నెత్తుటి పువ్వు - 20 - అచ్చంగా తెలుగు
                                                                   నెత్తుటి పువ్వు - 20
మహీధర శేషారత్నం


బుద్ధిగా తలవాల్చుకు కూర్చుంది.
“కూతురయితే.... కుతూహలంగా అడిగేడు.
“పరీక్ష చేయించుకుని తీపించేస్తాను...” నిస్సంకోచంగా అంది.
“వద్దు - వద్దు అలా అనకు....” వారించాడతను.
“ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు అదేందోనంట...” నవ్వింది. ఆమెలేచి వెళ్ళి గదంతా వెదికి ఒక పసుపుకొమ్ము సంపాదించింది. దారం ముక్క వెతికి పసుపు కొమ్ముకి కట్టింది.
“నా మెళ్ళో కట్టు...” అందించింది.
అందుకోలేదతను.
“భయమా?” కవ్వించింది.
“ఎందుకు?”
“నీ పెళ్ళాంతో వాటాకొస్తానని
“ఛ! ఇలా మళ్ళీ పెళ్ళి చేసుకోవడం నేరం.”
“మరో ఆడకూతురి ఉసురు నాకెందుకులే. ఇది కేవలం నీ కోసం, నా కోసం మాత్రమే.”
ఆమె ఊపిరి వెచ్చగా తగిలిందతనికి. వెనక్కి జరిగాడు.
“నేనా నీ మనిషిగా ఉండి పోతాను. నీకు బరువు కానులే. ఏదో పనిచూపించు....”
మనసులోనే దేవుడిని తలచుకుని తాళికట్టాడతను. కాని అతని మనసంతా బరువుగా, తప్పు చేసినట్టు ఏదో దిగులు ఆవరించింది. కాని ఆమె ఎప్పటికంటే ఉత్సాహంగా, కళ్ళలో మెరుపులు కురిపిస్తూ నవ్వుతూ వంటచేసింది. పాయసం చేసింది.
“ఇంద తీపి తిను.” కాస్త పళ్ళెంలో వేసి ఇచ్చింది.
అన్య మనస్కంగా అందుకున్నాడతను. తాను తప్పుచేసాడు. ఆడదాన్ని గౌరవించాలనే తను ఇద్దరాడ వాళ్ళకి అన్యాయం చేసాడు. దిద్దుకోలేని తప్పుచేసాడు. స్త్రీ స్పర్శ తనకి కొత్తది కాదు. బాధ్యత తెలియని వయసుకాదు. ఎందుకీ అమ్మాయి నా మనసింత లాగేసింది. మనసంతా చీదరగా అయిపోయింది. లేచి షర్టు తొడుక్కున్నాడు. జేబులోంచి దువ్వెనతీసి తలదువ్వుకున్నాడు. చెప్పులు వేసుకున్నాడు.
గబ గబా దగ్గర కొచ్చింది.
“ఇదుగో! అనవసరంగా దిగులుపడమాక. నువ్వేం తప్పు చెయ్యలేదు.” నీకు తప్పు చేయడం కూడా చాతవుద్దీ!
భుజాలచుట్టూ చేతులేసింది. నెమ్మదిగా తీసేసాడు.
నిశ్శబ్దంగా బయటికి నడిచాడు.
తప్పు చేసానో ఏంటో! పాపిష్టి దాన్ని గొణుక్కుంది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages