తెలుగు భాష ఎంతవరకు, ఎందుకు నేర్చుకోవాలి? - అచ్చంగా తెలుగు

తెలుగు భాష ఎంతవరకు, ఎందుకు నేర్చుకోవాలి?

Share This
తెలుగు భాష ఎంతవరకు, ఎందుకు నేర్చుకోవాలి?
డా.ఎ.సుబ్బారావు 

ఉదయం ఎనిమిది గంటలయింది.  శరత్ కాలంలో సూర్యకిరణాలు వేడిగా అనిపించడం లేదు.  మధ్య మధ్యలో చల్ల గాలి వీస్తోంది. హాయిగా పడక కుర్చీలో కాళ్ళు చాపుకుని అప్పారావు న్యూస్ పేపర్ చదువుతున్నాడు.  ఇంతలో అతని స్నేహితుడు కోదండరామయ్య అక్కడికి వచ్చాడు.

అప్పారావు బిగ్గరగా, “కాఫీ పట్టుకురావోయ్” అని భార్య కోసం లోపలి చూస్తూ అరిచాడు.  “ఏం కోదండరామయ్యా ! ఏమిటి విశేషాలు ?” అని పలుకరించాడు.

సమాధానంగా, ఇలా అన్నాడు, “అప్పారావ్ ! మా పిల్లలికి తెలుగు మాట్లాడటం మాత్రమే వచ్చును, వ్రాయడం అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు పొరుగు రాష్ట్రాలలో చదివారు. నీకు తెలియనిదేముంది?  ఫిదా సినిమా అంట., హే పిల్లగాడా..ఏందిరో పిల్లగాడా...., అంటూ పాడేస్తూంటారు. మాయాబజార్ సినిమాను కలరులో వచ్చింది, చూడండి అని అంటే, మాకేం డయలాగులర్థం కావడం లేదంటారు, వాళ్ళు బ్లేక్ అండ్ వైట్ సినిమాలను ఇష్టపడరులే, మరి ఎలా? ఎన్ టీ ఆర్ మరియు ఏ ఎన్ ఆర్ లు అద్భుతంగా నటించిన తెనాలి రామక్రిష్ణ సినిమా అయితే చెప్పనే అక్కరలేదు, కొంచెం కూడా అర్థం కాదు.  ఘంటసాల గారి పద్యాలు ఎంత బాగుంటాయి. అవి అసలే అర్థం కావు. ఆ మధ్య అంతర్జాలములో పాండవ వనవాసం సినిమాను చూశాము. వారికి తెలిసిన కథయే కాబట్టి భాష అర్థం కాక పోయినా, ఏదో చూసేసారు. వాళ్ళ భాషాపరిజ్ఞానంతో నేను సతమతమవుతున్నాను. లోగడ మా వీధిలో కొంతమంది బెంగాలీ పిల్లలు వాళ్ళ మాతృభాషలో వ్రాయడం రాకపోయినా, రబీంద్రుని గీతాంజలి గురించి, శరత్ సాహిత్యం గురించి చక్కగా మాట్లాడేవారు, వారికి భాషాభిమానం మెండు.  మా పిల్లలు ఏ తెలుగు రచయిత గురించి యైననూ చెప్పలేరు, మాట్లాడ లేరు. భాషాభిమానం లేదేమో అని అనిపిస్తుంది. అలాగే ఒక త్యాగరాజు కీర్తన గాని ఒక అన్నమయ్య పాట గాని అర్థం చేసుకోలేరు. చిన్నప్పుడు నేను చదివి వినిపించిన వేమన శతకం, సుమతీశతకంలోని పద్యాలను వాటి అర్థాలను ఎప్పుడో మరచినారు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు బోధపడడం చాలా కష్టం. శ్రీ గరికిపాటి గారు చెప్పినట్లు పెద్దబాలశిక్షను మళ్ళీ కొనాలి, చదివించాలి, వాళ్ళు ఒప్పుకొంటే.  మీ పిల్లల మాటేమిటి, అప్పారావ్” అని అన్నాడు.

