విశ్వనాథ శతకము - అమలాపురం సన్యాసికవి - అచ్చంగా తెలుగు

విశ్వనాథ శతకము - అమలాపురం సన్యాసికవి

Share This
విశ్వనాథ శతకము - అమలాపురం సన్యాసికవి
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం: అమలాపురం సన్యాసికవి నివాస స్థలము విశాఖపట్టణ మండలాంతర్గతమగు పాల్తేరు. గంగాభవాని,కాశీపతుల కుమారుడు. భార్య కన్నమ్మ. గట్టుమూరి కామేశ్వరకవి శిష్యుడు. ఈ కవి శాలివాహనశకము 1782 నకు సరియగు క్రీ.శ. 1860 లో జన్మించినటుల ఈతని శిష్యుడగు దేవులపల్లి చంద్రశేఖరశాస్త్రి గారు రచించిన పద్యము ద్వారా తెలిస్తున్నది. కుమ్మరి కులమునకు చెందిన ఈ కవి వందకు పైగా సతకములను, అనేక గ్రంధములను రచించినట్లుగా తెలుస్తున్నది. 
ఈకవి తనగురించి ఈ సతకాంతమున ఇట్లు చెప్పుకొనినాడు. 

సీ. అమలాపురాన్వయోత్తముఁడగు కాశీప, తికిని గంగాణవానికిని సుతుఁడ
సన్యాసినామక సహితుఁడ శ్రీకాట్ర, కోన లక్ష్మణసమాఖ్యునకు వేంక
మాంబకుఁ బుత్రిక యగు కన్నమాహ్వయ, పత్నితోఁ గూడి మీప్రాంతమునకు
నఱుదెంచి యేను గృతాంజలినై ప్రభూ, కానుక లివ్వఁగలనె నీకు
గీ. నీకృతిరచించితిని గొని మాకు నైక్య
మొసఁగుమని వేడితిని నట్ల యొసఁగరాదె
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

ఈ కవి శిష్యుడగు దేవులపల్లి చంద్రశేఖరశాస్త్రిగారు రచించిన క్రింది సీసమాలికవలన ఈ కవి గురించిన అనేక విషయాలు తెలుస్తున్నవి.

తనవంశకర్తయై తనరారు శాలివా, హనమహారాజు శకాబధములు క
ర గజర్షి విధుసంఖ్యఁ దగు రౌద్రివత్సర, చైత్రశుద్ధనవమి మిత్రపుత్ర
వారత్రయామాదియై రహిన్గను సమ, యంబున నమలాపురాన్వయామృ
తాంభోదిరాకాసుధాంశుండు నాగ ను, ద్భవమంది మదిని సద్భక్తి మెఱయ
గట్టుమూరి కులాగ్రగణ్యుఁడై మించు కా, మేశ్వరాఖ్య కవీంద్రువలన
నకలంక వృత్తిని సకలాంధ్రభాషావి, శేషజ్ఞుఁడై నిజశిష్య సంచ
యమునకు నెల్ల మహాముద మొదవంగ, గరతలామలకంబు గాఁగ నన్ని
విద్యలఁ గఱపి వివేకాత్ముఁడగుచుఁ గా, శీప్రముఖాఖిల క్షేత్రములను 
గ్రమమున సేవించి రామాయణగ్రంథ, మమరంగ వ్రాసి పట్టాభిషేక
మొనరించి ధరణీసురోత్తములలర రు, ద్రాక్షమహాత్మ్య ముఖ్యప్రబంధ
ములు మూడొనర్చి నిచ్చలు సోమవార మ, హావ్రతుండయి యనయంబునిటుల
నలరు సన్యాసి నామధేయాన్వితుఁడు స, ముజ్వలం బగు లింగైక్యమొందె నౌర
తలపఁగా నిట్టి పురుషుండు ధాత్రిఁగలడె, యనుచు జనులెల్ల నొక్కటై యభినుతింప.

ఈ కవి శతాధిక శతకములనే కాక రామాయణము, రుద్రాక్షమహత్వము అనే గ్రంధాలను కూడా రచించినట్లు తెలుస్తున్నది. అయితే ఈతను రచించిన అన్ని శతకాలలో కొన్ని మాత్రమే నేడు దొరుకుతున్నవి. 1. పంచముఖేశ శతకము, 2. ముఖలింగ శతకము, 3. శివ శతకము, 4. పంచముఖేశ్వరప్రభూత శతకము, 5. విశ్వనాథ శతకము, 6. పంచముఖేశలింగస్తుత్యంచిత సీసపద్యద్వాత్రింశతి అనేవి మాత్రమే లభిస్తున్నాయి. 

శతక పరిచయం.
"భూరిగుణయూధ కాశికాపురసనాధ విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ" అనే మకుటంతో నూటనలభైఏడు సీసపద్యాలతో అలరారే ఈశతకం భక్తిరస ప్రధానమైనది. చక్కని అంత్యప్రాసనియమముతో నిండిన పద్యములు చదవటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొన్ని పద్యాలను చూద్దాము.

సీ. శ్రీవిశాలాక్షీమనోవారిజార్య మ, యమదోర్బలోద్రేక హరణచతుర
చతురాస్యముఖ్యపూజితపత్పయోజాత, జాతరూపాశుకశాతకాండ
కాండకటాహప్రకాండ నైజపిచండ, చండరుక్చశిధనంజయవిలోక
లోకత్ర్యీరక్షణైకధురంధర, ధరణీధరోత్కరోత్తమనిశాంత
గీ. శాంతరసమూర్తి దేవతాచక్రవర్తి
శమితసుజనార్తి పరిహృతజననజార్తి
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

సీ. కామగర్వవిఫాల సామజాజినచేల, సామగానవిలోల శరణుశరణు
పుంగవాజానేయ సంగరాజేయ భు, జంగతల్పసహాయ శరణుశరణు
నిత్యనృత్యవినోద భృత్యతత్యాహ్లాద, సత్యవచోమోద శరణుశరణు
సాంద్రకృపాపాంగ చంద్రికాభనిభాంగ, చంద్రసూర్యరథాంగ శరణుశరణు
గీ. సంతతద్యోధునీజూట శరణుశరణు
సభ్యరక్షానిరాభూట శరణుశరణు
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

సీ. తిలగతతైలంబు తెఱఁగునఁబూసల, లోని దారముమాడ్కి మ్రానిలోని
చేవవిధంబున శిలలోనిలోహంబు, పగిదినిఁ బాలలోపలిఘృతంబు
వడువున ననలోని వాసనకైవడి, దారువులోపలి దహనుమాడ్కి
ఫలంబులోని రసంబు భాతిధరిత్రీత, లంబులోపలి నిధానంబురీతి
గీ. నరయమశకాదిదంతిపర్యంత జీవ
గణంబునందున నుందువు కానరావు
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

ఎఱ్ఱన, పోతన పోకడలు కొన్ని ఈ శతకంలో మనకు కనిపిస్తాయి. మచ్చుకి ఈ పద్యం చూడండి.

సీ. విమలభవత్కథల్ విననికర్ణములు క, ర్ణములాపురాణకూపములుగాక
త్వన్మూర్తిఁగనని నేత్రములు నేత్రంబులా, చాలినీకుహరసంచయముగాక
భక్తితో మిమునుతింపని రసజ్ఞరసజ్ఞె, ఘనతరాయసఖజాకంబుగాక
మిముఁబూజసేయని మృదులహస్తములు హ, స్తమ్ములాదారు హస్తములుగాక
గీ. నిజపదానతకృతబోధ నిర్నిరోధ
కుటిలవర్గమృగవ్యాధ గురుసుమేధ
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

అధిక్షేప పద్యములు కూడా ఈశతకంలో కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని పద్యాలను చూద్దాము.

