ఉమ్మడి మాణిక్యం - అచ్చంగా తెలుగు

ఉమ్మడి మాణిక్యం

Share This
ఉమ్మడి మాణిక్యం
విశాలి పేరి 


శిరీష మెల్లగా కళ్లు తెరిచింది. మత్తు దిగుతోందేమో కాస్త నొప్పి తెలుస్తోంది. ఓపికంతా కూడబెట్టుకొని "మామ్మా! " అని అంది. మాట నూతిలో నుంచి వస్తునట్టుగా ఉంది.. కానీ ఆమె ఎప్పుడు సృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తొన్న శాంతమ్మ  వెంటనే ఆ పిలుపుకి శిరీష వైపు చూసింది. "ఏం సిరి.. నొప్పిగా ఉందా? ఏదైనా తాగుతావా? " అని దగ్గరకు వెళ్లింది.
"మామ్మా! ఎవరు.. నాకు.. ఇచ్చారు.." అంటూ ముద్దగా పొడిపొడిగా అడిగింది శిరీష.
"ఇప్పుడవన్నీ ఎందుకు? నువ్వు రెస్ట్ తీసుకో " అంది మళ్ళీ పడుకోబెట్టింది శాంతమ్మా. 
"ఈ సీత.. వద్దు... లేదు..నో... " అని  పక్కన ఉన్న సీతను చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయింది శిరీష.    
***
శిరీష శాంతమ్మ గారి మనవరాలు.. కొడుకు కూతురు. శాంతమ్మ కు సిరిపురంలో యాభై ఎకరాల మాగాణి ఉంది. అది కాక కొన్ని మిళ్లు  కూడా ఉన్నాయి.  అన్నిటికీ వారసురాలు శిరీష ఒక్కతే! శిరీష చిన్నప్పుడే ఆమె తల్లీతండ్రి ఒక ఆక్సిడెంట్ లో పోయారు. అప్పటి నుంచి శిరీషకు శాంతమ్మే అన్నీ  అయ్యి పెంచింది. కొనీ రోజులుగా శిరీషకు ఒంట్లో బాగులేకపోవడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది శాంతమ్మ. శిరీష కి లివర్ పాడవ్వడంతో ఎంతో  పెద్ద పెద్ద డాక్టర్ల చేత వైద్యం చేయించింది. కానీ దేనికి తగ్గలేదు. చివరకు ఎవరేనా దాతల ద్వారా లివర్ శిరీషకు అమర్చాలని అనుకున్నారు డాక్టర్లు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న  పనిమనిషి సీత తన లివర్ ఇవ్వడానికి ఒప్పుకుంది. కొన్ని పరీక్షలు చేయించి సీత లివర్ శిరీషకు ఇవ్వడానికి అనుమతించారు డాక్టర్లు. కానీ ఈ విషయం ఆపరేషన్ అయ్యేవరకు శిరీషకు తెలియనీయకూడదని శాంతమ్మ షరతు పెట్టింది. 
అందుకు డాక్టర్లు ఎందుకు అని ప్రశ్నించకుండా ఆపరేషన్ చేసేశారు. 
*** 
పూర్తి స్పృహలోకి వచ్చిన శిరీష " మామ్మా! నిజం చెప్పు నాకు ఈ లివర్ ఇచ్చింది ఎవరూ? ఆ 'ఉమ్మడి సీత " కదా? " అని అదిగింది... 
కోపంతో శాంతమ్మ శిరీష వైపు చూసి "చూడు సిరి.. ఒక వ్యక్తిని గౌరవించడం నేర్చుకో " అని అంది
" ఏంటీ దీనికి గౌరవం.. నువ్వు దీన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు కానీ దీని గురించి జనాలు ఎన్ని అనుకుంటున్నారో తెలుసా? ఒకప్పుడు ఎన్నో గ్రంధాలు నడిపిన గ్రంధసాంగి ఈ ఉమ్మడి సీత.. ఇప్పుడు నీ పంచన చేరి నిన్ను బొట్టలో వేయడానికి పతితుగా నటిస్తోంది..." అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉండగా
"సిరీ... నోరుముయ్..." అని కాస్త గట్టిగా అంది శాంతమ్మ
"అది కాదు అమ్మాయ్ గారు.." అంటూ సీత ఏదో చెప్పబోతూ ఉండగా
" నువ్వు నాతో మాట్లాడకు.. నీ మూలంగానే ఎప్పుడూ నన్ను ఏమీ అనని మా మామ్మ ఈ రోజు నోరుమూయ్ అని ఇంత గట్టిగా అంది " అంటూ రోషంగా అంది
" సిరి.. ఒక్క ఐదు నిమిషాలు నేను చెప్పింది వింటావా? " అని నెత్తిన చెయ్యి పెట్టి అనూనయంగా అంది శాంతమ్మ
కళ్ళంపటి నీరుతో శాంతమ్మ వైపే చూస్తూ ఉంది శిరీష..
"నాకు మీ తాతగారికి పెళ్ళైన పదిహేను ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు, ఆ తరవాత మీ నాన్న పుట్టాడు. వాడు ఆడింది ఆటా, పాడింది పాట.  మీ తాతగారు అప్పుడే పోవడంతో వాడిని ఎక్కడకు పంపకుండా నా దగ్గరే ఉంచేసుకున్నాను. అందుకే వాడి చదువు టెంథ్ తో ఆగిపోయింది.   చేతి నిండా డబ్బు, ప్రశ్నించేవారు లేకపోవడంతో మీ నాన్నకి కొన్ని చెడు అలవాట్లు వచ్చాయి. ఆ సమయంలోనే వాడు చేయ్యి  జారిపోతాడేమో అని మీ అమ్మనిచ్చి పెళ్ళి చేశాను.  మీ అమ్మ వాడిని దారిలోకి తెలుస్తుందనే అనుకున్నాము. కానీ విధి ఆడిన నాటకంలో మీ అమ్మ నాన్న ఇద్దరూ పెళ్ళైన రెండేళ్లకే పోయారు.  
ఇక నా కోడలికి  అంటే మీ అమ్మకి పెళ్ళయ్యి పాప పుట్టాక  కుష్టు వ్యాధి వచ్చింది. ఆమెకి సపర్యాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో మీ అమ్మను చూసుకోడానికి తన ఆరోగ్యం కూడా లెక్క చెయ్యకుండా ముందుకొచ్చింది సీత. సీతకి కూడా ఒక పసిపాప ఉంది ఆ సమయంలో. కానీ మీ అమ్మకు సేవ చేయడానికి వచ్చింది. ఆమె వ్యక్తిగతం.. గతమే.. కానీ మన ఇంటికి వచ్చాక తాను పాత జీవితం జోలికి వెళ్ళలేదు. తన కడుపు కోసం తాను చేసిన వృత్తి అది. ఎవరినీ బాధించకుండా, ఎవరినీ మోసం చేయకుండా తన వృత్తి ఏదో తాను చేసుకుంటూపోయింది.   "    
"కానీ మామ్మ.. అలాంటి ఆడదాని నుంచి నాకు ఎలా ఇప్పించావు ఈ లివర్ని..ఛీ.." అంది శిరీష... 
" నీకు తన గత జీవితం ఎవరో చెబితే తెలిసింది, ఒక వేళ ఆ విషయం తెలియకపోతే నీ దృష్టిలో సీత మంచిదే కదా? " అంది శాంతమ్మ
"అయినా ఛీ అలాంటి బ్రతుకు బ్రతికి.. ఇప్పుడు ఏమీ ఎరగని నంగనాచిలా... నాకు ఎలా ఇచ్చింది లివర్ నన్ను అడగకుండా..."  అసహనంగా అంది శిరీష..
"సిరీ... ఎందుకు ఛీ? తనలోని రక్తమే నీలోనూ ప్రవహిస్తోంది..." అంది శాంతమ్మా
"అంటే..."  కళ్లు పెద్దవి చేసి చూసింది శిరీష...
"అమ్మగారూ.." అంటూ ఏదో చెప్పబోయింది సీత... 
" నువ్వాగు సీతా... అవును ఈ సీతే నీ తల్లి " అని స్థిరంగా అంది శాంతమ్మ. 
నా కొడుకు చేసిన ఘనకార్యానికి ఫలితం నువ్వు.  పెళ్ళికి ముందు నుంచే మీ నాన్నకు సీతకు సంబంధం ఉంది. అది తెలిసి కూడా నేను మీ నాన్నకి పెళ్ళి చేశాను. వాడికి ఒక కూతురు పుట్టింది.  నా కోడలు, కొడుకు, మనవరాలు, సీతా హాస్పటల్ కి వెళ్ళి వస్తూ ఉండగా జరిన యాక్సిడెంట్ లో వారు ముగ్గురూ పోయారు.  అప్పుడు సీత కూతుర్ని అంటే నా మనవరాలిని నాకు ఇమ్మని అడిగాను సీతని. "మీ అబ్బాయి సొత్తు అండి, పూర్తిగా మీదే హక్కు " అని అంది సీత.   ఆ యాక్సిడెంట్ లో పోయింది సీత కూతురని జనాలను నమ్మించాము. ఆ ఊరు వదిలి  నీతోటి,  సీత తోటి ఈ పట్టణానికి వచ్చేశాను. ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేసి నాతోటే ఉంటూ నీకూ,  నాకూ సేవ చేసుకుంటోంది సీత. నువ్వు ఎన్ని తిట్టినా పళ్లెత్తుమాట అనలేదు. తన కూతురికి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంది. ఈ విషయం నీకు చెప్పొద్దని సీత నా చేత ఒట్టు వేయించుకుంది. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. నేను పోయాక నువ్వు తనని అసహ్యించుకోకూడదు.  తన బ్రతుకులా కాకుండా తన కూతురి బ్రతుకు సుఖంగా ఉండాలని ఇలాంటి త్యాగం చేసింది. నా జీవిత చరమాంకంలో నాకో ఊతకర్రగా నిన్ను ఇచ్చింది. 
సీత .. వ్యక్తిగా తానొక స్త్రీ. వ్యక్తిగతంగా తానొక వేశ్య.  అందుకే అందరూ ఆమెని "ఉమ్మడి సీతా " అనేవారు. ఊరి చివర్లో ఉండే గ్రామదేవత ఊరిని ఎలా కాపాడుతుందో అలా కొన్ని కాపురాలను వీరు కాపాడుతూనే ఉన్నారు. ఊర్లో ఏ శుభకార్యం అయినా ముందు వీరి చేతే పనులు చేయిస్తారు, పెళ్ళిళ్లకి నల్లపూసలు వీరిచేత గుచ్చించేవారు.. ఎందుకంటే వీరు 'నిత్యసుమంగళీలు " . వారు కొవ్వొత్తిలా కరిగి ఎదుటివారికి  వెలుతురిస్తారు. ఖాళీ కడుపుతో ఉన్నా.. ఎందరివో "ఆకళ్లు " తీరుస్తారు.  
ఇక సీత వ్యక్తిత్వం చూస్తే పరులకు ఉపయోగపడాలి అనేదే ఆమె ధ్యేయం.   నువ్వు చిన్నప్పటి నుంచీ ఒక పనిమనిషిగా చూసినా ఏమీ అనుకోలేదు. నిన్ను తన కూతురిగా కాకుండా యజమాని కూతురిలా చూసింది. నా కోడలకి సేవ చేసింది. అంతే కాదు ఊర్లో ఎవరి ఏ సాయం కావాలన్నా ముందుందేది.  వ్యక్తి....  వ్యక్తిగతం... వ్యక్తిత్వం... మూడు వేరుగా చూడు.. కలపకు సిరి.      
"ఈరోజుకీ నీకు ఈ విషయం చెప్పకూడదనే అనుకున్నా,  నా కోసం  త్యాగం చేసిన  సీతకు, చివరకు ఏదీ మిగలకుండా అన్నీ ఇచ్చేసిన సీతకు ఒక కూతుర్ని ఇవ్వాలనుకున్నా.. " అని కృతజ్ఞతాభావంతో సీత చెయ్యి పట్టుకుంది  శాంతమ్మ. 
***

No comments:

Post a Comment

Pages