గజా(వ)రోహణ సత్కారం !? - అచ్చంగా తెలుగు

గజా(వ)రోహణ సత్కారం !?

Share This

హాస్య కథ
గజా(వ)రోహణ సత్కారం !?
 - మినీకథా చక్రవర్తి, కథానిధి, కథా బ్రహ్మ, కథా విశారద - కె.బి.కృష్ణ.


రాబోవు ఖర నామ ఉగాది పండుగ సందర్భంగా సరస్వతీ పుత్రులైన రచయిత(త్రు) లకు శుభవార్త !
అత్యుత్తమ రచయిత(త్రి) కి గజారోహణం, మరియూ " నవరత్న ఖచిత స్వర కంకణ " ప్రదానం మరియూ నగదు బహుమానం
సాహితీ చరిత్ర లోనే అలనాడు విజేనగరం రాజ్యం లో శ్రీకృష్ణదేవరాయల వారు కవులకూ,పండితులకూ సత్కారం చేసినట్లు గానే, అంత కన్నా ఘనంగా ప్రతీ యుగాది కీ సన్మానం చేస్తున్నాం మేము.
ఇంకెందుకు ఆలస్యం ? వెంటనే మీ వివరాలూ, ఫోటోలూ నెల రోజుల లోగా ఈ ఘనసత్కారం స్వీకరించడానికి ప్రతిపాదనలు పంపించుకోండి. ఆలస్యం, అమృతం, నిరాశ. -- అధ్యక్షులు, ముక్కోటి దేవతల సాహితీ సమితి. (రిజిస్టర్) కప్పలపాలెం "
రెండు కలశాలూ, మామిడాకులూ, మామిడాకులూ, బంతిపూల తోరణాలతో బోర్డర్ తొ అలంకరించబడిన, ప్రకటన దినపత్రిక నాలుగో పేజీలో నాలుగో వంతు ప్రకటన చదివేడు గణపతిరావు. " గుణశ్రీ " "గణశ్రీ " " లతాశ్రీ " ఇంకా అనేక కలం పేర్ల తో పుంఖాను పుంఖాలు గా గత ఇరవై సంవత్సరాలు గా కథలూ, చిన్నకథలూ, నవలికలూ వంటివి కూడా రాసి పారేస్తున్న గణపతి రావు కు ఒకే ఒక్క సారి, ముసలాడికి వయాగ్రా మాత్రేసుకున్నాక యవ్వనం పొంగి వచ్చేసినట్లు గా ఒక్క సారిగా నాలుగడుగుల పదకొండు అంగుళాల పొడవున్న గణపతి ఉన్న పళం గా ప్రపంచం లోనే ఎత్తైన మనిషైపోయాడు. "గణశ్రీ " పేరు తో మొదటి రచన పంపడం ఆలస్యం పత్రిక లో ప్రచురించేసి, అతన్ని అభినందిస్తూ " మీరు ఇలాగా మా పత్రిక కు రచనలు పంపిస్తూండండి " అని ఆ పత్రిక వారు ఉత్తరం రాయడం ఆలస్యం గణపతి పగలూ రాత్రీ కూర్చుని ఒక యాభై రచనల పంపించేశాడు పత్రిక వాళ్ళు " ఇక వద్దు మొర్రో అని ఫోన్ చేసేశారు.
ఏది ఏమైనా గత ఇరవై సంవత్సరాల నుండి నిరంతరం గా, అనేకానేక బాల్ పెన్ను లు వాడి వందలాది రచనలు చేసి, వాటిలో పదుల సంఖ్య లో పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయనీ, పాఠకుల ప్రశంసలు పొందాయనీ గణపతి రావు చెబుతుంటాడు అందరికీ.