సీ. ఆశ్రితకల్పక మంచుస్థాణువునెట్టు, లింద్రాది సురలాశ్రయించిరొక్కొ
స్త్రీపుంనపుంసక రూపహీనునకెట్లు, పురుషోత్తముఁడొనర్చెఁ బూజనంబు
కులగోత్రములు లేని గూఢమార్గునికెట్లు, కులగోత్రపతి తన కూతునొసఁగె
నతులామృతాపేక్షులైన మహర్షులు, విషధారి నాత్మభావించిరెట్టు
గీ. లిలఁబురాకృతపుణ్యంబు గలుగనెట్టి
వారలధికారులౌట ధృవంబుగాదె
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

సీ. ఆదిభిక్షుఁడవయ్యు నఖిలేశ్వరుండ నా, నలరారుటది విస్మయంబుగాదె
విసముకుత్తుకనిండ మెసఁగియు నెన్నఁడు, మృతిలేకయుండు టద్భుతముగాదె
యెవ్వరుముట్టని యెముకఁ జేపట్టియు, శుచిమూర్తివైతివి సొబగుగాదె
యున్మత్తమువహించి సన్మార్గవర్తి నా, విహరించితివి కడువింతఁగాదె
గీ. వ్యత్యయంబయ్యె నీనడవడిఁగనంగఁ
బ్రత్యయముసేయు భక్తులపట్లనట్ల
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

సీ. స్ఫురదణిమాది విభూతులుగలుగఁగా, నింటింటభిక్షకు నేఁగనేల
సర్వమంగళనీకు సామేననుండగా, బేస్తకన్యను నెత్తిఁబెట్టనేల
వెండిగుబ్బలిపైఁ బరుండక ననిశంబు, నొలకలలోపల నుండనేల
వేలుపుల్గొల్వఁ బేరోలగంబుననిల్వ, కురుభూతములవెంటఁ దిరుగనేల
గీ. మతవిరోధులు శంభుఁడ మంగళుండ
టన్నఁ దవులదెనామది విన్నఁదనము
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

సీ. కరికాళుఁడొసగు మాకందఫలంబులు, మిక్కుటంబగుకూర్మి మెక్కిమెక్కి
మాదరచెన్నాఖ్యుఁ డదరంబూన బెట్టు, సురచిరాంబకళంబుఁ జుఱ్ఱిజుఱ్ఱి
నివ్వమ్మమదిఁబత్తి నివ్వటిల్లఁగఁబోయు, జావసంతసమునఁ ద్రావిత్రావి
బోయకన్నడు యెడఁబాయకనర్పించు, నంజుఁడు తునకలు నమలిమనలి
గీ. తృప్తిఁదీరక భిక్షాంప్రదేహియనుట
జనులుదీర్తురె క్షుత్తు విశ్వంభరునకు
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

నవరసములలో పరమశివునిలీలలను వర్ణించిన తీరు చాల బాగున్నది. ఉదాహరణకు భీభత్స రసమును పోషించిన ఈ సీసం గమనించండి.

సీ. శ్రీకంఠ మిము వెలిఁజేసి దక్షుఁడు యాగ, మొనరింపఁగ నెఱింగి కినుకఁతోఁడఁ
జని పూషుదంతముల్సడలించి శశిని షో, డశఖండములుగ నడంచి భగుని
కన్నులుపెరికి పెన్గాలినెచ్చెలికాని, నాల్కలేడును గోసి నలువచెలువ
ముక్కు గ్రక్కునఁ జెక్కి మురవైరిచక్రంబు, చక్కిలమ్ముగఁ బుక్కు వెక్కసముగ
గీ. దక్షు తలఁ ద్రెవ్వనేసియుఁ దత్క్షణమున
భర్గభీభత్సరసముఁ జూపవె మహాత్మ
భూరిగుణయూధ కాశికాపురసనాధ
విదళితామర్త్యరిపుయోధ విశ్వనాథ

ఇటువంటి అనేక రసమయమైన పద్యములతో రచింపబడిన ఈ విశ్వనాథ శతకము అందరు చదవతగినది.
మీరూ చదవండి. మీ మిత్రులతో చదివించండి
-- 

No comments:

Post a Comment

Pages