బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు - చక్రస్నానం - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు - చక్రస్నానం

Share This
 బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు - చక్రస్నానం
డా.తాడేపల్లి పతంజలి 


శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు శ్రీ వారి  అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున  తిరుమలలోని స్వామిపుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తారు. చకతి హంతి పరబలమ్ -శత్రు సేనను సంహరించునది కనుక చక్రము అన్నారు.
 తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు పల్లకి, తిరుచ్చీ ఉత్సవం పూర్తి చేసి   వరహాస్వామి ఆలయం వద్ద స్వామివారి చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనాదుల కార్యక్రమం నిర్వహించి .. ఉదయం 6 నుంచి 9గంటల మధ్య చక్రస్నానం చేయిస్తారు. . . చక్రస్నానం అనంతరం సరోవరంలోని పవిత్ర జలాలు అత్యంత మహిమాన్వితమవుతాయని భక్తుల విశ్వాసం.
యజ్ఞం చివర చేసే అవబృథ స్నానం  వంటిది  చక్రస్నానం.
బ్రహ్మోత్సవాలు వేంకటేశ్వరునకు జరుగగా, అవబృథ స్నానం సేవకుడైన సుదర్శనునకు జరుగుతుంది. ఇది స్వామి వారు తన భక్తులను అనుగ్రహించే మనోహరమైన పద్ధతి.
 అన్నమయ్య సాహిత్యంలో చక్ర సంబంధమైన కీర్తనలు ఇవి. 1.అదె శిరశ్చక్రము లేనట్టి దేవర లేదు,2.చక్రమా హరిచక్రమా,3.జగదీశ్వరుని లీలాచక్రములోపలనుండి,4.నమో నమో దానవవినాశ చక్రమా,5.భీకరపు చక్రమదె పిడుగులు రాలీనదె,6. శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి,7. శరణాగత వజ్రపంజరు డీతడు చక్రధరుడసురసంహా
వీటిలో “చక్రమా హరిచక్రమా “అను కీర్తన యొక్క తాత్పర్యం తెలుసుకొందాం.

తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
రేకు: 30-2 సంపుటము: 1-183
చక్రమా హరిచక్రమా
వక్రమైన దనుజుల వక్కలించవో       ॥పల్లవి॥
1.     చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని-
చట్టలు చీరిన వో చక్రమా
పట్టిన శ్రీహరి చేతబాయక యీ జగములు
వొట్టుకొని కావగదవో వో చక్రమా       ॥చక్రమా॥
2.    పానుకొని దనుజుల బలుకిరీటమణుల
సానలదీరిన వో చక్రమా
నానాజీవముల ప్రాణములుగాచి ధర్మ-
మూని నిలుపగదవో వో చక్రమా       ॥చక్రమా॥
3.    వెఱచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ
వుఱుట్లు గొనియాడేరో చక్రమా
అఱిముఱిదిరు వేంకటాద్రీశు వీధుల
వొఱవుల మెఱయుదువో వో చక్రమా  ॥చక్రమా॥
తాత్పర్యం:
పల్లవి

చక్రమా! ఓ  హరిచక్రమా( సుదర్శనమా !) వక్రబుద్ధులు కలిగిన   రాక్షసులను వక్కలు చేయి (ముక్కలు ముక్కలుగా చీల్చివేయవలసినది)
         
1.            ఓ  చక్రమా!  చుట్టి చుట్టి పాతాళములోపలికి  చొచ్చిహిరణ్యకశిపుని తమ్ముడయిన  హిరణ్యాక్షుని  (హిరణ్యవత్ ధీతే అక్షిణే యస్య బంగారు వంటి పచ్చని కన్నులు కలవాడు.) చుట్టి చుట్టి- అతను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి , నిన్ను ధరించిన యజ్ఞవరాహ మూర్తితో సహ  పాతాళము లోపలికి వెళ్లి , స్వామిచే ప్రయోగింపబడి హిరణ్యాక్షుని చట్టలు చీరావు ( చంపావు)  . నిన్ను పట్టుకొన్న మా శ్రీ హరి చేతిని విడువక , ఒట్టు పెట్టుకొన్నట్లుగా ఈ లోకాలన్నింటిని రక్షించు.

2.            ఓ  చక్రమా!  పూనుకొని ఆ రాక్షసుల కిరీటములలో ఉన్న  మణులలోని   మెరుగులు నువ్వు తెచ్చుకొన్నావు. ( అనేక మండి రాక్షసులు చక్రముతో సంహరింపబడ్డారని భావం)
అనేక మంది ప్రాణములు రక్షించి  ధర్మమును ఈ లోకంలో నిలుపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

3.    నీ తళతళలకు భయపడి  బ్రహ్మాది దేవతలు నిన్ను శాంతింపచేయుటకు  వేదమంత్రములతో   నీ  ఉరుట్లను (పరిభ్రమణములను)  ఎప్పుడు  కొనియాడుతుంటారు.
ముందువెనుకలుగా తిరుగుతూ మా పవిత్రమైన వేంకటాచల వాసుని మాడ వీథులలో మెరుపులతో పోలికగా( ఒరవు)మెరుస్తుంటావు. నీకు నమస్కారం. స్వస్తి.
***

No comments:

Post a Comment

Pages