వసంతోత్సవం - అచ్చంగా తెలుగు
వసంతోత్సవం 
పి.వి.ఎల్.సుజాత

ప్రకృతిలోని అందాలని ఆవిష్కరించే వసంత ఋతువు ప్రవేశించే ముందు జరుపుకునే వేడుక హోలీ.అందుకే వసంతోత్సవం అంటారు. ప్రపంచంలోని రంగులన్నీ ఒకేచోట కుప్పలా పోసి..కనువిందు చేసే కలర్స్ ఫెస్టివల్ హోలీ. హోలీ పండుగ ఈనాటిది కాదు. ద్వాపర యుగంలో ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. శ్రీ కృష్ణుడు నలుపు కదా!.. తన నెచ్చెలి రాధ తెల్లగా ఉంటుందని, తల్లి యశోదమ్మ దగ్గర వాపోయాడుట. అప్పుడు యశోదా దేవి కృష్ణుడికి ఒక సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పోయమని కన్నయ్యకు చెప్పినట్టు, తల్లి సలహామేరకు కృష్ణయ్య రాధను పట్టుకుని రంగునీళ్లు కుమ్మరించినట్టు, దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడి మీద రంగులు చల్లినట్టు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి . అప్పట్నుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమైంది.
హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం . ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు.
హోలీ పండుగ ముందు రోజు కామదహనం చేస్తారు. ఈ కామదహనానికి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.
హిరణ్యకశపుని సోదరి , ప్రహ్లాదుని మేనత్త పేరు 'హోళిక'. ప్రహ్లాదుని వల్ల తన అన్న చనిపోయాడనే కోపంతో ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుడిని తోసే ప్రయత్నం చేసింది. ఆ మంటలు ప్రహ్లాదుడిని ఏమీ చేయకుండా, హోలికను దహించి వేశాయి. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీకి ముందురోజు కామదహనం చేయడం ఆచారం .
ఓ సమయంలో ధ్యాన నిష్ఠలో వున్న శివునిపై మన్మధుడు పూల బాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మధుడిపై ఆగ్రహించి, తన మూడో కంటితో కాముడిని (మన్మధుడిని) భస్మం చేస్తాడు. ఆ తరువాత రతీదేవి మొరపెట్టుకోవడంతో శాంతించిన శివుడు మన్మధుడిని తిరిగి బతికిస్తాడు. దానికి గుర్తుగానే హోలీ పున్నమికి ముందు కాముని దహనం చేయుట ఆనవాయితి. ఇక్కడ కామం అంటే కోర్కె , బాధ , అనే అర్థాలు కూడా చెప్పవచ్చు.
సుఖం, దుఃఖం ,సంతోషo,విచారం వీటన్నింటి మేలు కలయికే జీవితం. వాటిని మనం రంగుల రూపంలో హోలీ నాడు ఒకరిపై మరొకరు చల్లుకుంటాం. అయితే ఈ కృత్రిమ రంగుల వల్ల చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, తిమ్మిరి తదితర చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. అంతేకాకుండా పొరపాటున కంట్లో పడితే పాక్షికంగా లేదా శాశ్వతంగా కంటిచూపు పోయే ముప్పు కూడా ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూ హోలీని జరుపుకుని ఆనందించండి.
********

No comments:

Post a Comment

Pages