ఆ పాటికి అప్పారావు గారి భార్యామణి కాంతమ్మ ఘుమఘుమలాడే కాఫీ తెచ్చింది.  వేడిగా ఉంది. ఒక గుటక త్రాగి అప్పారావు ఇలా మొదలు పెట్టాడు,

“మా పిల్లలు ఇక్కడే హైదరాబాదులో చదివారు.  తెలుగు సబ్జెక్టుగా కూడా పఠనం చేసారు. మొదట్లో ముళ్ళపూడి వేంకటరమణ రచించిన బుడుగు పుస్తకంతో ప్రారంభించారు.  తరువాత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు వ్రాసిన బారిస్టర్ పార్వతీశం నవలను చదివారు. అలాగే యద్దనపూడి సులోచనారాణి గారి నవలల్ని కూడా చదివారు.  కొందరి అష్టావధానాల్ని విన్నారు. హరికథలు, బుర్రకథలు చూసారు, విన్నారు. దాన వీర శూర కర్ణ సినిమాలోని దుర్యోధనుని మాటలను బట్టీ పట్టి, అగ్ర జాతి కుచితబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అని అంటూ ఏకపాత్రాభినయం చేశారు.  శ్రీకృష్ణదేవరాయలు మరియు వారి ఆస్థానంలోని అష్టదిగ్గజాల రచనలు కూడా మా పిల్లలకి ఇష్టమే. కవిత్రయము (ఆది కవి నన్నయ్య, ఎర్రాప్రగడ మరియు తిక్కన సోమయాజి) పద్యాలను (మహాభారతంలోవి) అర్థం చేసుకుంటూ తెలుగులో భాషాప్రవీణులైన ఉపాధ్యాయుల ఆట పట్టించేవారు.  రేడియోలో వచ్చిన ఉషశ్రీ గారి రామాయణం మరియు మహాభారతం విన్నారు. ఆచార్య ఆత్రేయ వ్రాసిన సినిమా పాటలను విని రసికులయ్యారు. వేటూరి సుందరరామయ్య గారి పాటలను కీర్తించారు. త్యాగయ్య, శ్యామ శాస్త్రి, అన్నమయ్యల రచనలే కాకుండా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కీర్తనలను కూడా ఆస్వాదించారు.  అడవి బాపిరాజు గారి నవల నారాయణరావు, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల వేయి పడగలు వారి బుర్రలోకి ఎక్కాయి. పాత సినిమాల ప్రభావంతో తిరుపతి వేంకటకవుల పద్యాలను అవలీలగా పాడేవారు. కోయిలమ్మ పాడితే తెలిసింది కొత్త ఋతువు వచ్చిందనీ....అని గోరింటాకు సినిమా పాట పాడుకుంటూ తెలుగు భాషను మెచ్చుకునేవారు.  ఆకాశవాణిలో వచ్చే సమస్యాపూరణం కార్యక్రమంలో పాల్గొనేవారు. కానీ వారు ఎల్లప్పుడూ తమ భాషలో ఉన్న నైపుణ్యమును చూపుచూ కీకరకాయలు కాకుండా ఉండాలనిపిస్తుంది., ఆ దేవుడికి నా ప్రార్థన అదే”., అని అంటూండగానే కాంతమ్మ గారు ఖాళీ అయిన కాఫీ కప్పుల కోసం వచ్చారు.

మరి వీళ్ళ సంభాషణ ఒక చెవిన పడేశారుగా ఆవిడ!  అందుకే జవాబుగా ఇలా అన్నారు, “అన్నట్టు గురజాడ గారి రచనొకటి గుర్తొచ్చిందండోయ్...  దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్, గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌, పాడి పంటలు పొంగిపొరలే దారిలో, నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండకలదోయ్, కండకలవాడేను మనిషోయ్..  కోదండరామయ్యన్నయ్య గారూ...వంట మొదలు పెట్టాను.  భోజనం చేయాల్సిందే”. అవునంటూ అప్పారావు కూడా నొక్కి వక్కాణించాడు.

కాంతమ్మ గారు లోపలికి వెళ్తూ ఇలా అన్నారు, “మీరిద్దరూ ఎలా తెలుగు భాషను పోషించారో, ఎలా మన భాషను ఉద్ధరించారో ప్రశ్నలు వేసుకున్నారు.  మీ మనసుకు నచ్చిన సంఘటనలను గురించి చర్చించారు. రిటైర్ అయ్యారుగా. మా ఆడవాళ్ళకు ఖాళీ సమయం ఉండదు. నేనేమీ బాధ పడడం లేదు. నా అబిప్రాయాలను తరువాత చెప్తాను”.

