తెలిసొచ్చిందిరా బాబూ - అచ్చంగా తెలుగు

తెలిసొచ్చిందిరా బాబూ

Share This
'తెలిసొచ్చిందిరా బాబూ '
మీనాక్షి చెరుకువాడ అదో చిన్న జాతీయ బ్యాంక్ గ్రామ శాఖ. సబ్ మేనేజర్ పి.పి.రావు పదిమైళ్ళు సైకిల్ తొక్కుకుంటూ బోలెడ్ చెమటోడ్చి అప్పుడే లోపలికి అడుగుపెట్టాడు. ఆయన ఆహార్యం కాలేజ్ బుల్లోడికి ఎక్కువా, దసరా బుల్లోడికి తక్కువగా ఉంటుంది .. అలాగని ఆయనేం కుర్రాడు కాదు నలభై పడిలో పడి నాలుగేళ్ళు దాటింది. సమయం ఇంకా తొమ్మిదిన్నరే  అయినా, ఇసకేస్తే రాలకుండా ఉన్నారు జనం, సగం మంది డోక్రా మహిళలే,  నోళ్ళు అస్సలు మూతపడవు. ఈయన్ని చూస్తూనే అప్పటిదాకా గలగలా మోగుతున్న కంఠాలు ఠక్కున మూతపడ్డాయి .. ఆయనంటే వాళ్ళకి భయభక్తుల్లో భయమే ఎక్కువ.
అప్పటిదాకా గుసగుసలాడుకుంటున్న స్వీపర్ సుబ్బలక్ష్మి, మెసెంజర్ వెంకట్ ఠక్కున నోళ్ళు మూసేసారు.
మేనేజర్ కేబిన్ లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు అచ్చంగా బోనులో- ఆకలిమీదున్న పులిలా ఈయన రావడం చూస్తూనే బెల్ కొట్టి లోపలికి పిలిపించాడు" ఏమండీ రావుగారు! నన్ను ప్రశాంతం గా, సజావుగా నా ఉద్యోగం చేసుకోనివ్వరా! ఎందుకండీ ఇలా ఏడిపించుకు తినేస్తున్నారు .. ఒక్కటంటే ఒక్క పని సజావుగా, సవ్యంగా చేస్తున్నారా! " అంటూ ఛడా మడా దులిపిపడేసాడు.
" ఏమైంది సార్?" అయోమయంగా అడిగాడు రావు.
" నా శ్రాద్ధం అయింది, నిన్న రాత్రి పదకొండింటికి నిద్ర లేపి మరీ తలంటేసారు హెడ్ ఆఫీస్ వాళ్ళు .. అరే! ఆడిట్ రిపోర్ట్ అలా చెత్త కాగితాల మీద తీసి పంపుతాడండీ మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడైనా .. నా ఖర్మ కాకపోతే అప్పుడే ఏదో ఫోన్ మాట్లాడుతూ .. చూడకుండా సంతకాలు చేసి పంపి చచ్చాను .. అయినా బ్యాంకే కదండీ కొంటోంది కాగితాలు, ఏదో మీ సొమ్మెట్టి కొంటున్నట్లు అంత పొదుపెందుకండీ ..  బ్రాంచ్ లో రిపోర్ట్స్ ఎటూ ఒకవైపు వాడేసిన వాటి మీదే తీ స్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా, అవేవన్నా ఎవరన్నా చూస్తున్నారా! అంటూ .. ఆడిట్ రిపోర్ట్ కాపీలు కూడా ... ఛీ! .. మీ సంగతి తెలిసీ మీకు చెప్పడం .. వెళ్ళండి వెళ్ళి సేఫ్ తియ్యండి .. ఆ  గోల భరించలేకపోతున్నా .. ఓ గంట సేపు ఎవరినీ లోపలికి పంపకండి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసి ఆడిటర్స్ తో సంతకాలు చేయించి ఫాస్ట్ కొరియర్ లో పంపాలి .. అక్కడ ఆడిట్ మన నిర్వాకం వల్లే ఆగిపోయిందని చిందులేస్తున్నాడు నా మొగుడు .. ష్ .. " అంటూ కూలబడి సీసా ఎత్తి మంచినీళ్ళు గటగటా తాగేసి కాస్త చల్లబడ్డాడు.
