నీరాజనం కథ - అచ్చంగా తెలుగు
నీరాజనం కథ      
మినికథా చక్రవర్తి, కథా నిథి, కథా బ్రహ్మ, కె.బి. కృష్ణ.  


నాగార్జునసాగర్ మూడు కాలనీ లలో మేము హిల్ కాలనీ లో ఉంటున్నాం. శ్రావణ మాసం తొలిరోజులు, వాతావరణం ఆహ్లాదకరం గా వుంది. కృష్ణమ్మ ప్రవాహం నుండి వస్తున్న చల్లని మలయమారుతం ఆప్పుడే వేడెక్కుతున్న సూర్యకిరణాలు మనసు పులకరించేట్లు గా ఉంది. శ్రీమతివూరెళ్ళడ౦o o తో కేనాల్స్ రోడ్ లో ఉన్న గోవిందయ్య కాంటీన్ కి బయలుదేరాను. గోవిందయ్య తన అత్తగారు, భార్య ల తో ప్రాజెక్ట్ పనులు మంచి ఊపు లో ఉండగా వచ్చేశాడు. ముందుగా ఒక చిన్న పాక లో కాంటీన్ పెట్టాడు. ఇప్పుడు ఒక రెండు గదులు ఇల్లు అద్దెకు తీసుకుని, ఆ ఇంటి ముందే తాటాకులతో పెద్ద పందిరి వేసి, అర డజను బల్లలతో, ఒక డజను ఫైబర్ కుర్చీలు ఒక చెక్క బీరువా తదితర సామాగ్రి తో కాంటీన్  నడుపుతున్నాడు. ఒక సారి గోవిందయ్య కాంటీన్ లో ఇడ్లీ వడ సాంబార్ తింటే మళ్ళీ మీరు ఎక్కడా తిన లేరు. అంత మధురం గా చేస్తాడు. అతనికి చేదోడు వాదోడు గా అతని భార్యా, అత్త గారూ మరో ఇద్దరు కురాల్లూ పనిచేస్తారు.
నేను వంద గజాల దూరం నుండి చూశాను, పందిరి రాటలకు కొబ్బరాకులు చుట్టబెట్టారు. రంగు రంగు కాగితాలతో, మామిడి ఆకుల తోరణాలు కట్టారు. పందిరి మధ్యలో రంగు కాగితాల తో తయారు చేసిన బుట్టలు వేలాడదీశారు. ఒక పండుగ వాతావరణం లా వుంది ఆ ప్రదేశమంతా.
“ గోవిందయ్యా – రెండు ఇడ్లీలు వడ సాంబార్ ఇస్తావా, అమ్మగారు ఊరేళ్ళారు.—” అన్నాను.
మోకాళ్ళ దాక కట్ చేసిన పాత జీన్స్ పాంటూ, వెలిసిపోయిన ఆకుపచ్చ చారల  టీ షర్టు, చమన చాయ రంగు లో మరీ సన్నమూ లావు కాని శరీరం, కష్టజీవి ఎప్పుడో తెల్లవారు జామున నాలుగు గంటలకల్లా లేస్తాడు. కొంచెం మాసిన గెడ్డం, సంస్కారం లేని జుట్టు, చిరుచేమటలతో ముఖం నిండా శ్రమ సౌందర్యం. నాకు గోవిందయ్య అంటే చాలా ఇష్టం, అతను ప్రస్తుతం ఉన్న స్థితి లో, ఒక బల్ల ముందు దర్జాగా కుర్చీ లో కూర్చుని నలుగురు కుర్రాళ్ళతో పని చేయించుకుంటూ డబ్బులు వసూలు చేసుకునే స్థాయి కి వచ్చాడు చాల కష్టపడి, కాని ఇంకా మొదట్లో ఎలా కష్ట పడ్డాడో ఇప్పుడూ అదే వరస. గోవిందయ్య ఇడ్లీ సాంబార్ తింటున్న నా దగ్గరకు వచ్చి---
“ అయ్యగారూ తమరి దయ వలన మా బుడ్డోడు హైదరాబాద్ లో లక్ష రూపాయల జీతం తో ఉద్యోగం లో చేరి, చాలా రోజులకు ఈ రోజు మొదటి సారిగా వస్తున్నాడయ్యా—ఈ వేల మన కాంటీన్ లో అజ్దరికీ ఫ్రీ గా టిఫిను కాఫీ ఇచ్చేస్తు న్నా.— ఆడు చల్లగా వుండాలి – ” అంటున్నాడు గోవిందయ్య.
