పరమార్ధం - అచ్చంగా తెలుగు
పరమార్థం
దాసరి శివకుమారి 

మనీ ఆర్డర్ అన్న కేకతో చెట్టుకింద కూర్చుని తత్వశాస్త్ర పుస్తకం తిరిగేస్తున్న పరమేశ్వర్ తలెత్తి చూశాడు. 
“పరమేశ్వర శర్మకే మనియార్డర్” అని పోస్టుమాన్ మరల అన్నాడు.
పరమేశ్వర్ లేచి వచ్చి సంతకం పెట్టి తన పేర పంపిన 500 రూపాయలను తీసుకున్నాడు. డబ్బును తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. “ గాయత్రి పీఠం వారి వేద పాఠశాల లో ఉండి చదువుకుంటూ తన ఖర్చుల కోసం ఒక మనసున్న దాత పంపే డబ్బుతో నెట్టుకొస్తున్నాడు తర్వాత తాను వారి రుణం తీర్చుకోవాలి” అనుకున్నాడు పరమేశ్వర్.
మర్నాడు ఉదయాన్నే చాలా విచారకరమైన వార్త ఒకటి తెలిసింది. కోడూరులోని ప్రధాన గాయత్రి పీఠాధిపతి ఉత్తర భారతదేశంలో జరిగే గాయత్రి పీఠం ఉత్సవాలలో ఉపన్యసించడంకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విమాన ప్రమాదం జరిగి అకస్మాత్తుగా మరణించారు. వారికి ఇంకా ఏబది సంవత్సరాల వయసు కూడా పూర్తి కాలేదు కాబట్టి  ముందుగానే తన తర్వాతి ఉత్తరాధికారినిగా  ఎవరిని ఎంపిక చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఆ ప్రధాన పీఠం , పీఠాధిపతి స్థానం ఖాళీగా ఉన్నది. కోడూరు లోని ప్రధాన గాయత్రి పీఠం కింద ఎన్నో ఉపపీఠాలు కొన్ని వేదపాఠశాలలు నడుస్తున్నాయి. పీఠాలలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందిస్తున్నారు. వేదపాఠశాలలో వేదము, దర్శనాలు, ఉపనిషత్తులు ఇలాంటివి నేర్పుతూ జ్ఞానాన్ని కలిగిస్తున్నారు. 
ఇపుడు ప్రధాన పీఠాధిపతి అకస్మాత్తుగా స్వర్గస్తులయ్యేసరికి ఉత్తరాధికారి కోసం గాలింపు మొదలయింది.  ఉపపీఠాలలో నుంచి కానీ,వేద పాఠశాలల నుంచి కానీ, తగిన వ్యక్తిని ఎంపిక చేసి ప్రధాన పీఠ బాధ్యతలు అప్పజెప్పాలన్న నిర్ణయాని కొచ్చారు.
“పరమేశ్వర్! నిన్నొక  పనిమీద పిలిపించాను. మన ప్రధాన పీఠాధిపతుల విచారకరమైన మరణం సంగతి నీకు తెలుసు. ఆ పీఠానికి అనుబంధంగానే మన వేదపాఠశాల నడుస్తున్నది కదా! మన పాఠశాల నుంచి యోగ్యమైన వారిని ఒకరిని ఎంపిక కోసం జరిగే పని నిమిత్తం పంపమని కబురొచ్చింది. నీ గుణగణాలను బట్టి నిన్నే అక్కడకు పంపుదామని అనుకుంటున్నాను. ఎంపిక కాలేకపోతే నువ్వు మరలా తిరిగి వచ్చి ఇక్కడే విద్యాభ్యాసం చేయొచ్చు. అదృష్టవశాత్తు నువ్వే ఎంపిక అయితే మొట్టమొదటి సన్యాసదీక్ష తీసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాతే పీఠాధిపతిగా అభిషేకిస్తారు. పీఠం యొక్క బాగోగులు, ఆస్తిపాస్తులు,అనుబంధ నిర్వహణ మొదలగునవి అన్ని చేయాల్సి ఉంటుంది. ఎంతో గురుతరమైన బాధ్యత కానీ ఎవరికో కానీ దక్కని అదృష్టం కూడా. రేపు తెల్లవారు జామునే మనం బయలుదేరవలసి ఉంటుంది. ఈ రాత్రి అంతా బాగా ఆలోచించుకో నీకు అంగీకారంగా ఉంటేనే బయలుదేరి వెళ్దాం. పొద్దుపోయింది వెళ్లి పడుకో”అని పాఠశాల ప్రధానాచార్యులు చెప్పారు. 