కోదండరామయ్య మళ్ళీ అందుకున్నాడు ఇలా, “వాడుక భాషలో, ఆయా ప్రాంత యాసలో రాసిన కథలు కవితలు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంటాయి.  సాహితీ వ్యాసంగంలో సేవ చేసిన కందుకూరివీరేశలింగం గారిని మరచి పోలేము. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు వ్రాసిన పుస్తకము –ఆంధ్ర రచయితలు, చదువతగినది.  అందులో ఎందరో మహానుభావుల గురించి విశదీకరించారు....వారు..... పరవస్తు చిన్నయసూరి, మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి, కోరాడ రామచంద్రశాస్త్రి, మతుకుమల్లి నృసింహకవి, వారణాసి వేంకటేశ్వర కవి, ఆకొండి వేంకటకవి, పరవస్తు వేంకటరంగాచార్యులు, నరసింహదేవర వేంకటశాస్త్రి, రేమెల వేంకట రాయకవి, అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, మాడభూషి వేంకటాచార్యులు, ముడుంబ నృసింహాచార్యకవి, కొక్కొండ వేంకటరత్నశర్మ, బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆదిభట్ట నారాయణదాసు, కందుకూరి వీరేశలింగకవి, త్రిపురాన తమ్మయదొర, వావిలాల వాసుదేవశాస్త్రి, గురుజాడ శ్రీరామమూర్తి, వేదము వేంకటరాయశాస్త్రి, ధర్మవరము రామకృష్ణమాచార్యులు, దేవులపల్లి సోదరకవులు, పురాణపండ మల్లయ్యశాస్త్రి, పారనంది రామశాస్త్రి, వడ్డాది సుబ్బారాయకవి, కోలాచలము శ్రీనివాసరావు, శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, కల్లూరి వేంకటరామశాస్త్రి, మచ్చ వేంకటకవి, ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రి, జయంతి రామయ్య, పూండ్ల రామకృష్ణయ్య, అల్లంరాజు రంగశాయికవి, మేడేపల్లి వేంకటరమణాచార్యులు, గిడుగు వేంకటరామమూర్తి, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, నాదెళ్ళ పురుషోత్తమకవి, శృంగారకవి సర్వారాయకవి, దాసు శ్రీరామకవి, ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనశర్మ, పానుగంటి లక్ష్మీనరసింహరావు, నాగపూడి కుప్పుస్వామి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, కూచి నరసింహము, చిలకమర్తి లక్ష్మీనరసింహము, చిలుకూరి వీరభద్రరావు, కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు, కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, జనమంచి వేంకటరామయ్య, తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య, వత్సవాయి వేంకటనీలాద్రిరాజు, జనమంచి శేషాద్రిశర్మ, త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి, తిరుపతి వేంకటకవులు, వేంకట రామకృష్ణ కవులు, వేంకట పార్వతీశ్వర కవులు, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, దుర్భాక రాజశేఖరకవి, గడియారము వేంకటశేషశాస్త్రి, విక్రమదేవ వర్మ, మంత్రిప్రెగడ భుజంగరావు, ఆకొండి రామమూర్తిశాస్త్రి, చర్ల నారాయణశాస్త్రి, వడ్డెపాటి నిరంజనశాస్త్రి, ఉమర్ ఆలీషాకవి, వజ్ఝుల చినసీతారామశాస్త్రి, కోటగిరి వేంకటకృష్ణారావు, వేంకటాద్రి అప్పారావు, గురుజాడ వేంకట అప్పారావు, విశ్వనాధ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, రాయప్రోలు సుబ్బారావు, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పింగళి లక్ష్మీకాంతము & కాటూరి వేంకటేశ్వరరావు, మాడపాటి హనుమంతరావు, సురవరము ప్రతాపరెడ్డి, దువ్వూరి రామిరెడ్డి, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి, గుర్రం జాషువకవి, అడవి బాపిరాజు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు, వేదుల సత్యనారాయణశాస్త్రి, నోరి నరసింహశాస్త్రి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి ....”.

ఆ మధ్యన పాత వస్తువులను పుస్తకాలను కొనేవాడు ఒకడు కోదండ రామయ్య వీధిలోకి వచ్చాడని పెద్ద మొత్తంగా ఏవో కొనేసుకున్నాడని అప్పారావు విన్నాడు.  అది గుర్తుకువచ్చి, అప్పారావు అడిగాడు కోదండ రామయ్యను, “మీ ఇంట్లో తెలుగు పుస్తకాల భండారం ఉండాలి కదా ! ”, అని. భోరున ఏడ్చాడు కోదండ రామయ్య, ఏడుస్తూనే ఇలా అన్నాడు, “నేను సేకరించిన పుస్తకాలను ఏదో గ్రంథాలయంకి ఇచ్చేయాలి అని అనుకున్నాను, ఎలాగూ, మా పిల్లలు చదవడం లేదు కదా అని, కాని, వాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు నేను ఇంట్లో లేని సమయంలో ఎవడో చిత్తు కాగితాలవాడికి అమ్మేసారు.  ఏవో జేమ్స్ బాండ్ ఇంగ్లీషు నవలలు లాంటివి కొన్ని ఉన్నాయి. పూజలకి, ఉపనిషత్తులకి సంబంధించిన పుస్తకాలను మాత్రం నేనే నా గదిలో భద్ర పరచు కున్నాను.”

వంట అయిందని సిగ్నల్ వచ్చింది.  “ఆలస్యం అమృతం విషం”, అన్నారు పెద్దలు.  అంతేగా మరి. ముగ్గురూ కూర్చుని లంచ్ చేయడం మొదలు పెట్టారు.  కాంతమ్మ గారు తింటూ మాట్లాడరు, కాని, వారి సంభాషణ విని స్పందించి, ఇలా అన్నారు, “తెల్ల దొర అయి కూడా, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్  తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన వ్యక్తి.  తొలి తెలుగు శబ్దకోశమును ఈ ఆంగ్లేయుడే పరిష్కరించి ప్రచురించాడు కదా.  బ్రౌన్ డిక్షనరీని మనం  తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తాము.  సీ పీ బ్రౌన్ దొర, వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ప్రపంచ వ్యాప్తి చేశారు.  కలకత్తాలో పుట్టినా, ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.  తెలుగు జాతికి సేవ చేసిన ఆంగ్లేయులు ముఖ్యంగా నలుగురు.  వారి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రో, మరియు సీ పీ బ్రౌన్ లు.  కానీ, తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డలకే మాయ రోగం.  రాను రాను తెలుగు అచ్చు పుస్తకాలు ఏ తరగతివి తీసుకున్నా, కుదించుకుపోతున్నాయి.  చెప్పే నాథులు లేరు. వినే విద్యార్థులు కరువయ్యారు. ఛందస్సులో ప్రవేశం అంటే ...అదొక గొప్ప యజ్ఞం... కొందరిని యమాతారాజభానసలగం అంటే తెలుసా అని అడిగితే, ఏ మాత, ఏ రాజు అనేటువంటి ప్రశ్నలు వేశారుట! అదీ పరిస్థితి!  సంస్కృత భాషను సెకండ్ లాంగ్వేజ్ గా, తీసుకుంటే, మార్కులు బాగా వస్తాయని తెలుగు భాషను విడిచి పెడుతున్నారు. ఆ ప్రభావం వలన, ఆంగ్ల భాషను మాత్రమే బాగా నేర్చు కుంటున్నారు, తెలుగు వారు. మన మాతృభాషాభిమానం అనేది నశించుకుపోతున్నది.  తద్వారా, ఇంక పిల్లలికి, రాయప్రోలు సుబ్బారావు రచించిన గేయం –ఏ దేశమేగినా ఎందు కాలిడినా.... ఎలా తెలుస్తుంది? ఇదిగో.. ఇంతలోనే ఒక పాట గుర్తుకొచ్చింది, అమెరికా అమ్మాయి సినిమా లోనిది, .... పాడనా తెలుగుపాట! పరవశనై - మీ ఎదుట - మీ పాట పాడనా తెలుగు పాట......త్యాగయ క్షేత్రయ రామదాసులు - తనివితీర వినిపించినది, నాడు నాడులా కదిలించేది - వాడ వాడలా కనిపించేది”.  వెంటనే కోదండరామయ్య, “చెల్లాయ్.. కాంతమ్మా... భోజనానంతరం ఆ పాటను పాడి వినిపించాలి మరి” అని అన్నాడు. సరే నంది కాంతమ్మ.

అందరి భోజనాలు ముగిసాయి.  చేతులు కడుగుకొని వసారాలోకి వచ్చారు.  బయట మబ్బులు కమ్మాయి. మేఘావృతమైన ఆకాశాన్ని తదేకంగా చూస్తున్నారు.  కొత్త కొత్త ఆలోచనలు వారి మెదడులో చోటు చేసుకుంటున్నాయి.

ఇంతలో... “మాతా కబళం తల్లీ” ... అంటూ ఒక బిచ్చ గాడు కేక వేసాడు.  బిచ్చగాడు పలికిన తెలుగు పదాలు కూడా కాల క్రమేణా భావి తరాల వారికి అర్థం కావేమో అని ఆ ముగ్గురూ వాపోయారు !!

*********

No comments:

Post a Comment

Pages