నేటి దీవెన - అచ్చంగా తెలుగు
 నేటి దీవెన
కరవడి సరస్వతి 
  

“హాయ్ అత్తయ్యా, ఎలా ఉన్నారు?” సుచిత్ర గొంతు ఫోన్ లోంచి చెవుల్లో అమృతం పోసినట్లు వినిపించింది. మంచం మీద పడుకున్న దానిని ఒక్క ఉదుటున లేవబోయాను. ఆ పాటి కదలికకే  కళ్ళు తిరిగి నట్లయి వెనుక దిండుకిి చేరగిల పడ్డాను.
      “నేను బాగానే ఉన్నానమ్మా,. మీరెలా ఉన్నారు?”
      “పర్ ఫెక్ట్. మీకు బాగోలేదని మామయ్య ఫోన్ చేశారు. ఏమయ్యిం దసలు? కోడలు అలా ఆప్యాయంగా అడిగే సరికి నా మనసు ఆర్ద్రమైంది”.
       “కంగారు పడకమ్మా,, బాగానే ఉన్నాను. నడుస్తుంటే ఆయాసంలా వచ్చి నడవలేక పోయాను. గుండెకి సంబంధించిన దేమో అని డాక్టరు ఏవో పరీక్ష లవీ రాశారు.అంతే”. 
        “ మీ అబ్బాయి ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? నిన్న రాత్రి ఐతే సరిగ్గా నిద్ర కూడా పోలేదు.”
         నా మనసు కలుక్కుమంది. “అయ్యో, ఎందుకమ్మా. వాడికి చెప్పు, నేను బాగానే ఉన్నానని”
         “చెప్పినా ఆయన కంగారు ఆయనది. నన్ను రమ్మంటారా?”
         “వద్దులే సుచీ . వాడిని వదిలేసి నువ్వొచ్చేస్తే వాడికి తిండి అదీ ఇబ్బంది అవుతుంది.  అంతగా అవసరమైతే చూద్దాం. "
          "సరే , టెస్ట్లు  అవగానే చెప్పండి మరి ఏమన్నారో, బై  అత్తయ్య"
          "బై అమ్మా వుంటాను” అని ఫోన్ పెట్టేస్తుండగా డాక్టర్ దగ్గరకు వెళ్లిన ఈయన వెనక్కి వచ్చారు. "ఎవరు ఫోన్?" అంటూ.. 
         "సుచిత్ర.తను రావాలా అని అడిగింది"
         "ఎందుకులే హడావిడిపెట్టటం , అవసరమైతే ఎటూ తప్పదు " నా మనసులో మాటే ఆయన అన్నారు.   బుజ్జి గాడు మా ఒక్కగానొక్క కొడుకు. ఉద్యోగ రీత్యా వాళ్ళు చెన్నైలో ఉన్నారు. ఈయన ఇంకా సర్వీస్ లో ఉండటం వలన మేము హైదరాబాద్ లో. ప్రేమించి పెళ్ళి  చేసుకున్నాడు వాడు. మా కోడలు సుచిత్ర బంగారం. మేమిద్దరం కలిసి బయటికి వెళ్తే తెలియని వాళ్ళు నా కూతురనే అనుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న గుంటూరు లో ఉంటారు.
    "నేను అదే అనుకుంటున్నా.  వాళ్ళని కంగారు పెట్టేది దేనికి? ఇంతకీ డాక్టర్ ఏమన్నారు?" 
     "రేపు పరగడుపుతో వచ్చేయ్యమన్నారు. కావలసినవి సర్దుకోవాలి. నువ్వేమి కదలొద్దులే.  ఏమేమి కావాలో చెప్తే నేను సర్దుతాను "
     నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి "ఏమి పాప కర్మమో, మీ చేత చేయించు కోవాల్సి వచ్చింది ".
  నా పక్కకి వచ్చి కూర్చున్నా  రాయన. "నువ్వు నేను ఒకటి కాదటే పిచ్చి మొహమా , నువ్వు నాకు బాగుండక పోతే చెయ్యవా?" నా చెయ్యి పట్టుకుని  అడిగారు. నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. 
       "అలాంటి రోజు రాకూడదు " నా గొంతు వొణికింది. నవ్వేశారు ఆయన. "పోనీ ..అలాగే ఆశిద్దాం.. ఇంతకీ ఆస్పత్రికి  ఏమేం సర్దాలో చెప్పు మరి " 
         హాస్పిటల్ లో చేరేటప్పుడు అనుకున్నది వేరు  ఎదో టెస్టులు చేయించుకుని వచ్చేద్దాం అని. కానీ సమస్య అనుకున్నంత చిన్నది కాకపోవటంతో  ఆపరేషన్ వెంటనే చేయాలన్నారు డాక్టర్లు. ఈయన బాగా కంగారు పడి బుజ్జికి ఫోన్ చేసారు. వాడు చాలా కంగారు పడ్డాడు.
      "అవునా నాన్న... ఎప్పుడు చేస్తారు ఆపరేషన్?"
        "మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకు” 
         "అంత తొందరగానా...అయ్యో లీవ్ అప్లై చేసే టైం కూడా లేదే. ఆఫీస్ లో ఇయర్ ఎండ్ . ఎలా?" 
         "ఎలా అంటే నేనేమి చెప్పేది రా?" ఈయన గొంతు వణికింది బాధతో, అసహాయతతో కూడిన చికాకుతో .
        "నేను ప్రయత్నిస్తాను నాన్న. కాకపోతే సుచి నైనా పంపుతాను. నా మనసంతా అక్కడే ఉంది కానీ ఏమి చెయ్యలేని పరిస్థితి." వాడి గొంతు రుధ్ధమైంది . వింటున్న నాకు అయ్యో పాపం అనిపించింది . ఆయన దగ్గర నించి ఫోన్ లాక్కుని అన్నాను "పోనీలే నాన్న, నువ్వు రాలేక పోతే కోడలిని పంపు.  నాకు నువ్వొకటి, తనొకటి కాదు "
       "సరే అమ్మా. తప్పకుండ వెంటనే ఫ్లైట్ ఎక్కిస్తాను " వాడి గొంతులో రిలీఫ్ వినిపించింది."
ఒక గంటలో మళ్ళీ ఫోన్ చేసాడు బుజ్జి.  "అమ్మా సాయంత్రానికి దొరికింది. నీ ఆపరేషన్ అయ్యి నువ్వు బయటకి వచ్చేసరికి సుచి  నిన్ను రిసీవ్ చేసుకుంటుంది. "
         “అలాగే లేరా. నువ్వేమి కంగారు పడకు. ఆపరేషన్ అవగానే తనే నీకు వివరాలు చెప్తుందిలే ". నా కోడలు ఈయనకి తోడుగా వస్తోందని నిశ్చింతగా థియేటర్ లోకి వెళ్ళాను.
కానీ  నేను కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా మా ఆయనే. ఇంకఎవరూ లేరు. ఎవ్వరూ…
    "ఏవండీ సుచి ?" నా ప్రశ్నకి అయన కళ్ళు దించుకుని జవాబు చెప్పారు.  "తీరా బయలు దేరే వేళకి ఆ అమ్మాయికి విపరీతమైన తల నొప్పి వచ్చిందిట .”
     నన్ను నిరాశ కమ్ముకుంది." పోనీలెండి. అంత తలనొప్పి తో ఏమి వస్తుంది? అయినా అంతా  బాగానే జరిగిందిగా" అయన చెయ్యి నా చేతిలోకి తీసుకుంటూ ఓదార్పుగా అన్నాను. ఎవరికి సర్ది చెప్తున్నావు? నా మనసు  చిన్న బుచ్చుకుంటూ ప్రశ్నించింది.
నవ్వారు ఆయన దిగులుని దాచేసుకుంటూ .