అప్పటికి కేషియర్, కౌంటర్ క్లర్క్ కూడా వచ్చేసారు, వాళ్ళకి ఎంతో ఇంట్రెస్టింగ్ గా అప్పటిదాకా మానేజర్ చేసిన కధాకళి గురించి వివరిస్తున్నారు సుబ్బలక్ష్మీ, వెంకట్.
" ఈయన మారడు! " అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చి .. అప్పుడే బయటకు వస్తున్న పి.పి. రావుతో " ఏంటి సార్ పొద్దున్నే మీటింగ్ .. టార్గెట్శ్ గురించా!" ముసిముసి నవ్వులు అణచుకుంటూ అడిగాడు కాషియర్.
ఏం జవాబు చెప్పకుండా ఓ సీరియస్ లుక్కేసి లోపలికెళ్ళిపోయాడు. నవ్వుకుంటూ వెనకాలే వెళ్ళాడు కాషియర్.
                                                      ***
ఆ రాత్రి అన్నాల దగ్గర భార్య "ఏమండీ వచ్చే వారం పిల్లల పుట్టిన రోజు .. పాపం ఈ పుట్టిన రోజుకైనా కనీసం కొత్త బట్టలు కొందామండీ " ఆశగా అడిగింది అంబుజవల్లి. పురిటి ఖర్చులు కలిసొస్తాయని ఆ దేవుడు కవలల్ని ప్రసాదించాడు. యీయన ఖ్యాతి తెలిసిన ఎవ్వరూ పిల్లనియ్యకపోతే నలభై ఏళ్ళు దగ్గరపడ్డాకా తల్లీ తండ్రీ లేని అంబుజవల్లి ని వదిలించుకునే క్రమంలో ఇతని మెడకి కట్టేడు ఆవిడ మేనమామ. అప్పుడప్పుడు వగస్తూ ఉంటాడు తన త్యాగానికి.
" అలాగే! రేపు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు గుర్తుచెయ్యి, ఆదికో జత యియ్యి " తలవంచుకుని అన్నం తింటూ అన్నాడు.
ఆనందంతో, ఆశ్చర్యంతో మూర్ఛ వచ్చినంత పనైంది వల్లికి,ఆరేళ్ళుగా చూస్త్సోంది .. వాళ్ళో వీళ్ళో  కొన్నవి తప్ప పిల్లవెధవలకి ఒక్క లాగూ, చొక్కా కొన్న పాపాన పోలేదు, అదేమంటే ఎదిగే పిల్లలూ .. ఇట్టే పొట్టైపోతాయి ఏం వేసుకుంటే ఏమిటీ! పైగా యూనిఫారంస్ ఎటూ కొనక తప్పదూ అంటూ ..ఇదేమిటీ! కలా! నిజమా! అరిచి గీ పెట్టినా, గింజుకు చచ్చినా లాభం లేకపోయేది.
పొద్దున్నే రెడీ అయి టిఫిన్ తిని, కేరేజ్ పట్టుకుని బయలు దేరాడు .. వల్లి మరిచిపోకుండా కవర్ లో పెట్టి ఇచ్చింది .. ' కాస్త మంచివి తీసుకోండి ' అంటూ. ఉలుకూ .. పలుకూ లేకుండా తలాడించి సైకిలెక్కాడు.
' ఏమిటో! .. తాడూ .. బొంగరం లేని వాడు కూడా కార్లు కొంటూంటే యీయనీ సైకిల్, అది కూడా తాతల కాలం నాటిది  పైగా బ్యాంక్ ఆఫీసర్ కూడాను, అయినా దేనికైనా రాసి పెట్టాలి. పెట్టి పుట్టాలి ' అనుకుంటూ పనికి నడుం బిగించింది.

