శ్రీధరమాధురి - 63 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 63

Share This
శ్రీధరమాధురి - 63
(పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)

గురువు యొక్క స్థానంలో ఉండటం అంత సులభమేమీ కాదు. శిష్యులు చేసే దోషాలన్నీటి బాధ్యతను గురువు స్వీకరించ వలసి ఉంటుంది.
వివరంగా చెప్పాలంటే ఆదిశంకరులు దైవాన్ని స్తుతిస్తూ తనకు సంసార బంధాల నుంచి విముక్తి కలిగించే వలసిందిగా అర్థించారు. సన్యాసి అయిన ఆది శంకరుల వారికి సంసారం ఎక్కడ ఉంది? వేదాలు ఇలా అంటున్నాయి:
   
రాజ రాజ్య కృతం పాపం రాజ పాపం పురోహితం|
భర్తా స్త్రీ కృతం పాపం శిష్య పాపం గురుం వ్రజేత్||
  
ప్రజలు చేసే పాపాలన్నీ రాజుకు చెందుతాయి ,రాజు పాపాలన్నీ అతని పురోహితుడికి చెందుతాయి. ఒక పురుషుడు తన భార్య చేసిన పాపాలన్నింటినీ స్వీకరిస్తాడు.
శిష్యులు చేసే పాపాల భారమంతా గురువు పై పడుతుంది. కానీ శిష్యులు చేసే మంచి పనుల ఫలితం మాత్రం వారికే చెందుతుందని గుర్తుపెట్టుకోండి. అందుకే శంకరులకు స్వయంగా సంసారం లేకపోయినా కూడా, తనకున్న అనేకమంది శిష్యుల యొక్క పాపాల నుండి ఆయన విముక్తి పొంద వలసి ఉంది. గురువు యొక్క స్థానం ఎంతటి బాధ్యతాయుతమైనదో ఇప్పుడు మీకు అర్ధమయి ఉంటుంది. కేవలం
సన్యాసిగా ఉండేందుకు ఒకరు నిర్ణయించుకో గానే మోక్షం లభించదు. కానీ శిష్యుల యొక్క పాపాలు గురువు స్వీకరిస్తారు గనుక, శిష్యులకు మోక్షం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

జీవితంలో విజయాన్ని సాధించాలంటే ఒకరు తమ స్వీకరించిన వ్యవస్థ పట్ల అంకిత భావంతో ఉండాలి. తనకు అనుకూలంగా అన్నీ మార్చుకోవడం అనేది ఎక్కడికి చేర్చదు. ఆధ్యాత్మికత అనేది ఒక వ్యాపకం కాదు లేక కాలక్షేపం కాదు. అదొక జీవన మార్గం. నేను కొందరిని కొన్ని శ్లోకాలు చదవమని అన్నప్పుడు
, అవన్నీ రిటైర్ అయిన వాళ్ల కోసం అని అతను సమాధానం ఇచ్చాడు. ఇది నిజానికి ఒక దురభిప్రాయం. ప్రతి శరీరధారి (దేహాన్ని ధరించిన వారు) ఆ దేహాన్ని సక్రమంగా వాడుకుని, మోక్షాన్ని సాధించవలసిన అవసరం విధాయకంగా ఉంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి జీవితపు దశలన్నీ మోక్షాన్ని సాధించేందుకు ఒకరు చేపట్టవలసిన సాధనకు తగిన అర్హతను సమానంగా కలవే.
మోహక్షయమే( మోహం, ఆకర్షణ నశించిపోవడం) మోక్షం యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి మీరు 'మోహాన్ని' తొలగించుకోగలిగితే 'మోక్షాన్ని' పొందుతారు.

ఆధ్యాత్మిక సాధనలోని రహస్యాలను తెలుసుకొని వాటిని ఆచరించి ప్రయోజనం పొందాలని ఎంతో మంది విదేశీయులు భారతదేశానికి వస్తూ ఉంటారు. వారు అంకితభావంతో కృషి చేస్తూ ఉంటారు. మనం కూడా విదేశాలకు వెళ్లి ఎన్నో నేర్చుకోవాలని అనుకుంటాం కానీ సగం పరిజ్ఞానంతో తిరిగి వస్తాము. మీ లక్ష్యాన్ని సాధించే మార్గంలో మనసు పెట్టి ఎలా పనిచేయాలో మనం వాళ్ళని చూసి నేర్చుకోకూడదా? లేక వారి వేషాన్ని సంస్కృతిని అనుసరించడంతోనే మనం సరిపెట్టుకోవాలా? విదేశీ వేషధారణను, వారి జీవన విధానాన్ని ఎలా అనుకరించాలో మన పిల్లలకు చూపిస్తూ మనమే వాళ్ళను పాడు చేస్తాం. పిల్లల ముందు బాహాటంగా దెబ్బలాడుకుంటూ మనం వాళ్ళని పాడు చేస్తాం. వాళ్ల కళ్ళ ఎదుటే కలహాలు పెట్టుకోవడం లో బిజీగా ఉంటూ, పిల్లల పట్ల మన బాధ్యతను కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం. 
ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా, మనం పూజారుల యొక్క ఎత్తుల నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ, దైవం గురించి చాలా తక్కువగా భావన చేస్తాము.
'మీ ఆలోచనల్లో ఆచరణలో స్వచ్ఛత లేనప్పుడు పూజ చేసి మాత్రం ఏం ప్రయోజనం?' అనేకమంది ఆయనను అనేక పేర్లతో పిలిచినా కూడా, దైవం ఒక్కరే అన్న విషయాన్ని మరచి కొందరు, ' ఏ దైవాన్ని కొలవాలి' అంటూ, దైవారాధన గురించిన అనవసరమైన ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంటారు.
మీరు పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో చేయండి. కేవలం మీ కోసమే కాకుండా మానవాళి కోసం, సమస్త విశ్వం కోసం ప్రార్థించండి.
"లోకా సమస్తా సుఖినోభవంతు."

No comments:

Post a Comment

Pages