ప్రధాన పీఠాధిపతి ఎంపికలో పాలు పంచుకోగల యోగ్యత తనకు ఉందా అన్న ఆలోచనతో ఆ రాత్రి నిద్ర రాలేదు పరమేశ్వర్ కు కంబలి మీద పడుకొని అటు ఇటు దొర్లసాగాడు.
అతని అవస్థ చూసి పక్క కంబలి మీద పడుకున్న సోమశేఖర్ అడిగాడు “ఏం మిత్రమా ఈరోజు ఏంటి? చాలా అలజడిగా కనిపిస్తున్నావు” అని.
అవును మిత్రమా! అంటూ ప్రధానాచార్యులు చెప్పిన విషయం చెప్పాడు.
“ఇది చాలా సంతోషించదగ్గ విషయం. నువ్వే ఎంపిక అయితే నీజీవితమే మారిపోతుంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు మరి ఎంతో విలువైన సంపత్తికి రక్షకుడిగా మారతావు. కాకపోతే ముందుగా సన్యాస దీక్ష తీసుకుని,జీవితాంతం ఆ దీక్ష తోనే ఉండాలి. పీఠాభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ఉండాలి.” 
నా తల్లి కడుపుచలువ వల్లనే నేను మన ప్రధానాచార్యులు దృష్టికి వచ్చి ఉంటాను. సన్యాస పరీక్షలో ఉండటానికి నాకేం ఇబ్బంది లేదు.నేను కోరుకునేది కూడా ఇదే. ఏ బంధనాలు తగిలించు కోకుండా జీవితాంతం సమాజ సేవ చేస్తూ గడపాలనే ఉవ్విళ్లూరుతున్నారు. నేను సాఖ్యం నేర్చుకుంటున్న, యోగం నేర్చుకుంటున్న, జ్ఞానంతో సామాన్య మానవులకు ఎలా సేవ చేయొచ్చు అనే ఆలోచిస్తున్నాను. పీఠాధిపతి కావాలన్న ఆలోచనలు నాకు ఎప్పుడూ లేవు. నేను వేద పాఠశాల విద్యార్ధిగానే భావించుకుంటూ, ఈ ప్రకృతి పట్ల, మానవ సమాజం పట్ల, జాలి, దయ ఉంటే చాలు అనుకుంటూ ఉంటాను.
“ఇంత చిన్న వయస్సు నుండే ఇలాంటి  ఆలోచనలు చేస్తున్నావా మిత్రమా!” 
“మనతో పాటు మన ఆలోచనలు పెరిగి పెద్దవ్వాలి  కదా? ఇక విశ్రాంతి తీసుకుందాం” అంటూ పడుకున్నాడు పరమేశ్వర్.
*****
అనేకమంది ఉప పీఠాధిపతులు, వేదపాఠశాల ప్రధానాచార్యులు తమ తమ అనుభవంతోను, జ్ఞానంతోను కలిసి నిర్వహించిన వడపోతలు పరమేశ్వర్ నిలబడగలిగాడు. సన్యాస దీక్ష ఇవ్వబడింది. తరువాత పరమేశ్వర స్వామీజీగా కోడూరు గాయత్రి ప్రధానపీఠాధిపతిగా అభిషేకింపబడినాడు.మరి కొన్నాళ్లపాటు పరమేశ్వర స్వామీజీకి మరింత శిక్షణ అవసరం అనిపించి ఆ శిక్షణ కూడా పూర్తి చేయించారు. అపార సంపద ఉన్న పీఠం అది. త్వరగానే పీఠం యొక్క సంప్రదాయాలకు అలవాటు పడ్డాడు. తన ఆధ్వర్యంలో ఈ పీఠం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతుంది. దాంతో పాటు సామాన్య ప్రజల ఏ చిన్న సమస్యనైనా తీర్చడానికి తాను కంకణం కట్టుకున్నానని, ఈ పీఠం ఇలాంటి వారందరికీ ఆశ్రయం కల్పించే కల్పతరువు కావాలని గట్టిగా కోరుకుంటున్నాడు. ఆ దిశగానే అడుగులు వేయ సాగాడు.
ఆరోజు ప్రవచనాల కార్యక్రమం అయిపోయింది. భక్తులందరూ వెళ్ళిపో సాగారు. ఇద్దరు వ్యక్తులు లేచారు. “ స్వామి మీరు దేవుడి తర్వాత దేవుడు అంత వారు కదా! మా ఇబ్బందులు తెలియడం లేదా? మా చిన్న పిల్లలు, కడుపుతో ఉన్న ఆడవాళ్లు ఎక్కడికి వెళ్లాలన్న గతుకుల్లో ,రాళ్ళల్లో నడక లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ దారి చూపే వారు మాకు ఏదైనా దారి చూప లేరా స్వామి?” అంటూ కాళ్ళు పట్టుకున్నారు ఆ వృద్ధుడు ఇద్దరూ.
దైవ అనుగ్రహ ప్రాప్తిరస్తు. నా కాళ్లు వదలండి. మీకు  సరైన బాట  కావాలి.అంతే కదా! నేనే స్వయంగా మీ ప్రాంతానికి వస్తాను. పరిస్థితి చూసి వెంటనే సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికీ మీరు వెళ్ళండి. ఆ తర్వాత వెంటనే పరమేశ్వర స్వామీజీ పర్యటన తండాల ప్రాంతంలో జరిగింది.వెంటనే కోడూరు గాయత్రి ప్రధాన పీఠం ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకుంది. తండాలను కలుపుతూ అక్కడి ప్రజల కోసం రోడ్డు, ఆస్పత్రి, విద్యార్థుల కోసం ప్రాథమిక పాఠశాలల నిర్మాణం కోసం శంకుస్థాపన. అది పూర్తయిన తరువాత ప్రారంభానికి స్వయంగా స్వామీజీయే వెళ్లారు. ఆనాటి ఆ వృద్ధుల బాధకు నాకు చేతనైన సాయం అందించాను స్వామి! అని భగవంతుణ్ణి ఉద్దేశించి అనుకున్నాడు. పీఠం యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్నాయని,ఇతర ఉప పీఠాల వారు గగ్గోలు పెట్టినా, పరమేశ్వర స్వామీజీ చెవులు అలాంటి మాటలు వినిపించుకోవడం మానేశాయి.
ఆ సాయంత్రం నుంచి హోరుగాలి, గాలికి తోడు వర్షం ఉరుములు, మెరుపులు వచ్చి వాతావరణం అంత భయం పుట్టిస్తుంది.మూడు రోజులపాటు ఎడతెరిపిలేని వర్షాలు. ఆ రోజే కాస్త వర్షం వెనకాడింది. జనం ఇళ్లల్లో నుంచి బయటకు వస్తున్నారు. కానీ ఎటు చూసినా విరిగిపడ్డ పెద్ద పెద్ద చెట్లు,కరెంటు,టెలిఫోన్ స్తంభాలు. చిన్న ఇల్లు ఎటు పోయాయో తెలియదు. మరికొన్ని గోడలు, పైకప్పులు,పడిపోయిన పాతఇల్లులు. జలప్రళయం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఆ నీళ్లలో పడవేసుకుని పరమేశ్వర స్వామీజీ కొద్ది మంది అనుచరులు కలిసి కొన్ని కిలోమీటర్లు వరకు తిరిగారు. హృదయవిదారకంగా అనిపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు చేయిస్తున్నారని విని అక్కడికి వెళ్లారు. అనుచరులు గగ్గోలు పెట్టారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మీ దర్శనానికి వారే రావాలి. కానీ మనం వెళ్ళటం  పీఠానికి అమర్యాద.”
“నేనిప్పుడు పీఠాధిపతిగా కాదు విపత్తుకు చెలించిన ఒక మనసున్న మనిషిగా తిరుగుతున్నా అంటూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ప్రభుత్వం తరపున మీ సాయం మీరు చేయండి. ఇల్లు కోల్పోయిన వారందరికీ మా పీఠం తరపున ఇల్లు కట్టించి ఇస్తాం. వారి నెత్తిన మరల గూడు కనబడితేనే నాకు మనశ్శాంతి” అని చెప్పి ఆ విధంగానే వాళ్లకు ఇల్లు కట్టించి అప్పగించాడు. అప్పుడు ప్రజల కళ్ళలో కనపడ్డ మెరుపులు పరమేశ్వర స్వామీజీ గుండెను తాకాయి. మరోసారి ప్రధానపీఠంలోను, అనుబంధ పీఠాలలోనూ దుమారమే చెలరేగింది. అవి కూడా ఆయన చెవులను తాకలేదు.
తాను స్వయంగా జ్ఞానాన్ని సంపాదిస్తూ, ఆ జ్ఞానాన్ని శిష్యులకు ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, శంకరభాష్యం  గురించి బోధిస్తూనే ఉన్నాడు. ప్రవచనాలు చెప్పడంలో కానీ ఇంకా ప్రవచనాలు చెప్పడంలో కానీ ఉప పీఠాలకందించవలసిన తోడ్పాటులోగాని ఏ లోటు రానివ్వడం లేదు.
