బామ్మమాట బంగారుబాట - అచ్చంగా తెలుగు

బామ్మమాట బంగారుబాట

Share This
బామ్మమాట బంగారుబాట
ఇల్లెందుల ఉమాదేవి 


అసలే ఎండాకాలం.... బయట ఎండ మండిపోతోంది. వేడివడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.సాయిరాం గారింట్లో వాతావరణం  మరింత వేడిగా ఉంది. వేడిఎక్కువగా ఉందంటే అది రేకుల ఇల్లేమో అనుకుంటున్నారేమో. అదేంకాదూ...అది చక్కని అందమైన డాబాఇల్లు కానీ వేడి వడగాలులను మించిన ఉద్రిక్తత సాయిరాంగారింట్లో  ఆయన భార్య జయమ్మగారు,తల్లి అనంతలక్ష్మిగారూ...ఇకసాయిరాంగారి మాట చెప్పే పనేలేదు, వీరందరి మనసుల్లో ఉంది.ఎందుకంటే సాయిరాం గారి కూతురు కావ్య నిన్ననే పుట్టింటికి వచ్చింది.వస్తూవస్తూ ఓపేద్ద సమస్యని తీసుకొని మరీ వచ్చింది.తనభర్త రాజీవ్ తో విడాకులు తీసుకోవాలనే నిర్ణయంతో వచ్చింది.

రాజీవ్ ,కావ్యల వివాహమై ఇంకా ఏడాది కూడా కాలేదు. ఒక్కర్తే కూతురు, సాయిరాంగారుకూడా మంచి స్థితిమంతులు కావడంతో వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. రాజీవ్ కూడా బాగా చదువుకున్నవాడు, అందగాడు. పెళ్లికిముందు చేసిన ఎంక్వైరీలో కూడా రాజీవ్ మంచిబాలుడనే రిపోర్టే వచ్చింది.వాళ్ళ కుటుంబం కూడా వీళ్ళతో సరితూగగలదేనని తేలింది. కావ్యకూడా బాగా ఇష్టపడే ఈపెళ్ళిచేసుకుంది. మరిప్పుడు ఈవిడాకులగోల
ఏంటాఅని సాయిరాంగారింట్లో అందరూ మధనపడుతున్నారు.

ఏడాది కూడా కాకుండానే కావ్యపెళ్ళి పెటాకులు కావడమేంటాని కలవర పడుతున్నారు. కావ్య బాగా గారాబంగా పెరగడంతో మొండితనం ఎక్కువే. తనకు తోచిందేతప్ప ఎవ్వరిమాటా ఓ పట్టాన వినదు. ఇంతటి తీవ్రమైన  సమస్యని పరిశీలించి, కావ్య విడాకుల నిర్ణయం సరైనదాకాదా అని తేల్చే బాధ్యత ఇంటిపెద్ద అయిన కావ్యబామ్మగారికి అప్పగించారు.

మరునాడు ఇంటివెనకాల ఉన్నలాన్ లో కూర్చొని ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడుతున్న కావ్యదగ్గరకు వెళ్ళారు అనంతలక్ష్మిగారు. మాట్లాడడం అవగానే ఆవడనుచూసి "రా బామ్మా!కూర్చో.నీకూ నా డైవర్స్ నిర్ణయం తప్పనిపిస్తోందికదా" అని అడిగింది.
"అదేంలేదురా కావ్యా,ఎదోపెద్ద కారణముంటేనేగానీ ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవని నాకు తెలుసు. కానీ జరిగిందేమిటో నాకు చెప్పు తల్లీ.ఆంతా విన్నాక నీ నిర్ణయం సరైందోకాదో నేను చెప్తాను.తర్వాత నీ ఇష్టం"అన్నారు అనంతలక్ష్మిగారు. 
"అసలు ఆరాజీవ్ తో పడలేకపోతున్నాను బామ్మా.అతని ప్రవర్తన నాకు నచ్చట్లేదు.నన్ను టార్చర్ చేస్తోంది"అన్నది కావ్య.
"అయ్యయ్యో!కొంపదీసి అతడేమీ సాడిస్టు కాదుకదా. నిన్నేమీ హింసించలేదు కదా."గాబరాగా అడిగింది బామ్మ.
"ఛ...ఛ.అదేంలేదులే బామ్మా.అతనికంత సీను లేదులే బామ్మా. అన్నది తేలికగా కావ్య. మళ్ళీ "మరేంలేదు బామ్మా...అతనో అమ్మకూచి. ఎంతసేపు అమ్మా,అక్కా అనే జపం చేస్తుంటాడు.
నన్నసలు పట్టించుకోడు.చాలా చిరాగ్గా ఉంటోంది. భరించలేక పోతున్నాను." అన్నది అసహనంగా కావ్య.
"అసలేంజరిగిందో చెప్పవే ముందు" ఆత్రంగా అడిగింది బామ్మ.
"చెప్తానుండు.మొన్నటికిమొన్న వాలెంటైన్స్ డే రోజు ఏంచేసాడో తెల్సా బామ్మా."అని ఏదో చెప్పబోతున్న కావ్యని మధ్యలోనే ఆపేస్తూ"అదేంటే వాలెంటైన్స్ డేకి మీఆయన మంచి ఖరీదైన నెక్లెస్ కొనిపెట్టాడని,వాట్సప్ లో ఫోటోకూడా పెట్టావుకదే"అన్నారు అనంతలక్ష్మిగారు.
"ఆ...ఇచ్చాడులే.. నాకు నెక్లెస్ ఇస్తూ ఇంకోరెండు బాక్సులు కూడా చూపించాడు. అవేంటో తెలుసా. ఒకదానిలో వాళ్ళక్కకి చెవిజుంకీలు, మరొకటేమో వాళ్ళమ్మకి ఉంగరం. అదేంటీ...వాలెంటైన్స్ డే కినాకు గిఫ్ట్ ఇవ్వాలికానీ వాళ్ళకి కొనడమేంటని అడిగితే ,వాలెంటైన్స్ డే సందర్భంగా భారీ డిస్కౌంట్ ఉందని, అందుకే వాళ్ళకి కూడా తీసుకున్నానని చెప్పాడు. అలాచేయడం నాకు నచ్చలేదంటే,దాన్నో పెద్ద ఇష్యూ చేసిమూడ్ పాడు చేయొద్దని విసుక్కున్నాడు బామ్మా"అని కోపంగా చెప్పింది కావ్య.
"అవునా!అలాచేసాడా" ఇంకా చెప్పూఅన్నట్లు ఆత్రంగా అడిగారు అనంతలక్ష్మిగారు.
"మరేమనుకున్నావు. మొన్న జనవరీలో ఎక్జిబిషన్ కి వెళ్ళామా.నాకు కావల్సినవన్నీ కొనుక్కొమ్మన్నాడు. నా డ్రెస్ సెలెక్షన్ కి కాస్తా హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసాను. నాకు సెలెక్షన్ సరిగా తెలియదు. నవ్వేచూసుకో అన్నాడు.నన్ను బాగానే సెలెక్ట్ చేసుకున్నారుగా అనినేను సరదాగా అంటే  ఆసెలెక్షన్ కూడా మా అమ్మదీ, మా అక్కదే అని పంచ్ ఇచ్చాడేబామ్మా. నాకెంత ఒళ్ళు మండుతుందిచెప్పూ"అన్నది ఉక్రోషంగా కావ్య.
అది వినగానే పక్కున నవ్వేసింది బామ్మ. "ఏంటి బామ్మా...నీక్కూడా జోగ్గాఉందా? సర్లే...అసలేం జరిగిందో వినుముందు. నేను ఆషాపులో షాపింగ్ అవగానే బయటకు వచ్చానా, పక్కషాపునుండి పెద్ద బ్యాగుతో బయటకు వచ్చాడు.
అవేంటని అడిగితే వాళ్ళక్కపిల్లలు అంకిత, ఆకాష్ లకు షాపింగ్ చేసానన్నాడు. నీకు సెలెక్షన్ తెలిదన్నావుకదా అంటే ,చిన్నపిల్లలే కదా,మీ పెద్దవాళ్ళలాగా బాగుందనీ బాలేదని వంకలు పెట్టరుగా ఆని మళ్ళీ ఓ పిచ్చిజోకు. ఇలా ఎక్కడికెళ్ళినా నా షాపింగుతోపాటు వాళ్ళ షాపింగూనూ. నాకెలా ఉంటుందో చెప్పు."అన్నది కావ్య .
ఇంకోటి చెప్తాను విను బామ్మా. పోయినాదివారం ఇద్దరం సరదాగా బయటకు వెళ్దామనుకున్నాం. తనతో వెళ్తున్నానుకదాని తయారవడానికి కాస్త టైం ఎక్కువగా తీసుకున్నాను.తనేమో టీవీ చూస్తూ, నేను తయారయ్యెలోపు నాలుగైదుసార్లు మనమెళ్ళేది ఈ ఆదివారమా వచ్చేఆదివారమా అంటూ ఒకటే అరుపులు. సరే నేను తయారయి వచ్చేసరికి వాళ్ళమ్మతో  ఫోన్లో కబుర్లు ఫోన్ పెట్టేసాక, ఇప్పుడేం కబుర్లంటే వాళ్ళమ్మకి ఇష్టమైన సినిమా ఎదో వస్తుందని,ఆమాట చెప్పడానికి కాల్ చేసానన్నాడు. పదిహేను నిమిషాలు టైంవేస్టు. ఇలాంటివి ఎన్నెన్నో బామ్మా.ఇక ఈ అక్కాఅమ్మల కూచిని భరింఛడం నావల్లకాదు. అసలు మాకు కొత్తగా పెళ్ళైందన్న ఆనందమే లేకుండా పోయిందనుకో"బాధగా నిట్టూర్చింది కావ్య.
"మరి విడాకులు తీసుకొని ఏంచేస్తావు? జీవితమంతా ఇలాగే ఉంటావా"అడిగింది బామ్మ.
"ఎమో బామ్మా!ఎం చేస్తానో, ఏం చేయాలో నాకేం తెలియదు. నన్ను అర్ధం చేసుకునేవాడు దొరికితే మళ్ళీ పెళ్ళి చేసుకుంటానేమో" అన్నది కావ్య.
అనంతలక్ష్మిగారికి కావ్య ఎంత అయోమయ పరిస్థితిలో ఉందో అర్ధమయింది.
"ఇప్పుడు చెప్పు బామ్మా, నా నిర్ణయం సరైనదాకదా"అడిగింది కావ్య.
"కావ్యా!ఇంతసేపు నువ్వు చెప్పింది నేను విన్నాను.ఇక నేను చెప్పేది కూడావిని డిసైడ్ చేసుకో. వివాహమంటే జీవితాంతం తనతో కలిసి ఉండడానికి ఒక  వ్యక్తిపై నమ్మకంతో ఆత్మీయానుబంధం ఏర్పరుచుకొని, తన కుటుంబంలోకి ఆహ్వానం పలకడం. అంతేకానీ ఇంతకుముందున్న బంధాలు బలహీనపరచుకోవడం కాదు. నీకు అంతఖరీదైన నెక్లెస్ కొన్నాడు. మరి వాళ్ళమ్మగారికి, వాళ్ళక్కయ్యకి చిన్న గిఫ్ట్ లు కొంటే తప్పేంటి.
రాజీవ్ నిన్ను పెళ్ళి చేసుకున్నంతమాత్రాన తనవాళ్ళకి ఏమీ ఇవ్వకూడదా?దానితో నీకేంటి సమస్య?
ఇక ఎగ్జిబిషన్ లో వాళ్ళక్కపిల్లలకి బట్టలు కొన్నందుకు అంతబాధ పడిపోతున్నావు. ఎవరింట్లోనయినా ఆ ఇంటి ఆడపిల్లకి పిల్లలు  పుట్టినప్పుడు ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఆ పిల్లల ముద్దు ముచ్చట్లు, వాళ్ళు అమ్మమ్మా,తాతయ్యా,మామయ్యా అంటూ పిలిచే క్రొత్త పిలుపులు ఆ ఇంట్లో వాళ్ళకు కొత్త అనుబంధాన్ని, కొత్త హోదాని కలిగిస్తాయి.తమ ఇంట్లో చాలాకాలం తరువాత చిన్నపిల్లలు నడయాడడం ఎంతో ఆనందాన్ని కలిగి స్తుంది.రాజీవ్ కే కాదు ప్రతివారికీ తమ మేనల్లుళ్ళూ మేనకోడళ్ళంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అంతెందుకూ నిన్ను ఇప్పటికీ మీమామయ్యలు తమపిల్లలకంటే ఎక్కువగా ప్రేమిస్తారుగా. మరి
రాజీవ్ అదే చేసాడుగా. దానికినువ్వెందుకు అంత సీరియస్ గాతీసుకుంటున్నావు.
నువ్వు గంటలు గంటలు తయారవుతుంటే ఆఅబ్బాయికేమీ తోచక వాళ్ళమ్మగారికి ఫోన్ చేసాడు .అదీతప్పేనా?
చూడు కావ్యా! నిన్ను మీఅమ్మానాన్న ఎంత గారాబంగా పెంచారో, రాజీవ్ నికూడా వాళ్ళమ్మా నాన్నలని ఆంతే ప్రేమగా పెంచుంటారుకదా. పెద్దచదువులు చదివించారు. రాజీవ్ ఇప్పుడు ఇంతమంచి పొజిషన్లో ఉండాడానికి వాళ్ళక్క ఇచ్చిన ప్రోత్సాహమకారణమన్నాడని నువ్వే చెప్పావుగా ఒకసారి. మరి ఆలాంటి తనవాళ్ళకోసం ఏదయినా చేయాలనివుండదా. చూడు కావ్యా! ఏఅమ్మాయికయినా తనను తనను ప్రేమగాచూసుకుంటూ, తనకోరికలన్నీ తీర్చె మొగుడు ఇన్స్టాంట్ గా రాడు. దానికి వాళ్ళ కుటుంబం వాళ్ళని పెంచిన పెంపకం,నేర్పిన సంస్కారం తోనే మంచి వాళ్ళుగా ఎదుగుతారు.ఒక్కవిషయం తెలుసుకో కావ్యా!
పెళ్లి కాగానే తనవాళ్ళను నిర్లక్ష్యంచేసేవాడిని నమ్మకూడదు.తన వాళ్ళని ప్రేమించలేనివాడు ఎవ్వరినీ ప్రేమించలేడు.ఒకవేళ ప్రేమిస్తున్నానని చెప్పినా అది కపటప్రేమే.
మళ్ళీ పెళ్ళి చేసుకుంటానేమోనన్నావు.ఆవచ్చేవాడు నీమాట వినకపోతే  మళ్ళీ విడాకులు తీసుకుంటావా.పెళ్ళంటే ఆటకాదు. మొదటి పెళ్ళి,మొదటి రాత్రి యొక్క అందమైన అనుభవాలు మళ్ళీ పొందగలవా? ఏదుర్మార్గపు మొగుడో దొరికినప్పుడు, తప్పనిసరై విడాకులు తీసుకోవడం,మళ్ళీ పెళ్ళిచేసుకోవడం వేరు.
కానీనీది మాత్రం మూర్ఖత్వమే.నీలాంటి ఆడపిల్లలు ఎంతమందో ఇలాగే అనవసరమైన ఇగోలతో,జీవితాలనినాశనం చేసుకుంటున్నారు. చక్కని సంసారాన్ని,రాజీవ్ లాంటి మంచి మొగుడిని వదులుకుంటే, నీ జీవితాన్ని నువ్వే చేజేతులా నాశనం చేసుకున్నట్లే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో.ఆపై నీఇష్టం"అంటూ అనంతలక్ష్మిగారు లోపలికి వెళ్ళిపోయారు.

ఆరోజంతా బాగా ఆలోచించిన కావ్య, రాత్రి భోజనాలదగ్గర "అమ్మా నాన్నా నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ కి నేను మాఊరికి వెళ్తున్నాను. టికెట్ కూడాబుక్ చేసుకున్నాను."అని చెప్పింది. అనంతలక్ష్మిగారి వైపుచూసి,"థ్యాంక్స్ బామ్మా!నాకళ్ళు తెరిపించావు"అన్నది కళ్ళ నిండా నీళ్ళతో.
 ***

No comments:

Post a Comment

Pages