గురుభ్యోనమః - అచ్చంగా తెలుగు

గురుభ్యోనమః

Share This
గురుభ్యోనమః
సి.ఉమాదేవి 
 


విశ్వవిద్యాలయ ప్రాంగణం. ఎటు చూసినా కోలాహలమే. గురువులు, శిష్యులతో కళకళలాడుతోంది. పాఠశాలలో చేరిన తొలి రోజును జ్ఞప్తికి తెస్తోంది.తేడా ఒక్కటే.అప్పుడు వీపు మోయలేనంత పుస్తకాల బరువు,నేడు చేతిలో ఒక చిన్న డైరీలాంటి పుస్తకం.లైబ్రరీ అందించిన పుస్తకాలు ఔపోసనపట్తే చాలు.
    ఎవరో పెద్దాయన క్లాస్ రూంలోకి వెళ్తున్నారని,వారే తమ సార్ కావచ్చని అందరు క్లాస్ రూం వైపు కదిలారు.గదిలోకి వెళ్లిన పెద్దాయన చైతన్యమూర్తి.తనదగ్గరున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెన్ను,నోట్ బుక్ సిద్ధంగా పెట్టుకుని చివరి బెంచ్ పై కూర్చున్నారు.అందరిలోను ఆశ్చర్యం ప్రశ్నార్థకమైంది. ‘ఎందుకిలా కూర్చున్నారు మన సార్.అందరు వచ్చాకనే పాఠం మొదలెట్తారేమో’ అనుకుని అందరు ఆయనకు నమస్కరిస్తూ కూర్చుంటుండగా అంతలోనే హడావిడిగా లోపలికి వచ్చిన అసోసియేట్ ప్రొఫెసర్ తన స్థానంలోకి వెళ్లి ‘గుడ్ మార్నింగ్ బాయ్స్’ అనగానే అందరు, ‘ గుడ్ మార్నింగ్ సార్’ అంటూనే వెనక్కి చూసారు.వారితో చైతన్యమూర్తి గొంతు జత కలిసింది.                                    
“ మీరు రండి మూర్తిగారు,ముందుకొచ్చి కూర్చోండి.”అన్నాడు అసోసియేట్ ప్రొఫెసర్ కరుణాకరం. “ ఫరవాలేదు సార్,మీ గొంతు మైకులోంచి వినిపించినట్లు వినబడుతోంది.” అతడి చిరునవ్వు అందరిలోను నవ్వులు పూయించింది.విద్యార్థులందరు కంచుకంఠం మాస్టారు అని ముద్దుగా పిలుచుకునే కరుణాకరం మాస్టారు కూడా హాయిగా నవ్వేసారు.మొదటి పాఠంగా సిలబస్ పై అవగాహన,పరీక్షావిధానం,విడువక చదవాల్సిన అంశాలు మార్కుల,గ్రేడుల వివరణతో ఉత్సాహంగా ముగిసింది.క్లాస్ ముగియగానే బయటకు వెళ్లిన కరుణాకరంకు తన కొలీగ్ కృష్ణప్రసాద్ కనబడి, “ ఏం సార్, మీ గొంతు క్లాసు బయటకు వినబడుతుంటే వింటూ నిల్చున్నాను.సినారెగారి పాఠాలను సహోపాధ్యాయులు కూడా ఇలాగే వినేవారట.” అని నవ్వాడు.            “ అంతటి మహానుభావుడితో నాకు పోలికా? మా అమ్మ చిన్నప్పుడు మైకు మింగుంటావు అనేది నేను అరచి గోల చేసినప్పుడల్లా. అన్నట్లు మన సీనియర్ చైతన్యమూర్తి నాకిప్పుడు స్టూడెంటయారు.అప్పుడే మనతోపాటు పి.హెచ్.డి చేసుండాల్సింది.” అన్నాడు కరుణాకరం.
“అదే చెప్పాలనుకున్నా.మన చంద్ర,నేను కూడా వారి విద్యార్థులమే.కాస్త కనిపెట్టుకోండి.అహ మీ మంచి మనసు ,సంస్కారం నాకు తెలుసు.ఏదో ఒక మాట చెప్పాలనిపించింది.ఏమనుకోకండి.”
