పేగు బంధం - అచ్చంగా తెలుగు
పేగు బంధం
టేకుమళ్ళ వెంకటప్పయ్య 

"అత్తయ్యా! కాఫీ తీసుకోండి"

ఈ పిల్ల అన్ని విషయాలలో నామాట తు.చ. తప్పకుండా పాటిస్తుంది కానీ పిల్లలను కనే విషయం వచ్చేసరికి ఎందుకు మాట దాటేస్తుందో… అర్ధం కాదు.. అని మనసులోనే గొణుక్కుంటూ…అన్యమనస్కంగా.. చివరి మాట పైకే అనేసి కాఫీ గ్లాసు అందుకుంది యశోధరమ్మ.

"ఏమిటత్తయ్య అర్ధం కాదు అంటున్నారు?  ఏ విషయం గురించి?"

"హయ్యో! నేనీమీ అనలేదే!"

"నేను చెప్తానమ్మా! దాని బాధేమిటో"  అన్న మామ భూషయ్యగారి వైపు చూసి నవ్వుతూ ఖాళీ గ్లాసు అందుకుంటూ "అంటే ఇద్దరికీ అర్ధం కాని విషయాలు రెండూ ఒకటేనా.. వేరు వేరా.. మావయ్యా!"

"అయి ఉండవచ్చు, కాకపోవచ్చు. నా వరకూ నేను చెప్తున్నాను విను. ఈ రోజు మధ్యాహ్నం మేమిద్ద్దరం ఊరెళ్ళిపోతున్నాం" అన్న మాట పూర్తిగా చెప్పనీయకుండా మధ్యలో అందుకుంటూ "అదేమిటి? వచ్చి నాలుగు రోజులే కదా అయింది" అంది.

"ఏవండీ...మీరు కాసేపు ఆగండి. నన్ను మాట్లాడనివ్వండి. అమ్మా సౌమ్యా! చూడు. ఇందులో దాపరికం ఏమీ లేదు. మీకు పెళ్ళై ఎనిమిదేళ్ళు దాటింది.  సునీల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగమని టూర్లుంటాయని చెప్తూ దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. మీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే ఇక్కడ మాకేమి తోస్తుంది? ఇంట్లో పిల్లో…..పిల్లాడో ఉంటే మాకూ కాస్త కాలక్షేపం కదా! పైగా యిక్కడికు వచ్చి వెళ్ళినప్పుడల్లా మన ఊర్లో జనం మీ కోడలికి ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉన్నారు. ఏదో చెప్పి సరిపెడుతున్నాను" అంటూ కళ్ళు తుడుచుకుంది.

"నువ్వూరుకోవే! ప్రతిదానికీ… అన్నిటికీ బెంగపడకు. దేనికైనా టైం రావాలి." అంటూ కోడలి వైపు తిరిగి “అమ్మాయ్ సౌమ్యా...వాడు రాత్రికి ఎన్నింటికి వస్తాడో ఏమో మేము తాళం పక్క ఫ్లాట్‌లో యిచ్చి బయలుదేరుతాము” అన్నాడు.

ఏ టాపిక్ అయితే రాకూడదని సౌమ్య కోరుకుందో ఆ టాపిక్ రానే వచ్చింది. వీళ్ళకి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.

* * *

" సౌమ్యా! నా మాట విను ఒక్కరంటే ఒక్కరే! ఎక్కువ మంది వద్దు. తొమ్మిది నెలలు ఓపిక పట్టావంటే మనకొక బాబో.. పాపో... పుడతారు కదా.. అప్పుడిక మనకు ఏ సమస్యా వుండదు."

" సునీల్!  రోజూ పడుకునే ముందు ఈ టాపిక్ తెచ్చి నా బుర్ర ఎందుకు తింటావు?"

"ఆ పిల్స్ వేసుకోడం మానేయ్ సౌమ్యా...ప్లీజ్..మన పెళ్ళై ఎనిమిదేళ్ళయింది. మా అమ్మా నాన్నా ఎంత బాధ పడుతున్నారో చూశావా!"

