ప్రియమైన నీకు - అచ్చంగా తెలుగు
ప్రియమైన నీకు...
పెమ్మరాజు అశ్విని  
        
"అను ఎక్కడ వున్నావు నీ కోసం పోస్ట్ వచ్చింది వచ్చి సంతకం చేసి తీసుకో " అంటూ కేక వేశారు సావిత్రిగారు  " హా వచ్చే అత్తయ్య " అంటూ వంటింట్లోంచి చీర సర్దుకుంటూ గుమ్మం లోకి వచ్చింది అనురాధ ,అనురాధని ఇంతా బయట అంతా అను అనే పిలుస్తారు,తన భర్త గోపాలకృష్ణ మాత్రం రాధ అంటాడు . " పోస్ట్ చుస్తే ఏదో వస్తువు ఉన్నట్టు వుంది ,పదిలంగా లోనికి తీసుకెళ్లి చూడు " అంటూ ఉడికించారు సావిత్రమ్మ ,సిగ్గు తో బుగ్గలు కేంపులై లోనికి వెళ్లి మెల్లిగా పోస్ట్ కవర్ తెరిచింది అను.
         ఇంతలో పక్కనే పక్కలో వున్న పాప ఉక్కులు వినిపించి పాప కేసి చూసి "చిన్ని తల్లి నాన్న ఉత్తరం రాశారు వింటావా ,వుండు అసలీ కవర్ ఏంటో చూద్దాం" అని కవర్ విప్పింది అందులో పాప కి ఒక చక్కటి మెత్తటి గౌన్ చిన్ని చిన్ని ఆట బొమ్మలు,అను కి ఒక చక్కటి చీర తో పాటు ఒక ఉత్తరం వుంది "చిన్ని తల్లి నాన్న నీకు గౌన్ పంపించారు ఆడుకోడానికి గిల్లకాయలు పంపించారు చూడు చూడు అంటూ పాప కి ముద్దులు పెట్టింది అను " .
                 "రాధా ఎలా వున్నావు ,నాకు తెలుసు నువ్వు నా మీద అలిగావు అని కానీ ఏమి చెయ్యను ఫోన్ లో నీకు నా మనసు లో మాటలు ఎక్కువ చెప్పే అవకాశం ఉండట్లేదు బంగారం, అసలే ఇక్కడ సరిగ్గా సిగ్నల్స్ వుండవు ల్యాండ్ లైన్ ఫోన్ చెయ్యాలంటే బోలెడు దూరం రావాలి ,రాధా నీకు జ్ఞాపకం ఉందా మనకి పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయ్యింది ,ఇన్ని సంవత్సరాలు నా మిలిటరీ ఉద్యోగ రీత్యా రకరకాల ప్రదేశాలు తిరిగాము ఇద్దరమూ,5 ఏళ్లలో  చాలా మంది సైనికుల కుటుంబాల లాగా మనం విడిగే వుండే అవసరం రాని ప్రదేశాల్లో పోస్టింగ్ ఉంది కాని ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది,నువ్వు   కాశ్మీరు చూడాలని చాలా ఆశపడ్డావు, తీరా నాకు కాశ్మీర్ పోస్టింగ్ వచ్చే సమయానికి నువ్వు నెల తప్పావు , లేత నెలలు ఆ పరిస్థితుల్లో నిన్ను కాశ్మీర్ తీసుకెళ్లే సాహసం చెయ్యలేక నిన్ను మా ఊరు పంపించాలి అని ప్రయత్నం చేశా ,కానీ నువ్వు చాలా మొండి పట్టు పట్టేసరికి నీ మంచి కోరి కాస్త కాఠిన్యం వహించక తప్పింది కాదు. 
      కానీ రాధా నువ్వు గుర్తుకు రాని  నిమిషం లేదు , నీ చేతి వంకాయ కూర,నువ్వున పొద్దున్నే ఇచ్చే వేడి కాఫీ ,చిరునవ్వుతో నిండిన నీ మొహం, "బ్రోచేవారెవరు రా నిను విన" అంటూ నువ్వు చేసే వీణా గానం,ఏ రాష్ట్రంలో ఉన్న వారి పద్దతులను కూడా గౌరవించి ,మన సంప్రదాయాన్ని తగినట్టు పండుగలు అందులోనూ నీ చేతి పులిహోర అబ్బ తలుచుకుంటే నోరూరుతోంది తెలుసా,పున్నమి రాత్రుల్లో  మనం కలిసి గడిపిన సమయం ఇవ్వన్నీ తల్చుకున్నప్పుడల్లా ఒక వైపు బెంగేసిన మరో వైపు నేను ఇక్కడ చేస్తున్న డ్యూటీకి నువ్వు అందిస్తున్న సహకారం తల్చుకుని గర్వంగా అనిపిస్తుంది తెలుసా .
         రాధ నా బంగారం నేను ఇక్కడికి వచ్చి 8 నెలలు అయ్యింది ,కనీసం మన చిట్టి తల్లి నేరుగా చూడలేదు నువ్వు ఫోన్ లో అపురూపంగా పంపిన ఫోటో చూసుకుని మురిసిపోని పూట లేదు,ఛా రాధ  ఏంటా కన్నీరు ,నువ్వో వీర జవాన్ భార్య వి చూడు చూడు నీ కన్నీరు నా అక్షరాలతో పాటు నా మనసుని కూడా ముద్ద చేసేస్తోంది తుడుచుకో ,లేకపోతే మన చిట్టి తల్లి నేను రాగానే నన్ను కోప్పడేస్తుంది .