“నేనేమనుకుంటాను , నేను,మూర్తిగారు చదివిన విశ్వవిద్యాలయాలు వేరయినా మనమంతా ఒక్కటే కదా!” అని కృష్ణప్రసాద్ భుజంపై చెయ్యి వేసాడు ఆప్యాయంగా.
సాయంత్రమయితే ఎవరికైనా ఆటవిడుపే.అందుకే కాలేజీ బస్సు రాగానే అందరిలోను ఎక్కేయాలనే తొందరే. కరుణాకరం దగ్గరగా వచ్చిన అటెండర్, “ చూడండి సార్ ఆ చైతన్యమూర్తి గారు మన ప్రిన్సిపాల్ ఎదుటే సిగరెట్ పొగ గుప్పుగుప్పుమంటూ వదులుతూ,” అని గొణగసాగాడు.  
“అరే ఆ ప్రిన్సిపాల్ గారు కూడా చైతన్యమూర్తిగారి విద్యార్థేరా నాయనా.” “అదేంటి సార్?” అని ప్రక్కనే నిలుచుని ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్ర తెల్లబోయాడు. “అవును చంద్రా, మన ప్రిన్సిపాల్ గారు చైతన్యమూర్తిగారి కన్నా ఎంతో ముందుగా పి.హెచ్.డి పూర్తవడంచేత త్వరగానే ప్రిన్సిపాల్ కాగలిగారు.” గురుభ్రమణంలోని మలుపులు చాలానే ఉన్నాయే  అని మనసులోనే అనుకున్నాడు చంద్ర. చదవడం నిత్యకృత్యం.అయితే చదువును వెన్నంటి వచ్చే పరీక్షలు జీవితానికే పరీక్షలనిపిస్తాయి.థియరీ పరీక్షలు పూర్తయాయి.ప్రాక్టికల్స్ మొదలయాయి.చైతన్యమూర్తి గంటనుండి ఇన్ వర్స్ ఆఫ్ మాట్రిక్స్ ప్రాబ్లం కు పరిష్కారాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.    “నేనేమైనా వివరణ ఇవ్వాలా?” అని మెల్లగా అడిగాడు కరుణాకరం. 
“ వద్దులెండి.మీరు అనుమతిస్తే అలా కాస్త వరండాలోకి వెళ్లి వెంటనే వచ్చేస్తాను.నా వెంట అటెండర్ ను కూడా... .” అంటుండగా “అదేంమాట వెళ్లిరండి.” అన్నాడు కరుణాకరం.                                 
అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చేసాడు చైతన్యమూర్తి.రాగానే తీవ్రంగా ఆలోచిస్తూ  సరియైన సమాధానాన్ని సాధించగలిగాడు. అతనిలోని పట్టుదలకు అతడు ఎన్నో మెట్లు అవలీలగా ఎక్కిన అనుభూతి నాకు గురువుగా అత్యంత తృప్తి కలిగించింది.గురువులకే గురువుగా నిలవడం బండ్లు ఓడలుగా ఓడలు బండ్లుగా మారిన తీరు మనసున మెదలింది.అనుకున్న సమయానికి చైతన్యమూర్తి పి.హెచ్.డి.ని సంపాదించుకున్న అనంతరం అమెరికానుండి చిన్నారి మనవడు వస్తున్నాడని  విమానాశ్రయానికి చేరుకున్నాడు.సాదాగా వచ్చిన తాతయ్యను చూసిన మనవడు, “ వాట్ గ్రాండ్ పా! నో కోట్!” వెన్నంటి వచ్చిన కూతురు,అల్లుడు కూడా ఆశ్చర్యపోయారు. ‘తరాల అంతరాలలో పిల్లలు కూడా గురువులే’ అని నవ్వాడు చైతన్యమూర్తి. చైతన్యమూర్తి తన పి.హెచ్.డి పట్టాను కాన్వొకేషనుకు స్వయంగా వెళ్లి తెచ్చుకున్న సంతోషంలో అందరిని తమ ఇంటికి విందు భోజనానికాహ్వానించారు.తనకు పాఠాలు చెప్పినవారిని, తనతోటి ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను, తనతోపాటు చదువుకున్న వారిని కూడా విందుకు తప్పకరావాలని పిలిచాడు. విందుకన్నా ముందు వారి ఆప్యాయత అందరిని కలిపింది.తన పి.హెచ్.డి. అనుభవాలను పంచుకుంటూ , “అనుభవాన్ని మించిన పాఠం లేదంటారు.నా అనుభవం మీకు పాఠమే.” అని తనతోపాటు చదువుకున్నవారివంక చూసాడు.       
