హాస్యానికి రాజు—బసవరాజు - అచ్చంగా తెలుగు

హాస్యానికి రాజు—బసవరాజు

Share This
హాస్యానికి రాజుబసవరాజు
పోడూరి శ్రీనివాసరావు 


బసవరాజు పద్మనాభం అంటే హాస్యం.  పద్మనాభం అంటే శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న. పద్మనాభం అంటే పొట్టి ప్లీడరు. ఎన్నో చిత్రాల్లో  ప్రముఖమైన హాస్యప్రధానమైన పాత్రలు ధరిస్తూ ఎన్నో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా  తెలుగు చలనచిత్ర సీమలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప  హాస్యనటుడు.
బసవరాజు వేంకట పద్మనాభరావు 20 ఆగస్ట్ 1931 న కడప జిల్లా పులివెందుల తాలూకాలోని సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు శ్రీ బసవరాజు వెంకటశేషయ్య, శాంతమ్మ. పద్మనాభం తండ్రి వెంకటశేషయ్య కడప జిల్లా వేంపల్లెకు సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా వుండేవారు. ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. పద్మనాభానికి చిన్నప్పటినుంచీ సంగీతమన్నా, పద్యాలన్నా చాలా ఇష్టం. మూడు సంవత్సరాల వయసునుంచీ పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆవూరి టెంట్ హాల్ లో “ద్రౌపదీవస్త్రాపహరణం”, “వందేమాతరం”, “సుమంగళి” శోభనావారి “భక్త ప్రహ్లాద”మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్యసన్నివేశాలు అనుకరిస్తుండేవాడు.
1936లో ఐదేళ్ళ వయసులో “చింతామణి” నాటకంలో కృష్ణుడి వేషం వేసి వన్స్ మోర్లతో బాటు ఒక వెండికప్పును కూడా బహుమతిగా పొందాడు. తర్వాత తమ్ముడు సుదర్శనంతో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకుని, యాయవారంచేసుకుని  చదువుకున్నా, చదువు   వంటబట్టలేదు. థియేటర్ మేనేజర్ని మంచిచేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు. అప్పుడే సైకిల్  తొక్కడం నేర్చుకున్న పద్మనాభం తమ్ముడితో కలిసి సైకిల్ కొనడానికి డబ్బు సంపాదించడానికి,  ఎవరికీ చెప్పకుండా, రైల్లో టికెట్ లేకుండా, ముందు బెంగుళూరు వెళ్లి, అక్కడెంచేయ్యాలో తోచక, మద్రాస్ వెళ్ళారు. అక్కడ నటి కన్నాంబ ఇంటికివెళ్ళి ఆమెతో విషయమంతా చెప్పారు.  తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరి వారి కంపనీ లో కుదురుకున్నారు..
ఆతర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, ఇంకొకవైపు. ఎస్. ఆర్. లాంటి వాళ్ళతో కలిసి, భక్తతుకారాం లాంటి నాటకాల్లో 50, 60 ప్రదర్శనల్లో పాల్గొన్నాడు.  రుషేన్ద్రమని వాళ్ళ ట్రూప్ లో పాదుకాపట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణలీలలు మొదలైన నాటకాల్లో పాల్గొన్నాడు.
వాళ్ళు తీసిన “పాదుకాపట్టాభిషేకం” సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే, తమ్ముడు ఇంటికి తిరిగివచ్చేశాడు.  తర్వాత పద్మనాభం మాయలోకం సినిమాలో కోరస్ లో పాడడమే గాక, ఒక పాత్ర కూడా  వేసాడు. నటుడిగా పద్మనాభానికి ఇది తొలి సినిమా. రెండవ సినిమా త్యాగయ్య. మూడవ సినిమా ముగ్గురుమరాటీలు.. తర్వాత నారదనారది, యోగి వేమన  తదితర చిత్రాల్లో అవకాశాలు వరసగావచ్చాయి . 1947 లో వచ్చిన రాధికలో కృష్ణ పాత్ర వేయదమేకాకుండా, ఒక గోపబాలునికి ప్లేబాక్ కూడా పాడాడు.   భక్తశిరియాల లో చిన్న చిరుతొండడి పాత్ర. వింధ్యరాణి లో ఇటు నటన, అటు గానం. 
1948లో  జెమినివారి వీరకుమార్ చిత్రంలో నటించడానికి కొంత అడ్వాన్సు కూడా తీసుకున్నాడు. ఇంతలో యోగివేమన తీసిన కే.  వి. రెడ్డి, గుణసుందరి కథ తీస్తుండడంతో ఆయనను వాహినీ స్టుడియోలో కలవగా, ఆయన   పద్మనాభంచేత పాట పాడించుకుని విని, గొంతు  బాగాలేదని చిరాకుపడ్డాడు. దాంతో నిరాశగా పద్మనాభం సింహాద్రిపురం వెళ్ళిపోయాడు.
