శ్రీమద్భగవద్గీత -30 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీ మద్భగవద్గీత
రెడ్లం రాజగోపాలరావు


క్షేత్ర  క్షేత్రజ్ఞ విభాగయోగము 
13 వ అధ్యాయము

కార్యాకారణ కర్తృుత్వే హేతుః ప్రకృతిరుద్యతే
పురుషస్సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుద్యతే
21 వ శ్లోకం

కార్య మనగా శరీరము కారణమనగా ఇంద్రియ మనోబుద్యహంకారములు, పంచభూతములు, శబ్ధాది విషయములు వీనియన్నింటినీ కలుగజేయునది ప్రకృతి ప్రకృతి జడమైనది. అందువలన సుఖదుఃఖఖములు అనుభవించలేదు. పురుషుడు చైతన్య స్వరూపుడు అసంగుడు కావున అతనికి సుఖ దుఃఖ భోక్తృత్వములుండవు. అయిననూ ప్రకృతి యొక్క సంయోగము వలన సుఖ దుఃఖాదులు పురుషుడనుభవించునట్లు తోచుచున్నది అంతేగాని వాస్తవానికి అతనికి కర్తుృత్వ భోక్తుృత్వాదులెవ్వియూ లేవు ప్రకృతి యొక్క గుణములతోటి సంగమమే జీవుని జన్మకు హేతువు.

ఉపద్రష్టానుమన్తా చభర్తా భోక్తా మహేశ్వరః
పరమాత్మేతి చాప్యుక్తో దేహేశ్మిన్ పురుషః పరః
23 వ శ్లోకం

పురుషుడు ఈ శరీరమందున్నప్పటికీ శరీరము కంటే వేరైన వాడును , సాక్షీభూతుడును, అనుమతించువాడు, భరించువాడును, అనుభవించువాడును, మరియు పరమాత్మయని చెప్పబడుచున్నాడు. యజ్ఞమునందు ఉపద్రష్టయను వాడు సాక్షిమాత్రముగానుండును. అట్లే ఆత్మ శరీరమందున్ననూ , శరీరముకంటే వేరుగా పరముగయున్న వాడై దేహీంద్రియాదులకు సాక్షిగా వెలయుచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగా అట్టి పరమాత్మ స్వరూపుడేయని దేహేంద్రియాదులు కాదనియు దృఢముగా భావన చేయవలెను. మహేశ్వరః పరమాత్మా, దేహేశ్మిన్ అని చెప్పబడినందువలన జగన్నాదుడైన పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ భగవానుడు జీవునకు అతి సమీపమున ఉండుటవలన ప్రయత్నముచే సులభముగా పొందవచ్చును.
పరః - అని చెప్పుట వలన ఆత్మ దేహముతో ఉపాధితో సంబందము లేక దానికి పరముగా అతీతముగానున్నదని తెలియుచున్నది. పరః పురుషః అను పదములకు పరమ పురుషుడు పరమాత్మయని అర్థము చెప్పవచ్చును.

ధ్యానేనాత్మిని పశ్యంతికేచిదాత్మానమాత్మనా
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే
25 వ శ్లోకం

ఆత్మను పరిశుద్ధమైన మనస్సుతో ధ్యానించి కొందరు తనయందు సాక్షాత్కరించుకొనుచున్నారు. అట్లే మరికొందరు సాంఖ్య యోగము చేతను, ఇంకా కొందరు కర్మయోగముచేతను అనుభూతమొనర్చకొనుచున్నారు. మనుష్యులు వారి వారి జన్మ సంస్కారముననుసరించి, దానికనుగుణ్యముగా వారు భగవంతుని గూర్చీ ప్రయత్నించి సాధన చేయుచుందురు. కొందరు ధ్యానమందు, కొందరు భక్తియందు, కొందరు జ్ఞానమందు కొందరు కర్మయందు ఇష్టము కలిగియుందురు. ఏ మార్గముననుసరించిననూ చిత్తసుద్ధితో ప్రయత్నించిన యెడల భగవత్సాక్షాత్కారమును పొందగలరని వచించబడినది. వారి వారి మనస్తత్వముననుసరించి ఆయామార్గములననుసరించుటకు సర్వులు స్వతంత్రులై యున్నారనియు ఏ మార్గముననుసరించిననూ అందరూ అంతిమ లక్ష్యము చేరుకొనగలరని ఈ శ్లోకముల ద్వారా తెలియజేయబడినది. ఇచట ధ్యానయోగము, సాంఖ్యయోగము, కర్మయోగములను మూడు మార్గములు చెప్పబడినవి. 
చూచుచున్నారని చెప్పుటవలన దైవం పరోక్ష వస్తువు కాదనియు ప్రత్యక్షముగా జనులు అతనిని చూడగలరనియు అనుభూతమొనర్చగలరనియు విదితమగుచున్నది. దైవ ప్రాప్తి విషయములో జనులు సందేహించనవసరం లేదు. మరియు దేవుడున్నాడై లేడా అను సంసయమునకు తావులేదు. ఏలయనిన నీవు దేవుని చూడగలవు మహాత్ములు ధ్యానాదులచే ఆ విధముగా చూచుచున్నారని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపధముగా చెప్పివేసెను.
ఆత్మని తనయందే అని పేర్కొనుట వలన పరమాత్మ ఎచటనో కాదు తనయందే పొందబడుచున్నాడని వ్యక్తమగుచున్నది. తనహృదయమందే పరమాత్మకలడని చెప్పుటచే ఆతనికై బయట వెతుకు ప్రయత్నము క్రమముగా తగ్గించుకొని హృదయకుహరమున దర్శించవలసియున్నది. ఏ మార్గముననుసరించిననూ చిత్తశుద్ధియొక్కటియే ఆత్మసాక్షాత్కారమునకు ఏకైక సాధనమని గ్రహించవలెను. అదియొక్కటియే మోక్షద్వారమును తెరుచుటకు తాళపు చెవియైయున్నది. వారి మనస్సును శుద్ధమొనర్చుకొని పరమాత్మవైపు ప్రయాణమొనర్చుటయే ముక్తికి సోపానము.
సాధారణముగా కొందరు కర్మ యోగమును తక్కువగను ధ్యానయోగమును ఎక్కువగను చెప్పుదురు కాని ఇచట పరమాత్మ కర్మయోగమునకు జ్ఞాన,ధ్యాన యోగములతో సమాన స్థితినొసంగి గౌరవించెను. నిష్కామ కర్మయోగము చిత్తశుద్ధిని కలిగించి తద్వారా జ్ఞానావిర్బావమునకు హేతువై భగవత్సాక్షాత్కారమును కలుగజేయుచున్నది.

శ్రీమద్భగవద్గీత -30

క్షేత్ర క్షేత్రజ్ఞ యోగేవమన్తరమ్ జ్ఞానచక్షుషా
భూత ప్రకృతి మోక్షంచయే విదుర్యాన్తితే పరమ్
35 వ శ్లోకం

ఎవరు జ్ఞాన దృష్టిచేత ఈ ప్రకారముగా క్షేత్ర క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమే కైవల్యప్రాప్తికి హేతువని నిరూపించబడినది. సామాన్యులందరును దృగ్దృశ్యములను, క్షేత్ర క్షేత్రజ్ఞులను కలిపివేయుచున్నారు. నేనే దేహము నేనే మనస్సు అనే ప్రకారముగా జీవుడు క్షేత్రముతోనైక్యమొందిపోవుచున్నారు. అదియే దుఃఖమునకు కారణము. వాస్తవానికి జీవుడు క్షేత్రజ్ఞుడగు ఆత్మయేకానీ క్షేత్రముకాదు. జ్ఞానదృష్టికలిగి క్షేత్ర క్షేత్రజ్ఞులను విభజించి చూచుటయే ఈ అధ్యాయమందు తెలుపబడిన బోధ.

ప్రతివారును బంధ విముక్తికై జ్ఞాననేత్రమును తెరిచే ప్రయత్నమును విచారణా సామర్థ్యమును క్షేత్ర క్షేత్రజ్ఞ విభేద పరిజ్ఞానమును తప్పక పొందవలసియున్నారు. నాకేల మోక్షము కలుగలేదని ప్రశ్నించువారు ముందుగా తన జ్ఞాన నేత్రము తెరుచుకొనినదాయని చూచుకకొనవలెను. ఎవరైననూ ఏ మతమువారైననూ , ఏ కులమువారైననూ జ్ఞాననేత్రము వికశించినచో వారు తప్పక ముక్తులవుదురు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages