మంత్రసాని
జయంతి వాసరచెట్ల
ఆ చేతులతో ఎన్నిపురుళ్ళుపోసి
ఎన్ని పసి ప్రాణాలకు ఈ ప్రపంచం
చూపించిందో...!!
తన చేతుల్లోని మాలిన్యాలను కడిగి
పసికూనలకు తన ఒడిని పంచిందో..!!
ఓనవ్వూ.....
ఓ ఏడుపూ....
ఏదైతే నేమి తనునేర్పాల్సిందే....!!
ఉరుకులు పరుగుల జీవితంలో
అడుగడుగునా కష్టాలను మోస్తూ
అందరి రోగాలను తూడువనింకెనే చూస్తుంటది!!
ఎవరి బంధువులు వారికున్నా
అందరికీ తనే అమ్మయితది....!!
రోగుల దుప్పట్లు సర్ది వాళ్ళ మురికిని తుడుస్తది
ఆసుపత్రి కి వచ్చి పోయేవారి బాధలు,ఏడుపులను
అనుదినం సదువుతనే ఉంటది....!!
వచ్చిపోయే వారి అడుగుజాడలను ఆకలింపుచేసుకుంటది...!!
ఆయమ్మా అని ఎవరు పిలిచినా ఒక చేత్తో చీపురు…
మరోచేత్తో...బకెట్టు పట్టుకుని నిలవడ్తది....!!
దవాఖానా లోని అందరికీ తను అమ్మే .....
అందరూ తనకు బిడ్డలే.....
ఎంతమంది ముఖాల్లో సంతోషాలు చూసినా
తన జీవితంలోని దుఃఖాన్ని ఏ బిడ్డా చదువలేడుకదా!!
అక్కడున్నంతకాలం ఆయమ్మా అని పిలుస్తరుగాని......
అమ్మకాదుగా?
ఎంత శ్రమించినా .....
వెలుగు లెన్ని వచ్చినా.......
ఆశ్రమకు విలువ కట్టగలమా
తన జీవితంలో వెలుగునింపగలమా...!!
***
No comments:
Post a Comment