మానసవీణ -11 - అచ్చంగా తెలుగు
                                          మానసవీణ -11

నాగజ్యోతి సుసర్ల  


(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెతో చనువుగా మెలుగుతూ ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రభుత్వ కాలేజిలో చేరి, చదువుతూ ఉన్న మానస అక్కడి విద్యార్ధుల మనసు గెల్చుకుని, క్లాస్సులు సజావుగా జరిగేలా చేస్తుంది. రోడ్డుపైన అనాధలుగా వదిలేసిన కొండలరావు దంపతుల దీనస్థితిని చూసి, వాళ్ళ బిడ్డలను కలిసేందుకు వెళ్తుంది మానస.)
 కొండల రావు, అలివేణి దంపతుల గురించి GTR అంకుల్ చూస్తున్నారు కదా! అని మానస ఊరుకోలేదు. కొండలరావునుండి వారి కొడుకుల అడ్రెస్ లు కనుక్కుని, వెళ్ళి వారిని కలవాలని నిర్ణయించుకుంది. రోజు మానస కాలేజ్ నుండి ఆశ్రమానికి వెళ్ళేవైపు  కాకుండా వేరే వైపుకు వెళ్ళటం చూసిన రాజేష్ ఆమెని ఆపి ఎక్కడికి వెళుతోందో  కనుక్కుని తనతో పాటు బయలుదేరాడు. మానస ముందుగా కొండలరావు పెద్దకొడుకు ఇంటికి వెళ్ళింది, రాజేష్ ఇంటికి కాస్త వారగా నిల్చుని గమనిస్తున్నాడు. మానసను చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగిన ఇంటివారితో మానస తను ఎవరో ,తను ఎందుకు వారింటికి  వచ్చిందో  విషయం చెప్పి, కొడుకుగా అతను నిర్వర్తించవలసిన బాధ్యతను గుర్తు చేసింది.  వెంటనే కొండలరావు పెద్దకోడలు కనకమాలక్ష్మి  అందుకుని మేము మా అత్తమామలకు చెయ్యాల్సిందంతా చేశాము..వారికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు...ఆస్తులు పంచుకోవటానికి తయారవుతారు కానీ బాధ్యతలు పంచుకోరా వాళ్ళు? అసలు నువ్వు మాకు చెప్పొచ్చావు కానీ, అదే నోటితో వాళ్ళకు కూడా కాస్త చెప్పు అంటూ రుసరుసలాడింది.