        రాధమ్మ పాప ఎలా వుంది డాక్టర్ కి చూపిస్తున్నావా ,నీకు పాలు బాగా పడుతున్నాయా ,నా మీద బెంగెట్టుసుకుని చిట్టి తల్లిని మాడ్చేయకు ,అసలే నా చిట్టి తల్లి పెద్దయ్యాక రుద్రమ దేవి అంశ పుణికిపుచ్చుకుని మిలిట్రీలో చేరాలి ,నీకు  తెలుసు గా మన ఇంట్లో మా నాన్న సైన్యం లొనే ఉండేవారు ,నేను కూడా ఆయనని చూసి సైన్యం లొనే చేరా  నా తర్వాత నా చిట్టి తల్లి కూడా దేశ సేవ చెయ్యాలి దానికి తల్లిదండ్రులు గా మన వంతు దేశభక్తి తన లో పెంచడమే సుమా,బహుశా అప్పటికి సైన్యం యుద్దాలు లేని వసుధైక కుటుంబం వస్తుందేమో అని రోజు మేము ఈ  సైనిక స్థావరాల్లో అనుకుంటాము తెలుసా,నాయకుల యుద్ధ కాంక్ష కి ,కుతంత్ర రాజకీయ ఎత్తులకు సైన్యం సామాన్యులు బలి  కాకుండా,కనీసం భావి తరాలైన యుద్ధం అనే మాట మరిచి మానవత్వం తో మసిలితే అవి నిజమైన పండగ రోజులు,సర్లే నీ  ఆరోగ్యం జాగ్రత్త ,అమ్మ ఎలా వుంది ,వెంకు మావయ్య వస్తున్నాడా రోజు .
 రాధ మనం ఎప్పుడు టీవీ లో చూసే దానికన్నా ఇక్కడ కాశ్మీర్ లో పరిస్థితులు అద్వాన్నంగా  వున్నాయి తెలుసా ,ముక్కు పచ్చలారని పసి వాళ్ళని మతం మత్తులో ఉగ్రవాదం లోకి దింపుతున్నారు మొన్న కాల్పుల్లో ఒక పిల్లవాడు గట్టిగా 20 ఏళ్ళు కూడా వుండవు వాడిని చంపక తప్పలేదు ,అక్కడ వృత్తి ధర్మం ముందు కదా ,ఇక్కడ వీరి    మనసులో   రావణ కాష్ఠం రగిల్చి దానితో చలి కాచుకుంటున్నారు దాయాదులు ,వీళ్ళు నిజానికి అమాయకులు కానీ మూర్ఖులు వారికి వారి మత  పెద్దలు చెప్పే మాట మీద వున్న గురి ఎంత అంటే ప్రాణం తీయడానికి,తీసుకోడానికి కూడా వెనకాడరు .
        నిజానికి ఇక్కడ వారిలో వున్నా సృజన ,నైపుణ్యాన్ని ఈ ఉగ్రవాదం ,హింసావాదం కమ్మేస్తోంది ,మా సైన్యం లో కొందరు ఇక్కడ మామూలు ప్రజలతో మమేకమయ్యి చెప్పే విషయాలు వింటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది,వీరిలో ఇప్పటికి కొందరికి భారత దేశం అంటే ఎన లేని ఇష్టం కానీ బయటికి చెప్పే ధైర్యం చెయ్యలేరు .
     సర్లే ఇలా చెప్తూ పోతే నీకు నాకు మధ్య కబుర్లకి అంతు పొంతూ ఉండదు ,నీ ఆరోగ్యం జాగ్రత్త మొన్న ఒక రోజు మా ఆఫీసర్ తో అన్నాను సర్ నేను వెళ్లి నా చిట్టి రాధమ్మ ని ,మా బంగారు తల్లిని చూడాలి సెలవిమ్మని  ,ఇహ నో ఇప్పుడో ఇస్తాడు అని ఆశగా చాతకపక్షి లాగ చూస్తున్నా, ఏయ్ పిచ్చి మొద్దు, వచ్చే ముందు ఫోన్ చేస్తా గాని ఇప్పటి నుండి నిద్ర మాని కూర్చోకు నీ ఆరోగ్యం పాడవుతుంది ,చూడు చిట్టి తల్లి పిలుస్తోంది, కళ్ళు తుడుచుకుని  పాపకి చెప్పు "మీ నాన్న దేశానికి రక్షించే పనిలో వుండి  కాస్త ఆలస్యంగా నిన్ను చుసేకి వస్తాడు అని".
ఇంతలో పక్కలో పసిదాని ఏడుపుకి ఉత్తరం లోంచి ఈ లోకం లోకి వచ్చి "ఒంటి రా చిట్టి తలికి బొజ్జలో ఆకలేసిందా పాలు తాగుతావా ఇదిగో ఈ బొమ్మ చూడు నాన్నారు నీ కోసం పంపించారు చూడు , నిను చూడటానికి వచ్చే నెల వస్తారట ,నిన్ను కూడా తన తో పాటు సరిహద్దుకు తీసుకుపోతాడట మీ నాన్న ,నిన్ను రుద్రమదేవి లాగా ధీర వనిత ని చెయ్యాలి అట   చిట్టి తల్లి,మీ నాన్న వాళ్ళ స్నేహితులు ఆశించినట్లు మీరు పెరిగే సమయానికి యుద్ధం అనేది లేకుండా విశ్వశాంతి కలిగితే మనలాంటి వారికి ఈ ఎదురుచూపులు ,భయాలు ఉండవు,సర్లే మీ నాన్న వస్తూనే చెవి మెలిపెట్టి గట్టిగా చెపుదాం ,నన్ను అమ్మని కూడా తీసుకెళ్ళు అని ,ఏమంటావు  అంటూ  చూసింది "చిన్ని బుగ్గలు సొట్ట పడేలా బోసి నవ్వులు చిందిస్తోన్న వెన్నెలని గుండెకి హత్తుకుంది .
***

No comments:

Post a Comment

Pages