జర్నీ ఆఫ్ ఎ టీచర్ -23 - అచ్చంగా తెలుగు
 జర్నీ ఆఫ్ ఎ టీచర్ -23
చెన్నూరి సుదర్శన్ 


“అప్పుడు మనోహర్ సారే కాలేజీకి ఇంచార్జ్ ప్రిన్సిపాల్. ఈశ్వరయ్య అని ఇంగిలీసు సార్ ఉండేటోడు. పాపం శాన అమాయకుడు. నోట్లే నాల్కే లేదంటే నమ్ము సార్. అసోంటోని సంసారంల నిప్పులు పోసిండు.. ఈ కొడుకు.సార్ అనాలంటే మనసొప్పది” అనుకుంటూ ఖాళీ అయిన గ్లాసును పక్కనున్న బెంచీ కింద పెట్టాడు. నా టీ ఇంకా అయిపోలేదు.


“కొండయ్యా ఊరించకుండా విషయమేందో చెప్పు” అన్నాను.

“కాలేజీల ఎవరు రాకున్నా ఈశ్వరయ్య సార్‍కే వర్సగా మూడు, నాలుగు పీరియడ్లు అప్పజెప్పి మాయమయ్యేటోడు మనోహర్ సార్.
ఓపాలి మనోహర్ సారు ఎనకాల్నే పోయిన. సర్రాసుగా ఈశ్వరయ్య సార్ ఇంట్ల సొచ్చిండు. సారిల్లుగాఎదురుంగదే..” అంటూ చూపిస్తూ “నేను మెల్లంగ కిటికీ రిక్క తీసి సూసిన.. ఏమున్నది?..ఈశ్వరయ్య సార్ పెండ్లానికి తగులుకున్నాడు” నేను కావాలనే సరాయించిన..
నన్ను సూడంగానే కొడుకు ఝల్లున వనికిండు.. నేను తిరిగి కాలేజీకి వచ్చిన. నా ఎనకాల్నే ఉర్కచ్చి నన్ను ఆఫీసులకు పిల్సిండు. అమాంతం నా రెండు కాళ్ళమీద పడ్డడు. ఎవరికీ చెప్పద్దని వంద రూపాయలు చేతిల పెట్టచ్చిండు. పైసలు వాని ముఖాన కొట్టిన.. ఇంత వరకు ఈ సంగతి ఎవరకీ చెప్పలే సార్.. మీ మన్సులనే పెట్టుకొండి”
            నాచేతిలో గ్లాసు ఖాళీ అయిందన్న విషయం మరిచే పోయాను. నా మనసు శూన్యమయ్యింది. సంఘంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు కలిగిన ఉపాద్యాయ వృత్తికిది తీరని కళంకం. మనోహర్ ఎం. ఏ. ఎం.ఫిల్. చదివిన చదువులు నిష్ప్రయోజనం. అన్యమనస్కంగా కొండయ్య వెంట నేను కాలేజీకి బయలు దేరాను.
            “సార్ దొంగతనం.. లంజెతనం దాచినా దాగేటివి కావు సార్. ఎప్పుడో ఒకప్పుడు బయట పడకతప్పై.
నేను నోరు మెదపక పోయనా  ఆ వాడల కొద్ది రోజులకు గుప్పుమన్నది. పాపం ఈశ్వరయ్య సార్ ఇజ్జతికి ఉరేసుకొని సచ్చి పోయిండు” అనగానే నా కళ్ళు చెమర్చాయి..శ్వాస మందగించింది..ఆందోళనగా కొండయ్య ముఖం చూసాను. కొండయ్య కన్నీటి పర్యంతమయ్యాడు.
            కొండయ్య కళ్ళూ, ముక్కు తుడ్చుకుంటూ “సార్.. ఆ పాపం మనోహర్ సార్‍కు తాకింది. ‘అయ్య సేసిన పాపాలు కొడుక్కు సాపాలైతై’ అంటరు.. యాడాది లోపే చేతికందిన ఒక్క కొడుకు నీళ్ళ లారి టక్కరై సచ్చిండు. అప్పటిసంది సారు కుతికె దగ్గర పడ్డది.. నా మఖం సూడాలంటేనే బుగులు పడ్తడు..”
            కొండయ్య మాటలు నన్ను డీలా పడేసాయి. స్టాఫ్ రూమ్ ఎంతకూ రావడం లేదని కాళ్ళు మొరాయించసాగాయి.
కొండయ్య నేను కలిసి రావడం తదేకంగా చూస్తున్నాడు.. ప్రిన్సిపాల్ గది ముందు నిలబడి మనోహర్.
చదువుకూ సంస్కారానికి బొత్తిగా సంబంధం లేకుండా పోయిందని  నామనసు క్షోభించింది. 
***


ఆరోజు   ఏకాంబరం నుదురుకు ఎడంపక్క చిన్న బ్యాండేజ్ వేసుకొని రావడం కంగారు పడ్డాను.

“ఏమైంది సార్..” అంటూ  అయ్యో పాపం అనే రీతిలో అడిగాను. కాస్తా కుంటుతున్నట్లూ గమనించాను.
“స్కూటర్ ఆక్సిడెంట్.. ఇద్దరు  తగువులాడుతూ నాకు అడ్డమొచ్చారు. వారిని తప్పించబోయి నేను పడిపోయాను. ఇంకా నయం వెనుక నుండి వెహికిల్స్ ఏవీ రాలేదు కాబట్టి బతికి బట్టగట్టాను హ్హ.హ్హ..హ్హా...” అని నవ్వుతూ కుర్చీలో కూర్చోబోయాడు.. నేను సహకరించాను.
సునీత, కమల మేడంలు ఏకాంబరాన్ని ఓరకంటగా చూస్తూండటం కంటపడిండి. వారి చూపుల్లో అబద్ధమైనా అతికినట్లు చెబ్తున్నాడన్నట్లుగా ఉంది.   
            అలాంటి పరిస్థితిలో సునీత తనకేమీ పట్టనట్లు ఉండడం నాకు కాసింత విస్మయం కలిగింది. గొడవ జరిగి ఉంటుందీమధ్య.. అనుకున్నాను.
            కాసేపటికి ఏకాంబరం మెల్లగా లేచి సునీత వద్దకు వెళ్ళాడు.  ఎదో చిదంబర రహస్యం చెబుతున్నట్లుగా ఏకాంబరం సునీత చెవి కొరుకుతుంటే ఆమె ముఖంలో వర్ణమాల వెలసింది. లేచి ఏకాంబరం వెంట వెళ్ళింది సునీత.. మాంత్రికునికి వశమైన నాగినిలా.
            ఎప్పుడెప్పుడు చెబుదామా..! అన్నట్లుగా ఎదురి చూస్తున్న  కమల నా పక్కకు రివ్వున పక్షిలా వచ్చి వాలింది.
            “సూర్యప్రకాష్ సార్.. చూసారా..! వారిద్దరూ మళ్ళీ చెట్టాపట్టాలేసుకొని ఎలా వెళ్తున్నారో..!” ముక్కు మీద వేలేసు కున్నట్లుగా చెప్పింది.
            “ఏమైంది?.. గొడవ పడ్డారా?.. పాపం ఆక్సిడెంట్ అయిందట కదా” అన్నాను.
            “ఆక్సిడెంటా.. పాడా.. సునీత మొగడు తన్నాడు” అంటూ విషయం దీపావళి చిచ్చుబుడ్డి వెలిగిస్తున్నట్లుగా చెప్పడం మొదలు పెట్టింది.   
(ఇంకా ఉంది)
***

No comments:

Post a Comment

Pages