ఎంతటి ద్వేషాన్ని అయినా ప్రేమతో, ఓర్పుతో చక్కదిద్దవచ్చనుకునే మానస కోపం తెచ్చుకోకుండా, రెండో కొడుక్కి  ఫోన్ చేసి వీరింటికి వచ్చేలా ఒప్పించింది. కొండలరావు కొడుకులిద్దరినీ కూర్చోబెట్టి "మనల్ని కన్న తల్లితండ్రుల్ని ఒక వయసు దాటాక  మనం కన్నబిడ్డల్లా చూసుకోవాలి , ఎంతోమంది అనాధలు తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా వేదన అనుభవిస్తుంటే, అన్ని రకాలా వారి ఆత్మీయతనూ, ఆస్తుల్ని పంచుకున్న మీరు, కన్న పేగు బంధాన్ని డబ్బు ఖర్చుకు దడిసి కాలదన్నుకోటం అతి నీచమైన పని గా మీకు అనిపించటం లేదా ? అంటూ ప్రశ్నించిన మానస వంక విసుగ్గా చూసిన రెండో కోడుకు "సర్లేవమ్మా ప్రతి ఒక్కళ్ళూ ఎదుటివారికి బుద్ధులు చెప్పేవాళ్ళే , వెళ్ళి నీపని నువ్వు చూసుకో ఇంకోసారి మమ్మల్ని ఇలా విసిగిస్తే నీకు మర్యాద దక్కదు" అంటూ కటువుగా మాట్లాడాడు. అది విని రాజేష్ వెంటనే మానస పక్కకు వచ్చి నిలబడ్డాడు. స్వతహాగా నెమ్మదస్తురాలైన మానస  సొంత తల్లితండ్రులను పట్టించుకోవటానికి ససేమిరా అంటున్న వారి వంక అసహ్యంగా చూస్తూ " మీరేదో అనుకుంటున్నారేమో, మీ నుండి మీ అమ్మగారి వైద్యానికి అయ్యే ఖర్చూ, వారు జీవించిఉన్నంత కాలం పోషణ కు అయ్యే వ్యయం తీసుకునే హక్కు మీ తల్లితండ్రులకుంది..అంతే కాకుండా ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆస్తి కూడా మీ నాన్నగారి స్వార్జితం కాబట్టి, ఆయన చేత వీలునామాలు మార్చి రాయిస్తామనీ బెదిరించింది. అంతేకాక  నేను విషయాన్ని మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చెయ్యబోతున్నాను" అంది...మానస వంక గుర్రుగా చూస్తున్న కొండలరావు కొడుకుల తో రాజేష్  "మానస ఆడపిల్ల తనేం చేస్తుంది అనుకోకండి.. మా స్టూడెంట్స్ అందరం విషయంలో మానస తో పాటు మీ తల్లితండ్రుల వెనకాల ఉంటాం. మా యువశక్తి ముందు మీరు మీ వేషాలు తగ్గించి తలవొగ్గాల్సిందే" అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇహ వ్యవహారం ముదిరేలా ఉంది అని గ్రహించిన కొండలరావు కొడుకులిద్దరూ, అసలు ముందు మా అమ్మకు ట్రీట్ మెంట్ ఇస్తున్న డాక్టర్ తో మాట్లాడి తరువాత  ఖర్చులు సగం సగం భరిస్తామని హామీ ఇచ్చారు. తరువాత కూడా వారిని తమ దగ్గర ఉంచుకోవటానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు.
  విషయాన్ని GTR కు తెలియచేయటానికి మానస, రాజేష్ కలిసి GTR ఇంటికి వెళ్ళారు..ఇప్పుడు మానసకు ఎంతో సంతోషంగా ఉంది. తను అనాధ అయినా, మరో తల్లితండ్రులు పిల్లలు ఉండి కూడా అనాధలు గా మారకుండా చూడటం ఒక ఎత్తైతే, సమాజానికి పీడ లాగా తయారవుతాడు అని అందరూ అనుకున్న రాజేష్ మంచిమనిషై తనకు వెన్నుదన్నుగా నిలవటం ఇంకో ఎత్తు....వారిద్దరూ కలిసి GTR ఇంటికి వెళ్ళేసరికి అనిరుధ్, సువర్చల, GTR ముగ్గురూ హాల్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వీరిని చూస్తూనే సువర్చల రండి రండి అంటూ లోపలకు ఆహ్వానించింది.. మానసతో పాటు ఇంట్లోకి వస్తున్న వేరే యువకుడిని చూడగానే అనిరుధ్ మొహం చిన్నబోయింది... విషయాన్ని GTR సునిశిత దృష్టి పసిగట్టింది .మానస రాజేష్ ని కాలేజ్ లో తన సీనియర్ గా పరిచయం చేసింది. మానస కూడా తనను చూడగానే, ఎప్పుడూ  నవ్వుతూ పలుకరించే అనిరుధ్   రోజు కాస్త స్తబ్ధంగా ఉండటం గమనించింది. కానీ తను వచ్చిన విషయం GTR కి చెప్పే పనిలో పడి విషయానికి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు
GTR మానస సాహసానికి అబ్బురపడ్డాడు, కానీ అంత దూకుడుగా ఉంటే మానసకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాస్త కలవర పడ్డాడు. కాసేపు కూర్చుని కాఫీ త్రాగి మానస, రాజేష్ లు బయలుదేరారు . GTR స్నేహపూర్వకం గా రాజేష్ ఫోన్ నంబర్ తీసుకున్నారు. రాత్రి ఆయన రాజేష్ కి ఫోన్ చెసి మానసను కాలేజ్ లో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండేలా మాట  తీసుకున్నారు....అలానే మరొక వ్యక్తికి కూడా ఫోన్ చేసి మానస విషయం చెప్పి పిల్ల రక్షణ విషయంలో ఎవ్వరికీ, చివరికి మానసకు కూడా తెలియకుండా ఉండేలా గట్టి రక్షణ వలయాన్ని మానస చుట్టూ ఏర్పాటు చేయించగలిగారు.    
మర్నాడు కొండల రావు కొడుకులు GTR, అనిరుధ్, మానస అందరూ ప్రియదర్శినీ కేన్సర్ ఇన్స్టి ట్యూట్ లో  ఉన్న అలివేణి ,కొండల రావు దగ్గరకు వెళ్ళారు. కొడుకులకు ముకుతాడు కట్టి లాక్కొచ్చిన మానస మీద వారికి చెప్పలేనంత ఆప్యాయత కలిగింది. ఆమె వ్యక్తిత్వానికి కారణం  ఆమె పెరిగిన ప్రేమలతా ఆశ్రమం , ఆశ్రమ స్థాపకుడు GTR అని అర్ధం అయిన కొండలరావు GTR కాళ్ళమీద పడి  క్షమార్పణ వేడుకున్నాడు.  
 పిల్లలు అర్ధం గాక వాళ్ళవంక అయోమయం గా చూస్తుంటే అప్పుడు కొండల రావు చెప్పాడు " నేను తహసిల్దార్ గా పని చేస్తున్న రోజుల్లో, GTR గారు తమ ప్రేమలతా  ఆశ్రమం కట్టించటానికి ప్ర్తభుత్వ భూమి కోసం అర్జీ పెట్టుకున్నారు. ఆయన నేను అడిగిన లంచం ఇవ్వని కారణం గా, ఆయనకు భూమి అందకుండా ఫైల్ తొక్కి పెట్టాను...తరువాత వారు వేరే స్థలం కొనుక్కుని అందులో ఆశ్రమం   ప్రారంభించారు.....అదే ఆశ్రమం ఇప్పుడు మాకు ఆశ్రయం ఇచ్చింది ....ఎంతమంది కష్టార్జితాలో లంచం గా పుచ్చుకుని నేను వారి ఉసురు పోసుకున్నాను. డబ్బులతో పెరిగిన నా బిడ్డలు కూడా అసహ్యం గా తయారు అయ్యారు....చేసిన పాపం చెబితే పోతుందని ఈనాడు ఇలా వీరి కాళ్ళమీద పడ్డానంటూ" చెప్పి కన్నీరు కార్చాడు..కొండలరావును లేవనెత్తి GTR "ఇప్పటివరకూ అనుభవించిన మానసిక క్షోభ  నీవు చెసిన పాపాన్ని కడిగేసే ఉంటుంది"అంటూ  ఓదార్చారు
తరువాత కొండలరావు పిల్లలచేత వారి తల్లి తండ్రుల బాధ్యతను తాము స్వీకరిస్తామంటూ నోటరీ సమక్షములో, స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించారు. కానీ కొండల రావు అందుకు ఒప్పుకోలేదు ఆత్మీయతలు సహజం గా రావాలి..సంతకాల దాకా వెళ్ళాల్సి రావటం మా లాంటి తల్లితండ్రులు చేసుకున్న ఖర్మ. నా భార్య వైద్యం కోసం మాత్రమూ నేను సంపాదించిన దానిలోంచి డబ్బు ఇవ్వమనండి....దయచేసి మా శేష జీవితాన్ని మీ ప్రేమలతా ఆశ్రమం లో గడపడానికి అనుమతి ఇవ్వండి...ఊడిగం చేస్తూ అయినా మీ ఋణం తీర్చుకుంటాను అంటూ ...పాలిపోయిన  మొహాలతో  చూస్తున్న కొడుకుల ముందే GTR పాదాల మీద మరో సారి పడిపోయాడు....GTR కి ఒప్పుకోకపోవటానికి కారణం ఏమీ కనిపించలేదు.    
మానస GTR వంక చూస్తూ, ఇంతటి ఉన్నత వ్యక్తిత్వం కల వ్యక్తి ఆధ్వర్యం లో ఉన్న ఆశ్రమం లో, ఆయన ఉప్పు తింటూ పెరగటం వల్లనే తనకు కూడా, సాటి మనుషుల మంచి కోసం పాటుపడాలనే సంకల్పం...సమాజం లో  జరిగే పరిమాణాలకు వెంటనే స్పందించే అలవాటు వచ్చాయేమో’ అని సంతోషపడింది.
**** 
మానస మనసు ఎంతో బాధపడింది..కొండలరావు బిడ్డల వైనాన్ని చూశాక... రోజు ఆశ్రమానికి తిరిగి వచ్చి మూగపోయిన మనసుతో మానస తన డైరీ లో ఇలా వ్రాసుకుంది.       
         
