అన్నమయ్య "ఇల్లాలు" కీర్తనలు - అచ్చంగా తెలుగు

అన్నమయ్య "ఇల్లాలు" కీర్తనలు

Share This
అన్నమయ్య “ఇల్లాలు” కీర్తనలు-1/3
డా.తాడేపల్లి పతంజలి 


అపారమైన అన్నమయ్య సాహిత్యంలో ఏ అంశాన్ని తీసుకొన్నా దానికి సంబంధించిన కీర్తనలు కనబడుతుంటాయి. బ్రహ్మోత్సవాల కీర్తనల అర్థ విశేషాలు  ముగించిన తరువాత  అన్నమయ్య ఇల్లాలును కీర్తనలో కొద్దిగా,  పూర్తిగా వర్ణించిన కీర్తనలు నాకు 03 కనబడ్డాయి.  వాటిలో మొదటి  కీర్తన పేర్కొంటాను.

తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన
రేకు: 1298-2  సంపుటము: 22-524

॥పల్లవి॥

సతి యిట్టిదైతేనే సంసారఫలము
కతలిన్ని నీయందే కలవే వోచెలియా 

1.     చెప్పినబుద్దులు విని చిత్తములోన మెలఁగి
తప్పక సేవసేసేది తరుణి
ముప్పిరి నితవుతోడ ముచ్చటలచ్చటలాడి
యెప్పుడూ బాయకుండేది ఇల్లాలు   ॥తి॥

2.    ఓపిక గలిగి పతి కొడబడ బత్తి చూపి
కాపురము నేసేదే గరితె
యేపున వహించుకొని యింటిపను లేమరక
చేపట్టుగుంచమైనది సేసపాలమగువ  ॥తి॥

 3.    యిచ్చకమెఱిఁగి తనయిలువరుస నెరసి
నిచ్చబతిగూడినదే నెరవాది
హెచ్చి నీవూ శ్రీవేంకటేశుడూ దొరసినట్టు
అచ్చపుగుణాల నెక్కుడైనదే వనిత   ॥తి॥

తాత్పర్యము:

ఇల్లాలు ఇలా ఉంటేనే  సంసారము చేసిన ఫలితము దక్కుతుంది.

ఓ అలమేలు మంగమ్మా ! నేను మూడు చరణాలలో చెప్పబోయే ఆ  లక్షణాల కథలు అన్నీ  నీలో ఉన్నాయి.   

1.     పెద్దలు చెప్పిన మంచి మాటలు  విని – మనస్సులో కూడా  వారి మాటలపై ఇష్టం పెంచుకొని, భర్త మనస్సుకు అనుగుణంగా తప్పక సేవ చేసే స్త్రీ -  ఇల్లాలు. ఏ విషయంలో అయినా- అందరికంటె మూడు రెట్లు ఎక్కువగా   ఆ కుటుంబపు మేలును ఆలోచించి, - తగిన సమయంలో ముద్దు ముచ్చటలాడి -ఎప్పుడూ భర్తను విడువకుండా ఉండేది ఇల్లాలు.  

2.    ఓపికతో ఉండి,  భర్తకు అనుకూలంగా మెలగుతూ,  భక్తితో  కాపురము చేయు స్త్రీ ఇల్లాలు. శాస్త్రోక్తంగా వివాహమాడిన స్త్రీ (సేసపాలమగువ) ఇంటివారి అతిశయాన్ని భరిస్తూ , ఇంటిపనులలో ఏమరుపాటు లేక  కోరిన వరములు తీరుస్తుంటుంది( చేపట్టుగుంచము)

3.    ఓ అలమేలు మంగమ్మా ! భర్త  ఇష్టము తెలుసుకొని ,తనఇంటి గౌరవాన్ని నిలిపి  నిత్యము  భర్తతో కలిసి ఉన్నదే నేర్పరి అయిన  ఇల్లాలు. సంతోషాల లో ఆధిక్యదశను పొంది  నీవూ శ్రీవేంకటేశుడూ సమానమైనట్లుగా , నిర్మల గుణాలు ఎక్కువగా ఉన్నదే ఇల్లాలు.

విశేషాలు

గృహం గృహస్వామిత్వం అస్తి అస్యాః భార్యా ఇంటి యజమానురాలు., పెండ్లాము. అగ్నిహోత్రసాక్షిగ వివాహమాడినది  ఇలా – ఇల్లాలు  పదానికి అర్థాలు కనబడుతుంటాయి.

ఆధునిక సమాజంలో గృహిణి పదానికి ఇలానే అర్థం చెప్పుకోవాలనుకోవటం , ఇలానే ఇల్లాలు ప్రవర్తించాలనుకోవటం సబబు కాదు.   కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి.  ఇది  15 వ శతాబ్ది సమాజంలో  గృహిణి.  అన్నమయ్య దర్శించిన గృహిణి.

నీవూ శ్రీవేంకటేశుడూ దొరసినట్టు (నీవూ శ్రీవేంకటేశుడూ సమానమైనట్లుగా) అని అన్నమయ్య మాట.  సంసారంలో   భార్యా భర్తలు  ఇద్దరూ సమానమే అని  కవి అంతరంగం. స్వస్తి.

***
 

No comments:

Post a Comment

Pages