***
నాలుగు రోజులు గడిచిపోయాయి .. ' యీయన బట్టల మాటే ఎత్తడం లేదు .. కొంపదీసి కొనరా ఏమిటి, పాపం వెర్రినాగన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారూ మనసులోనే అనుకుంది. రేపు పుట్టిన రోజనగా ఆ రాత్రి ఆఫీస్ నుంచి వస్తూనే ఓ కవర్ భార్య చేతిలో పెట్టాడు. సంబరంగా తీసి చూసింది .. అవాక్కయ్యింది .. రెండు రోజులుగా వెతుక్కుంటోంది కిటికీ కర్టెన్స్ మారుద్దామని .. అవి ఇలా రూపాంతరం చెంది చేతిలోకొచ్చాయి. ఉన్న ఒక్కగానొక్క కాస్త మంచివి .. తెల్లబోయింది. పువ్వుల పువ్వులవి, ఇంకా నయం గళ్ళవి కావు బాలనేరస్థుల్లా ఆనే వారు.
"ఏమిటండీ! " ఇంక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. " కిటికీలకు ఏం వెయ్యను" కాసేపటికి మాట పెగల్చుకుని అంది.
" అన్నీ నేనే చెప్పాలా .. నీ పాత చీరలు బోలెడన్ని ఉన్నాయి కదా, తినేసి పడుకోడం కాదు, మధ్యాహ్నం వేళ కత్తిరించి కుట్టు .. ఇదిగో ఆ చేత్తోనే నా పాత పంచి ఒకటి తీసి నాలుగు బనీన్లు కుట్టు .. ఛస్తున్నా ఈ చెమటతో " ఆవిడ తేరుకోక ముందే మరో షాకిచ్చి లోపలికి వెళ్ళిపోయాడు.        

