రాజలింగం - అచ్చంగా తెలుగు
రాజలింగం
సుష్మా విజయకృష్ణ 

డాక్టర్ అప్పయింట్మెంట్ కి ఆలస్యం అవుతోందని కార్  స్పీడు కొంచెంపెంచా..

ఆఫీస్ లో అనుకోని మీటింగ్ ఒకటి తగిలి..బయల్దేరదామనుకున్న సమయం కన్నా ఒక్క ఇరవై నిముషాలు లేట్ అయ్యింది...
బంటీ గాడికి నాలుగు రోజులనించీ జ్వరమూ.. విరోచనాలు..సొరకాయ లా ఉండేవాడు.. ములక్కాడ లా తయారయ్యాడు!
పక్కింటి బామ్మగారి సౌజన్యంతో కొంత, మా వారు నేను వంతులేసుకొని కొంత వాడి దేక్భాల్ చేస్తున్నాం!
'ఇరువురి ఉద్యోగాల అలజడిలో '.. పాట క్రమం తప్పకుండా పాడుతున్నాం నిద్రలేని జ్వరం కాస్తున్న రాత్రులు!
చలికాలం రోజులేమొ.. సాయంత్రం ఆరు దాటకముందు కమ్ముకుంది చీకటి...
నాకోసం బంపర్ ఆఫర్ లాగా వానొకటి మొదలయ్యింది.. అకాలంగా..
గాలి వానలో వాన నీటి లో.. కారు ప్రయాణం..
వైపర్లు రై.. రై..మని తిరుగుతున్నాయి విండ్ స్క్రీను మీద..
డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి పిల్లాడిని ఒక కంట కనిపెడుతూనే.. కార్ నడుపుతున్నా..
ఇంతలో ఎటు నించి వచ్చిందో చూడనేలేదు.. ఒక పెద్ద లారీ.. ఇంచుమించు కార్ని ఆనుకొని రాసుకుంటూ… అన్నట్టుగా వెళ్ళింది.. జూయ్య్ మని!
ఒక్క క్షణం గుండె గుభేల్మంది! ప్రాణం గొంతు దాటి నోట్లోకి వచ్చింది!!
చెమటలు కారాయి నుదుటిమీంచి!
నాకు తెలిసిన ఆంజనేయ దండాకలాన్నీ బయటికే చదివేశాను వరుసగా!
బ్రేక్ వేయలేను.. స్టీరింగు తిప్పలేను..ఇరువైపులా వాహానాలు దూసుకుపోతున్నాయి..అందరూ వానను తప్పించుకుంతూ.. ఇళ్ళకు చేరే రంధిలో ఉన్నారు..
భుజాలు ఒకలాంటి తిమ్మిరెక్కాయి నాకు.. టెన్షన్ తో నరాలన్నీ బిగుసుకుపోయాయి..
హమ్మాయ్యా.. ఏం జరగలేదనే తీర్మానానికి రావటానికి ఒక్క క్షణకాలం పట్టింది!  
కుదిరినవెంటనే బండి పక్కకు తిప్పి.. ఆపి.. ఒక్కసారిబంటీ గాడిని ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నాను..భయంగా..! అమ్మో వాడున్న వైపు నించే వెళ్ళింది లారీ.. ఏమన్నా అయ్యి ఉంటే..? అన్న ఆలోచనే ఇంతలా భయపెడుతోందే..
ఏమైందన్నట్టు అయోమయంగా చూశాడు వాడు నావంక నీరసంగా~ పాపం..తప్పిన ప్రమాదం వాడికేం తెలుసు?
ఎందుకో తెలియదు.. మా రాజలింగం గుర్తొచ్చాడు నాకాక్షణాన!
రాజలింగం మమ్మల్ని చిన్నప్పుడు రోజూ స్కూల్ కి తీసుకెళ్ళి.., మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే  ఆటో డ్రైవర్. ఐదారేళ్ళు అతని ఆటోనే మాకు బెంజి కారు! మనిషికింత చొప్పున నెల జీతం తీసుకునే వాడు. ఆ చిన్న ఆటో లో ఒక పదమూడు మంది పిల్లల్ని కూర్చోపెట్టేవాడు. ఎలాగో అని మాత్రం అడక్కండీ!
సీటు కి వీపు ఆనుకునే దగ్గర చిన్నపిల్లలైతే ఒక నలుగురు , ఓ మోస్తరు పెద్దవాళ్ళైతే ఒక ముగ్గురు..సీటుమీద ఒక నలుగురు, లేక ఐదుగురు.. సీటు కి ముందు- అతను కూర్చునే సీటు వెనుక భాగానికి మధ్యలో వేసిన చెక్క బల్లమీద ఇంకో నలుగురు.. ఇలా అన్న మాట!
ఇవాల్టి రోజున ఈ షేరింగ్ ఆటోల కన్నా చలా నయం! ఎలా? అని మీరు అడగచ్చు.. లింగం పిల్లల్ని అలా ఇరికించేవాడు.. వీళ్ళు పెద్దల్ని కూడా అలా ఇరింకించేస్తారు..
కానీ ఈ పద్ధతి అసలు చాలా ప్రమాదకరం కూడా..!
అదెలాగో చెప్పటానికే ఈ కధా ..కమామిషు!
రాజలింగం ఉదయాన్నే 8 ఇంటికల్లా వచ్చేస్తాడు! రావటం ఆలస్యం.. బద్ధకిష్టులమైన మమ్మల్ని తరమటానికిగాను బయట ‘టొయి టోయి’ మని బంతి హారన్ ఒకటి మోగించటం నేనిప్పటికీ మర్చిపోలేను..
కంచాల్లో తింటున్నవాళ్ళం తింటున్నట్టే లేచి చేతులు కడుక్కొని మారు మాట్లాడకుండా ఆటో ఎక్కేసేవాళ్ళం!
ఈ హడావుడిలో బెల్ట్ మర్చిపోవటమో, బ్యాగు మర్చిపోవటమో, హోంవర్క్ మర్చిపోవటమో.. లేక ఇంకేదో మర్చిపోవటమో రొటీన్ గా జరిగే తంతే! బూట్లు వేసుకోని వారొకరైతే.. ఒక్క బూటుతో కుస్తీ పడుతున్నావాళ్ళొకరు..
తొమ్మిదింటికి స్కూలైతే.. మూడు కిలోమీటర్లకి భాగ్యానికి ..గంట ముందే బయల్దేరాలా అన్నారు ఒక సారి విషయం తెలియని శ్యామలా రావుగారు.. ఆయన కొత్తగా మా పక్కవాటాలో అద్దెకు వచ్చారులే!
“పది నిమ్షాలల్ల జామై ఉస్మానియ గేటు పడ్తది సార్- దినాము ఏదోక ట్రేన్ లేట్ నడుస్తది. ఈ లోపటి సంది ట్రాకు దాటాలన్నట్టు..ముందుగాలా పోకుంటే.. గంతే సంగతులు. గాగేట్ మల్ల ఎప్పుడు లేస్తదో మనకే కాదు.., ఆ పైనోడిక్కూడ ఎరుకుండదీ.., గందుకే జల్ది పోవాలే”, అని మీసం దువ్వుతూ జవాబిస్తాడు రాజలింగం.
వీరప్పన్ మీసాలకి అప్పగారిలాగా ఉంటాయతని మీసాలు. నిజంగానే నిమ్మకాయలు నిలబెట్టచ్చు!!
రైల్వే క్రాసింగ్ దగ్గర పొరపాటున గేట్ పడిపోతే.. మాకు మహా సరదా..ఆటో దిగి.. ఆ గేట్ కి వ్రేళ్ళాడి ఉయాలూగేవాళ్ళం.. ఈ అల్లరంతా అమ్మకి అమ్మమ్మకి తెలుసో లేదో మరి..?
కానీ రాజలింగం మాత్రం తన చూపు మా మీద నించి పక్కకి మరల్చేవాడు కాడు! మళ్ళీ జాగ్రత్తగా మమ్మల్ని అప్పగించాలి కదా? నిన్న.. మొన్న కట్టప్పొచ్చాడు కాని.. మా రాజలింగం మామ ఎప్పటి వాడో!
ఇహ రాజలింగం గుర్తొచ్చిన విశేషమేమనగా..
అది ఒక శనివారం.. ఒంటి పూట బడి.. మిషినరీ స్కూల్ ని అలా అంటే బావుండదేమో. .. అదే హాఫ్ డే..రాజలింగం యధాప్రకారం అందరినీ ఆటో ఎక్కించి ఇళ్ళకు పయనమయ్యాడు..
