మేరా భారత్ మహాన్ - అచ్చంగా తెలుగు

మేరా భారత్ మహాన్

Share This
 మేరా భారత మహాన్ 
ఆదూరి హైమవతి 
   
" ఒరే ఎందుకురా ! ఇంతచదివీ మళ్ళా ఆ ఉద్యోగానికే వెళతా నంటున్నావ్!" బాధగా అంది తల్లి తాయమ్మ.
" అమ్మా! ఏంచదివినా ఏ ఉద్యోగం చేసినా పుట్టినదేశానికీ , దేశంలోని మనలాంటి జనాలకూ సేవచేయాలి , అప్పుడే జన్మ సార్ధకత  .అదే చదువు యొక్క సారాంశం.  ధనం సంపాదించను ఏ ఉద్యోగమైనా చేయవచ్చు అమ్మా! కానీ సేవచేసే అవకాశం లభించడం ముఖ్యం. కాదనకు అమ్మా!"అంటూ తల్లికి నచ్చజెప్పాడు భరత్.
"ఏమోరా ! మొదటి నుంచీ నీ ధోరణే నీది. కానీయ్ , అన్నిటికీ ఆభగవంతుడే వున్నాడు."అంటూ తనకు తానే నచ్చజె ప్పుకుంది తాయమ్మ.  
       అలా భరత్ తనకు సేవచేసే అవకాశం లభించే  రక్షక భట శాఖలో  ఒక రక్షకుడుగాచేరాడు. అదే పోలీస్ కాని స్టేబుల్ అన్నమాట .శిక్షణాకాలం పూర్తై ,  డ్యూటీ అలాట్ చేశారు అధికారులు.ఉద్యోగంలో చేరిన మొదటిరోజే అతని కెంతో తృప్తిగా అనిపించింది.  
  ఎందుకంటే నడవలేని ఒక ముసలాయన రోడ్డు దాట లేక నడిరోడ్డులో నిలచిపోయాడు. డ్యూటీలో వున్నతాను అన్ని వాహనాలనూ ఆపేసి రోడ్డు మధ్యలో వున్న అతడిని రోడ్డు దాటించి ఒక రిక్షా ఎక్కిస్తుండగా చూసాడు, అతడు మరెవరో కాదు తనకు చిన్నతనంలో ‘అ- ఆ ‘లు దిద్దబెటి చదవనూ రాయనూ నేర్పి తన విద్యకు బేస్ మెంట్ వేసిన తన ఉపాధ్యాయుడు ఉమా పతి.తలమీది టోపీ తీసి నమస్కరించినా ఆయన గుర్తుపట్టలేదు.
 రిక్షా వానిని ఆయనను దింపిన ఇల్లు గుర్తుంచుకునివచ్చి తనకు చెప్ప మన్నాడు. డ్యూటీ దిగగానే పండ్లు తీసుకుని ఆయన ఇంటికెళ్ళాడుతాను, వరండాలో కూర్చుని సేదతీరుతున్న ఉమాపతి "ఎవరదీ !" అన్నా డు.
  తాను ఆయన పాదాలకు నమస్కరించి "పంతులుగారూ!నేనండీ! మీ శిష్యుడిని భరత్  ని.  నాకు విద్యేకాక వివేకం నేర్పిన నా దేవుడు మీరు.లేత వయస్సులో మీరు మాకు చెప్పిన అన్ని విషయాలూ నాహృదయం లో నాటు కున్నా యండీ! ఎలాగైనా మీరు చెప్పిన విధంగా  మానవ సేవ చేయను తగిన ఉద్యోగం మీ ఆశీస్సులవల్లే నాకు లభించిందండీ! "అంటూ తనను తాను పరిచయం చేసుకుని ‘ఏ అవసరమున్నా తనకు తెలియ పరచమని’ తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వచ్చాడు భరత్. 
   భరత్ మహా ఆనందంగా ఇంటికి వచ్చి ,అంతా తల్లి తాయమ్మకు చెప్పి అమ్మ పాదాలకూ నమస్కరించి " అమ్మా!నీ అనుమతీ ఆశీ ర్వా దంవల్లే నాకు ఉద్యోగంలో  చేరిన మొదటిరోజే ఇలా నాగురుదే వునికి సాయం చేసే అవకాశం లభించింది." అనిచెప్పాడు.
తాయమ్మ చాల సంతోషించి " నాయనా! నీ గురువుకే కాదు ఏ అసహా యు లు కనిపించినా ఇలాగే సేవచేయి నాయనా! భగవతుడు సంతోషిస్తాడు."అని ఆశీర్వదించింది.   