"మావయ్య గారు అత్తయ్య గారి కోసం పిల్లల్ని కనాలా? నాన్సెన్స్! నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధమౌతోందా సునీల్! నా కెరీర్ ఇప్పుడు పీక్‌లో ఉంది. ఇంకో ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు అయిపోగానే నేను టీం లీడర్ని అవుతాను తెలుసా! అప్పుడు జీతం డబలవుతుంది. ఆ తర్వాత ఆలోచిద్దాం."

"నిజమే సౌమ్యా! నువ్వు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ మాట చెప్తూనే ఉన్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికే నీ వయసు 30 దాటింది. ఇంకో రెండు మూడేళ్ళు ఆగితే ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలీదు. నా మాట విను"

"నువ్వూ నా మాట విను సునీల్…… ప్లీజ్... ఇప్పుడు మనిద్దరం సంపాదించబట్టే గదా! యింత పెద్ద ఫ్లాటు… రెండు కార్లూ.. దర్జాగా బతుకుతున్నాం."

"నిజమే...కానీ…డబ్బెంత ముఖ్యమో కుటుంబం, పిల్లలు కూడా అంతే ముఖ్యం. ఈలోపు ఆఫీసులో ఏమీ కొంపలు మునిగిపోవు...నీ కెరీర్ కు ఏ ప్రమాదం లేదు..ప్లీజ్.."

"హు…..రోజూ ఇదే గోల...దేవుడా.. నాకు మనశ్శాంతి  ఉండనివ్వవు నువ్వు… సునీల్… పెళ్ళికి ముందే అన్నీ చెప్పాను. నా ఇష్టా ఇష్టాలకు విరుద్ధంగా నడుచుకోను అంటేనే నిన్ను పెళ్ళి చేసుకున్నాను". సునీల్ ఏదో చెప్పబోతూ ఉండగా.. “సారీ సునీల్…. టార్చర్ పెట్టకు...ప్లీజ్...” అంటూ పక్క గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది సౌమ్య.

* * *

ఉదయాన్నే ఆరుగంటలకు రావాలసిన పనిమనిషి లక్ష్మి ఏడు గంటలకు "అమ్మా! తలుపు తీయండి" అంటూ కాలింగ్ బెల్ నొక్కింది. ఏమిటో దీన్ని ఆలశ్యంగా వచ్చినప్పుడల్లా చెడా మడా తిట్టాలనిపిస్తుంది. కానీ వచ్చాక దాన్ని చూశాక కోపం యిట్టే మాయమైపోతుంది. నిజంగా లక్ష్మీ కళ.  ఎంత అందమైన మనిషి! తప్ప బుట్టింది వాళ్ళింట్లో.

"అమ్మా నేను పనికి ఇలా బయలుదేరానా… సరిగ్గా అదే టైముకు మా అమ్మకు గుండెల్లో నొప్పి వచ్చింది. మా అయ్య హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళాడు. వాళ్ళిద్దర్నీ ఆటోలో గవర్నమెంటు ఆసుపత్రికి పంపి నేను ఇలా వచ్చానమ్మా!"

"సరేలే.. తగ్గిపోతుంది. పనికానీ త్వరగా నేను వెళ్ళాలి కదా! "

* * *

ఆఫీసులో పని అయ్యే సరికి ఎనిమిదయింది టైం. బాస్ కు చెప్పి కార్లో యింటికి బయల్దేరింది. ఆఫీసులు వదిలే టైం. దారిలో అడుగడుగునా ట్రాఫిక్ జాం. ఈ రైల్వే గేటు ఒకటి. ప్రతిరోజూ ఇదే టైంకు కనీసం  అరగంట మూస్తారు అని విసుక్కుంటూ అప్రయత్నంగా ఎదురుగా ఉన్న సినిమా పోస్టర్ వేపు చూసింది. సన్నీలియోనే వెలిగిపోతోంది మాడరన్ డ్రెస్సులో. ప్రక్కనే ఐడియా వారి అడ్వర్‌టైజుమెంటు..  అప్పుడు వచ్చింది నిజంగానే బ్రహ్మాండమయిన ఐడియా సౌమ్యకు.

* * *

"ఏంటే లక్ష్మీ! ఏమయింది?  అలా ఉన్నావ్!" అంది పీక్కుపోయిన ముఖంతో నీరసంగా ఉన్న పనిమనిషిని చూసి.

"మా అమ్మకు గుండె ఆపరేషన్ చెయ్యాలంట.. రెండు లక్షలు ఖర్చవుతాయంట.. పెద్దాసుపత్రిలో ఆ సౌకర్యం లేదంట. వారంలో చెయ్యకపోతే బ్రతకదంట. నిన్నంతా మాకు ఇంట్లో తిండీ నిద్రా లేవు. మా బావ ఇదే టైంలో దుబాయి వెళ్ళాడు" అని చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

"ఏడవకు… ఇలారా.... ఇదిగో టిఫిన్ తిను" బలవంతంగా తినిపించింది. సౌమ్య సమస్యకు అదేసమయంలో పూర్తి రూపం వచ్చేసింది.

* * *

"ఏమండీ... మిమ్మ ల్ని ఒక విషయం అడగాలి." అంది బెడ్ సర్దుతూ.

"నా సలహాలు కూడా నీకు పనికొస్తాయా!" అని కోపంగా చూశాడు.

"అయ్యో! అలా అంటారేమిటి. వినండి"

"చెప్పు త్వరగా. నాకు నిద్రొస్తోంది."

"నేను పిల్లల్ని కనాలనుకుంటున్నాను"

"హా...ఆశ్చర్యం… నిజంగా! ఇది కల కాదు కదా! "

"అవును. కానీ.. తొందర పడకండి. ఆవేశంలేకుండా నిదానంగా వినండి. కనడం అంటే మామూలుగా కాదు."

" అంటే స్పెషల్‌గానా? ఏంటో ఆ స్పెషల్. కాస్తా అర్ధమయేట్టు చెప్పు"

"సరోగసీ ద్వారా"

"వ్హాట్.  నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా? మా అమ్మ చెప్పుచ్చుకు కొడుతుంది."

"అవ్వా..బువ్వా రెండూ కావాలంటే కుదరదు. మీ అమ్మనాన్నలకు నచ్చజెప్పుకునే పూచీ నీదే!"

"నీకేమైనా పిచ్చి పట్టిందా?"

"తప్పేంటి? మన ఎదురు ఫ్లాట్ రజనికి 3-4 సార్లు కడుపు నిలవకపోతే ఆవిడ రహస్యంగా సరోగసీ ద్వారా పిల్లాణ్ణి కనలేదా? డెలివరీ అయ్యాక తనకే డెలివరీ అయినట్లు బిల్డప్ ఇచ్చింది? ఎవరు కనుక్కున్నారు? ఎవరికి తెలిసింది? పైగా పోలికలు కూడా వాళ్ళయనవి వచ్చాయని పెద్ద గొప్పలకు పోతున్నారు. ఏమో …రేపు నేను గైనకాలజిస్టును కలవడానికి వెళ్తున్నా! అంతే! " ముసుగు కప్పేసి నిద్రకుపక్రమించింది సౌమ్య .


* * *


"లక్ష్మీ... ప్లీజ్. ముందా ఏడుపాపు."

"లేదమ్మగారు.. మా యమ్మ లేకపోతే నేను సచ్చిపోతా! రెండు లక్షలు యిప్పటికిప్పుడు ఎలా కట్టాలి? మాకు తిండికి జరగడమే కష్టం"

"ఆ రెండు లక్షలు నేనిస్తాను"

"అమ్మగారూ! నిజమేనా! మరి మేము ఆ ఋణం ఎలా తీర్చుకోవాలి?"

"ముందు కాళ్ళ మీదనుండి లే! ఋణం తీరే ఉపాయం ఉంది. నీవేమీ డబ్బులు కట్టకుండానే. అన్నీ వివరంగా చెప్తాను.” అంటూ తన మనసులోని మాట మెల్లిగా చెప్పింది.

అన్నీ విన్న లక్ష్మి కాసేపు మౌనంగా ఉండిపోయింది. "మీరు చెప్పింది తప్పో ఒప్పో నాకు తెలీదు. మాకు రెండు లక్షలు అర్జెంటుగా కావాలి. వేరే గత్యంతరం లేదు. అవతల అమ్మ ప్రాణాలు.  ఒప్పుకుంటున్నాను. ".

"మీ నాన్నను తీసుకుని ఆఫీసుకురా! అందరం కలిసి హాస్పిటలు కు వెళ్దాం" అనగానే మళ్ళీ దండం పెట్టింది.

* * *

"లక్ష్మీ! డాక్టర్‌గారు చెప్పింది బాగా అర్ధమైందా! ఒక సంవత్సరం కాంట్రాక్టు. ఒకరోజు హాస్పిటల్‌లో ఉండి డాక్టర్ చెప్పిన పని అవగానే ముందు రెండు లక్షలు ఇస్తా.. డెలివరీ అయ్యాక నీవు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకో లక్ష ఇస్తాం సరేనా? నువ్వు ఒక సంవత్సరం పాటు మా ఇంట్లో ఉండాలి. అన్ని ఖర్చులు మావే! ఈ అగ్రిమెంటు మీద నువ్వు మీ నాన్న సంతకం పెట్టండి." సంతకం పెట్టాక డాక్టర్ పక్కరోజు ఉదయం లక్ష్మిని, సౌమ్యను, సునీల్‌ను ఐ.వీ.ఎఫ్ సెంటర్‌కు రమ్మంది. మరుసటిరోజు ఎంబ్రియోలజిస్ట్ ద్వారా అన్ని పనులు సక్సస్‌ఫుల్ గా పూర్తి చేశారు. లక్ష్మీ వాళ్ళ నాన్నకు రెండు లక్షలు ఇచ్చి పంపించి. లక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళి అన్ని జాగ్రత్తలు చెప్పారు.

* * *

తొమ్మిది నెలల కాలం ఇట్టే గిర్రున తిరిగిపోయింది.  లక్ష్మి పండంటి మొగ బిడ్డను ప్రసవించింది. యశోధరమ్మ వాళ్ళ ఊళ్ళో నిజంగా సౌమ్యకే డెలివరీ అయినట్టుగా, నెలలు తప్పు లెక్కవేసినట్టుగాఅందరికీ అబద్ధం చెప్పింది. పిల్లాడికి పోతపాలు పడకపోవడం వల్ల లక్ష్మి చనుబాలు పడుతోంది. ఇంతలో లక్ష్మి బావ  గోవింద్ భుక్యా దుబాయి నుండి వచ్చి లక్ష్మిని నానా తిట్లు తిట్టాడు. బిడ్డను కన్న అమ్మాయిని ఎలా పెళ్ళిచేసుకోవాలి నేను అంటూ నానా చీవాట్లూ పెట్టాడు. లక్ష్మి దండం పెట్టి, కాళ్ళమీదపడి, పొరబాటు అయిందని ఆ డబ్బు వల్లే అమ్మ ప్రాణాలు నిలిచాయని సర్ది చెప్పి, ఇంకో మూడు నెలల్లో వచ్చేస్తానని చెప్పి పంపింది. లక్ష్మికి పిల్లాడు బాగా మాలిమి అయ్యాడు. క్రిందకు దింపితే ఏడుస్తున్నాడు. లక్ష్మి వెళ్ళిపోతే మెల్లిగా పోతపాలు అలవాటు చెయ్యాలని నిర్ణయానికొచ్చింది సౌమ్య.   ఇంకో వారం రోజుల్లో లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. లక్ష్మి చనుబాలు పడితేనే నిద్రపోతున్నాడు. లక్ష్మి తప్ప ఎవరెత్తుకున్నా పెద్దగా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. పిల్లవాడికి పోతపాలు పోస్తే వాంతులు విరోచనాలు అవుతున్నాయి. లక్ష్మి బిడ్డనప్పగించి వెళ్ళిపోయాక ఏమి చేయాలో యశోధరమ్మకు కానీ సౌమ్యకు కానీ అర్ధం కావడంలేదు.

* * *

ఉదయం ఆరు గంటలయింది. యశోధరమ్మ, భూషయ్య దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు. సునీల్ రాత్రి క్యాంప్ నుండి లేట్‌గా వచ్చి లోపల నిద్రపోతున్నాడు. ఎందుకో సడన్ గా మెలుకువ వచ్చింది సౌమ్యకు. ఇంట్లో ఎటువంటి అలికిడీ లేదు. రూంలో అత్తయ్య, మావయ్య లేరు. లక్ష్మి రూం కూడా ఖాళీగా ఉంది. బాల్కనీ లో కూడా ఎవరూ లేరు. లిఫ్ట్‌లో క్రిందికి వెళ్ళి చూసింది. లక్ష్మి లేదు.  ఉయ్యాలలో బిడ్డా లేడు. మనసు ఎందుకో కీడు శంకించి సునీల్‌ను లేపింది. సునీల్ వీధి చివరదాకా వెళ్ళాడు వెదుక్కుంటూ. వీధి చివర బ్యాంక్ ఏ.టీ.ఎం. గార్డు రాత్రి ఒంటిగంట సమయంలో ఏదో ఒక వ్యాన్ అపార్ట్‌మెంట్ ముందు ఆపిఉండడం చూశానని మాత్రం చెప్పాడు. మళ్ళీ రూంలోకి వెళ్ళి చూశారు. లక్ష్మికి సంబంధించిన వస్తువులు కూడా ఏమీ కనపడలేదు. ఉయ్యాలకు మాత్రం ఒక చీటీ పిన్ చేసి ఉంది. వణికే చేతులతో సౌమ్య చీటీ విప్పింది.

అమ్మగారూ! నేను పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాను.  తప్పులు రాసి వుంటే క్షమించండి. నాకు సరోగసీ అంటే ఏమిటో ప్రమాణ పూర్తిగా తెలీదు. కానీ డాక్టరుగారి మాట, మీ మాట విని, మా అమ్మప్రాణాలు కాపాడడంకోసం ఈ పని చేశాను. ఆ సమయంలో ఆపని మంచా… చెడా కూడా ఆలోచించే స్థితిలో లేను.  మా అమ్మ బతికితే చాలు అన్న ధ్యాస తప్ప. మా బావ వచ్చి తిట్టే వరకూ నిజంగా ఇదంతా నాకు అర్ధం కాలేదు. ఎంత ఘోరమైన తప్పో తర్వాత తెలిసివచ్చింది. అమ్మా! మా బావ నేనూ చిన్నప్పటినుండి ప్రేమించుకున్నాం. మీ డబ్బున్న వాళ్ళ ప్రేమల గురించి నాకు తెలీదు. ఒకరిని పెళ్ళిచేసుకుని మరొకరితో పబ్బులకు, సినిమాలకు తిరిగే వాళ్ళను ఎంతమందినో చూశాను ఈ నగరంలో.  వయసులో చిన్నదాన్నైనా, బిడ్డ విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. విత్తనం మీదైనా క్షేత్రం నాది. బిడ్డను కడుపులో మోస్తున్నరోజుల్లో… కన్నతర్వాత, గడువుతీరాక ఈ గొడవ వదిలించుకుని ఎప్పుడెప్పుడు మా యింటికి చేరుకుందామా అనుకుంటూ రోజులు లెక్కపెట్టుకున్నాను. కానీ… అదేమి విచిత్రమో… నేనొకటి అనుకుంటే దైవం వేరొకటి తలిచినట్టుగా పుట్టినబిడ్డతో నాకు రోజురోజుకూ బంధం పెరిగిపోయింది. బిడ్డకు స్తన్యం ఇవ్వడం ద్వారా నాకు ఆ బిడ్డతో విడదీయరాని బంధం ఏర్పడింది.  నా గర్భసంచిలోనుండి… బొడ్డు తాడుతో వెలువడ్డ ఈ నా బిడ్డను ఇంకో నాలుగు రోజుల్లో మీకు అప్పజెప్పి వెళ్ళిపోవడం ఊహించుకోలేక పోయాను. బిడ్డకు నా చనుబాలు తప్ప వేరే పడడంలేదు. నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను వదిలేసి ఇలా వెళ్ళిపోతే జీవితాంతం నాకు మనశ్శాంతి ఉండదు. ఒకవేళ పోతపాలు పడక బిడ్డకేమైనా అయితే! ఆ ఊహే భరించలేకపోతున్నాను.  బిడ్డే గుర్తొచ్చి క్షణ క్షణం నరకం అనుభవిస్తాను. ఇదే విషయం మా బావకు కూడా నిన్న ఫోనులో చాలా వివరంగా చెప్పాను. మొదట తిట్టినా తర్వాత శాంతపడ్డాడు. అనకూడదు కానీ మా బావ దైవసమానుడు. నేనంటే విపరీతమైన ప్రేమ. బిడ్డతో సహా నేను వచ్చేస్తే కూడా అభ్యంతరం లేదని, నన్నే పెళ్ళిచేసుకుంటానని అన్నాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో?  ఈ నగరాల్లో ఉన్న కృత్రిమ ప్రేమలకు మా బావ నిజమైన ప్రేమకు చాలా తేడా గమనించాను సౌమ్యమ్మా... నేను ఈ బిడ్డను వదలలేక తీసుకెళ్ళిపోతున్నాను. వెళ్ళేముందు నాదొక విన్నపం. జీవితంలో డబ్బులు ఒక్కటే ముఖ్యంకాదు. ఇలా సరోగసీ ద్వారా కాకుండా మీరు ఈసారి తొమ్మిది నెలలు మోసి బిడ్డను కనండి.  మీకు అమ్మతనం అంటే ఏమిటో తెలుస్తుంది. బిడ్డపై ప్రేమ అంటే తెలుస్తుంది. మాతృత్వం అనుభూతి అంటే మరపురానిది. అమ్మా! అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందం పొందుతావు. పరాయి బిడ్డను కంటేనే ప్రేమ ఆపుకోలేకపోతున్నాను.  ప్రసవ వేదనను భరిస్తూ నీ ప్రతిరూపానికి జన్మనిస్తున్న నీ సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి నన్నుమనస్ఫూర్తిగా క్షమించండి. మాకోసం అనవసరంగా వెదికించకండి మీకు వృధా శ్రమ. మా వూరు దట్టమైన కర్ణాటక భగవతి అడవుల్లో ఒక మారుమూల కుగ్రామం. భయంకరమైన ఆటవికులు. అలవాటైన మనుషులు తప్ప మరోకరు అక్కడకు ప్రవేశించడం కూడా కుదరదు.  ఎవ్వరూ కనుక్కోలేరు. నేను, మా బావ, మా అమ్మ, నాన్నలతో సహా ఈ వూరు విడిచి అక్కడికి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాము. మీరు ఈ వుత్తరం చూసే సరికి మేము మా వూర్లోకి ప్రవేసిస్తూ ఉంటామనుకుంటాను. ఒక చివరి మాట చెప్తున్నా సౌమ్యమ్మా!  బిడ్డను గొప్ప విద్యావంతుడిని,ధనవంతుడిని  చేస్తానో లేదో చెప్పలేను కానీ మా బావలా ఒక మంచి మనసున్న మనిషినిగా మాత్రం తప్పకుండా తీర్చిదిద్దుతానని ప్రమాణం చేస్తున్నాను. బహుశ: జీవితంలో మళ్ళీ మనం కలుసుకోలేక పోవచ్చు.  మరొకసారి క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... లక్ష్మి.

వెక్కి వెక్కి ఏడుస్తున్న సౌమ్య చేతిలో ఉత్తరం తీసుకుని చదివి అలా నేల మీద చతికిలబడిపోయాడు సునీల్. అప్పుడే గుడినుంచి వచ్చిన యశోధరమ్మ, భూషయ్య  ఏమి జరిగిందో అర్ధంకాక అవాక్కై చూస్తున్నారు. బాలభానుడి లేత కిరణాలు యధాతధంగా అంతటా సోకుతున్నా అంధకార బందురంగా తోచింది సౌమ్యకు. ఆ ప్రత్యక్ష నారాయణుడైనా కనువిప్పు కలిగించాలని కోరుకుందాం.

-0o0-

No comments:

Post a Comment

Pages