ప్రతి ఓటమి ఒక గెలుపు
పోడూరి శ్రీనివాసరావు
గెలుపూ ఓటమి దైవాధీనం అన్నారు శాస్త్రకారుడు
కానీ..... ప్రతి ఓటమీ ఒక గెలుపే అన్నాడు కార్యసాధకుడు
గెలుపుకు ఓటమి తొలిమెట్టు
అనుభవానికి అదే పునాది మెట్టు
 ఓటమితోనే తన లోపాలు తెలుసుకుంటాడు
 అనుభవాన్ని రంగరించి గెలుపుగా
 మలచుకుంటాడు... ఆశావహుడు
 కార్యసాధనలో ఓటమిని సవాల్ గా తీసుకుంటాడు
నిరంతరం గెలుపును ఆస్వాదించడం
అనర్ధదాయకం.... కష్టతరసాధ్యం
ఓటమి నెదుర్కుని, గెలుపును సాధిస్తే
మధుర క్షణాల పారవశ్యం.
 ఓటమి అవమానాన్నే కాదు...
 పట్టుదలను , పరిశ్రమను పెంచుతుంది
 గెలిచి తీరాలన్న కసిని రగిలిస్తుంది
 ఏకాగ్రతను, తీక్షణను కలిగిస్తుంది.
గెలవడమే లక్ష్యంగా, కార్యసాధనకు
మార్గాన్ని సుగమం చేస్తుంది.
గెలవాలన్న కోరికకు పునాదులు వేస్తుంది
మస్తిష్క మధనాన్ని ప్రేరేపించి
 నూతన ఆలోచనలకు తెరదీసి....
 నవీన పంథాలను ఆచరింపచేసి....
 పట్టుదలకు పట్టాభిషేకంచేసి....
 గెలవాలన్న ఆకాంక్షకు దన్నుగా నిలబెడుతుంది.
నిరంతర గెలుపును ఆనందిస్తున్న...
అనేక ఓటముల తర్వాత
తొలిసారి విజయకేతనం ఎగరేసిన
మనుషుల మధ్య అంతరాన్ని చూడండి.
 తొలిసారి గెలుపును ఆస్వాదిస్తున్న
 వ్యక్తి ఆనందం అంబరాన్ని అధిగమిస్తుంది.
 ఎప్పుడూ గెలుపులను వ్యక్తి సంబరం
 అతనికి హమేషా సర్వసాధారణమే
ప్రేక్షకుల జయజయధ్వానాలు
అతనికి మామూలుగానే అనిపిస్తాయి
కానీ,తొలిసారి విజయోత్సాహం జరుపుకుంటున్న
ఆ వ్యక్తికి, అవే జయజయధ్వానాలు
స్వర్గపీఠం అధిరోహించిన అనుభూతిని పంచుతాయి.
 అందుకే  ఆనందాన్ని అనుభవించాలంటే,
 ఆస్వాదించాలంటే ...తొలిసారి గెలుపును కాదు..
 ఓటముల పరంపర తర్వాత
 గెలిచిన గెలుపే ....గెలుపు
పీ.వీ సింధుని చూడండి
కిడాంబి శ్రీకాంత్ ను చూడండి
గెలుపును సాధించాక, మరల గెలుపుకై
ఎదురుచూస్తూ.... ఎన్ని ఓటముల నెదుర్కొంటున్నారో!
 దేశమంతా తిరిగి వారి ఖాతాలో
 విజయాన్ని దర్శించాలని
 తహతహలాడుతుంటే
 వారి నుంచి నిరాశే ఎదురవుతోంది.
వరస విజయాలతో ఉప్పొంగుతున్న
విరాట్ సేన హవా ఈరోజు దేశంలో....
గెలుపు వారికి సర్వ సాధారణమైపోయింది
పిచ్ ఏదైనా ... స్వదేశమైన ...విదేశమైనా...
 తెల్లబాలైన ..ఎర్రబాలైనా ... గులాబీబంతైనా..
 ఏ పంథా అయినా ... ఏ తరహా అయినా...
 టెస్ట్ మ్యాచయినా,ఫిఫ్టీ ఓవర్లయినా..
 పొట్టి ఫార్మాట్ అయినా లెక్క లేదు.
ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ
విజయకేతనాన్ని ఎగరేస్తూనే ఉన్నారు.
క్రికెట్ అభిమానులకు ఆ విజయానందం
సర్వసాధారణమైపోయింది... కిక్కే లేదు...
 ఒకసారి విజయం సాధించడం వేరు
 కానీ,విజయసాధనే, అది నిరంతరంగా...
 సాధిస్తూ.... ఆ స్థానాన్ని నిలుపుకోవడం
 ఎంతో కష్టం - అనితరసాధ్యం.
కానీ, ఓటమి తర్వాత గెలుపు
ఆలోచనలను ఆవిష్కరిస్తుంది
పట్టుదలను పెంచుతుంది
కసిని కలిగిస్తుంది.
 నిరంతర విజయంకన్నా
 ఓటమి తరువాత గెలుపును
 ఆస్వాదించడం
 నూతన అనుభూతిని కలిగిస్తుంది.
ఆ దిశగా పయనించడం
ఎల్లవేళలా అభినందనీయం
ఆ దిశగానే పయనిద్దాం
ఓటములను నుంచి పాఠాలు నేర్చుకుంటూ...
మేధస్సుకు పదును పెట్టుకుంటూ
నూతనావిష్కరణలు చేద్దాం
విజయపంథాలో
ముందుకు అడుగేద్దాం.
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment