అటక మీది మర్మం - 23 - అచ్చంగా తెలుగు
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-ఇరవై మూడవ భాగం (23)
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్. తండ్రి కోరికపై ఆ కేసును చేపడుతుంది నాన్సీ.  ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పని చేసే ఎఫీ ద్వారా తెలుసుకొంటుంది. ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి. తన తండ్రి క్లయింట్ కు అమ్మించి పెడతానని వాటిని నాన్సీ యింటికి తీసుకొస్తుంది. అంతకు మునుపు నాన్సీ తండ్రి అప్పగించిన మరొక కేసులో సీసాలను అమ్మే వంకతో డైట్ కంపెనీ లాబ్ లో దూరి అక్కడ ఉన్న రసాయనికాలను తెచ్చి తండ్రికి యిస్తుంది. మాటల మధ్యలో తండ్రి లాబ్ లో ఆమె లైట్ వేసి వదిలేసిన దానిపై డైట్ కంపెనీలో విచారణ జరుగుతోందని చూచాయగా తెలియపరుస్తాడు. అందువల్ల డైట్ కంపెనీకి తిరిగి వెళ్ళి ఆ పరిసరాల్లో తెలిసిన వ్యక్తి కనపడటం వల్ల తాను అకస్మాత్తుగా వెళ్ళిపోయానని, తిరిగి అక్కడ వదిలి వెళ్ళిన సీసాల అమ్మకం మాట్లాడటానికి వచ్చానని నమ్మబలుకుతుంది. డైట్ తో సీసాల అమ్మకానికి బేరం కుదరక సీసాలను తీసుకొచ్చేసి ఫేబర్ దుకాణంలో అమ్ముతుంది. ఒకరాత్రి ఆగంతకుణ్ణి పట్టుకోవటానికి ఆమె చీకట్లో మాటువేయగా, ఆకస్మికంగా మార్చ్ రావటంతో ఆ ఆగంతకుడు తప్పించుకొని పారిపోతాడు.  మరునాడు రేడియోలో వినబడే పాటలో కొన్ని పదాలు మార్చ్ కుమారుడు అతని భార్యకు వ్రాసిన ఉత్తరంలో ఉన్నాయని ఆమెకు గుర్తుకొస్తుంది.  తరువాత . . . .)
@@@@@@@@@

నాన్సీకి మళ్ళీ ఆ ప్రేమలేఖలను చదవాలని ఆత్రుత కలిగింది.  అవి యింకా తన యింట్లోనే ఉండటం వల్ల ఉన్నపాటున యింటికి వెళ్ళాలని ఆమె నిశ్చయించుకొంది.
కానీ ఆమె బయల్దేరబోతుండగా, సుశాన్ తాను కట్టుకొన్న ఫాన్సీ దుస్తులను చూసి మెచ్చుకొంటుందని, నాన్సీని మేడ మీదకు పిలిచింది.  ఆమె వెళ్ళగానే, ఒక చేత్తో తను కట్టుకొన్న పరికిణీని ఎత్తి పట్టుకొని, మరొకచేతిలో పట్టుతో చేసిన గొడుగుని విలాసంగా పట్టుకొని ఆ పాప నిలబడింది.
"నేను హాలులోని బీరువాలో చూశాను.  మనం కిందకెళ్ళి తాతయ్యకు చూపిద్దాం" ఆత్రుతగా చెప్పిందామె.  "నేనిప్పుడు ఎదిగిన అమ్మాయిలా కనిపిస్తున్నానా?"
"నువ్వు వేసుకొన్న ఎత్తుమడమల బూట్ల వల్ల ఖచ్చితంగా నువ్వు మరింత పొడుగ్గా కనిపిస్తున్నావు" అంటూ నాన్సీ నవ్వింది.  "చూసుకో! లేకపోతే కాలుజారి పడతావు."
వాళ్ళిద్దరూ మెట్లు దిగుతుండగా, పాప తూలి పడబోయింది.  కొన్ని మెట్ల వెనుక ఉన్న నాన్సీ పాపను సమయానికి ఒడిసి పట్టుకొంది.  కానీ ఆమె చేతిలోనున్న గొడుగు మొన పక్కన గోడకు అంటించిన కాగితంలోకి చొచ్చుకుపోయి వంకరటింకరగా చింపేసింది.  ఆ కన్నంలోంచి అనేక వరుసల్లో వ్రాసిన సంగీతస్వరాలు బయటపడ్డాయి.
"నేనలా చేయాలని అనుకోలేదు" పాప భయంతో ఏడవసాగింది.  "తాతయ్య ఏమంటాడో?"
"అది నీ తప్పు కాదు" నాన్సీ ఆమెను ఓదార్చింది.  "అదృష్టవశాత్తూ నీవు గాయపడలేదు.  అంతేగాక నీవొక రహస్యాన్ని వెలుగులోకి తెచ్చావు."
ఉత్సాహంగా నాన్సీ కాగితం చిరిగిన చోట పరీక్షించింది.  గోడపై అనేక వరుసల్లో సంగీతస్వరాలు పెయింట్ తో వ్రాయబడి ఉన్నాయి.
ఆమె మార్చ్ ను మెట్ల దగ్గరకు పిలిపించింది.  మొదట అతను తన మనుమరాలు కట్టిన దుస్తుల విషయంలో యువ గూఢచారి కబురంపిందని తలపోశాడు.  కానీ పెద్దాయన గోడపై వ్రాసి ఉన్న సంగీత స్వరాలను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
"బహుశా యిది మా కుటుంబానికి చెందిన పురాతన గీత సంపదలో ఒక భాగం కావచ్చు" ఉత్సాహంగా చెప్పాడు.  "ఇలాంటివి యింకా ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవాలని ఉంది.  ఇక్కడ అంటించిన కాగితాన్ని చింపేద్దాం!" పెద్దాయన కోరాడు.  "ఏమైనప్పటికీ, ఈ వ్రాతలు కూడా రంగు వెలసిపోయాయి."
నాన్సీ సహకారంతో, బెస్, జార్జ్, మార్చ్ ప్రతి అంగుళాన్ని జాగ్రత్తగా చింపుతూ, గోడకు అంటించిన కాగితాన్ని చాలావరకు తొలగించారు.  అది విసుగును పుట్టించే పని అయినా, ఎంతో ఓపికతో ఆ పనిని జయప్రదంగా పూర్తిచేశారు.  క్రమేపీ అందమైన, పూర్వకాలపు చిత్రమొకటి బయటపడింది. 
ఆ చిత్రంలో పియానో దగ్గర కూర్చున్న స్త్రీ, ఆమె పక్కనే పాడుతున్న మగవాడు ఉన్నారు.  పాక్షికంగా చిరిగిన ఆఖరి కాగితం పియానో పైన ఉండే సంగీతపు చట్రాన్ని మూసి ఉంచింది.  దాని కన్నా నాన్సీ దృష్టిని ఆకర్షించినది గోడపై గీసిన కాగితపు రూపంపై కనిపిస్తున్న సంగీత స్వరాలు.   గోడపై ఉన్న ఆ వర్ణ చిత్రంలో స్వరాల కింద చిన్న అక్షరాలలో మార్చ్ కుటుంబసభ్యుడైన స్వరకర్తపేరు వ్రాయబడి ఉంది.

నాన్సీ గోడపై వ్రాసిన స్వరాలను కూనిరాగం తీసింది.  ఆ బాణీ మాత్రం ఖచ్చితంగా ఫిప్ మార్చ్ విపులీకరించిన, ప్రస్తుతం బాగా జనాదరణపొందిన బాణీలా తోచింది.
"ఇప్పుడు బెన్ బాంక్స్ పెద్ద మోసగాడని చెప్పటానికి తగిన సాక్ష్యం దొరికింది.  అతను తన బాణీలుగా ప్రకటించిన వాటిలో యిది ఒకటి" అంటూ పెద్దాయన కేకపెట్టాడు.
"ఇలాంటి సాక్ష్యాన్ని కోర్టు ఒప్పుకొంటుందా?" జార్జ్ అడిగింది.
"ఒప్పుకోవచ్చనుకొంటాను" నాన్సీ ప్రశాంతస్వరంతో బదులిచ్చింది.  "దీనికోసం అంతదూరం వెళ్ళవలసిన అవసరం రాకపోవచ్చు.  తనకి వ్యతిరేకంగా మన దగ్గర ఒక కేసు ఉందని తెలియగానే, ఈ విషయాలను కోర్టు వరకూ వెళ్ళకుండా పరిష్కరించే మార్గాలనే జెన్నర్ ఎంచుకొంటాడు.  మిస్టర్ మార్చ్! మీకిష్టమైతే, ఆ ప్రచురణకర్తను ఒకసారి కలుస్తాను."
"అలాగే చేయి" అంటూ అతను సమ్మతిని తెలిపాడు.
రివర్ హైట్స్ పట్టణానికి కొన్ని మైళ్ళదూరంలో ఆక్స్ ఫర్డ్ నగరంలో జెన్నర్ ఆఫీసు ఉంది.  'అక్కడకు తనతో వస్తారా' అని నాన్సీ స్నేహితురాళ్ళను అడిగింది.  ఆసక్తిగా ఉన్న వాళ్ళిద్దరూ వెంటనే బయల్దేరుదామన్నారు.  వాళ్ళు ముగ్గురూ ఒక గంటలో తమ గమ్యమైన ప్రచురణా కార్యాలయానికి చేరుకొన్నారు.  అది యిటుకలతో కట్టిన భవనమే కానీ నిర్మాణం జరిగి చాలా కాలమైనందున కళాహీనంగా ఉంది.
"అబ్బే! ఈ భవనం అంత మనోహరంగా లేదు" కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించాక బెస్ గొణిగింది.  
మేడమీద గదిలో ఎవరో బాండ్ తో కుస్తీపడుతున్నట్లు వినిపించింది.  మరొకమూల గదిలోనుంచి మరొకరు పియానోని శ్రుతిచేయటానికి శ్రమపడుతున్నారు.

"వినండే!" అకస్మాత్తుగా నాన్సీ అరిచింది.
"బిగ్గరగా వినిపించే చప్పుళ్ళు తప్ప నాకేం వినపడటం లేదు" జార్జ్ చెప్పింది.  "ఆకట్టుకొనేలా ఉండాల్సిన బాణీని అపశ్రుతిలో వాయిస్తున్నారు."
"పియానో దగ్గర వ్యక్తి  ఫిప్ మార్చ్ పాటల్లో ఒకదాన్ని వాయిస్తున్నాడు" నాన్సీ చెప్పింది.
ముగ్గురమ్మాయిలు మూసి ఉన్న తలుపుల దగ్గరకు మెల్లిగా కదిలారు.  పియానోపై పాట అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఒక్కక్షణం గడిచాక, వాళ్ళు ముగ్గురూ ఆహ్వానితులుగా ఒక హాలులోంచి తిన్నగా వెళ్ళారు.  అలా వాళ్ళు ఒక గదిగుమ్మం చేరేవరకూ వెళ్ళారు.  ఆ గది తలుపుపై సంగీత ప్రచురణకర్త పేరు ఉంది.   యువగూఢచారి తన స్నేహితురాళ్ళతో లోనికి ప్రవేశించింది. 
 (తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages