అష్ట కష్టాల చుట్టాల లిస్ట్ - అచ్చంగా తెలుగు

అష్ట కష్టాల చుట్టాల లిస్ట్

Share This

 'అష్ట కష్టాల చుట్టాల లిస్ట్
 బి.వి.సత్య నాగేష్, 9849064614
(ప్రముఖ మానసిక నిపుణులు, మైండ్ ఫౌండేషన్ అధినేత)

          వైరస్.. వాట్సాప్..ఊసరవెల్లి..బందిపోటు...హైటెక్ బ్లాక్ మెయిల్.. నిరంకుశ, అధికారనాకేంటిఏమిటి ఇవన్నీ సినిమా పేర్లు అనుకుంటున్నారా? కాదు. మన ప్రియతమబంధువుల వ్యవహార సరళిని బట్టి ఇచ్చేముద్దుపేర్లు . అసలు బంధువులతో ఇబ్బందులు పడని  వారుంటారా? చుట్టాలతో ఎప్పుడూ చెట్టాపట్టాలేసుకొని తిరిగని వారుంటారా? కానీ ఎప్పుడో ఒకప్పుడు తెగతెంపులుఅవ్వాల్సిందే.ఎందుకిలా జరుగుతుంది? అంటే మమషుల మనస్తత్వం అహం రీత్యా అంటారు.ప్రముఖ సైకాలజిస్ట్/ఐ.వి.సత్యనాగేష్ మనబంధువులంటే ఎక్కడి మంచో పుట్టుకురారని వారూ సమాజంలోని భాగమేనని చెబుతూ,బంధువులు ఎన్ని రకాలు ఎవరితో ఎలా మెలగాలో విశ్లేషించారు శ్రీ సత్యనాగేష్. 
రండి..రండి... ప్రయాణం బాగా జరిగిందా?" అంటూ బంధువును ఇంట్లోకి ఆహ్వానించాడు వినోద్.
          ఆ...ఏదో జరిగిందిలే..." అంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు బంధుపు.
          ఏంటి విశేషాలు?" అన్నాడు వినోద్.
          ఏముంటాయి...మా పాట్లు మావి, మీలాగ ప్రతి నెలా పెన్షన్, ఇంటి అద్దెలు, డిపాజిట్స్ పై వడ్డీలు,స్థిరాస్తులు వుంటే నేను ఈ రోజు హైదరాబాద్ రావలసినపని వుండేది కాదు" అంటూ నిట్టూర్చాడు బంధువు.
          ఈ రకమైన పరిస్థితికి అతనే కారణం కదా!అనుకున్న వినోద్ కు ఏం చెప్పాలో అర్ధం కాలేదు.మనం కొంతమంది మనస్తత్వం అంతే! బస చెయ్యడానికి వచ్చిన బంధువును ఆప్యాయంగా ఎదురొచ్చి ఆదరించినా వారి మాటలు అంతే, అంతేకాదు...వ్యంగ్యంగా మాట్లాడడం, సూటిపోటిమాటలనడం, అసూయను మాటల్లో వ్యక్తపరచడం, రాజకీయం చెయ్యడం, ఎదుటివారితో లేని పోని వాటి గురించి మాట్లాడటం లాంటివి చేస్తారు.
          నేటి సమాజంలో చాలామంది అలాగే ఉన్నారు. స్నేహితులను, బంధువులను ఇబ్బంది పెడుతూనే వున్నారు. రక్తం పంచుకుపుట్టిన తోబుట్టువుల నుంచి బీరకాయ పీచు సంబంధం వున్న వారి వరకు కొంతమందితో ఏదో ఒక సందర్భములో మనస్పర్థలే!... అపార్థాలే...మాటామాటా అనుకోవడాలే. ఎందుకిలా?దీనినుంచి బయటపడేదెలా? అనే విషయాన్ని పరిశీలిద్దాం.
          ఈ రాబందుల్లాంటి వారు ఏవిధంగా ఇబ్బంది కలిగిస్తూ వుంటారు? వీరిలో రకరకాల వాళ్ళు రకరకాలుగా వారి ప్రత్యేకతతో ఏ విధంగా ఇబ్బందులను కల్గిస్తూ వుంటారనే విషయాన్ని చూద్దాం.
          టీ.వి.సీరియల్స్ లో చాలా రకాలను చూస్తూనే ఉన్నాం. అలాగే నిజ జీవితంలో కూడాచూస్తూ అనుభవించడం కూడా జరుగుతుంది. మరి.....వాళ్ళు ఎలా మాట్లాడుతూ వుంటారనేవిషయం గురించి, వారి ఉద్దేశాలేంటి అనే విషయాల్ని తెలుసుకుని మసలుకుంటే మంచిది.ఒక్కొక్క రకం గురించి తెలుసుకుందాం.
          మొదటిరకం వారు ఏదో సలహాలివ్వాలనేఉద్దేశంతో వుంటారు. ఎదుటివారు అడగకపోయినా కల్పించుకుని సలహాలనిస్తారు. ఒక్కొక్కసారి ఆ సలహాలు, చెప్పే విషయాలు వినడానికి కూడా ఇష్టంవుండదు.కానీ...తప్పదు. ఎందుకంటే మీరు వాళ్ళని ఆపలేరు కాబట్టి, కొన్ని ఉదాహరణలను చూద్దాం.

'అష్ట కష్టాల చుట్టాల లిస్ట్
1.     మీకు పెళ్ళి అయ్యి 25 సంవత్సరాలయింది. మీరు సంతోషంగా వున్నారు. కాని ఓ విషయం చెప్పనా? మీ ఇద్దరికి జాతకాలు అస్సలు కలవలేదు. నా మాట వినలేదు. మీ పెళ్ళి ముందు కూడా చాలా గొడవలయ్యాయి. అయిపోయిందేదో అయిపోయింది. మీరిద్దరూ బాగానే వున్నారు" అంటూ భార్యా భర్తలిద్దరికి - మంచిమాట చెపుతున్నాననే ముసుగులో అనవసరమైన విషయాల్ని చెప్పేస్తారు. వీళ్ళనివైరస్ టైప్బంధువులంటారు. భార్యాభర్తలిద్దరికి జాతకాలపై గట్టి నమ్మకముంటే...ఇక గతంలో జరిగిన ప్రతీ విషయాన్ని 'పోస్ట్ మార్టమ్' లాగా విశ్లేషించడం మొదలు పెడతారు.
2.    మరోరకం మనుషులకు ఏదైనా విషయం తెలిస్తే చాలు. వెంటనే వేరే వాళ్ళకి , “నీకు తెలుసా?” అంటూ అందరి దగ్గర చర్చ పెట్టేస్తారు. నిజానిజాలు తెలుసుకోరు. వీరువాట్సాప్ టైప్”. అంతర్జాతీయ స్థాయి శాస్త్రజ్ఞుడు ఏదో గొప్పవిషయాన్ని కనిపెట్టి ప్రపంచానికి తెలియజేసినంత స్థాయిలో అత్యుత్సాహాన్నిప్రదర్శిస్తారు.
3.    మరోరకం మనుషులు ఎదుటివారితో చాలా మంచి వ్యక్తిలా తియ్యగా మాట్లాడతారు. కాని ఆ మాటల్లో వేరే వారి గురించి చెడుగా వర్ణించడానికి వెనుకాడరు. కేవలం ఎదుటి వారికి వినసొంపుగా వుండేటట్లు, “మీశత్రుపు నాకూ శత్రువేఅన్న విధంగామాట్లాడుతూ సొంత మనుషులను కూడా దూరం చేసుకుంటారు. ఎక్కడ చేసే భజన అక్కడ చేస్తారు. వీరు “ఊసరవిల్లి టైప్మనుషులు. ఏదో ఒక రోజు విషయాలు బయటపడతాయనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడేస్తూ వుంటారు.
4.    మరోరకం మనుషులు "ఎదుటివారికి నష్టం జరిగినా ఫరవాలేదు....నేను సంతోషంగా వుండాలంతే!" అనుకుని రాబందుల్లా పీక్కుని తింటారు. వీరు చూడటానికి బాగానే వుంటారు. కానీ మామూలు మనుషుల్లా కనిపించినప్పటికీ దోపిడిదొంగలు, రౌడీల మనస్తత్వంతో .. వుంటారు. ఇటువంటి బంధువులుబందిపోటు టైప్లోకివస్తారు.
5.    మరోరకం మనుషులు మనతో ప్రేమగా వున్నట్లే నటిస్తూ, వివాదాస్పదమైనఅంశాల్లోకి లాగి మన అభిప్రాయాన్ని తెలుసుకుంటారు.ఫోన్లో మాట్లాడితేఎందుకైనా మంచిది... పడుంటుందిఅనిరికార్డ్ చేస్తారు కూడా. వీరుహైటెక్ బ్లాక్ మెయిలర్ టైపు" లోకివస్తారు.
6.    మరోరకం మనుషులు అవసరం లేని విషయాల్లోకి కూడా జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చేస్తూ వుంటారు. ఎదుటి వారికున్న " ఇబ్బందులు, కష్టనష్టాలు గురించి ఆలోచించరు. ఎదుటి వారికి వుండవలసిన సంతాన సంఖ్య (ఒక్క బిడ్డ మాత్రమే) గురించి కూడా ఆదేశాలిచ్చేస్తారు. పెళ్ళి చేస్తే పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాలి? ఎంతమందిని పెళ్ళికి పిలవాలి? పెళ్ళి విందులో ఏ పదార్థాలు వుండాలి? అనే విషయాల్ని కూడా నిర్ణయించేస్తారు. పెద్దరికం నిలబెట్టుకోరు. వీళ్ళునిరంకుశ టైప్" (ARBITRARY) లోకి వస్తారు.
7.    మరోరకం మనుషులు....వీళ్ళకి వయసు, అనుభవం తక్కువగా వున్నప్పటికి ఎదుటివారికి ఉచిత సలహాలు ఇచ్చేస్తారు. అంతటితో ఆపకుండా నేను చెప్పినట్లు చేసారా లేదా?" అని ప్రశ్నిస్తారు కూడా! ఉదాహరణకు..... 10 సంవత్సరాల వయసు లోపు పిల్లలున్న బంధువులు పిల్లల్ని పెంచే పద్దతి గురించి మాట్లాడుతారు.మీ అమ్మాయికి తొందరగా పెళ్ళి చెయ్యండి. నచ్చజెప్పండి.....లేదంటే పిల్లల్ని పెంచడంలో మీరు ఫెయిల్ అయినట్లే!" అంటారు. వీళ్ళుఅధికార టైప్లోకి వస్తారు.
8.    మరో రకం మనుషులు కేవలం వారికి లాభం కలిగే విధంగా వ్యవహరిస్తారు. వీళ్ళునాకేంటి?టైప్" లోకివస్తారు.
అనేక రకాల ఈ బంధువులు/స్నేహితుల్లో కొన్ని మానసిక అవలక్షణాలుంటాయి. అవేంటో చూద్దాం.
1. అసూయతో వుంటారు. పైకి తియ్యగా మాట్లాడుతున్నట్లు వున్నప్పటికి లోపల . అసూయతో రగిలిపోతూ వుంటారు.
2. కొందరిలో వ్యంగంగా మాట్లాడేఅలవాటుంటుంది. వాటి మాటలు పదునైన విషబాణల్లాగా గుచ్చుకుంటాయి. అనాల్సిన మాటలన్నిటిని అనేసిఅయినా నాకెందుకులేఅంటూ నిట్టూర్చుతారు. . వాళ్ళు మాట్లాడిన మాటలు ఎదుటివారిని ఎంత బాధపెడతాయనే విషయం గురించి ఆలోచించరు,
3. అభద్రతాభావంతో వుంటారు మరికొంతమంది. దానికి తోడు తగినంత ఆస్థి, డబ్బు లేకపోతే ఎదుటివారిని ఏదో ఒకటి అని తృప్తి చెందుతూ వుంటారు. వీరితో సంభాషణ బాగుండదు. వీరు వేసే ప్రశ్నలు విసుగు పుట్టిస్తాయి.
4. స్వసానుభూతి (Self Pity) తో బాధపడుతూ వుంటారు. అబద్దాలు, నేరాలు చెప్పడం అనేది వీరి ప్రవర్తనలో భాగం. వీరిని Compulsive Liars అంటారు. అసాంఘిక ప్రవర్తన వుంటుంది. వీరిని . Sociopaths అంటారు.
5. మరోరకం గురించి తెలుసుకుందాం. వారుఅతిగా గొప్ప చెప్పుకోవడం ద్వారా ఎదుటివారిని కించపరుస్తూ వుంటారు. వీరిని Narcissists అంటారు. వీరికి చాలా .. అవలక్షణాలుంటాయి.
6. మరోరకం మాటల గారడిలో చాలా నేర్పుపొంది వుంటారు. వీరిని Manipulators అంటారు.
7. మరికొంతమందిలో పనికి రాని వృధా మాటలు, ఊసులాటలు చెప్పే గుణం వుంటుంది. వీటిని Gossipers అంటారు.
          పైన ఉదహరించిన కొన్ని లక్షణాల మేళవింపుతో కొందరు బంధువులు, స్నేహితులు ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ వుంటారు.. మరి వీరినుంచి దూరం అయ్యే క్రమంలో వున్న పరిష్కార మార్గాలు గురించి పరిశీలిద్దాం.
బంధువుల నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!
·         పందితో పోట్లాడకు. అది నిన్ను కూడామురికిగా చేస్తుంది. ఆ తర్వాత నిన్ను చూసి ఆనందిస్తుంది" అని ఓ సామెత వుంది. అందుకని అటువంటి వారితో వాదనకు దిగకూడదు. వారు చెప్పేది తప్పు అని మీకు ఖచ్చితంగా తెలుసుకున్నప్పటికి.....వారిని ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. వీళ్ళింతే! అనుకుని సరిపెట్టుకోవాలి. వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలనే వ్యర్థ ప్రయత్నం చెయ్యకూడదు.
·         " కొంతమంది చాలా క్యాజువల్గా మాటలను వదిలేస్తారు. చిన్న ఉదాహరణ చూద్దాం..! ఒకసారీ ఒక దగ్గర బంధువు ఉదయం 9.30 గంటలకు వినోద్ ఇంటికి వచ్చాడు. వినోద్ ఆఫీస్ కు వెళ్ళడానికి తయారయ్యాడు. భోజనం చేసి వెళ్ళాలి.....అంతే! వచ్చిన బంధువును కూడా భోజనం చెయ్యమని మర్యాదకోసం అడిగాడు. చాలా సమయం బ్రతిమాలిన తరువాత భోజనం చెయ్యడానికి ఒప్పుకున్నాడు. బంధువు భోజనం చేస్తానన్నాడు కాబట్టి ఏదో ఒక ప్రత్యేకమైన వంట చెయ్యడం వలన కొంచెం ఆలస్యం అయ్యింది. అంతేకాదు..... బంధువు చాలా నెమ్మదిగా తినే అలవాటున్నవాడు. వెరసి.... ఆఫీస్ కు వెళ్ళడం ఆలస్యమైంది. భోజనం అయిన తర్వాత బంధువు అన్న మాటలివి.
·         ఇంత ఆలస్యంగా ఆఫీస్కి  వెళ్తున్నావు. నీ పనంతా మీ సహోద్యోగులు చెయ్యాల్సి వస్తుంది. మా అబ్బాయి ఆఫీసులో కూడా చాలామంది ఆలస్యంగా వస్తారుట. పాపం....వాడు ప్రతిరోజూ మొదటి రెండు గంటలు సవ్యసాచిలా పనిచేస్తూ ఒత్తిడికి గురౌతున్నాడు. ఏంటో....అన్నాడు బంధువు. మరి...ఇలాంటి బంధువు విషయంలో పరిష్కారం ఏమిటో చూద్దాం. వినోద్ ఇటువంటి మర్యాదలను పాటించకుండా తన ఆఫీస్ సమయానికి తను వెళ్ళి తన మర్యాదను తనే కాపాడుకోవాలి. ఆ సమయంలో బంధువు ఇంటికి రావడం బంధువు తప్పు అని అనుకోవాల్సిందే.
·        మనసుకు కష్టం కలిగించే మనుషులతో ఎక్కువ సంభాషణ చెయ్యకూడదు. వారిపైదృష్టి పెట్టకూడదు. మీ పనిలో మీరుండాలి. అక్కడే వేరే వ్యక్తులుంటే వాళ్ళతో మాట్లాడాలి. విసిగించే వ్యక్తులతో 'Eye Contact" లేకుండా చూసుకోవాలి. టాపిక్ మార్చడానికి ప్రయత్నించాలి.
·        విసిగించే, కష్టం కలిగించే వారు మాట్లాడుతున్నపుడు వారు మాట్లాడే టాపిక్ మీకు ఇష్టం లేదనే విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాలి.
·        వారు మాట్లాడే తీరు నచ్చకపోతే ఆ' విషయాన్ని వారికి అర్ధమయ్యేలా సుతిమెత్తగా చెప్పాలి. వారి మాటలకు స్పందించకూడదు.
·        వారు చెప్పే విషయంపై మీకు భేదాభిప్రాయం వుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే....వారు. చెప్పే విషయాన్ని మీ అభిప్రాయంగా వేరే వాళ్ళకిచెప్తారు.
·        చేతనైతే లేదా వీలైతే వారికి ఏదో ఒక పనిని అప్పజెప్పి సంభాషణ లేకుండా చెయ్యండి.
·         ఇష్టం లేని విషయాలకు 'No' చెప్పడం అలవాటు చేసుకోవాలి.
·         చాణక్య సూత్రాన్ని పాటించండి. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వారికి మూడు ప్రశ్నలు .. వెయ్యండి. మొదటిది:నువ్వు చెప్పబోయే విషయం నిజమైనదా?కాదా" అని అడగాలి.ఆ విషయం నిజమైనదని ఖచ్చితంగా తెలిస్తే నా రెండవ ప్రశ్నను విను" అని చెప్పాలి. రెండవది:నువ్వు చెప్పే విషయం 'మంచి విషయమేనా?" అని అడగండి.మంచిదే' అయితే మూడవ ప్రశ్న వెయ్యండి. మూడవది :నువ్వు చెప్పే విషయం నాకు ఉపయోగపడేదేనా?" అని అడగండి. ఈ మూడు ప్రశ్నలకు సరియైన సమాధానం వస్తే ఆ విషయాన్ని వినండి. అంటే... విషయం . ఖచ్చితంగా 'నిజమైనదీ, మంచిది, ఉపయోగపడేది అయి వుండాలి. సంభాషణలో ఈ మూడు ప్రశ్నల్ని మూడు ఫిల్టర్స్ గా  చెబుతారు. ఈ విధంగా అటువంటి వ్యక్తుల్ని చాలా వరకు మీరు అదుపులో వుంచగలుగుతారు. మీపై గౌరవం పెరుగుతుంది కూడా
          చివరిగా....'యదార్ధవాది బంధు విరోధి' అనే నానుడి వుంది. యదార్థం కొందరికి నచ్చదు. కానీ, కల్లబొల్లి కబుర్లు చెప్పే వారిని ప్రోత్సహించకుండా యదార్ధాన్ని మాత్రమే మాట్లాడి కొంతమందిని దూరంగా వుంచినా ఫరవాలేదు. మనం ప్రశాంతంగా వుంటాం.అడుసు తొక్కనేల....కాలు కడగనేల" అన్న సామెతలా అటువంటి వారిని కదపడమెందుకు... తర్వాత బాధపడడమెందుకు? అన్న తీరులో వారికి దూరంగా వుండడం మంచిది.
*** 

No comments:

Post a Comment

Pages