   అలా భరత్ మంచి రక్షక భటుడనే విషయం సమాజానికి తెలిసింది. సహాయంపొందినవారు పై అధికారులకు ఉత్తరాల ద్వారా తెలుపడం వల్ల పై అధికారులుకూడా భరత్ సేవలను గుర్తించారు.
   కాలం గడుస్తూ వుంది.
కాలవైపరీత్యం చెప్పను ఎవ్వరివల్లాకాదు. పంచభూతాలను అత్యధికంగా వాడుకుంటూ కలుషితం చేస్తూ, మానవజాతి పట్టపగ్గాల్లేకుండా బరితెగించి పోయింది.
  ఒక దూది బస్తాలు పోగేసిన గోడవున్లో  ఒక బస్తాకు అగ్గి అంటుకుంటే మిగతావి నవ్వుతూ వుంటే అగ్గి వాటిని వదులుతుందా! అలా గోడవునంతా  మంటలమయం అవుతున్నసమయంలో యజమాని వచ్చి గబగబా  అందిన మేరకు కొన్నింటిని బయటకు లాగుతాడు.అవిదక్కుతాయి.అగ్గినుండీ బూడి దవకుండా రక్షింపబడతాయి.
అలా చిత్రాతి చిత్రమైన ఏకకణ చిరుజీవి ఎక్కడో పుట్టి, ఎక్కడినుంచో పయనమై ప్రపంచదేశాలన్నింటీలో వీరవిహారం చేస్తూ ప్రాణులన్నింటినీ గడగడా వణికిస్తున్నది.ప్రపంచ దేశాలప్రజలంతా భయంతో కంపించి పోతున్నారు.భారత ప్రధాని సూచన మేరకు లాక్ డౌన్ ఐంది.ఎక్కడా వీధుల్లో జనసంచారం లేదు. జంతుజాలాలుకూడా  ఎక్కడా  కనిపించడం లేదు.వీధులన్నీ  నిర్మానుష్యం.
    భరత్ తన డ్యూటీలో అలర్ట్ గావుంటూ నడి ఎండలో నిల్చుని నాలుగురోడ్ల కూడల్లో  డ్యూటీ చేస్తున్నాడు. ఎవరూ లాక్ డౌన్ సమయంలో వీధుల్లోకి వచ్చినా పట్టుకోవలసిందే.  
 నడిమధ్యాహ్నం సూర్య తాపం అదరగొట్టేస్తున్నది.దూరం నుంచీ ఆర్తనాదం.కనుచూపుమేరలో ఒక మహిళ బాధతో మూల్గుతూ నడవలేక నడవలేక మధ్యమధ్యలో ఆగుతూ అడుగులేస్తున్నది.ఆమె భర్తకాబోలు తన భుజాల మీద ఆమె చేతులేసుకుని నడిపిస్తూ ' హెల్ప్ హెల్ప్ దయచేసి ఏవరైనా సాయం చేయండి "అని అరుస్తున్నాడు.  
   డ్యూటీ లో వున్న భరత్ విన్నాడు. కనుచూపుకి వచ్చాక గమనించాడు. టోపీ తీసి తాను నిల్చునున్న సర్కిల్ ల్లో స్టూల్ మీద వుంచి, కొద్దిదూరంలో వున్న కూరలూ, పండ్లూ అమ్మే చెక్క బండి గబగబా లాక్కుని వారి దగ్గర కెళ్లాడు. మగమనిషి సాయంతో ఆమెను ఎత్తి బండిమీద పడుకోబెట్టి తాను డ్యూటీ చేసే ఎదురుగా వున్న ఒక హాస్పెట్లల్లోకి బండిని అతడి సాయంతో నెట్టుకెళ్ళి ,
" సార్! నేను డ్యూటీలో వున్నాను. వెళ్లాలి. మీరు మిగతా విషయం చూడండి.ఏదైనా సాయంకావలిస్తే పిలవండి" అని చెప్పి వడివడిగా నడుస్తూ  తన స్థానానికి వచ్చి టోపీ పెట్టుకుని డ్యూటీలో అలర్టయ్యాడు. 
    సాయంకాలం నాలుగైంది, భరత్ డ్యూటీ దిగే సమయం. హాస్పెటల్ నుంచీ ఇందాకటి మగ మనిషి  భరత్ వైపు చూసి నడుచుకుంటూ బయటికొచ్చి వచ్చాడు. భరత్ " ఏమైంది ! అంతా కులాసాయేనా!" అని అడిగాడు.
" అయ్యా ఆపరేషన్ చేసి ! డెలివరీ చేశారు. రక్తం కావాలిట ఓ గ్రూపు. లోపల నిలువలేదట. నాగ్రూపు బీ. ఏం చేయాలో తెలీక మీరే దేవునిలా ఇందాక సాయపడ్డారు అందుకే మీదగ్గరికే వచ్చాను. "అంటూ ఏడుస్తూ నిల్చున్నాడు. భరత్ టైంచూశాడు.నాలుగు కావచ్చింది. " సార్ మీరెళ్లండి. ఇంకో ఐదునిముషాల్లో నన్ను రిలీవ్ చేయను మరో కానిస్టేబుల్ వస్తాడు. అతడు రాగానే నేను లోపలికి వచ్చి రక్తం ఇస్తాను.నాది ఓ గ్రూపే. "అనిఅతడిని లోనికి పంపేశాడు. ఇంతలో తనను రిలీవ్ చేసే ఉద్యోగి రాగానే విషయం చెప్పి హాస్పెటల్లో కెళ్ళి రక్తం డొనేట్ చేశాడు.    