రేల్వే గేట్ కూడా దాటేశాం.. ఇంకో రెండు సందులు దాటితే ఇల్లే.. అనగా...
ఎదురుకుండా వచ్చిందండీ.. ఒక పెద్ద లారీ..
ఇది మామూలే కదా.. రోడన్నాక లారీలు బస్సులూ ఉండవా ఏంటి?
నేను ఎప్పతిలాగా వెనక చెక్క బల్ల మీద మధ్యలో కూర్చున్నాను. ఏమైందో తెలిసే లోపుగా ఆటో అమాంతం పక్కకు ఒరిగింది.. నేను పక్కనున్న మహతి మీద పడ్డాను.. అది కింద నేల మీద పడింది.
ఆ...... అని అరిచాం అందరం.. అంద దుమ్ము దుమ్ము..
కాసేపేమీ తెలియలేదు.. నలుగురు చేరటం.. కొంచెం కోలాహలం.. బోలెడంత గోలగా ఉంది..
ఒక పది మంది వచ్చి ఆటో ని లేవదీశారు..అందులో ఉన్నవాళ్ళమున్నట్టు.. డబాలో అగ్గిపుల్లల్లా మళ్ళీ నిటారుగా సద్దుకున్నాం.
మెల్లగా ఒక్కొక్కళ్ళని బయటికి లాగారు అందరు..నాకు మోచేయి గీసుకుపోయింది.. మహతి బ్యాగుకున్న బకిల్ గుచ్చుకున్నట్టుంది.. దానికేమొ మొహం మీద ఒక చిన్న చార..కింద నేల మీదేదో కంకర గీసుకున్నట్టుంది..
మిగతా వారిది ఇంచు మించి ఇదే పరిస్థితి!
రాజలింగం వైపు చూశాను నేను..ఆకాశం వైపు చూసి ఒక దండంలాంటిది పెట్టి..ఎవరి మీదనో అరుస్తున్నాడు..
ఏయ్ మల్లేస్.. ఆ ఇద్దరిని ఇటు తొలు.. పిల్లల్ని ఇంటికి సేరేయాలె..ఈ ఆటో ని దుకనం కాడికి ఈడ్చికెల్లుండ్రి..దబ్బున రండ్రి..
అతనితో మాట్లాడాలంటేనే భయమేసింది.. మాట్లాడకుండ అతను చూపిన ఆటో ఎక్కి ఇంటికెళ్ళాం..
ఇంట్లో తాతమ్మ (అమ్మమ్మా వాళ్ళ అమ్మ ) ఉంది ఆ పూట.. నా మో చేతి పరిస్థితి అదీ చూసి.. ఖంగారు పడింది ఆవిడ.. ఏమైందమ్మా అని ముందుకొచ్చింది..
ఏం గాలే అమ్మ.. ఆటో బ్రేక్ ఫెయిలైనాది.. మొత్తం ఆటో నంతా పక్కకి ఈడ్చేసిన.. పిల్లలంతా మంచిగున్నారు.. ఏం పరేషాన్ కాకుండ్రి.. నే మల్లొస్తా అని వెళ్ళిపోయాడు రాజలింగం!
అతను చేసిందేమిటో.. అసలేమైందో అప్పటిక్కానీ అర్ధం కాలేదు నాకు!
ఎదురుకుండా లారీ వస్తే.. బ్రేక్ వేయబోయాడు.. అది కాస్తా ఫెయిల్ అయ్యిందని తృటిలో తెలుసుకొని.. మెరుపులాంటి ఆలోచన చేసి.. షటర్ మూసి ఉన్న ఒక షాపు వైపు ఆటో ని తిప్పి.. మొత్తాన్ని పక్కకి వంచేశాడు మా కట్టప్ప + బాహుబలి! అలా మా అందరి ప్రాణాలు కాపాడాడు! ఆటో ని దక్కించుకున్నాడు..
ఏమైనా జరిగి ఉంటే.. అన్న ఆలోచన రాలేదు.. రానివ్వలేదు..!
ఆ సమయానికి అతను చేసినది తప్పా ఒప్పా అన్న మాట పక్కనుంచితే.. సమయస్పూర్తితో వ్యవహించాడు అన్నది మాత్రం తెలియవచ్చింది. 
ఆ సంఘటన నేనెప్పుడూ మర్చిపోను. అతన్నీ మర్చిపోను.
  ******

No comments:

Post a Comment

Pages