***
 " ఏమండీ చేతి లో పనుంది, కాస్త ఆ కూరలబ్బాయి దగ్గర కూరలు తీసుకోండి, మీరేం బేరాలాడకండి .. వాడుకగా ఇస్తాడు .. ఇచ్చినవి తీసుకుని లోపల పెట్టండి .. డబ్బు నే పద్దు రాస్తాను " వంటింట్లోంచి వల్లి అరుపుకు అలాగే అంటూ తలాడించి బేగ్ తీసుకుని బైటకు వచ్చాడు.
కూరల అతను అన్నీ చకచకా తూచి సంచీలో వేస్తున్నాడు. " ఏయ్ .. ఆగాగు .. ఆ టమాటా ఎంత? 
" ఆయ్ .. అయన్నీ అమ్మగారికి తెలుసండి .. " 
" అలా కాదు .. ముందు ఎంతో చెప్పు! " సంచి లాగేసే ప్రయత్నం చేస్తూ అన్నాడు..
" టమాటా కిలో అరవై, బెండ .. నలభై .. వంకాయలు ..
" ఆగాగు! .. ఏమిటా రేట్లు .. టమాటా ఇరవై చేసి యియ్యి .. పావు కిలో చాలు, బెండ అరకిలో పది చేసుకో .. వంకా ..
" చ్చాల్చాల్లెండి .. నా యాపారం సాగినట్టే .. మీరు సెప్పే రేట్లన్నీ ఎప్పుడో మీ సిన్నప్పటియి .. ఇదిగో మీ సంచీ " కూరలన్నీ తట్టలో కుమ్మరించుకుని సంచీ గిరాటేసాడు ముఖం మీదకి.
వాడికేసి కోపంగా చూస్తూ ఖాళీ సంచీ ఊపుకుంటూ లోపలికి వచ్చిన మొగుడితో ' ఏవండీ కూరలు? ' అంది వల్లి.
" వల్లీ .. నువ్వు కాస్త దూబరా తగ్గించుకోవాలోయ్ .. అలా నాలుగడుగులు వేస్తే రైతు బజారు .. ఇంతింత రేట్లు పెట్టి .. హూ .. " అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
అద్దె తక్కువని ఊరు చివర తీసుకున్న ఇంటికి రైతు బజారు పది కిలోమీటర్ల తక్కువుండదు .. అలా నాలుగడుగులట .. గొణుక్కుంటూ లోపలికి వెళ్ళింది తనూ.
" వల్లీ! సాయంత్రం పెందరాళే వచ్చేస్తా, నువ్వూ, పిల్లలూ రెడీ గా ఉండండి సినిమాకి వెడదాం " ఆ మాటలతో దాదాపు కళ్ళు గిరగిరా తిరిగాయి వల్లికి, అయినా ఆనందం ఆపుకోలేక అడిగింది ' నిజంగానే '
" అవును .. రెడీ గా ఉండండి " చెప్పి వెళ్ళిపోయాడు.
సాయంత్రం అన్నట్టే త్వరగా వచ్చిన మొగుడికి ఆనందంగా మంచి కాఫీ ఇచ్చింది. అప్పటికే పిల్లలూ, తనూ తయారుగా ఉన్నారు .. సైకిల్ మీద వెడదామన్న అతనిని కొరకొరా చూస్తూ .. వద్దులెండి .. మేం రాం' అంటూ గిర్రున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.
" సర్లే ఆటో లోనే వెడదాం .. రండి .. ఇంకా ఆటో దొరకాలి .. సినిమా మొదలైపోయాక వెడితే ఎలా! " అంటూ సైకిల్ జాగ్రత్తగా లోపల పెట్టేసాడు.
ఇక చూడండి గజానికో ఆటో .. వాడు యాభై అంటే ఇతను యిరవై .. వాడు నలభై అంటే ఇతను పదిహేను .. అలా బేరమాడుతూనే హాలు వరకూ నడిపించేసాడు .. అప్పటికే ఆట మొదలై అరగంట అయింది .. ఉసూరంటూ లోపలికెల్ళి కూలబడ్డారు. అయ్యో! ఊరికే వచ్చిన టికెట్లైనా పూర్తి న్యాయం చెయ్యలేదే అని బాధపడుతూ చూసాడు పి.పి.రావు. ఇక  చచ్చినా  అతనితో ఎక్కడికీ వెళ్ళకూడదన్న నిర్ణయంతో అలసటగా నిద్రపోయింది వల్లి. 
  ***
బ్రాంచ్ లో ఫాన్స్ వేసుకోనివ్వడు, ఉన్న చోట తప్ప లైట్స్ వెయ్యనివ్వడు .. అంతవరకూ ఓకే కానీ కష్టమర్ల డబ్బుల మీద కూడా అతని ఆంక్షలే .. అంతెందుకు ఇంత తీసుకోండి అంటూ .. విసిగిపోయిన మేనేజర్ .. జోనల్ ఆఫీస్ కు సరెండర్ చేసేసాడు నాకొద్దు అంటూ .. చేసేదిలేక వాళ్ళు అక్కడే స్టాఫ్ డిపార్ట్ మెంట్లో వేసుకున్నారు .. ఇతనికిదే సరైన చోటు అంటూ .. ఇక చూడండి .. పాపం అందరి టి.ఏ బిల్ల్స్ ... కట్ .. కట్. ఇలా లాభం లేదని, అన్ని శాఖల వాళ్ళూ యూనియన్ నాయకులతో మొరపెట్టుకున్నారు, వాళ్ళు ఒత్తిడి చేస్తే మళ్ళీ ఏదో శాఖకి బదిలీ చేసారు.
ఆ రోజు సిబ్బంది ఎవరూ లేరు, కాషియర్, తనూ మాత్రమే ఉన్నారు .. చూస్తే నగదు అస్సలు లేదు .. సరే సబ్-స్టాఫ్ ని తీసుకుని కరెన్సీ చెస్ట్ కి బయలుదేరాడు నగదు తేడానికి. బ్యాంక్ డబ్బు ఇస్తుంది, అయినా సబ్-స్టాఫ్ బైక్ మీద వెళ్ళారు నగదు తేడానికి .. వచ్చేటప్పుడు తను వెనకాల చేతి సంచీలో పెట్టుకుని కూర్చున్నాడు .. పది లక్షల కాష్ .. పక్కనున్న చెస్ట్ సుమారు పది కిలోమీటర్ల దూరం .. వచ్చేటప్పుడు ఎదురుగా వస్తున్న కారు గుద్దేస్తే .. ఎగిరి సంచితో సహా రోడ్డు మీద పడ్డాడు, వెంకట్ .. బైక్  తో ఇంకో పక్క పడిపోయాడు. దారిన పోయే వాళ్ళు ఎవరో చూసి సాయం చేసి లేవనెత్తారు .. డబ్బు కట్టలు చిందరవందరగా కింద పడ్డాయి .. గుమిగూడిన జనం .. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందమైంది అతని పరిస్థితి .. ఎలాగో వచ్చి బాంకులో పడ్డారు .. చూస్తే రెండు ఐదువందల కట్టలు మిస్ అయ్యాయి .. అంటే లక్ష .. విషయం పైకి తెలిస్తే ముందు ఉద్యోగం హుష్ కాకి, పద్దతి ప్రకారం నగదు తేనందుకు. మేనేజర్ ముక్క చివాట్లు పెట్టి, ఆ కాష్ కట్టేస్తే పైకి రిపోర్ట్ చెయ్యనన్నాడు .. బ్రతుకు జీవుడా అనుకుంటూ లక్షా కట్టి బైటపడిన పి.పి. రావుకు దెబ్బకు జ్ఞానోదయం అయింది .. పొదుపుకూ, పిసినారితనానికి ఉన్న సన్నటి రేఖ తెలిసొచ్చింది.                    

***

No comments:

Post a Comment

Pages