ఇంతవరకూ ఏ సాహితీ సంస్థ గాని, కళావేదిక ల వారు గాని గణపతిరావు ను అతని సాహితీ సేవలకు గుర్తింపు గా సత్కారం చేయకపోవడం, అతనికి చాలా వెలితి గా వుంటోంది. ఈ మధ్యన ఏ రంగం లో నైనా వెనక బలగం వుంటే గాని ఆ యా రంగాలలో పేరు ప్రఖ్యాతులు రావడం గాని, సత్కారాలు గాని జరగవు అని తెలుసుకున్నాడు. ధోనీ కంటే పవర్‌ఫుల్ బ్యాటింగ్ చేసే వాళ్ళు బోల్డంత మంది వున్నారు. అలాగే చాసోని మించి కథలు రాసే వాళ్ళున్నారు. శ్రీశ్రీ ని తలదన్నే అద్భుతం గా కవిత్వం సృష్టించే వాళ్ళున్నారు. వాళ్ళంతా ఎందుకు పైకి రాలేదు ? అంటే వాళ్ళకి బలగం లేదన్నమాట -- ఇలా గణపతి ఆలోచనా తరంగాలలో కొట్టుకుపోతూ, మరో ప్రక్కన ఒక వేళ గజారోహణ చేయిస్తే, తనను రెండు పక్కలా ఎవరైనా పట్టుకుని వుంటారా లేదా లేకపోతే ఏనుగు తనను చెరుకు మొక్క లా నోటితో కరుచుకుని ఉతికేస్తుందా ? అమ్మో ! అని ఆలోచస్తున్నాడు. ఆ వేళ ఆదివారం.
వంటింట్లోంచి సాంబార్ వాసన ఘుమఘుమ ముక్కుపుటాలను తాకుతూ జరరాగ్ని ని అధికం చేయసాగింది. పేపరు చూస్తూ -- ముఖం మీద పేపరు పెట్టుకుని కునికి పాట్లు పడుతున్న తన భర్త ను చూసి, గణపతి రావు భార్య దుర్గమ్మ, సాంబారు పోపు వేసేక, చీర చెంగు తో చేతులు తుడుచుకుంటూ వచ్చి గణపతిరావు పరిస్థితి ని చూసింది.
ఆమె గురించి రాయడం మహాపాపమూ, తప్పూ గానీ -- దుర్గమ్మ అచ్చంగా బాపు గారి బొమ్మల్లో ఆండాళ్ళమ్మగారి లాగా పైనుంచి కింద దాకా ఒకే షేపులో నీళ్ల డ్రమ్ములా వుంటుంది. పాపం మన గణపతిరావు బాపు గారి కార్టూన్స్ లోలాగాఇవ్వాలేం కూర చేయమంటావ్ ? ” అంటూ పడక్కుర్చీ లో పడుకుని వున్న నీళ్ళ పీపావంటి భారీ సైజు లో ఉన్న భార్య ను, చేతి లో గరిటె తో బక్క పీనుగు లా దీనం గా నిలబడి వున్నట్లు గా వుంటాడు. మరదీ వీరి దాంపట్య వైభోగం. ఎప్పుడైనా పదీపరకా ఏ పత్రికైనా దయ తలిచి మనియార్డరు పంపితే, అవి కాస్తా దుర్గమ్మ లాగేసుకుంటూంటుంది.
నెమ్మదిగా గణపతి ముఖం మీద పేపరు లాగేసి చూసింది. గజారోహణం, స్వర్ణకంకణ ప్రదానం గురించిన ప్రకటన. ఈన చేసే రచనల్లో సోకు, తక్కువ గాని ఈనకి కీర్తికండూతి బహు ఎక్కువే ! సన్మానాలు, సత్కారాలూ, బిరుదుల భోగం అంటే మహా ప్రీతి. మల్లా ఎవుడో పేపర్లో ప్రకటించేడు. ఈ పిచ్చిమాలోకం మళ్ళీ డబ్బు తగలేసి, ఫోటోలు, తన రచనలు వున్న నాలుగు పుస్తకాలూ పంపించేస్తాడు. ఆ యెనక కలలు కనేస్తాడు. సరే చూద్దారి అనుకుంది.
గణపతిరావు రచనా వ్యాసంగపు వేగాన్ని మించి ఆఘమేఘాలతో కాలం గడిచిపోతోంది. గణపతి రావు గజారోహణా నవరత్న ఖచిత స్వర్ణకంకణ సన్మానానికి దరఖాస్తు పంపించేశాడు.