         నిన్ను కన్న అమ్మ నీకు జన్మనివ్వగ తలచి 
         తనకు తాను మరణించీ అమ్మగ జన్మెత్తుతుంది 
          మరణం నీ కోసం, నిను తను మోయుటకోసం 
         నీ కోసం ప్రతి నిముషం తను చస్తూ బ్రతికేస్తూ 
         తను కరుగుతూ తన రక్తం పాల లాగ మార్చేస్తూ 

          నీ ఆకలి తీరుస్తూ నిన్ను తాను బ్రతికిస్తే 
          నీవు పెరిగి పెద్దవుతూ తనను ఉద్ధరిస్తావని 
          తలచి తలచి తపనపడి మంచి బతుకు అందిస్తే 
          నీవేమో నీ ప్రాణం తన భిక్షని తెలుసుకోక
          అంధకారబంధుడవై తన నమ్మకాన్ని వమ్ముచేస్తె 

         అపుడు కదా తనకు తెలిసె అసలు మరణమేమిటో
         తనుకన్నది నిను కాదని తన నాశన ముసలాన్నని 
         ప్రాణమున్న కట్టెనైన కాటికంపు రాక్షసమని 
         మనిషి రూపుదిద్దుకున్న మహాపాపవిగ్రహమని 

        అయినా తను చేస్తుందీ కన్నీటి తో అభిషేకం 
        మానవతా విలువలన్ని మృగ్యమైన నీకోసం 
        కడదాకా తన చూపులో నువ్వు మిగలటం కోసం.....

        మృగమా మేలుకో, నీ ఉనికిని మలచుకో...నువు మనిషని తెలుసుకో
        అమ్మ మనసు కాలకుండ ఆత్మీయత పంచుకో......


 కాస్త బాధ తీరుతుందని ప్రక్కనే ఉన్న  మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళింది. గుడిలో ఉన్న అమ్మవారి ప్రశాంత గంభీరమైన వదనం చూస్తూ మానస మైమరచిపోయింది. నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకుని అమ్మా! జగన్మాతా! నువ్వు అమ్మలగన్న అమ్మవి కదా ? నీ బిడ్డ తన అమ్మ కోసం తపిస్తోంది, తనకు తల్లిని చూపే బాధ్యత వహించు తల్లీ అంటూ కన్నీరు కార్చింది... లోపల ఒక మృదువైన హస్తం మానస బుగ్గలపై జాలువారుతున్న కన్నీరు ను నెమ్మదిగా తుడిచింది..ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన మానసకు, అమాయకం గా తన మొహం వంకే చూస్తున్న శ్రావణి కనిపించింది . అప్రయత్నం గా మానస నోటిలోంచి   అమ్మా! అన్న పిలుపు మార్దవం గా వచ్చేసింది. పిలుపు విన్న శ్రావణి "బంగారు తల్లీ ! ఎందుకమ్మా ఏడుస్తున్నావూ...నేను వచ్చేశాగా నీ కోసం...."అంటూ మానస చెయ్యి పట్టుకుని గబ గబా పక్కకు లాక్కెళ్ళింది.  
 వారి వెనకాలే శ్రావణి వాళ్ళ పని అమ్మాయి సరిత కూడా వెళ్ళింది.
*** 
(సశేషం)

No comments:

Post a Comment

Pages