  “పదవీ విరమణకు చేరుకునే ముందు చేసిన పి.హెచ్.డి. మనసుకు తృప్తినిస్తుంది కాని ఉద్యోగసోపానంలో సత్ఫలితాలనివ్వదు.” దృఢంగా పలికాడు చైతన్యమూర్తి. “మరి మీ పి.హెచ్.డి. మీకిప్పుడు ఎంతవరకు ఉపయోగపడింది?” కృష్ణప్రసాద్ నవ్వుతూ అడిగాడు. “ నీకు తెలుసు కదా” అని చిన్నగా నవ్వి, “అందరికీ తెలియచేయాలనే కదా నేను మీ అందరిని పిలిచాను.” అతని ముఖంలో ఆనందం కన్నా బాధ మొగ్గ తొడుగుతోంది. “నేను ప్రొఫెసర్ కాగలిగాను కాని పదోన్నతి కాస్త మీకు నన్ను దూరం చేస్తూ బదిలీ కావడం నా మనసులో ఆనందంకన్నా బాధను పెంచుతోంది.” అందరిలోను ఒక్క క్షణం మాటలు కరువయి గొంతులు మూగపోయాయి.          “ అలా అనకండి సార్.మీరు మాతోపాటు క్లాసుకొస్తున్నా , మేము మీ ఇంటికి వచ్చినపుడు మాకు పాఠాలను పునశ్చరణగావించి మా సందేహాలను నివృత్తి చేయడం మా అదృష్టం.మీరు మాలాంటి విద్యార్థులకు ప్రొఫెసర్ గా నియమించబడటం  మీరు అందుకున్న ఔన్నత్యం.మీకు మా చప్పట్లు” అంటూ అందరు లేచి నిల్చుని లయబద్ధమైన చప్పట్లతో అలరించారు.
“ మీరు పరీక్షలో వ్రాసిన విశ్లేషణాత్మక జవాబుపత్రాన్ని విద్యార్థులకు దిక్సూచిగా  డిపార్ట్ మెంట్ గ్రంథాలయంలో నిక్షిప్తం చేయాలన్న నిర్ణయాన్ని కరుణాకరం ఆనందంగా చెప్తూ అభినందించాడు.    ‘ గురువుగారు’ అంటూ ఆప్యాయంగా కరుణాకరాన్ని దగ్గరగా హత్తుకున్నాడు చైతన్యమూర్తి.  గొప్ప బీద, మేనేజరు గుమస్తా, గురువు విద్యార్థి ఇలా చెప్పుకుంటూపోతే మనుషులమధ్య తారతమ్యాలు కళ్లు కనబడనివ్వని పొరలలా, మనసుపై సైతం అధికులమనే పొరలు దట్టంగా అతుక్కుని ఉంటాయి. అయితే తద్భిన్నంగా మనుషులు ప్రవర్తించినపుడు  మానవతా పరిమళం మనసు పొరలను తొలగించి కమనీయ దృశ్యమానమవుతుంది.తల్లి,తండ్రి తరువాత స్థానం దైవానికి అత్యంత సమీపంగా ఉన్న గురువుదే.అమ్మ ఒడిని వీడి బడిలో చేరినది మొదలు అటు పాఠాలను,ఇటు జీవితపాఠాలను సమాంతరంగా బోధించే గురువులున్నంతకాలం విద్యార్థినీవిద్యార్థులకు గురువెప్పుడూ దైవం మానుషరూపేణా అనిపిస్తారు. చక్కటి విందునారగించి చైతన్యమూర్తినుండి వీడ్కోలు తీసుకుంటూ గురువులందరికీ విద్యార్థులు ప్రణమిల్లారు.
                                             *****

No comments:

Post a Comment

Pages