ఆమె భర్త అనంత్ భరత్ పాదాలకు నమస్కరించాడు కృతజ్ఞత మరోలా తెలపను చేతకాక. భరత్ మెల్లీగా తన సైకిలెక్కి ఇంటి కెళ్ళిపోయాడు.
  మరునాడు డ్యూటీకి కాస్తముందుగానే వచ్చి భరత్ హాస్పెటల్ లోపలికెళ్ళి ఆమెకు ఎలా వుందని బయట కూర్చునున్న ఆమె భర్త అనంత్ ను అడిగాడు. "రండి సార్ !నాభార్య మిమ్మల్ని అడుగుతున్నది అన్నలాగా వచ్చి కాపాడారని మీకు వందనాలు చెప్పాలని చూస్తున్నది " అని లోనికి తీసుకెళ్లాడు.                                                                              బెడ్ మీద వున్న ఆమె ఇందిర  చేతులుజోడించి నమస్కరించింది. కళ్ళెమ్మట నీరుకారుతుండగా" అన్నా! భరత్ అని మీపేరే వీడికి పెట్టాం" అంది.తాను తెచ్చిన బ్రెడ్ ఆమెకు అందించి నవీన్ డ్యూటీలో చేరను వెళ్లాడు.
  ఒకగంటలో ఎస్.పీ వచ్చి " భరత్! నీ మానవసేవకు నీకు మన డి డిపార్ట్మెంట్ తరఫున ఒక వెయ్యి రూపాయ లు బహుమతిగా ఇస్తున్నాను." అని సొమ్ము తీస్తుండగా, డీ.ఎస్.పీ తన జీప్లో వచ్చి " భరత్! నీవల్ల మన డిపార్ట్మెంట్ కు మంచి పేరువచ్చింది. నీవు మానవతా దృష్టితో చేసిన సేవ రెండు నిండు ప్రాణాలను కాపాడింది,నీసేవకు గుర్తిపుగా నీకు మన డిపార్ట్మెంట్ తరఫున పదివేలు అందిస్తున్నాను." అంటూ సొమ్మున్న కవర్ బయటికి తీశాడు.
 భరత్ వారిద్దరికీ సెల్యూట్ చేసి " సర్ ! నేను మానవ ధర్మాన్ని పాటిం చాను. మనది రక్షణశాఖ కదా!  ఆ ధర్మం పాటించాను.సర్ మీరేమీ అనుకోకపోతే మొత్తం ఈ పదకొండువేలనూ హాస్పెటల్ ఖర్చుకు ఆదంపతులకు ఇవ్వండి,పాపం పేదవారు, కూలి చేసుకునేవారు  " అనిచెప్పాడు. 
  భరత్ కు డీ.ఎస్.పీ సొమ్మిచ్చేప్పుడు ఫోటో తీసి పేపర్లలో వేయను ప్రత్యేకంగా వచ్చిన పత్రికాధిపతులు భరత్ ఫోటో తీసుకుని విషయమంతా స్పెషల్ ఎడిషన్లో పెద్ద ఫోటోతో వేశారు. భరత్ తల్లి, భరత్ పంతులుగారూ ఆపేపర్ చూసుకుంటూ పొంగిపోయారు.  
  ఒక తల్లితమ బిడ్డ, ఒకగురువు తమ శిష్యుడు అంత ఆదర్శవంతంగా తయారవడంకన్నా మరేం కోరుకోరుకదా!  
              ' మేరా భరత్ మహాన్ 'అనుకుని ఆనందించారు.
                     మేరా భారత్ మహాన్        
గమనిక- వాట్స్ యాప్ లోవచ్చిన ఒక సమాచారం  ఆధారంగా ఈ కధ రూపుదిద్దుకుంది. 23ఏళ్ల పోలీస్  కానిస్టేబుల్  ' మనప్పారై'- తిరుచ్చి - చేసిన ఘనతకు భారతదేశం అంతా అతడికి సెల్యూట్ చేయాల్సిందే.  
                                       ***** 

No comments:

Post a Comment

Pages