ఒక రోజున ఏం జరిగిందంటే –
ఇద్దరు పెద్దమనుషులు ఆనాటి రాజీవ్ గాంధీ బ్రతికుండగా తయారైన
తొలి చిన్న కారు మారుతీ కారేసుకుని డుబ్ బుడ్ మని పొగలు కక్కుకుంటూ వచ్చారు. ఈ మధ్యనే ఆ కారులో డీజలూ, పెట్రోలూ అరవై నలభై శాతం లో పోయించి నడిపే మార్పులు చేయించార్ట, ఖర్చు తగ్గుతుందని.
గణపతి రావు గారూ -- " అంటూ వచ్చిన ఇద్దరి లో ఒకడు కేకేస్తున్నాడు.
ఖద్దరు శిల్ లాల్చీ పైజమా లో ఒకడూ, మరొకడు సాదాసీదా ఖద్దరు బట్టలలోనూ వేలాడుతున్నారిద్దరూ. కేకేసినోడి చంకలో అదే ఖద్దరు శిల్క్ బట్టలు వేసుకున్నోడి చంక లో అలనాటి ముఖ్యమంత్రి అంజయ్య గారి ఛాయాచిత్రం కనుపించీ కనుపించకుండా వుంది దాని మీద, మరీ పాతదైపోవడం వల్ల గామోసు.
తలుపు తీశాడు గణపతి. ఎదురుగా కళాపోషకుల వేషాల్లో ఇద్దరు శాల్తీలు. వెంటనే గణపతి రావు గజారోహణం సీను లోకి ఎల్లి పోయి, అటూ ఇటూ ఊగుతూ -- "ఎవురూ ? " అంటూంటే—
"ఆర్నీ పిచ్చి మేళమా -- ఆయనే రా ప్రముఖ కథారచయిత గణశ్రీ ఉరఫ్ గణపతిరావు గారు " అన్నాడు మామూలు ఖద్దరు బట్టలేసుకున్నాడు.
వెంటనే ఇద్దరూ ఉన్న పళంగా వొంగి గణపతి పాదాలు తాకి తాకనట్లుగా నటించేసేరు. గణపతి ఉన్న పళాన్న మళ్ళా ఒక సారి గజారోహణ చేసి కిందకు దిగేసేడు.
          గణపతి రావు లోని ఆహ్వానించకుండానే వాళ్ళిద్దరూ లోపలకు వచ్చేసి, హాలులో మూడు సోఫాల్లో రెండు సోఫాల్లో వాళ్ళు కూలబడి, పెద్ద సోఫాలో గణపతిరావుని కూలేశారు. ఇంతలో దుర్గమ్మ వంటింట్లోంచి గజగమనలా రెండు గ్లాసుల్లో నిమ్మరసంతో పట్టుకొచ్చి ఇచ్చేసింది. ఆ వచ్చిన రెండు శాల్తీలూ  దుర్గమ్మనూ గణపతిరావునీ తేరిపారా, మార్చి మార్చి చూసి ఇద్దరి పెర్సనాలిటీ లో వున్న భారీ తేడాకీ కించిత్ ఆశ్చర్యచకితులై " న-- న-- నమస్కారం తల్లీ. ఈ సరస్వతీ పుత్రులకుప్రేరణ కలిగిస్తున్నది తమరేనా తల్లీ ! అపరసరస్వతీ దేవి లా ) "గోచరిస్తున్నావమ్మా !! " అన్నారు. దుర్గమ్మ కొంచముగా సిగ్గుపడి వెళ్ళిపోయింది.
          వచ్చిన రెండు శాఖీల్లోంచి, ఖద్దర్ సిల్క్ లాల్బీ శాల్తీ గలగలా నవ్వుతూ -- " సరస్వతీ పుత్రా, వందలాది, వేలాది రచనలు చేసుస్తూ ఆంధ్రపాఠకులను ఊపేస్తున్న కథనబ్రహ్మా -- మా సాహితీ సంస్థ తమర్ని ఈ ఖర ఉగాది సందర్భంగా గజారోహణ మరియూ నవరత్న ఖచిత స్వర్ణ కంకణ సన్మానమునకు మిమ్ములను ఎన్ని చేసి మమ్ములను మేము గౌరవించుకొని యున్నాము -- అంటూ గణపతి చేతి ఒక హైబ్రిడ్ గులాబీ అందించాడు. ముగ్గురు కూర్చునే సోఫాలో ఉన్న గణపతి వెంటనే ముగ్గురి సైజు లో ఉబ్బిపోయి, చాలా ఇరుకు గా ఫీలైపోతున్నాడు.
"చెప్పండి నేనేం చేయగలను ? " అన్నాడు ఎలాగో కిందకు చూసి, అంటే అప్పటికే గణపతి గజారోహణ పర్వం లో ఉన్నాడన్నమాట !

వెంటనే వచ్చిన రెండు శాలీలు గబగబా తమ దగ్గర ఉన్న ఫైళ్ళు తీశారు.
" అయ్యా -- మేము ఈ సంవత్సరం నుండీ ఉగాది సత్కారం, ఎవరికి సత్కారం చేస్తే వారి ఇంటి వద్దనే జరిపేట్లు గా తీర్మానం చేశాము. మీరు మీ బంధుమిత్రుల ఫోన్ నెంబర్లూ, చిరునామాలు మరియూ సభలో ఎవరు పాల్లోనాలనేది, తదితర వివరాలు మాకు ఇస్తే వారందరినీ మేమే వెళ్ళి సగౌరవం గా పిలుస్తాము. మీకు ఎటువంటి శ్రమా లేదు. అంటే మీ ఇంటి ముందు మీ బంధుమిత్రుల ఎదుట, మీ పేటలో, మీరూ, మీ శ్రీమతిగారి తో గజారోహణా ఊరేగింపూ, ఆ తరువాత రాజకీయ ప్రముఖుని చే నవర్నఖచిత స్వర్ణకంకన బహుకరణా, సభకు ముందు ఉపాహారం, తరువాత విందుభోజనమూను. అదీ సంగతి.
ఇక పోతే మీ ఇంటి ముందు రెండు షామియానాలు, రెండు వందల కుర్చీలూ, వేదిక, సన్మానం కుర్చీ, వీటికి గానూ పది వేలు.. గజారోహణ కు ఊళ్ళో సర్కస్ కంపెనీ నుండి ఏనుగును తెప్పించడానికి, మావటివాడి తో సహా మరో పది వేలూ, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలకు పదివేలూ, దండలూ, శాలువాలూ, మెమెంటోలూ, బొకేలూ, మొత్తం కలిపి ఇరవై వేలూ, ఇక చివరగా నవరత్న ఖచిత స్వర్ణ కంకణానికి ఒక యాభై వేలూ, అది కూడా పూర్తిగా బంగారం అయితే చాలా అవుతుంది కాబట్టి ఒన్ గ్రామ్ గోల్డ్ కంకణం, డూప్లికేట్ నవ రత్నాలూ అలాగన్న మాట, ఎలాగైనా మొత్తం లక్ష రూపాయలవుతుందన్నమాట ! ఏమంటారు ? " అన్నాడు ఖద్దరు శిల్క్ శాలీ.
గణపతి చింకి చేటంత ముఖం చేసుకుని, ముఖమంతా పళ్ళు కనుపించేట్లు గా నవ్వి –
అబ్బో -- చాలా ఖర్చు పెడుతున్నారు. భారతదేశ, ప్రపంచ సాహితీ చరిత్ర లో ఇలాంటి గొప్ప సత్కారం నేను కనీవినీ ఎరుగను. -- " అంటూంటే, సదరు రెండు శాలీ లు తమ తమ బట్టలు దులిపేసుకుని, అదోరకం గా నవ్వేస్తూ –
" సరస్వతీ పుత్రా !! తమరు లక్ష రూపాయలు మాత్రమే విరాళం ఇస్తే, ఇంకా వాహనాల ఖర్చు సభకు జనసమీకరణకు ఖర్చు అనేకం వున్నాయి. అవి మరో ఏభైవేలు అవుతోంది. ఆ డబ్బంతా మన నగరం లోని సాహితీ బంధువుల దగ్గర గుంజేస్తాం -- మరి మనం ముందుకు వెళ్లామా -- " అంటూంటే –
వంటింట్లోంచి గిన్నెలూ, పళ్ళేలూ, చెంబులూ, గ్లాసులూ, గాలిలోకి ఎగురుతున్న చప్పుడవుతోంది.