*****
మోకాళ్ళ పైకి కట్టుకున్నపంచెలు చేతులకు,చెవులకు వెండి నగలు, నెత్తిన చుట్టిన తల గుడ్డా, చేతుల్లో పొడవాటి కర్రలు పట్టుకున్న వ్యక్తులు ఇద్దరు వచ్చి కర్రను పక్కన ఉంచారు. ఆ తరువాత భయంభయంగా పీఠానికి, స్వామీజీకి నమస్కారం చేసే నిలబడ్డారు.
“ఏం నాయనా! భయం ఏమీ వద్దు. ఏం కావాలో చెప్పండి”అన్నాడు ప్రేమగా, ధైర్యం ఇస్తున్నట్లుగా కూడా.
“మేము ఇక్కడికి పది మైళ్లు పైగా మా ఆవుని తోలుకొని నడుస్తూ వచ్చాం. ఇటీవల మా ఆవులు కొన్ని ఉన్నట్లుండి గింగిరాలు తిరుగుతూ కిందపడి చచ్చిపోతున్నాయి. వాటిని కాపాడుకోవడం ఇంకా మావల్ల కాదు. మా ఆవులన్నిటికి మీ గోశాలకి అప్పగిస్తాం. మీరైతే కాపాడుకుంటారు స్వామి”అన్నారు చేతులు జోడించి.
“అయ్యో పాపం అలాగా? మరి మీకు దగ్గరలో పశువుల ఆసుపత్రి లేదా లేకపోతే ఆస్పత్రిలో  మీరే చూపించ లేదా! ఆస్పత్రి లాంటిది ఏం లేదు. మాకు తెలిసిన ఆకు పసర్లు, మంత్రించిన గరిక తినిపించాను. ఏమీ లాభం లేకపోయింది స్వామీ”.
మీరు భోజనం చేసి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి.మా పశువైద్యులతో చెప్పి మీవెంట వచ్చిన ఆవులకు వైద్యం చేయిస్తాను. వాటికి నయం అయ్యాక, మీరు తోలుకెళ్ళండి. ఆ తర్వాత వాళ్ళ ప్రాంతం ఏదో,వారి స్థితిగతులు ఏమిటో తెలుసుకున్నాడు. అక్కడి వారికి పశుసంపద వాళ్ళ ఆస్తి. మెట్ట ప్రాంతం కావడాన పంటల దిగుబడి అంతగా లేదు. పశు సంపద మీదే ఆధారపడి జీవిస్తున్నారని తెలిసింది. వెంటనే కోడూరు ప్రధాన గాయత్రి పీఠం ద్వారా ఆ ప్రాంతంలో ఒక పశువుల ఆసుపత్రి కట్టించాలి. పశువుల ఆస్పత్రి పూర్తయిన తరువాత పశువైద్యనికి  కావలసిన సిబ్బందిని, మందులను చికిత్స పరికరాలను అందించాలి అన్న నిర్ణయం జరిగింది. 
ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్కచేయకుండా, తను అనుకున్న పశువుల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయించాడు పరమేశ్వర స్వామీజీ. అప్పటివరకు మెడలు వేలాడు వేసే ఆవులు, గొర్రెలు కనబడి స్వామీజీ మనసు అస్థిమితంగా బాధగా అనిపించేది.ఇప్పుడు నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది అనుకుంటూ పీఠాన్ని తాకి నమస్కరించాడు స్వామీజీ.
ఆరోజు సున్నితంగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు పరమేశ్వర స్వామీజీ.
“కొందరు రాజకీయాలలో ఉంటారు,కొందరు విద్యను బోధిస్తారు, కొందరు దేశ రక్షణ బాధ్యత లో ఉంటారు,మరి కొందరు కార్మిక రంగంలో ఉంటారు. నేను ఈ ఆధ్యాత్మిక రంగంలోకి తేపడ్డాను. ఈ రంగాన్ని ఆలంబనగా చేసుకొని పేదవారికి, ప్రాణికోటికి నాచేతనైన సాయం చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు స్వామి! నన్ను ఇందుకే పుట్టించావు అని నేను నమ్ముతున్నాను. మానవసేవే మాధవసేవ కదా స్వామి! తోటివారి కన్నీరు తుడవడం కన్నా గొప్ప పరమార్థం ఏముంటుంది స్వామి. నేను ఇదే నమ్ముతున్నాను”. అనుకుంటూ మరోసారి పీఠాన్ని తాకి నమస్కరించి వైదిక సంధ్యా కార్యక్రమం నిర్వహించడానికి కూర్చున్నాడు.
***

No comments:

Post a Comment

Pages