ఆదర్శ గుణ శీలుడు శ్రీ రాముడు - అచ్చంగా తెలుగు

ఆదర్శ గుణ శీలుడు శ్రీ రాముడు

Share This
ఆదర్శ గుణ శీలుడు శ్రీ రాముడు
-సుజాత. పి .వి. ఎల్



ఆదర్శ గుణాలన్నీ ఒకే చోట రాశిగా పోసి చూస్తే మనకు కనిపించే ఏకైక దేవుడు రాముడు. ఒకే మాట , ఒకే భార్య రాముని సౌశీల్యతను తెలుపుతాయి. త్రేతాయుగంలో వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు,పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దశరథ మహారాజు కుమారునిగా కౌసల్యాదేవి గర్భాన శ్రీ రాముడు జన్మించాడు. పద్నాలుగేళ్ళ అరణ్యవాసం చేసొచ్చిన తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరగడం విశేషం. అలాగే సీతారాముల కళ్యాణం కూడా నవమి రోజే జరిగింది. అప్పటినుండి ప్రతి ఏటా రామ కళ్యాణం జరుపుకుంటున్నాం.

ఈ చైత్ర శుద్ధ నవమి ఏంతో విశిష్టమైనది, పవిత్రమైనది కూడా. ఎందుకంటే శ్రీరామ చంద్రుని కల్యాణ మహోత్సవం, రావణాసురుడ్ని వధించి సీతా సమేతుడై దిగ్విజయంగా అయోధ్యకు తిరిగి వచ్చింది ఈ నవమి రోజే కనుక. అందుకే శ్రీరామ పట్టాభిషేకం, మరియు రామ కళ్యాణం నవమి నాడే జరిపించడం అనాదిగా వస్తోంది.

 'రామ' నామానికి ప్రత్యేక విశిష్టత కలదు. 'రామ' లో ర, ఆ, మ, లు కలసిన శబ్దం పలుకుతుంది.
'ర' అక్షరము రుద్రుడ్ని
'అ' అక్షరము బ్రహ్మ ను
'మ' అక్షరము విష్ణువును సంభోదిస్తోంది.

 'రామ' అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పలికినంతనే త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది. రామ అన్న శబ్దం జీవాత్మ, పరమాత్మ స్వరూపాలే. 'రామ'నామములో 'రా' అని పలికినప్పుడు ఆ శబ్దంలోంచి ఎన్నో జన్మాల పాపాలు బయటకి వెళ్లిపోతాయి. 'రా' అని పలికి చూడండి పెదవులు విడిపోతాయి. ఆ వెంటనే ' మ'అని ఉచ్ఛరించటంతో బహిర్గత పాపాలు మనలోకి ప్రవేశింపజేయనీయకుండా పెదవులు మూసేస్తాయి. అందుకే 'మ' అని పలకగానే పెదవులు కలిసిపోతాయి.

శ్రీ రామ కల్యాణాన్ని కనులారా చూడ్డం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. పూర్వ జన్మ సుకృతం. కళకళలాడే కల్యాణ వేదికలు , తాటాకు పందిళ్లు , మామిడి తోరణాలు ,మేళ తాళాలు. పానకం , వడపప్పు , పొంగలి, బొబట్లు, గారెలు, బూరెలు, కుడుములు, పులిహోర,పాయసాలు. అందరి ఇంటా పెళ్లి కళ తెచ్చిపెట్టే పండుగ శ్రీ రామ నవమి. ఈ ఎర్రటి ఎండలకు చల్లటి బెల్లం పానకం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

శ్రీరామవావతారంలోని అంతరార్థాన్ని రాముడి జీవిత పరమార్థాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటమే నిజమైన 'శ్రీరామనవమి '.ఎందుకంటే మన అందాల రాముడు సకల సుగుణాభిధాముడు. పితృవాక్యా పరిపాలకుడు, తండ్రి మాటని జవదాటని సద్గుణ శీలుడు. అలాంటి రాముణ్ణి తలచుకుంటే చాలు జన్మ చరితార్థమౌతుంది.ఆత్మను,పరమాత్మతో అనుసంధానించడం, మనస్సుని, బుద్ధితో మమేకం చేసిన రోజే నిజమైన శ్రీరామనవమి!!

******* 

No comments:

Post a Comment

Pages