వంటింట్లోంచి పెద్ద టమేటా వేగంగా ఫాస్ట్ బౌలర్ విసిరిన బంతి లా వచ్చి రెండు శాల్లీ మధ్యనుంచి వెళ్ళి వారి వెనుక గోడకు తగిలి పగిలి చచ్చింది !!
మరి కొద్ది క్షణాల్లో చిన్న దోసకాయ అపరిమితమైన వేగం తో వచ్చి గణపతిరావు కు తగలబోయి గురి తప్పిందేమో అతను కూర్చున్న సోఫా వెనక గోడ కు తగిలి పగిలి చచ్చింది.
వెంటనే ఆ రెండు శాలీ లకు కంగారు పుట్టిందో ఏమో !!!
నేపాళీ మాత్ర వేసుకున్నట్లు గా కంగారు తో వారి వారి పొట్టలు చేత్తో పట్టుకుని నిలబడ్డారు ఆపళాన్న.
గణపతి సంగతి చెప్పనవసరం లేదు. వీళ్లు వెళ్ళేక తనకు జరగబోయే సత్కారం ఊహించుకోలేకపోతున్నాడు. ఇంతలో –
ఒక చేతిలో చెక్క పప్పుగుత్తీ -- మరో చేతిలో ఇనుపపోపుల గరిటా -- పట్టుకుని మిడిగుడ్ల తో, అపరిమితమైన కోపంతో గ్రామదేవత లాగా ఊగిపోతూ, విజైవాడ కనకదుర్గమ్మ లాగా వచ్చింది దుర్గమ్మ.
వస్తూనే తమ ఇంటికి వచ్చిన రెండు శాలీలను తన ఎఱ్ఱని కళ్ళతో చూస్తూ ఏదో అనబోతూంటే –
బతికుంటే ఆడాళ్ళలాగా గోరింటాకైనా పెట్టుకోచ్చు. లేదంటే మరోటో, మరోటో సత్కారం చేసుకోచ్చు, పదరా బాబో -- అంటూ వాళ్ళిద్దరూ దుర్గమ్మ చూపులకూ, చేతులకూ అందకుండా, వాళ్ళ అదృష్టం కొద్దీ తలుపులు తెరిచే ఉండడం తో వాటి గుండా పారిపోయి, డొక్కు మారుతీ కారు ఒకరు ఎక్కితే, మరొకడు ఆ కారు తోస్తూంటే ,ఒక వేళ కారు తొందర గా స్టార్ట్ అవక పోతే దుర్గమ్మ దాడి ప్రమాదం వుందని భయవడి ఛస్తో బతుకుతూ పారి పోయారు వాళ్లిద్దరూ –
సోఫాలో మిడిగుద్దేసుకుని గణపతి రావు ఆకాశం కేసి చూస్తున్నాడు.
బహుశః గణపతి రావు గజాన్ని ఎక్కగానే అది కింద పడేసిందేమో అనుకుంటున్నాడు.
భర్తను చూస్తూ ఆందోళన తో –
ఏమయిందీ -- మీకూ -- మిగిగుడ్లేసుకుని అట్టా ఉండిపోయారూ -- మనిషన్నాక బుద్ధి జ్ఞానం ఉండాల. మడిసి కి ఈ కలికాలం లో గజారోహణం, నవరత్న ఖచిత స్వర్ణకంకణమూ తొడిగేది ఎవుడూ ?
మీ లాంటి సన్నాసులను చూసి పుట్టుకొస్తున్నారు అట్టాటి సత్కారాలు చేసేటోళ్లు. బుద్ధిగా పడుండండి. లేపోతే మాటా మంతీ, తిండీ బట్టా, నిద్రా నిప్పులూ, లేకుండా మందెట్టించేస్తాను.
తెలుస్తూందా ? అంటూ గర్జిస్తోంది దుర్గమ్మ.
ఆ పళాన్న గణపతి రావు గభాల్న కళ్ళు తెరిచి, సోఫా లో ఉన్నానేంటీ -- అనుకుంటూ తన కుడి చేతిని చూసుకుంటున్నాడు ఊహల్లో తన చేతి కి తొడిగిన నవరత్న ఖచిత స్వర్ణ కంకణం కోసం. పాపం గణపతి రావు !!!!
 ***

No comments:

Post a Comment

Pages