వారం తరవాత కానీ నన్ను ఇంటికి పంపలేదు డాక్టర్లు. అదీ సవాలక్ష  జాగ్రత్తలతో. ఇంకా మనిషి సహాయం లేకపోతే అడుగు వెయ్యలేని పరిస్థితే నాది. బుజ్జి, సుచి   రోజు వాళ్ళు రాలేక పోయినందుకు నొచ్చు కుంటూనే ఉన్నారు. సుచికి కూడా పెద్ద బాగోట్లేదుట. వీలు చూసుకుని నేను కోలుకోగానే త్వరలో వచ్చి నన్ను కలకత్తా కి తీసుకు వెళ్తామని చెప్ప్పారు. పిచ్చివెధవ ప్రాణమంతా ఇక్కడే ఉంది. కోడలు మాత్రం? ఎంత బాద పడుతోందో రాలేక పోయానని.. నా జబ్బు గురించి అక్కడి డాక్టర్ లతో కూడా మాట్లాడాడట బుజ్జి.  ఓ రెండు నెలలైనా అమిత జాగ్రత్త గా ఉండాలి అన్నారట వాళ్ళు. వెంటనే మళ్ళీ అటాక్ వస్తే కష్టమే అన్నారట‌.అప్ప్పుడే తెలిసింది నాకు, నాకు వచ్చింది హార్ట్ ఎటాక్ అని. అందుకేనా ఆయన అంత డీలా పడిపోయారు అనుకున్నాను
           సాయంత్రం హార్లిక్స్ కలుపుతున్నా రాయన నా కోసం. మంచం మీంచి లేచే శక్తి లేక  పడుకొని ఉన్న నేను పక్క నించి ఆయన్ని చూస్తున్నాను. ఎంత చిక్కి పోయారో! చాకిరీతో నలిగి పోయి వడలి పోయారు. ఒక్కసారిగా అయన మీద ప్రేమ , జాలి పొంగుకొచ్చాయి. గుండె బరువనిపించింది. ఏమిటి మా పరిస్థితి!  నా చూపులు తాకి నట్లున్నాయి , నా వైపు తిరిగా రాయన.
        "ఏమిటి, అట్లా చూస్తున్నావు?"
        "ఏమి లేదు" తల అడ్డంగా తిప్పి అన్నాను " నా అనారోగ్యం తో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిక్కి పోయారు కూడా. నా చేత అన్నీ చేయించుకో వలసిన మీరు..."నా కళ్ళ  వెంట నీళ్ళు తిరిగి నోట్లో మాట పూర్తి చేయ లేక పోయాను.
       "అదేమీ లేదు, పిచ్చి ఆలోచనలు పెట్టుకోక త్వరగా కోలుకో. " హార్లిక్స్ తీసుకుని వస్తూ అన్నా రాయన. ఈ లోగా కాలింగ్ బెల్ మోగింది. 
     "తాగుతూ ఉండు, ఎవరో చూసి వస్తాను" నేను హార్లిక్స్ అందుకుని సిప్ చేయ సాగాను. 
      హాల్లోంచి ఈయన గొంతు సందడిగా వినిపిస్తోంది "పూర్ణా , బుజ్జి వచ్చాడే " అంటూ నాకు ఎక్కడలేని బలము వచ్చేసింది. "బుజ్జా" ఒక్క ఉదుటున లే్చి హాల్ లోకి వచ్చేసాను. " ఏరా, ఇదేనా రావటం ?" ఆ పాటి కదలికకే చెమటలు కమ్ముకొచ్చి సోఫాలో కూలబడి పోయాను. బుజ్జి చప్పున వచ్చి నన్ను పట్టుకున్నాడు. హత్తుకున్నాడు.
      "అయ్యో అమ్మా,ఇంత నీరసం గా ఉన్నావేమిటి? ఇలా అయి పోయావేమిటి?" వాడి కళ్ళ వెంట నీళ్ళు  కారు తున్నాయి.
