జరుగుతున్న కథ - అచ్చంగా తెలుగు
జరుగుతున్న కథ 
 మహేష్ విశ్వనాధ 




దీపావళి పర్వదినం.... 
గోషామహల్ ప్రాంతం ...
జ్ఞాన్ బాగ్ ప్యాలెస్గకు గడ్డికోసం వచ్చి అక్కడ అందమైన దూడకు జన్మనిచ్చాను. 
పండుగ రోజు కారణంగా అక్కడ వారు దూడను లక్ష్మీ కటాక్షంగా  భావించి పూజించారు. 
ఆరు రోజులు గడిచాయి  గడ్డికోసం వెళ్ళి వచ్చిన నాకు నా బిడ్డ కనపడలేదు. 
నాలుగు దిక్కులు తిరిగాను, నలుమూలల  వెతికాను. నాలుగు ఆశ్రమాల ప్రజలను అడిగాను, రోజంతా పిలుస్తూనే ఉన్నాను. 

జాడ లేదు సమాజానికి జాలి లేదు. 
ఎంత నిగ్రహించుకుందామన్నా నా కన్నీటిని ఆపుకోలేక పోతున్నా ... 
నాకు సహాయం కావాలి. ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్ళను ? పోలీస్ స్టేషన్ పరిథి నాకు తెలియదు. ఏవరికి కంప్లైంట్ ఇవ్వాలి ? 
నిరంతరం ధ్యానం  చేసుకునే నా జీవితంలో ఒక్కసారిగా  అలజడి. నా జపం ఏమిటో మానవులకి తెలీదుగా ! ఎక్కడున్నావమ్మా అంటూ పిలుస్తున్న నన్ను చూసిన వారికి నేను మూగ ప్రాణిని కాదు అని తెలుస్తోంది. నన్ను పరదేవతగా భావించక పోయినా సమస్య లేదు కానీ నా బిడ్డను డబ్బుకోసం ఎత్తుకెళ్ళి విక్రయించే వారి కోసం క్రొత్తగా నరకం ఏర్పాటు కావాలి.  మానవ జన్మకీ  నా జన్మకీ  ముఖ్య వ్యత్యాసం ఉంది. హైదరాబాద్ లో నేను పాలు ఇవ్వను అని తెలిసాక గుడి దగ్గరో  గోశాల దగ్గరో  వదిలేసి వెళ్లిపోతున్నారు. 

మానవులు ఆడ శిశువు అని తెలియగానే చెత్తకుండీలో పడేస్తారు. ఒక వేళ జీవిస్తే ఆమెకు జీవితాంతం నరకం చూపిస్తారు. గోషామహల్ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా నివసిస్తారు. గో శబ్దంతో పాటు ఇక్కడ గోవులు కూడా ఎక్కువే. ఈశ్వరాధన ఆపి " సుపద్మసహాయం భజేహం భజేహం " అంటూ నేను పిలిస్తే  గోవిందుడు మీ అందరిని శిక్షిస్తాడు. అలా జరగకూడదు మా కష్టాలు మాలోనే దాచుకుంటాము. 

రోడ్డుకు అడ్డంగా నా తోటి గోవులు ఆకలిని ఆపుకోలేక వ్యర్థాలను తింటున్నాము. మానవులు మాత్రం సకల దేవతలు మాలో ఉంటాయి అని నమ్ముతారు. దేవతలంతా అక్కడుంటే మరి మా సమస్యలు, విన్నపాలు ఎవ్వరికి వినిపించాలి. నేను నరకాన్ని దాటిస్తే నరకానికి దగ్గరగా నన్ను తీసుకువెళ్తున్నారు.  కసాయి ఒక్క వేటుతో ఇక్కడ బాధల నుంచి వేరొక లోకానికి తీసుకు వెళ్తాడు.  మీరంతా పారేసిన ప్లాస్టిక్ తిని , తిన్నది అరగక ప్లాస్టిక్ పేగులలో చుట్టుకుని మేము పడే బాధ ఎందరికి తెలుసు?  మానవ జాతి లాగానే మేమూ జీవులమే ! ఆహారం కావాలి.  టన్నులు టన్నులు లాగే శక్తి ఉన్న మాకు ఆహరం ముఖ్యం ! వరి గడ్డి దొరకదు నగరంలో మిగిలింది దొరికేది మూసీ కంపుకొట్టే నీటి పై పెరిగిన గడ్డి. చిన్న కట్ట పది రూపాయలు. ప్రతి భక్తుడు ఆ బరువు లేని కట్ట నా ముందు పెట్టి టన్ను పుణ్యాన్ని అడుగుతాడు. ప్రేమ చూపిస్తున్నామనుకుంటారు.  ఇక మా మీద ఎంతో పేమతో ఇంట్లో మిగిలిన అన్నం, చపాతీలు, పూర్తిగా బూజు పట్టిన పండ్లు కూరగాయలు భద్రంగా దాచి గుడి ముందు ఉండే చెత్తకుండీల దగ్గర మా కోసం ఎంతో భక్తిగా పెడతారు. మమ్మల్ని భక్తితో కొలవనవసరం లేదు. ఒక జీవిగా గుర్తిస్తే చాలు. ఒక పువ్వును పూజిస్తారు, రాయిని పూజిస్తారు. పాలు ఇచ్చే మీ ఇంటి ఆడబిడ్డని తంగిడి పూలు చూస్తే నాకు కూడా బ్రతకాలని ఉంది. బెల్లం ఎక్కువైతే వేడికి ప్లాస్టిక్ కరిగే అవకాశం ఉంది.  గడ్డి పెట్టలేని వాడు బెల్లం ఎలా పెడతాడు. పాలు, పాలు , పాలు ఇందుకు మాత్రమే కాదు.  మా జీవితం ప్రతి ఒక్కరిని కాపాడమంటూ , షాపుల వారిని , బాటసారులను దీనంగా అడిగే మమ్మల్ని  చూసారా ఎప్పుడైనా ? ప్లాస్టిక్ కారణంగా కడుపు ఉబ్బిపోతుంది. చెప్పలేనంత నొప్పి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి.  నా పొట్ట చెత్తను దాచే కుండీ కాదు. మీ ఇళ్లల్లో మిగిలింది నా ముందు ఉంచటానికి.  ఇదిలా ఉంటే మితిమీరిన భక్తితో ఇక్కడ కొందరు నన్ను తాళ్ళతో బంధించి సమపాళ్ళలో లేని దాణా మాకు కలిపి ఇస్తారు. ఆరోగ్యానికి అదే ప్రమాదం కలుగుతుంది.  పచ్చని గడ్డి తినాల్సిన మేము కుక్కలతో పందులతో ఆహరం పంచుకుంటున్నాము.  తల్లిగా గోమాతగా నన్ను " ఓల్డ్ ఏజ్ హోమ్ " లో తల్లిదండ్రులను చూసినట్లు ప్రతి పండుగకు తప్పనిసరిగా వస్తావు. నా మీద నీకు ఉండాల్సింది పాలు ఇచ్చాననే ఒక కృతజ్ఞతా భావం. నేల మీద మట్టి మీద మీరు ఉంచే ఆహరం తినే ప్రయత్నం చేస్తూ దూడ నేల పై ఉన్న మట్టిని కూడా తిని మరణిస్తుంది. గుడి ముందు చెత్త వేస్తున్నావు.   గతిలేక నేను అది తినాల్సివస్తోంది. నాది గర్భం కాదు గర్భాలయం అని నీకు తెలిసే రోజు రావాలి.  " కృత్రిమ గర్భధారణ " మాకు ఆనందాన్ని ఇవ్వదు. మేము అంతమవుతున్న జాతి అని మామీద  చూపే సానుభూతి ఒక దుర్మార్గం. ఇన్ని తరాలు ఏ కృత్రిమ పద్ధతి అవలంబించారు . లక్షల ధర గిత్త పలుకుతుంది. మీరు చేసేది వ్యాపారం. మాది జీవితం. " మా జాతిని మేమే సంరక్షించుకోగలము , వృద్ధి చేసుకోగలం.  మీకు వినిపిస్తోందా? 

మా నివాసం ఎక్కడో ఏమిటో తెలుసా ?   మేము స్వేఛ్ఛా జీవులం. గోశాల మా నివాసం. కరెంటు  స్తంబాలు కనిపిస్తాయి. గరుకు స్థంభం ఒక్కటి కూడా కనపడదు. గడ్డి లేదు, దాణా లేదు, దురద వస్తే కనీసం గరుక స్థంభం లేదు. మేము చేసిన పాపమేమిటి? పది గోవులు ఉండాల్సిన చోట వంద గోవులను ఉంచుతారు. కూర్చునే ఆలోచనని పక్కన పెట్టేద్దాం .  నిలబడటానికి కూడా స్థలం ఉండదు. ఇక మా ఇష్టాయిష్టాలని చెప్పటానికి ఒకటే మార్గం . వాసన ద్వారా ఇష్టాన్ని, అయిష్టాన్ని చెప్తాము. జెర్సీ ఆవు వాసన మాకు నచ్చదు. చాలా సంధర్భాలలో ఏమి తింటున్నామో ,  ఎంత తింటున్నామో తెలీదు. ఏ పరిస్థితుల్లో తినాల్సి వస్తోందో మాత్రమే తెలుస్తోంది . నిలబడే శక్తి లేక పోయిన స్థలం లేని కారణంతో నిలబడే ఉండాల్సిన దుస్థితి. అడవులు, వనాలు మా నివాసాలు. ప్రతి రోజు దూర దూరాలు నడిచి వెళ్ళి మేత మేసి వస్తాము. ఇక్కడ మేము ఎక్కువగా నివశిస్తున్నాం కారణం ఈ ప్రాంతం మీద మాకున్న ప్రేమ కాదు. జవాబు మా దూడలను ఎత్తుకెళ్ళి అమ్మేసిన దుర్మార్గులకు తెలుసు. మా జీవితాలలో అతి పెద్ద పరీక్ష.  తల్లి నుంచి దూరం చేసిన బిడ్డల కోసం ఎదురుచూసే ప్రతీక్ష ఎదురుచూపు ఏ ఒక్కరి మీద ఎదురు తిరిగే ఆలోచన కలిగించదు. నేను పుట్టినప్పటి నుంచి తాడుతో కట్టేసి ఉంచితే నేను ఎలా పరుగు పెట్టగలను ఎలా ఆడుకోను ? ఇక నేను పాలు ఇవ్వలేను అని తెలిసాక నన్ను వదులుతావు. రోడ్డు ప్రక్కన నన్ను నిలబెడతావు. నా సర్వస్వం అక్కడే. గోశాల వరకు చేరిన మా నివాసం కబేళా కసాయి దగ్గరకు వెళ్తుంది. అవును నిజం  ! లారీలతో ఆవులను కబేళాకు వెళ్ళకుండా అడ్డుకున్నాము అంటారు. కానీ ఎద్దులకు గడ్డి పెట్టాలి, ఉపయోగం లేదు వీటితో అని " స్వయాన గోశాల వ్యక్తులే కబేళాకు పంపుతారు" గోశాల ఒక దొంగల నిలయం .  మహారాజుకు తెలీయకుండా కూలీలు పాలు దొంగిలిస్తారు.  ఉచిత సేవ,  నిస్వార్థ దానం అంటారు . క్రింద వారు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. మా ఆవుల సంతానం కథ మరీ విచిత్రం , ప్రతి పూజలో ఆవు , దూడ మాత్రమే కనిపిస్తాయి. నా పేరు 'కామధేనువు' అని పెట్టి కోర్కెలు తీర్చుకుంటున్నారు . మరి నా కోరిక తీర్చే ఎద్దును నా దగ్గర ఎందుకు ఉంచరు. ఎదురురాగానే ఎద్దు రూపంలో ఉన్న డాక్టర్ వీర్యం యొక్క మోతాదు ఎంత ఇవ్వాలి అని అడుగుతాడు. గిర్ జాతి గుజరాత్ నుంచి వచ్చినది ఎక్కువ పాలు ఇస్తుంది అనే కోరికలతో ప్రతి గిర్ జాతి ఎద్దు వీర్యాన్ని నాలో ఇంజక్షన్ రూపంలో ఇస్తున్నారు. మీరు చేసే ప్రతి దుర్మార్గాన్ని మౌనంగా గమనిస్తున్నాను. నా బిడ్డను చూసి ఆనందంతో బాధను మరచిపోతున్నాను. నా సంతానం, ఎద్దును పొలం పనులతో అష్టకష్టాలు పెడతారు.  మొయ్యలేని బరువులు ఎండలో రోడ్లపై లాగిస్తారు. ఇలా చేస్తూ నన్ను వారి కోర్కెలు తీర్చమంటారు.  ఎద్దు కావలి కాస్తుంది గోశాలలో.  మా అందరినీ కావలి కాసే ఒక రక్షకుడు కావాలి.  మూడు నెలలు నా బిడ్డకు వచ్చి గడ్డి తినడం మొదలు పెట్టగానే ఎలా మా ఇద్దరిని వేరు చెయ్యాలి అని చూస్తారు. అందుకే నా బిడ్డ గడ్డి తింటున్నట్లు చూడగానే నాలో ఒక భయం.  ఎవరో ఇద్దరు వచ్చి నన్ను నా బిడ్డను చూస్తే ఎలా ఎప్పుడు మా ఇద్దరినీ దూరం చేస్తాననే భయం . ఒక ప్రమాదం!  గర్భం బాధలను మరచి పోవడానికి ఒక సహాయం.  ప్రతి ఒక్కరికీ  యీ తెల్ల అందమైన ఆవు కావాలి, కపిల ఆవు ఇలా కొన్ని జాతుల గురించి ప్రతి ఒక్కరిలో ఉన్న విశ్వాసం, నమ్మకం మా వృద్ధికి మంచి కారణం అవుతోంది. " పశు సంపద" అనే పరం మా జీవితాలలో ఒక ప్రమాదం.  దయచేసి మమ్మల్ని సంపదగా చూడకండి.  పశువులను కాపాడి రక్షించుకోవాలనే  విషయం మీద  దృష్టి పెట్టాలి.  పశు సంపద మీద కాదు. ఒకప్పుడు  ఇంటికి ఒకరు ఉండేవారము.  ఇప్పుడు అపార్టుమెంట్ కు ఒకటి కూడా లేము.  గోమాత అని పిలిచే నన్ను గోసంపద అని ఎలా అన గలరు ? ఎలా పిలువ గలరు?  తల్లికి గుడి కట్టాలి.  వెల కట్టకూడదు.  దుర్మార్గులు ఎక్కడో ఉండరు మన మధ్యలోనే ఉంటారు .  

గోషామహల్ లో  కలకత్తా మిఠాయి దుకాణం ఉంది అందరికీ తెలిసిన సంగతి . దానికి ఆనుకుని సందులో ఆవులను, గేదెలను రోడ్డు ప్రక్కగా పెట్టి పాలను విక్రయిస్తూ ఉన్నారు.  ఇదే దుకాణం ఎదురుగా చిన్న గుడి, దాని ఎదురుగా ఒక చెత్త కుండీ. ఇక్కడ ఎన్నో ఆవులు ఆహరం కోసం నిరీక్షిస్తూ ఉంటాయి.  మేము రోడ్డు మీదకు ఎందుకు వస్తామో  ఎప్పుడైనా ఊహించారా ? గొల్లలు నా బిడ్డను కట్టేసి ఉంచుతారు.  భక్తులు మాకు ఇచ్చిన కూరగాయలు, పళ్ళు,అన్నం, చపాతీలు, గడ్డి తిని పాలు ఇవ్వడానికి తిరిగి బిడ్డ దగ్గరకు వస్తాము. నా పాలు బకెట్లు.  భక్తి కారణంగా వచ్చే పాలను అదే భక్తుడికి అమ్ముతారు.  నా బిడ్డ బలంగా ఉండదు.  నా పాలు త్రాగితే నా కంటే ఎత్తుగా బలంగా పెరుగుతుంది నా బిడ్డ.  దూడ పరిగెత్తితే పట్టుకోవడం ఎవరి  తరం కాదు.  ఇలా దుర్మార్గులు సమాజంలో శక్తివంతమైన అతి బలమైన ఆవులను సమాజంలో రాకుండా ఆపుతున్నారు.   మమ్మల్ని రోడ్ల మీద గడ్డి వెతుక్కోమని వదిలేస్తారు. ఎవరైనా మాకు సహాయం చేసే ప్రయత్నం చేస్తే వారిని కొడతారు.  భయపడేలా చేస్తారు.  మునిసిపాలిటీ వారు రోడ్డు పై ఆవులు ఉంచకూడదు అని చెప్పరు. ప్రస్తుతం ప్రతి ఇన్స్పెక్టర్ నెంబర్ వారి దగ్గర ఉంటుంది.  పోలీసులు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటారు.  ఆఖరికి ఏ కేసు ఉండదు. నా దూడని ఇప్పటి దాకా ఎక్కడికి వెళ్లిందో చెప్పలేకపోయారు.  వీరి నుంచి మమ్మల్ని కాపాడేవారు లేరా ? మీ అందరికీ పాలిచ్చి ప్రాణం పెంచే మాకు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు ? గోషామహల్ లో గోవు జన్మించాలంటే ఏదైనా పాపం చేసి ఉండాలి.  పుట్టిన ప్రతి ఆవు భయపడుతుంది. సీ సీ కెమెరాలు మా దగ్గర లేవు.  శ్రీ కృష్ణ పరమాత్మను నా దూడను ఈ దుర్మార్గులు  ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలుసుకునే దివ్యదృష్టిని  ప్రసాదించమని ప్రార్ధిస్తున్నాను!  
***

No comments:

Post a Comment

Pages