ఆ సమయంలోనే తేలుకాటుతో సోదరుడు ప్రభాకరం, జబ్బుతో చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో,  విరక్తిచెండిన పద్మనాభం కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరంగా వున్నాడు. గుంతకల్ కు సమీపంలోని కొనకండ్ల లో చిన్నాన్న శ్రీనివాసరావుదగ్గర కరణీకం నేర్చుకుంటుండగా, వీరకుమార్ చిత్రం షూటింగ్ కు పిలుపువచ్చింది. ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్నరోజుల్లో, విజయా సంస్థతో ఏర్పడిన పరిచయం పద్మనాభం కెరీర్ ను  మలుపుతిప్పింది.
షాహుకార్ చిత్రంలో నౌకర్ పోలయ్య వేషానికి ముందు హాస్యనటుడు బాలకృష్ణను అనుకున్నారు. కానీ అతను ముదురుగా అనిపించడంతో చక్రపాణి గారు వేరొక నటుడిని ఆపాత్రకు చూడమని చెప్పగా దర్శకుడు ఎల్. వి. ప్రసాద్ గారి సూచనతో ఆవేషం పద్మనాభం  కు  దక్కింది. పాతాళభైరవి స్క్రిప్ట్  వర్క్ జరుగుతుండగా కె. వి. రెడ్డి తోటరాముడిగా రాజారెడ్డిని, మాంత్రికుడిగా  ముక్కామలను అనుకున్నారట. కానీ  షావుకార్ రషెస్ చూసినవెంటనే మనసు మార్చుకుని హీరోగా ఎన్. టి. ఆర్., మాంత్రికుడిగా  ఎస్. వి. ఆర్.,  అంజిగా బాలకృష్ణ,, సదాజపుడిగా పద్మనాభం లను ఖరార్ చేసుకుని, విజయావారి పర్మనెంట్ ఆర్టిస్ట్ లుగా  మూడేళ్ళ అగ్రిమెంట్  తీసుకున్నారు. పాతాళభైరవితో బాలకృష్ణ అసలుపేరు మరుగునపడిపోయి, అంజిగాడు గానే ప్రసిద్ధిపొందాడు. పద్మనాభం తెలుగు, తమిళభాషల్లో పాతాళభైరవితో  బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన   పెళ్ళిచేసిచూడు, చంద్రహారం చిత్రాలలోకూడా నటించాడు. అదేసమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీ కాళహస్తి మాహాత్యంలో కాశి వేషం  వేసాడు. 1954 లో వచ్చిన సతీ అనసూయతో మొదలుపెట్టి, కృష్ణప్రేమ, సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామకథ, సతీ తులసి , ప్రమీలార్జునీయం లలో నారదుడిగా వేసాడు.  
1964  వ  సంవత్సరంలో రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పేర చలనచిత్ర నిర్మాణసంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రాలను నిర్మించారు. మర్యాదరామన్న సినిమాతోనే, నేటి ప్రముఖ  గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  గాయకుడిగా చలనచిత్రసీమకు పరిచయం కావించబడ్డాడు.  ఆతర్వాత  పద్మనాభం తన బానర్  లో 1968 లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, ఆ చిత్రానికి దర్శకునిగా కూడా వ్యవహరించారు. 1970  లో కథానాయిక మొల్ల చిత్రాన్ని నిర్మించి, ఆచిత్రానికి బంగారునంది అవార్డ్ కూడా పొందారు.   
పద్మనాభం నటించిన సినిమాల్లో కొన్ని ప్రముఖమైనవి ::  షాహుకారు, పాతాళభైరవి, జయసింహ, పాండురంగమాహాత్యం, అప్పుచేసిపప్పుకూడు, ఇల్లరికం, రాజమకుటం, ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగు నీడలు, ఆత్మబంధువు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, దాగుడుమూతలు, బొబ్బిలియుద్ధం, మూగమనసులు, మంచిమనిషి, వీరాభిమన్యు, పాండవవనవాసం, దేవత, సుమంగళి, పొట్టి ప్లీడర్, శ్రీకృష్ణతులాభారం, అవేకళ్ళు, ఆడపడచు, గో పాలుడు భూపాలుడు, పరమానందయ్య శిష్యులకథ,  భక్తప్రహ్లాద, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న, తిక్కశంకరయ్య, బాగ్దాద్ గజదొంగ, ఆదర్శకుటుంబం, ఆత్మీయులు, కథానాయకుడు, బుద్ధిమంతుడు, భలేరంగడు, కథానానటించారు.యికమొల్ల, కోడలు దిద్దినకాపురం, చిట్టిచెల్లెలు, జాతకరత్న మిడతంభొట్లు, శ్రీ క్రిష్ణవిజయం,.... ఇలా అనేక సినిమాల్లో ప్రముఖ హాస్యపాత్ర అంటే పద్మనాభానిదే. ఇంకా ఎన్నో విజయవంతమయిన చిత్రాల్లో పద్మనాభం  
నటించారు.
చిత్రసీమలో మంచి హాస్యానికి  విలువనిచ్చి, మంచి హస్యనటుడి గాను,  ఉత్తమాభిరుచిగల నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించిన శ్రీ పద్మనాభం చెన్నైలో ఫెబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతో, 79 ఏళ్ళ వయసులో స్వర్గస్తులయ్యారు.  
డా. పోడూరి శ్రీనివాసరావు.
   98494  22239             

No comments:

Post a Comment

Pages