ఆశలూ, ఆశయాలూ, నెరవేరడానికి కలలు కనాలి. ఆ కలలు నిజం కావడానికి శక్తి కి మించి శ్రమ పడాలి. ఆప్పుడే మనిషి సఫలీ కృతు డవుతాడు.
ఆ కష్టాలకు ఫలితం వచ్చినప్పుడు విజయాన్ని దర్శించినప్పుడు అతని జీవితం ధన్యం. ఆనంద దాయకం. గోవిందయ్య ముఖం లో అపరిమితమైన సంబరం గోచరిస్తోంది.
“ అదేంటి గోవిందయ్యా – నువ్వు మొదటినుంచీ చాలా కష్టపడి, నీ కుటుంబాన్ని లాక్కోచ్చావు.నీ కొడుకుని కూడా అనుక్షణం అంటిపెట్టుకుని కంటికి రెప్ప లా చూశావు. దేవుడు నిన్నూ, నీ కష్టాన్నీ కనిపెట్టి దయ చూపించాడు. మా దేముందీ నువ్వు బాగా ఉండాలనీ అనుకోనే వాళ్ళమే – ” అన్నాను.
గోవిందయ్య కాంటీన్ లో చుట్టుపక్కల చాలా ఆఫీసుల్లో ఉద్యోగులూ బస్సుల్లో వచ్చేవాళ్ళూ పోయేవాళ్ళూ ఉదయం టిఫిను మధ్యాహ్నం ప్లేట్ భోజనము, రాత్రి భోజనము సాయంకాలం పూట బజ్జీలు వగైరాళ్ళు తింటూ వుంటారు. అతను తన కాంటీన్ కి వచ్చే పోయే వాళ్ళ రుచులు అన్నీ అతనికి తెలుసును.
గోవిందయ్య కు ఒక్కడే కొడుకు. వాడు వాడి తల్లి లాగే పచ్చగా బంగారం రంగు లో ఉంటాడు. వాడు చిన్నప్పటినుండీ తెలివైన వాడు. కేనాల్స్ లో కాన్వెంట్ లో మేడం గారి ని పట్టుకుని వాడిని అక్కడే చదివించాడు. పదో తరగతి లో మొదటి పది మందిలోనూ, ఇంటర్ లో పది ర్యాంకులలో వచ్చాడు. మా ఆఫీసుల్లో ఇంజనీర్స్ ని పట్టుకుని కోచింగ్ చెప్పించి ఎంసెట్ పోటీ పరీక్ష రాయించి, ఫ్రీ సీటు వచ్చే ర్యాంక్ తెచ్చుకున్నాడు. అప్పుడు మొదలైంది ఆర్ధిక సమస్స్య, కొడుక్కి చదువు ఎలా చెప్పించాలా అని దిగులు పడుతున్న గోవిందయ్య కుటుంబానికి ఆపద్భాన్దవుని లా సాగర్ లో కాంట్రాక్టర్ గోవర్ధన్ గారు వాడి చదువు సంగతి చూసుకుంటాననీ, వాడు ఎంతవరకూ చదివితే అంత వరకూ తానూ ఖర్చు పెట్టి చదివిస్తానని వాడిని అక్కున చేర్చుకున్నారు. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని గోవిందయ్య కొడుకు బి టెక్ ప్రధమ ర్యాంక్ లో పాస్ అయి, ఏం టెక్ ఎవరి సహాయం లేకుండానే స్కాలర్ షిప్ తో చదువు కుంటు వుంటే, ప్రాజెక్ట్ వర్క్ చెయ్యడానికి బెంగుళూర్ వెళ్తే ఆ కుర్రాడి అసాధారణ ప్రతిభా పాటవాలు గుర్తించి బెంగుళూర్ లో ఆ కంపని వారు సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలతో ఉద్యోగం ఇచ్చేసి తమ దగ్గరే ఉంచేసుకున్నారు. అప్పటి నుండీ వాడు ఇంటికి రానే లేదు. బి టెక్ లో చేరినప్పటి నుండీ ఎవరైనా హైదరాబాద్ నుండి వస్తుంటే వారి చేత తల్లితండ్రులకు కబురు పంపడ మే కాని వ్యక్తి గతం గా రాలేదు. కారణం ఆ సమయం లో చదువు దెబ్బ తింటుందనీ అందువలన  తన ధ్యేయం నేరవేరదనీ. నేటి యువత కు గోవిందయ్య కొడుకు రాజా ఆదర్శం. గోవిందయ్య కుటుంబానికి యువరాజు వంటి రాజా ఇవ్వేళ వస్తున్నాదన్నమాట.
నేను టిఫిన్ తినేసి, గోవిందయ్య టేబుల్ దగ్గర కూర్చున్నాను. నాకు రాజా  ని చూడాలని ఉంది. అక్కడే బల్ల దగ్గరగా, గోవిందయ్య భార్య, అత్త గారూ నిలబడి ఉన్నారు. సమయం పది గంటలవుతోంది.
ఇంతలో హైదరాబాద్ నుండి ఒక బస్సు వచ్చి కాంటీన్ ముందు ఆగింది. అందు లోంచి రాజా దిగాడు. ఐదున్నర అడుగుల ఎత్తు లో ఎత్తుకు తగిన శరీర పుష్టి తో లేత నీలం రంగు జీన్స్ ప్యాంటు మీద లేత నీలం రంగు గళ్ళ చొక్కా టక్ అప్ చేసుకున్నాడు. వీపు మీద బ్యాగ్ వేలాడుతోంది. అతని ముఖం లో అవ్యక్తమైన తేజస్సు తాండవిస్తోంది. సంతోషం, సంబరం కలగలిపి ముఖమంతా వెలిగిపోతోంది.
బస్సు దిగడం ఆలస్యం, అక్కడే నిలబడి వున్న అమ్మమ్మ కన్నమ్మ ని కావలించేసుకుని “ అమ్మమ్మా ఎలా ఉన్నావే  ? ” అంటూ ఆమెను అత్తుక్కుపోయి వాళ్ళంతా తడుముతోంటే, ఆమె కంటి నిండా నీళ్ళతో –ఆమె కూడా మనవణ్ణి జుట్టు నుండి పాదాల వరకూ అణువణువూ తడుముతూనే వుంది.  
ఆమెను వదిలి పక్కనే వున్న తల్లి ని కావలించుకుని “ అమ్మ ఎలా ఉన్నావే ? అంటూ తల్లిని తన శరీరానికి హత్తు కున్నాడు. గాలి కూడా ఆ తల్లీ కొడుకుల మధ్యన దూరడానికి ధైర్యం చేయలేకపోతోంది. తల్లి రాజా శరీరమంతా తడుముతూ ఆప్పుడే కొత్తగా తన కొడుకుని చూసినంత ఆనందపడి పోతోంది. మరో ప్రక్కన ఏడుస్తూనే వుంది. ఆ తల్లీ కొడుకుల అనురాగపు దృశ్యం చూడ డానికి నా రెండు కళ్ళూ సరిపోక అనేక కళ్ళు చేసుకుని చూస్తున్నాను. 
జన్మించక ముందు అమ్మ గర్భం లో వెచ్చదనం జన్మించాక అమ్మ కమ్మని వొడి లో వెచ్చదనం, అమ్మ పెట్టిన ముద్దు, అమ్మ పెట్టె గోరు ముద్దా, తన బిడ్డను చూసి మురిసిపోయే అమ్మ -- మనిషి జీవితం లో ఒక అద్భుత అనుభూతి. వర్ణ నాతీతమైన ఆనందం. అమ్మ ఒడిలోని తృప్తీ ఎవరూ కల్పించలేరన్నది నిర్వి వాదాంశం. ఆ తల్లి ముఖారవిందం నిండా అంతు లేని సంతోషం. తృప్తీ, ప్రేమానురాగాల వెలుగులూ – కాదు ఆ తల్లి ముఖం చందమామ లా వెలిగి పోతోంది. అయినా ఆమె కంటి నిండా నీరు –  “”
“ అమ్మా పిచ్చి అమ్మా నేను బాగానే వున్నాను కదే – ” అంటూ తల్లిని ని విడిపించుకుని చకచకా తమ ఇంటికి వెళ్తూ, తండ్రిని చూసి “ హాయ్ నాన్నా వస్తున్నా – ” అంటూ కాళ్ళూ చేతులూ ముఖమూ కడుగుకుని వెనక్కు తిరిగి వచ్చాడు రాజా.
అక్కడే వున్న మడత మంచం వాల్చి, దాని మీద అమ్మమ్మ కన్నమ్మ ను కూర్చోబెట్టాడు. ఆమె “ ఏందీ రా కన్నా ? ” అంటూ వుంటే – ఒక చిన్న స్టూల్ ఆమె పాదాల దగ్గర పెట్టేడు. బ్యాగ్ లోంచి నోట్ల కట్ట, ఒక పండు, ఒక బంతి పువ్వు, కన్నమ్మ చేతి లో పెట్టి ఆమె పాదాల చెంత సాష్టాంగ పడి “ అమ్మమ్మా దీవించు” అంటూ ప్రక్కనే ఉన్న నీళ్ళ బకెట్ తీసుకువచ్చి, అందులో తన బ్యాగ్ లోంచి పన్నీరు  సీసా తీసి ఆ నీటి లో పోసి, ఆ బకెట్ లో కన్నమ్మ రెండు కాళ్ళూ పెట్టి, ఆమె పాదాలు అణువణువూ చేతులతో తడిమి మరీ కడిగి ఆమె పాదాల నుండి వచ్చిన ఆ నీళ్ళు రాజా తన తల మీద జల్లుకుంటూ వుంటే, రాజా తల్లి మణెమ్మ వచ్చి తన తల్లి కన్నమ్మ పాదాలు  రాజా తల మీద పెట్టి “ అమ్మ దీవించవే నీ మనవణ్ణి మన బంగారు తండ్రి ని – ” అంటూ, ఆమె పాదాల నుండి జాలు వారే నీళ్ళు రాజా తల మీద, వాడి వంటి నిండా రాయసాగింది. ఆడ వాళ్ళిద్దరి కళ్ళ నుండీ అవిశ్రాంతం గా నీరు స్రవిస్తూనే వుంది. ఏమిటిది ? సంతోష పడాల్సిన సమయం కదా ? అనుకుంటూ, నేను కూడా తడి అవుతున్న నా కళ్ళ తో వాళ్ళని పరికిస్తున్నాను. 
ఈ తతంగం అయ్యాక రెండు కుర్చీలు వేశాడు రాజా. వెళ్లి తండ్రిని టేబుల్ దగ్గర నుండి తీసుకు వచ్చి, తల్లినీ కూడా ఆ కుర్చీల్లో కూర్చోబెట్టాడు. బ్యాగ్ లోంచి మరో నోట్ల కట్ట , పూవులు, పళ్ళూ, బకెట్ లో పన్నీరు జల్లి తండ్రి చేతుల్లో పువ్వులూ పళ్ళూ నోట్ల కట్ట పెట్టి, వాళ్ళిద్దరి కాళ్ళూ బకెట్ లో పెట్టి తన రెండు అరచేతులతో వాళ్ళిద్దరి కాళ్ళూ తడిమి తడిమి కడుగుతూ వారి పాదాల నుండి వెలువడే నీళ్ళు తన తల మీద రాసుకుంటూ – “ మీరే నాకు దేముళ్ళూ దేవతలూ మీరు లేకపోతే నేను ఇవ్వాళ లక్ష రూపాయల ఇంజినీర్ ని ఎలా అవుతాను ? అమ్మా నాన్నా జన్మజన్మలకూ మే ఋణం తీర్చుకోలేను – ” అంటూన్న రాజా కు ఈ సారి అతని కాళ్ళ వెంట నీరు స్రవించ సాగింది. తల్లీ తండ్రీ వాడి తల మీద నీళ్ళు అరచేతులతో రాస్తూ—తమ హృదయాలకు వాడి తలని హత్తుకుంటూ – మా ముద్దుల రాజా, గారాల కన్నా నువ్వు కోట్లు సంపాదించాలి రా, ఎన్నో భవంతులు కట్టాలి రా, మమ్మల్ని పెద్ద పెద్ద కార్ల లో తిప్పాలి రా, నీకు వివాహం అయ్యేక ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టాలి. వాళ్ళిద్దరూ ఒకరు డాక్టర్, మరొకరు ఇంజినీర్ చదవాలి. మన కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తేవాలి. చిరంజీవ !! చిరంజీవ !! అంటూ ముగ్గురూ పిచ్చి వాళ్ళలా ఏవేవో మాట్లాడేస్తున్నారు. రాజా  తన తలను తల్లీ తండ్రీ కాళ్ళ మధ్యన పెట్టుకుని తన రెండు చేతులతో వాళ్ళిద్దరినీ కలిపి గట్టి గా తన కేసి అదుము కుంటున్నాడు. తల మీద, బుగ్గల మీద కోట్లాది ముద్దులు ఆవిష్కరిస్తున్నారు తల్లీ తండ్రీ రాజా కు. 
తల్లీ తండ్రీ మనిషి జీవితం లో దేముని కన్నా ముఖ్యమైన వారని అంటారు. ఎందుకంటే తల్లి మాత్రమె సంతానానికి ముందు తమ తండ్రి ని చూపిస్తుంది. తరువాత ఊహ వచ్చేక దేముణ్ణి చూపిస్తుంది. లేకపోతే దేముడేవరో సంతానానికి తెలిసే అవకాశం లేదు గదా ! అందుకే అమ్మా నాన్నా అమృతం తాగిన వాళ్ళు అన్నారు కవులందరూ. ఈ దేవుళ్ళ పాద పూజ దృశ్యం అసమానం, అనన్య సామాన్యం. ఆ పందిరి లో ఉన్న వారందరూ కనులార్పకుండా చూస్తున్నారు ఈ దృశ్యాన్ని – ఈ దృశ్యం చలన చిత్రం లో గాని  చిత్రీకరిస్తే ఆస్కార్ అవార్డు రావడం ఖాయం.! ఈ దృశ్యం వర్ణించడానికి నాకు కలం ముందుకు కదలడం లేదు అమిత ఆనందం తో –
చివరగా జేబు లోంచి ఒక ప్యాకెట్ తీసి తల్లి కి ఇస్తూ రాజా –
“ అమ్మా – ఇది ఒక స్మార్ట్ ఫోన్ టీ.వి తో సమానం. ఇందులో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో మాట్లాడవచ్చు. నన్ను చూడోచ్చును—” అంటూ వుంటే “ నా చిట్టి కన్నా – ఎంత మంచోడివి రా నీకు తెలివితేటలతో పాడు మనుషులంటే ఎంత అభిమానం రా నీకు. నా ముద్దుల తండ్రీ వేయేళ్ళు చల్లగా ఉండరా – ” అంటోంది కనుల వెంట నీరు వర్షిస్తూ ఉండగానే.
ఇంతకు ముందు కన్నమ్మ కు పాదాభిషేకం కన్నా నాకు ఈ దృశ్యం నా గుండెల ను కలచివేసింది. మధ్య తరగతి బ్రతుకులలో సంతానానికి తల్లితండ్రులంటే పెద్ద చదువులు చదివే వరకూ వున్న ప్రేమాభిమానాలు బలీయమైన అనుబంధం, పెద్ద ఉద్యోగం, స్థాయి వచ్చేక, సిరిసంపదలు జీవితాల్లో ప్రవేశించేక ఎందుకు మ్రుగ్యమైపోతున్నాయో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థాయి కి ఎదిగిన వీరిని చూసేక –
ఇంతవరకూ జరిగిన తతంగమంతా అప్పుడప్పుడు అక్కడకు వస్తూన్న రాజా స్నేహితులూ, కాన్వెంట్ లో, కాలేజీ లో పెద్దలూ, కన్నార్పకుండా చూస్తూనే వున్నారు చలన చిత్రం లా. ఇదోక వింత లా వుంది వారికి. ఇచ్చి పుచ్చుకోవడం, ఇచ్చినవారికి కృతజ్ఞతలు తెలుపడం, ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలనుకోవడం, ఇత్యాది కనీస్ ధర్మాలు -- సంస్కారాలు – కనుమరుగున పడి పోతున్న ఈ కలికాలం లో. ఈ కమనీయ దృశ్యాలు కొంత మందికి పిచ్చి చేష్టలు గా గోచరించినా – మనసున్న వారికి ఉన్నత సంస్కారం గల వారికి అపురూపమైన సంఘటనలే. ఇంతలో కాలేజీ ప్రిన్సిపాల్ గారు “ రాజా – ” అని పిలిచారు. రాజా వెంటనే “ సర్ తమరు ఇక్కడే వున్నారా, మన్నించండి మిమ్మల్ని చూడనేలేదు ” అంటూ వెంటనే ఆయన పాదాలకు ప్రణమిల్లాడు రాజా, వెంటనే ఆయన రాజా తండ్రి తో –
“ గోవిందయ్య గారూ మా కాలేజీ లో చదువుకుని ఇంతటి అత్యున్నత స్థాయి కి వచ్చిన మా విద్యార్థి రాజా కు మేము వేదాశీర్వచనం చేయించాలను కుంటున్నాం – రాజా ఇంతటి తో సరిపెట్టుకోకుండా కోటి రూపాయల జీతాన్ని కూడా తెచ్చుకోవాలి. రాజా ఇటు కూర్చో – ” అని రాజా ను తనకు దగ్గర గా ఆప్యాయంగా లాక్కుని నుదుట ముద్దు పెట్టి, తూరుపు వేపుగా కుర్చీ వేసి పసుపూ – కుంకుమా – పూలూ – అక్షతలూ – వున్న పళ్ళెం వారి  కూడా తీసుకువచ్చిన ఇద్దరు వేదపండితుల కు ఇచ్చి ఆశీర్వచనం చేయమన్నారు.
అప్పుడు వేద పండితులు – “ యా వైతాం బ్రహ్మణో వేదా – ” అంటూ వేదం మంత్రాలతో మహాదాశీర్వచనం ప్రారంభించారు. ఆ ప్రాంత మంతా కృష్ణమ్మ తల్లి మీదుగా వీస్తున్న చిరుగాలులతో కలిసి వేద పరిమళాలు వెదజల్లుతూంటే – చెవులకు వేదనాదాలు వినిపిస్తోంటే అందరి మనసుల్లోనూ రాజా సంస్కార పరిణితి ప్రవర్తన గోచరిస్తున్నాయి ఘనం గా. “ శతమానం భవతి శాతాయుహ్ పురుశశ్శతెంద్రియ ఆయుశ్యేవేంద్రియ ప్రతితిష్టతి – ” అంటూ వేదశీర్వచనం ముగియ గానే, రాజా వేద పండితుల చేతుల్లో దక్షిణ తాంబూలాలు పెట్టి వారి పాదాలకు సాష్టాంగప్రణామాలు అర్పించాడు. “ దీర్ఘాయుష్మాన్ భవ ! శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు ! పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు – ” అంటూ దీవించారు రాజాని. లక్ష రూపాయల జీత గాడు రాజా వేద పండితుల పాదాల మోకరిల్లి ఆశీర్వచనాలు తెసుకుంటూ వుంటే, సంస్కార బాణాలను సంధిస్తూ వంగిన విల్లు లా అందం గా కమనీయం గా గోచరిస్తున్నాడు రాజా అక్కడ వున్న వారందరికీ. – 
రాజా తన తల్లి తండ్రులకూ, అమ్మమ్మకూ, తనకు తన ప్రగతి పధ ప్రయాణం లో సహకరించిన వారందరికీ నీరాజనాలు సమర్పించినట్లు గా తోచింది నాకు. అవును ! మనిషి కి కృతజ్ఞతలు సమర్పించుకోవడానికి ఇదొక మార్గం కదూ!
తరువాత కాన్వెంట్ లో ఉపాధ్యాయులూ, అతని మిత్రులూ, శ్రేయోభిలాషులూ, కాంటీన్ ఖాతా దారులూ, రాజాను బొకేలతో, శాలువాల తోను కానుకలతోను అభినందించి అతని పై పూల వర్షం కురిపించి వెళ్ళిపోయారు. చివరగా నేను కూడా వెళ్లి రాజాను హ్రుదయాలింగానం చేసుకున్నాను.
అప్పుడు రాజా తన తల్లి తండ్రు లతో – “ మీరు ఇంకో సంవత్సరం మాత్రమె ఇక్కడ వుండేది. నేను హైదరాబాద్ లో పెద్ద అపార్ట్ మెంట్ తీసుకుంటాను. మీరు అక్కడకి వచ్చేసి ఏమీ శ్రమ పడకుండా హాయిగా కూర్చోవాలి తెలిసిందా ? 
అంటూ వుంటే – రాజా తల్లి వాడిని మరలా తన గుండెలకు హత్తుకుని –
“ కృష్ణమ్మ తల్లి ని వదిలిపెట్టి మేము హైదరాబాద్ రావడమే ! అమ్మో ! ఆయినా అప్పుడు ఆలోచించుదాం లే ! ” అన్నది. అప్పుడు వాళ్ళు కొడుకు కూడా వెళతారా? కాలమే పరిష్కరిస్తుంది.
 ***  


No comments:

Post a Comment

Pages