నెత్తుటి పువ్వు - 22 - అచ్చంగా తెలుగు
                                           నెత్తుటి పువ్వు - 22
మహీధర శేషారత్నం

“మగవాడిదేముంది? బులబాటం తీర్చుకుపోతాడు. శారీరక ధర్మ ప్రకారం దాని ఫలితాన్ని అనుభవించాల్సింది స్త్రీయే కదా! మన సొసైటీకి అనుగుణంగా ప్రవర్తించాలికాని, విచ్చలవిడితనం స్త్రీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఖర్మకాలి ప్రెగ్నన్సీవస్తే భ్రూణహత్యలో, దిక్కులేని వాళ్ళలా వదిలెయ్యడాలో ఏముళ్ళ కంపల్లోనో... ఏ పాపం చెయ్యని ఒక పసిప్రాణి వీళ్ళతప్పకు, బలయిపోవడం ఏం న్యాయం” అంటూ వాదించారు.
కాని ఆవిడ తన మాటమీదే నిలబడింది.
ఎన్నో ఆధునిక సౌకర్యాలున్న ఈ రోజుల్లో అవాంఛిత గర్భం రాకుండా చేసుకోవడం పెద్ద కష్టం కాదు. వివాహాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే ఉన్నాయి. నేనింత కట్నం ఇస్తా, నువ్వెంత బంగారం పెడతావు? అమ్మాయి ఇంత చదువుకుంది. అబ్బాయి ఏం చదువుకున్నాడు. అమ్మాయి ఉద్యోగం చెయ్యాలా? వద్దా? అదీ మగపెళ్ళివారి నిర్ణయాలే. నూటికి తొంభై తొమ్మిది మంది చెయ్యమనే అంటారు. డబ్బెవరికి చేదు? ఇలాంటి వ్యవస్థలో పెళ్ళికి అర్థం ఏమిటి? వివాహ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయట పెట్టడం లేదా? ఆర్ధిక స్వాతంత్ర్యం అంటారు. ఉద్యోగం చేస్తున్న భార్యలలో ఎంతమందికి ఆర్థిక స్వేచ్ఛ ఉంది. ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సిన ఆడవాళ్ళెంతగమందో! ఎ.టి.యం. కార్డు మొగుడికిచ్చేసి ఏవండీ! అని చెయ్యిచాచేవాళ్ళు, సర్పంచి మహిళ అయితే మొగుళ్ళ అధికారాలు, ... అంత గొప్పతనం నాకయితే కనపడడంలేదు.
వివాహం అంటే స్వేచ్ఛని పోగొట్టుకోవడమే అని ఆవిడ వాదించింది.
ఏదీ తేలకుండానే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, అందరికీ ధన్యవాదాలు అంటూ యాంకరు అరగంట గడిచిపోవడంతో కార్యక్రమం ముగించేసాడు.
నాగరాజు ఏదో ఆలోచనలో మునిగి పోయిన అలాగే కూర్చుండి పోయాడు. 
ఏంటీ! ఆడాళ్ళ ప్రోగ్రాములు కూడా వదలకుండా చూస్తున్నావు? అంటూ లక్ష్మి వచ్చింది.
“ఆఁ! ఏంలేదు. ఏదో వివాహేతర సంబంధాలు గురించి చర్చిస్తూంటే వింటున్నాను..” అన్నాడు. “కాళ్ళిరగొడితే సరి.” అంది లక్ష్మి ఠపీమని.
“ఎవరివి?” ఉలిక్కిపడ్డాడు నాగరాజు.
“నీవి” అంది.
“ఆఁ!”
“మరే! లేకపోతే ఎవరివేమిటి? పాడు పనిచేసిన వాళ్ళవి తేల్చేసింది లక్ష్మి,
“అదికాదు, లక్ష్మీ! మనసు కోతిలాంటిది. మాటవినదు. తప్పులు చేస్తుంది. మరి ఆలోచించాలి కదా!” అన్నాడు నచ్చచెప్పుతున్నట్టు.
“ఏమిటీ! నువ్వు కాని సెకండ్ సెటప్ పెట్టేసావేమిటి?” 
.... అయినా నీకంత సీను లేదులే. అలాంటి ఎదవ పనులు చెయ్యవు. తేలికగా అనేసింది లక్ష్మి, ..... నీకు తప్పు చెయ్యడం కూడా చాతవుద్దీ... అంటూ సరోజ కళ్ళముందు నిలబడింది. 
ఈ ఇద్దరు ఆడవాళ్ళకీ నామీదెంత నమ్మకం. మనసులో గిల్టీగా ఫీలయ్యాడు నాగరాజు.
నెలా, రెండు నెలలు పంతంగా గడిపాడు కానీ, మనసు పుండులా సలప సాగింది. ఏదో తనబతుకు తను బతుకుతున్న దాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు, ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుంది..
కొన్నాళ్ళకు మళ్ళీ కాళ్ళు సరోజ ఇంటివైపు లాక్కెళ్ళాయాయి.
“ఏమయిపోయావిన్నాళ్ళూ” నేనెంతలా చూస్తున్నానో తెలుసా?.... అల్లుకుపోయింది.
మనసు తప్పంటూనే లొంగిపోయింది. నాగరాజు ఇప్పుడు రెండిళ్ళ డయ్యాడు. నెలకోసారి వెళ్ళడం సరోజ బాగోగులు చూడడం అతని బాధ్యతయింది. రోజాకి ఒక సెల్ఫోన్ కొనిచ్చి తనదీ, శంకరానిదీ నెంబర్లు ఫీడ్చేసి ఇచ్చాడు. అత్యవసరమైతే తాను అందుబాటులో లేకపోతే శంకరానికి ఫోన్ చెయ్యమన్నాడు. శంకరానికి కూడా అదే చెప్పాడు. శంకరానికి ఇష్టం లేకపోయినా కాదనలేకపోయాడు. రంకూ, బొంకూ దాచినా దాగవు. అందులో పోలీసోడు. అందరికళ్ళూ తనమీదే అనిపించింది.
“ఏంటలా పరధ్యాసగా ఉండావు? ఏమయింది నీకు? 
ఒళ్ళు బాగుందా...... ఓనాడు లక్ష్మీ నిలదీసింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages