నటయోగి మారుతీసేవేంద్ర సరస్వతి అని పిలువబడే శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి - అచ్చంగా తెలుగు

నటయోగి మారుతీసేవేంద్ర సరస్వతి అని పిలువబడే శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి

Share This
నటయోగి మారుతీసేవేంద్ర సరస్వతి అని పిలువబడే శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి
పోడూరి శ్రీనివాసరావు 

కొన్నిపాత్రలు కొందరికోసమే పుట్టాయా అనిపిస్తాయి. నటులలో నాటకరంగంలో ప్రసిద్ధికెక్కి, అటు పిమ్మట సినీరంగంలో కాలూని,విఖ్యాతిగాంచిన నట పరంపర,గతతరం నటులకు ఆనవాయితీ; నందమూరి తారకరామారావుగానీ,అక్కినేని నాగేశ్వరరావుగానీ  ,యస్వీ రంగారావు గానీ,గుమ్మడి వెంకటేశ్వరావు గానీ, రేలంగి వెంకట్రామయ్య గానీ,నాగభూషణం గానీ, ధూళిపాళ గానీ, మిక్కిలినేని ముక్కామల, కృష్ణమూర్తి, సావిత్రి, అంజలి....ఇలా చెప్పుకుంటూ పోతే .... ఆ తరం నటులంతా, నాటకాల్లో నటించి, అనంతరం చిత్రసీమ వైపు చూసేవారు. అందుకే వారి నటనలో... ఆంగికం,వాచకం,నటన,అన్నీ సహజంగా ఉండేది.
చలనచిత్రసీమ,చిత్రీకరణలో,పొరపాటు జరిగినా,మళ్లీ షూటింగ్ జరుపుకోవచ్చు... మార్పులు, కూర్పులు,చేర్పులు చేర్చుకోవచ్చు. కానీ నాటక ప్రదర్శనలో అటువంటి తప్పిదాలకు తావులేదు. ఎందుకంటే అది ప్రత్యక్ష ప్రసారం. తప్పు జరగడానికి కానీ,నాలిక్కరుచుకుని ‘సారీ’ చెప్పడానికి గానీ అవకాశం ఉండదు. స్క్రిప్ట్ పూర్తిగా వస్తేనే గానీ, నాటకం రక్తి కట్టదు. టైమింగ్ తెలియాలి,సన్నివేశ పరంపర తెలియాలి, ఎదుటిపాత్ర డైలాగులూ తెలియాలి (తన డైలాగులు ఎలాగూ తెలియాలనుకోండి) అన్నీ సమపాళ్లలో మేళవిస్తేనే నాటకం రక్తి కట్టేది. పైగా డైలాగులన్నీ ఏకబిగిని, పూర్తిగా వచ్చి ఉండాలి.
అలా నాటకరంగాన్ని ఏలి,సినీరంగంలో ప్రవేశించిన,ధరించిన పాత్రల ద్వారా, ఈ పాత్ర ఈయన కోసమే పుట్టిందా అని పేరు తెచ్చుకునేలా, ఆ పాత్రలో జీవించి,తన నట జీవితాన్నే అజరామరం చేసుకున్నా అతికొద్ది మందిలో శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి ఒకరు – ఆ పాత్ర శ్రీ యన్టీఆర్ నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీ కృష్ణపాండవీయంలో ‘శకుని’పాత్ర. ఆ తర్వాత బాలభారతం,దానవీరశూరకర్ణ చిత్రాల్లో సైతం శ్రీ ధూళిపాళ శకుని పాత్రనే పోషించారు.
శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రిగారు సెప్టెంబరు 24 వతేదీ,1921న గురజాల తాలూకా దాచేపల్లి గ్రామంలో రత్నమ్మ,శంకరయ్య దంపతులకు జన్మించారు. వీరికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరుతోబుట్టువులు. దాచేపల్లి గ్రామంలో వీరి ఇంటివెనుక నాగులేరు ప్రవహిస్తూ ఉండేది. పండ్లతోటలు,తమలపాకుల తోటలతో ఆ గ్రామం కళకళ లాడుతూ ఉండేది. తండ్రి శ్రీ శంకరయ్యగారు, వేదాధ్యయనం చేసినా, యాభై ఎకరాల పొలంతో, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎంచుకుని, రైతుగా స్థిరపడ్డారు. అంత పొలం ఉన్నా మెట్టప్రాంతం కావడంతో వచ్చే ఫలసాయం ఇంటి ఖర్చులకే సరిపోయేది.
శాస్త్రి ప్రాథమిక విద్య దాచేపల్లిలోనే పూర్తి చేశారు. తర్వాత వేదాధ్యయనం కోసం,బాపట్ల వెళ్లి శాస్త్ర పాఠాలు అభ్యసించారు. అనంతరం గురజాల తిరిగివచ్చి, ఒక న్యాయవాది వద్ద,గుమాస్తాగా చేరారు. తను కూడా వకీలుగా రాణించాలనే ఆశవున్నా అది నెరవేర లేదు. గుమాస్తాగా పనిచేస్తూనే, ఇంగ్లీషు భాషపై పట్టు సాధించారు. సంగీతం మీద నాటక కళల మీద మక్కువ ఉండడంతో, గుంటూరుకు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో 1935లో ‘శ్రీ కృష్ణతులాభారం’ నాటక ప్రదర్శన జరుగుతుండగా, అందులో సత్యభామ చెలికత్తే (నళిని) వేషం ధరించారు.అపుడు ధూళిపాళ వయసు 15 ఏళ్ళు. తరువాత వరుసగా ధూళిపాళకు ఆడవేషాలు ధరించే పాత్రలు చాలా వచ్చాయి. అలా మరో మూడేళ్లపాటు ఆడపాత్రలే పోషిస్తూ వచ్చారు. వాటిలో చింతామణి నాటకంలో రాధ, బొబ్బిలియుద్ధం నాటకంలో మల్లమాంబ పాత్రలు ధూళిపాళకు మంచిపేరు తెచ్చి పెట్టాయి. ఒకసారి ప్రముఖ రంగస్థల నటులు శ్రీ మాధవ పెద్ది వెంకట్రామయ్య – ధూళిపాళ నటన చూసి, ఆడవేషాలకు స్వస్తి పలకమని హితవు చెప్పారు. దాంతో ధూళిపాళ మాధవపెద్ది వద్ద శిష్యరికం చేశారు. వెంకట్రామయ్యగారి శిక్షణలో దుర్యోధన పాత్ర పోషించడంలో మెలకువలు నేర్చుకుని, అఖిలాంధ్ర పాండవోద్యోగా నాటక పోటీల్లో ప్రథమ బహుమతి పొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్ నాటక కళాపరిషత్ నిర్వహించిన ఏక పాత్రాభినయ పోటీల్లో మాయసభ సన్నివేశంలో దుర్యోధనుడిగా నటించి,ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.
ఆ తర్వాత బ్రహ్మనాయుడు,యుగంధరుడు,బిల్వమంగళుడు,రంగరాయుడు మొదలైన పాత్రలు పోషించి, మంచి రంగస్థల నటునిగా పేరు తెచ్చుకున్నారు. గుంటూరులో ‘స్టార్ థియేటర్స్’పేరుతో నాటక సంస్థను నెలకొల్పి అనేక పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఆ రోజుల్లో కురుక్షేత్రం నాటక ప్రదర్శన జరిగితే – మొదటి కృష్ణునిగా ఈలపాట రఘురామయ్య, రెండవ కృష్ణునిగా పీసపాటి నరసింహమూర్తి మూడవ కృష్ణునిగా షణ్ముఖ ఆంజనేయరాజు నటిస్తే, దుర్యోధనపాత్రను ధూళిపాళ పోషించారు.
1959లో మద్రాసు నగరంలోని పచ్చియప్ప కళాశాలలో  ‘రోషనార’ నాటకం ప్రదర్శించారు. అందులో రామసింహుడిగా పోషించారు. ఈ నాటకానికి ప్రసిద్ధ దర్శక నిర్మాత బి.ఎ.సుబ్బారావు, ధూళిపాళ సంభాషణలు పలికే తీరును నిశితంగా గమనించారు. ప్రేక్షకుల నుంచి, ధూళిపాళ సంభాషణలకు కరతాళ ధ్వనులు మ్రోగడం అతనికి లాభించింది. దాంతో ధూళిపాళ సినిమా రంగప్రవేశానికి దారులు తెరుచుకున్నాయి. బి.ఎ.సుబ్బారావు సినిమాలో నటించే అవకాశం కల్లిపిస్తానని మాట ఇచ్చారు. అయితే ధూళిపాళకు నాటకాల మీద ఉన్న మోజు సినిమాల మీద లేదు. ఆయన పెద్దగా సినిమాలు చూసింది లేదు.
ఒకరోజు మద్రాసుకు రమ్మనమని, బి.ఎ.ఎస్.ప్రొడక్షన్ అధిపతి బి.ఎ.సుబ్బారావుగారి వద్ద నుంచి ధూళిపాళకు ఉత్తరం వచ్చింది. ఆయన పెద్దన్నయ్య ప్రోద్భలంతో ధూళిపాళ తెనాలి వెళ్లి చెన్నై రైలెక్కారు. బి.ఎ.సుబ్బారావు ‘బీష్మ’చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది 1962వ సంవత్సరం ‘బీష్మ’చిత్రంలో దుర్యోధనుడి పాత్రకు ధూళిపాళను ఎంపికచేసుకున్నారు. తొలిరోజు షూటింగులో భీష్ముణ్ణి సర్వ సైన్యాధ్యక్షుడిగా దుర్యోధనుడు ప్రకటించే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఎదురుగా భీష్మునివేషంలో ఉన్న నటరత్న ఎన్.టి.రామారావుకు దర్శక నిర్మాత సుబ్బారావు పరిచయం చేయగా, రామారావు ధూళిపాళను మందహాసంతో స్వాగతించారు. తాపీ ధర్మారావు వ్రాయగా ధూళిపాళ చెప్పిన డైలాగ్ తొలిషాట్ లోనే ఓకే అయింది. అలా రామారావుతో కలిగిన పరిచయం,స్నేహంగా చిగురించి,చిత్రసీమను వదిలేదాకా కొనసాగింది. భీష్మ చిత్రం విడుదలయి, ఘనవిజయం సాధించడంతో ధూళిపాళకు అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి.
“నటుడనే వాడు, తనని తాను మరచిపోకుండా,తాత్కాలికోద్రేకంతో,సృజనాత్మక శక్తి కలిగినపుడు మాత్రమే తన భావ ప్రకటన ద్వారా రసోత్పత్తిని కలిగించ గలుగుతాడు” అనే సూత్రాన్ని తు.చ.తప్పకుండా పాటించిన నటుడు ధూళిపాళ్ల. అందుకు ప్రేరణ 1966లో రామకృష్ణ ఎన్.టి.ఆర్.పతాకం మీద రామారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీ కృష్ణపాండవీయం’చిత్రంలో ధూళిపాళ నటన. ఈ చిత్రం ద్వారా భిన్న ప్రవృత్తులు గల శ్రీ కృష్ణ,సుయోధన పాత్రలను తానే ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు రామారావు. భారత,భాగవత కథలను జల్లెడ పట్టి,మరే సినిమాలోనూ చూపించని విధంగా శకుని జీవిత ఘట్టాలను ఇందులో పొందుపరిచారు. ఇక శకుని పాత్ర ఎవరు ధరిస్తారా అనే మీమాంసకు తెరదించుతూ, ఆ అవకాశాన్ని రామారావు ధూళిపాళకు ఇచ్చారు. అది ద్విభాషాచిత్రం కావడంతో తెలుగు,తమిళ భాషల్లో కూడా ధూళిపాళనే ఆ పాత్ర పోషించాల్సి ఉంటుందని సూచించారు.అంతకు ముందు శకునిపాత్రను సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,ముదిగొండ లింగమూర్తి,నెల్లూరినగ రాజారావు పోషించి, మెప్పించి ఉన్నారు. ఆ పాత్రను ధూళిపాళ ఛాలెంజ్ గా తీసుకుని, వాచకంలోనూ అభినయంలోనూ, భిన్న ప్రవృత్తిని కనపరుస్తూ సాధన చేశారు. సినిమాలో శకుని పాత్ర బాబా పండింది. సినిమా సూపర్ హిట్ కావడంతో, ధూళిపాళ సినీ ‘శకునిమామ’ అయిపోయారు. తరువాత ‘బాలభారతం(1972), దానవీరశూరకర్ణ(1977)సినిమాల్లో శకుని పాత్ర ధూళిపాళనే వరించింది.
‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో గయుడిగా, ‘నర్తనశాల’లో దుర్యోధనుడిగా,’బొబ్బిలియుద్ధం’లో నరసరాయుడిగా,’వీరాభిమన్యు’లో ధర్మరాజుగా, ‘సీతాకళ్యాణం’లో వశిష్టుడుగా, మరికొన్ని సినిమాల్లో రావణాసురుడు, మైరావణుడుగా ధూళిపాళ నటించి మెప్పించారు. ధూళిపాళ బయట ఎక్కడైనా కనబడితే ‘శకునిమామ’అని పిలిచేవారు. అలా ధూళిపాళ రెండు దశాబ్దాల పాటు, పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాల్లో మంచి పాత్రలూ, దుష్టపాత్రలూ కూడా పోషించారు. దుష్టపాత్రల్లో ఎలా రాణించారో, సాత్విక పాత్రల్లో కూడా అంతా గొప్పగా నటించి మెప్పించారు.
బాంధవ్యాలు (1968), ఆత్మీయులు (1969), బాలరాజు కథ (1970), రెండు కుటుంబాల కథ (1970), కలెక్టర్ జానకి (1972) (జానకి తండ్రి), మంచి మనుషులు (1974), గుణవంతుడు (1975), ఉండమ్మా బొట్టు పెడతా…మహామంత్రి తిమ్మరుసు కథానాయకుడు, ఆత్మగౌరవం వంటి 300 సినిమాల్లో ధూళిపాళ నటించి ప్రేక్షకుల మన్నన పొందారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమీ వారు ధూళిపాళను ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు. తెలుగు యూనివర్సిటీవారు ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేశారు.’బాంధవ్యాలు’ చిత్రంలోని నటనకు ధూళిపాళకు నంది పురస్కారం లభించింది. తమిళపత్రికల్లు కూడా ధూళిపాళను ‘నడిప్పిళ్ పులి నడత్తల్ పశువు’ అని కీర్తించాయి అంటే నటనలో పులి,నడతలో గోవు అని అర్ధం.
నిర్మాతల కోరికపై ధూళిపాళచివరిసారి మురారి, చూడాలని ఉంది సినిమాల్లో నటించారు. ధూళిపాళకు చిన్నతనంలోనే వరలక్ష్మమ్మతో వివాహమయింది. వీరికి ఒక కుమార్తె,ఇద్దరు కుమారులు ఉన్నారు.
నాటకాలు వేసేవాళ్ళు చెడిపోతార్రా – అని ధూళిపాళను వారి తండ్రిగారు హెచ్చరిస్తూ ఉండేవారు. కారణమేమిటంటే – నాటకాల్లో వేషాలు వేసేవారు,వ్యసనాలకు బానిసలు కావడమే. తండ్రి చేసిన హెచ్చరికలు ధూళిపాళకు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉండేవి. ఆ హెచ్చరికలను వారు జీవితాంతం గుర్తుపెట్టుకు మసిలారు. మద్రాసులో షూటింగ్ జరిగితే, ఇంటినుంచే భోజనం క్యారేజ్ వచ్చేది. అవుట్ డోర్ షూటింగ్ లో తప్ప నిర్మాతలు తెప్పించిన భోజనం ఆరగించిన రోజులు ధూళిపాళచరిత్రలో లేవు. నిత్యకర్మ, ధూపదీపనైవేధ్యాలు ధూళిపాళకు క్రమశిక్షణ నేర్పాయి. ప్రతీ సంవత్సరమూ సతీసమేతంగా వారణాసి వెళ్లి రెండు మూడు నెలలపాటు అక్కడే వుండి కాశీ విశ్వేశ్వరుని సేవించేవారు. అక్కడ నవగ్రహ ఆలయంలేకపోవడంతో, ఆలయానిర్మాణం చేయాలని ప్రయత్నించి అనారోగ్య కారణాల వల్ల ఆ ప్రయాత్నాన్ని విరమించుకున్నారు.
గుంటూరులో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించే అవకాశాలు వదులుకొని మద్రాసులో ఉన్న ఆస్తులు అమ్ముకుని, గుంటూరు చెరీ అత్యంత దీక్షతో మారుతీనగర్ లో ఆంజనేయస్వామి ఆలయానిర్మాణాన్ని చేపట్టి పూర్తిచేశారు. దాంతో ధూళిపాళమనసు అధ్యాత్మిక మార్గంలోకి మళ్లించి తను నిర్మించిన ఆలయాన్ని కంచి కామకోటి పీఠానికి సమర్పించారు. 
మానవజన్మ విశిష్టతను, మోక్షసాధన అవసరాన్ని తెలుసుకొని, తరించాలని భావించి, కంచి కామ కోటి పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల చేతులమీదుగా సన్యాసం స్వీకరించారు. తన పేరును ‘మారుతీసేవేంద్ర సరస్వతి’గా మార్చుకున్నారు.రామాయణం,సుందరకాండ గ్రంథాలను తెలుగులో వ్రాసి ప్రచురించారు. ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, తద్వారా ఆద్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సుదూరప్రాంతాలకు వెళ్లి సుందరకాండ పారాయణం చేసి, భక్తులను ఆశీర్వదించే వారు.
గుంటూరులో ఒక కళావేదిక నిర్మించాలనే సత్సంకల్పంతో మూడు తరాల నటులతో నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి, నిధిని ప్రోగుచేసి, కళాసేవకు తోడ్పడ్డారు. ఆ రంగస్థలం పైనే రెండు లక్షలనిధి సమకూరడం ధూళిపాళ మీద ప్రజలకు ఉండే గౌరవాన్ని సూచిస్తుంది. మానవశక్తిని బలీయమైన అతీంద్రియ శక్తి ఏదో నడిపిస్తుందని ధూళిపాళ నమ్మకం.
కొంతకాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ, ఏప్రిల్ 13,2007 నా ధూళిపాళ కాలం చేశారు.
నటనారంగంలో తాను ఎంచుకున్న పాత్రలను నభూతోనభవిష్యతి అన్నరీతిలో పోషించి, ఆధ్యాత్మికమార్గం వైపు తన గమనాన్ని మార్చుకొని మారుతీసేవేంద్రసరస్వతి నామధేయంతో మారుతీసేవలో గుంటూరులో తాను నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో కాలం గడిపి భక్తులకు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లిన శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి ధన్యజీవి. నటప్రస్థానం మలుపులు తిరిగి యోగిగా రూపాంతరం చెంది కైవల్యపథం చేరుకున్న మహానటయోగి శ్రీ ధూళిపాళ.
(ప్రాణమిత్రుడు సాహితీవేత్త శ్రీ ఆచారం షణ్ముఖాచారికి ప్రత్యేక కృతజ్ణతలతో ........... డా.పోడూరి శ్రీనివాసరావు)

No comments:

Post a Comment

Pages