     “ఇంకెలా ఉంటుందిరా..మనిషి దక్కటమే అదృష్ట మన్నారు డాక్టర్.
      "వెర్రి నాగన్న, ఏమయిందిరా? బాగానే ఉన్నాలే . ఇప్పు డేమయ్యిందని. టైం కి ఆపరేషన్ చెయ్యటం వలన గండం గడిచిందని డాక్టర్ చెప్పాడులే. నాన్న చెప్పలేదా? ఇంతకీ సుచి  ఏది?" నా చూపులు గుమ్మం వంక తిరిగాయి ఆశగా.
        “తను గుంటూరు వెళ్లిందమ్మా  పొద్దున్నే ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారికి బాత్రూం లో కాలు జారి బెణికిందిట ఆవిడ ఫోన్ చేసిన దగ్గిర నుంచి సుచి బెంగ పడిపోయి ఒకటే  ఏడుపు వెంటనే వాళ్ళ అమ్మను చూడాలని. తనకి ఈ మధ్య ఒకటే వాంతులు. ఏమి తిన్నా ఇమడట్లేదు. అయనా తప్పేదేముంది? అందిన ఫ్లైట్ పట్టుకుని వచ్చేసాము. తనని అక్కడ దింపి, అత్తయ్య గారిని అక్కడ నా ఫ్రెండ్ కృష్ణ ఆర్ధోపెడిక్ నీకు తెలుసుగా వాడికి చూపించి , వాడు మరేమి ఫరవాలేదన్నాక ఇంట్లో దింపి నేను కార్ లో ఇక్కడికి వచ్చాను. సుచి  ఒక వారం వాళ్ళ అమ్మ దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకొని ఆమెకి కాస్త తగ్గుముఖం పట్టాకే నీ దగ్గిరకి వస్తానన్నది. అఫ్ కోర్స్, వాళ్ళ అన్నయ్యా , వదినా ఇంకా మిగిలిన వాళ్ళూ అక్కడ ఉన్నా రనుకో.అయినా తన ఆతృత తనది. నా గుండె ఎందుకో బరువెక్కింది
.      “నేను రాత్రికి వెళ్ళిపోవాలి. అర్జెంటు పనులున్నాయి. "
       నేనేదో అనేలోగా వాళ్ళ నాన్న  “మంచిది రా. ఓ గంట టైం ఉందిగా . వంట చేసేదా? భోజనం చేస్తావా లేక కాఫీ తాగి బయలు దేరతావా?" అన్నారు.”
     “కాఫీ చాలు నాన్నా , నేను మళ్ళీ గుంటూరు వెళ్లి మా అత్త గారిని ఇంకోసారి పరామర్శించక పోతే సుచి  ఫీల్ అవుతుంది. పైగా అది అల్లుడిగా నా బాధ్యత కదమ్మా. ఇక ఇటు రావటం కుదరదు. సుచి వెనక్కి రాగానే అమ్మని అక్కడకే తీసుకు వెళ్దాం. నువ్వు లాంగ్ లీవ్ పెట్టేయ్" అన్నాడు బుజ్జి. 
       "అయితే అమ్మాయి ఇక్కడికి రాదట్రా ?" నా మనసులో ఏదో ములుకు  గుచ్చుకుంది. 
        "అయ్యో ఎందుకు రాదమ్మా?తిరిగొచ్చే లోగా నిన్ను తప్పకుండా చూసే వస్తానన్నది. సుచికి మర్యాదలు బాగానే తెలుసు. ఇంతకీ మీకు టిక్కెట్లు ఎప్పటికి బుక్ చెయ్య మంటావు?"  ఈయన నా వైపే చూస్తున్నారు ఏం జవాబు చెప్తానా అన్నట్లు
         "ఇప్పుడే వద్దులే రా . నన్ను కాస్త కోలుకొనీ. ప్రయాణం చేసే ఓపిక నాకు ఇంకా రాలేదు. వచ్చాక చూస్తాములే" నా మాటలకు ఆమోదం కనిపించిం దాయన మొహంలో. మా ఇద్దరి భావాలూ ఒక్కటేగా.
       " అదేంటి? నాన్నా, మీరు చెప్పండి అమ్మకి" అన్నాడు బుజ్జి. తనమాటే నాదీనూ అన్నట్లు నవ్వారు ఆయన నిండుగా
        “వస్తాం లేరా నిదానంగా!”
మరో వారం గడిచాక మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది.  ఈ సారి వచ్చింది సుచి . రావటం తోటే నన్ను చుట్టేసింది. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ మామగారితో దెబ్బలాడింది టికెట్స్ కొన నియ్య నందుకు. ఆనక కాఫీ తాగాక తీరికగా నా మంచం మీద కూర్చుని కబుర్లు మొదలు పెట్టింది. ఈయన అక్కడే కుర్చీలో కూర్చుని మా కబుర్లు వింటున్నారు.
         "అసలు నేనూ,మీ అబ్బాయి కలిసి ఈ  వీకెండ్ కి వద్దామని ప్లాన్ చేశా మత్తయ్యా. కానీ ఈ లోగా మా అమ్మ పడిందని ఫోన్ రావటంతో అటు వెళ్లాల్సి వచ్చింది. భగవంతుడి దయ వల్ల పెద్దగా ఏమీ కాలేదు లే. అయినా నా బాధ్యతగా ఉండి ఒక వారం పాటు ఆమెను చూసుకొని వచ్చాను. ఇప్పుడు తను బాగానే నడుస్తోందిలే. హాయిగా తిరుగుతోంది.  అవును మీరేంటి ఇంకా ఇలాగేె ఉన్నారు? ఇంత చిక్కి పోయారేంటి? నా దగ్గిరకి వచ్చి హాయిగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోండి." ఆ అమ్మాయి ప్రేమలో కపటం లేదు. అది నాకు తెలుసు. అప్రయత్నంగా ఆయన వైపు చూశాను నేను. ఆయనా నా వైపే చూస్తున్నారు. చిన్నగా కళ్ళు తిప్పేసు కున్నాను నేను. ఏదో తెలియని అప్రియమైన భావం.
"అన్నట్లు అత్తయ్యా మీకో కబురు. మీ అబ్బాయి చెప్పారా?" బుగ్గల్లో గులాబీలు పూస్తుండగా అడిగింది సుచి.
    “లేదే “ అంటున్న నాకు చప్పున బల్బ్ వెలిగింది ఆ అమ్మాయి సిగ్గు దొంతరలు చూసి. ఓపిక చే‌సుకొని మంచం మీద లేచి కూర్చుంటూ "ఏమండోయ్…”అన్నాను ఆనందంగా.   అడిగా రాయన "ఏమిటి పూర్ణా? మనం మూడేళ్ళుగా ఎదురు చూస్తోందేనా? మా మొహాలలో వెలుగు చూసిన ఆయనకు జవాబుతో పని లేక పోయింది.సుచి లోపలి వెళ్లి అక్షింతలు తెచ్చింది దేవుడి మందిరం నించి .  
    "రండి అమ్మాయికి అక్షింతలు వేద్దాం" ఆయన వచ్చి నా పక్కన నిలుచున్నారు.
    "దీవించండి అత్తయ్యా, మావయ్యా" అన్నది సుచిత్ర. 
            అక్షింతలు కోడలి నెత్తిన వేస్తూ ఇద్దరం అప్రయత్నం గా దీవించాము "సుపుత్రికా ప్రాప్తిరస్తు! " ఇద్దరి మొహాల్లో నవ్వు మెరిసింది! అవును మరి, మా బుజ్జి లాంటి కొడుకు కంటే సుచి లాంటి కూతురే పుడితే వాళ్ళన్నా సుఖపడతారు.
***

No comments:

Post a Comment

Pages