మాట్లాడే మనిషి - అచ్చంగా తెలుగు

మాట్లాడే మనిషి

Share This
మాట్లాడే మనిషి  
పూర్ణిమ సుధ 


’ఏమే సుబ్బూ..! తెల్లారిందా ?’ ఇప్పటికిది ముఫ్ఫై తొమ్మిదో సారి... సుబ్బలక్ష్మిగారికి విసుగూ, చిరాకూ, నవ్వూ, బాధా అన్ని ఒకేసారి వచ్చేసాయి. ’ఏమండీ, మన రంగడింకా కూయనేలేదు. అప్పుడే ఎలా తెల్లారుతుంది ? మీ ఆత్రానికైనా హద్దుండాలి. మీ మనవరాలి రాకేమో గానీ నా ప్రాణానికొచ్చింది. అరె..! క్షణం కునుకుపట్టనీరు...! మీరూ పడుకోరు. అప్పటికీ మా పిన్ని అంటూనే ఉండేది, మరీ ముసలాడిలా ఉన్నాడు, చాదస్తం ఎక్కువేమో..! మరోమారు ఆలోచించి ఆ కాకినాట్లారి సంబంధం ఖాయం చేసుకుంటే బావుంటుందేమో అని..! నేనే... పిచ్చిదాన్ని...’ అంటూ మిథునంలో బుచ్చిలా ప్రేమగా విసుక్కుంది. వారింట్లో ఉన్న కోడి, పాడి అన్నిటికీ పేర్లతో సంబోధనే మరి... ’సర్లే చెప్పొచ్చేవు. మా రాజ్యం మటుకు, అప్పుడే దోరమగ్గిన మామిళ్ళా భలే ఉండేది. మా మేనమామ ఏదో మీ సంబంధం చేసుకోమని కాళ్ళా వేళ్ళా పడితే సర్లే అని ఒప్పుకున్నా..” అంటూ ఎదురాడారు రఘురామయ్యగారు. ’చాల్లెండీ సంబడం రేప్పొద్దున మన వైదేహి వచ్చాక కూడా ఇలాగే దెబ్బలాడితే ఊరుకునేది లేదు. వచ్చేది, లేడీస్, మీరు తగ్గాల్సిందే” అంటూ ముందే వార్నింగిచ్చింది సుబ్బు..! ’సర్లేవో, ఇప్పుడిక తెల్లారే ఉంటుంది. ఇంతకీ ట్రైనెప్పుడొస్తుందో..! నిజంగా ఐదున్నరేనా ? మన రైల్వే వాళ్ళ విధిగా ఓ రెండు మూడు గంటల లేటా ? ఏమిటోనే కాళ్ళూ చేతులూ ఆడట్లా..! మొట్టమొదటిసారి వస్తోంది, దారిలో ఏం తిన్నదో ఏమిటో..? చక్కగా అన్నీ వండి పెట్టు..! ఆ దిక్కుమాలిన పాశ్చాత్య తిండి, ఉప్పు కారం లేకుండా, ఉడికీ ఉడక్కుండా తింటారు’ అని చెబుతూండగా ఫోన్ మోగింది. పరుగులాంటి నడకతో, ఒక్క అంగలో ల్యాండ్ లైన్ అందుకుని, ’హలో’ అన్నారు. అవతలవైపు వైదేహి... ’తాతయ్యా, ఊళ్ళోకి దిగాను. కానీ ఎంతకీ ఒక్క ఆటో లేదు. కడియపులంకకి ఎలా వెళ్ళాలని గూగుల్ మ్యాప్స్ లో కొడితే కూడా ఏమీ రాలేదు, వేర్ ద హెల్ ఆర్ యు గ్రాండ్ పా..” అని విసుక్కుంది. ’హయ్యో..! వచ్చేసావా ? ఇదిగో ఐదు నిమిషాల్లో నీ దగ్గరుంటా..! నీ కుడి చేతి వైపు నీలం రంగు రూముందా ? అందులో జగన్నాధం గారని స్టేషన్ మాస్టర్ ఉంటారు. రఘురామయ్య గారి మనవరాలినని చెప్పి అక్కడ కూర్చోమ్మా..!’ అని ఆఘమేఘాల మీద సుబ్బు కాళ్ళ కింద నిప్పులు పోసినంత పని చేసారు... అర్జెంటుగా బండి కట్టి, స్టేషన్ కి బయలుదేరారు. 


స్టేషన్ మాస్టర్ రూమ్ లో కూర్చున్న వైదేహిని చూస్తూనే కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి, ఆనందంతో..! అబ్బాయి గిరి ఏ రోజున పావనిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడో, ఆ రోజునే ససేమిరా గుమ్మం తొక్కద్దని చెప్పి గెంటేసిన వైనం, ఆ తరువాత, వాళ్ళు ముంబైలో స్థిరపడ్డారని కర్ణాకర్ణిగా వినడమే తప్ప, ప్రాణం పీకుతున్నా ఏరోజు ఓ ఉత్తరం ముక్క రాయని తన మూర్ఖత్వం, కొడుకు నుండీ రెండు మూడు సార్లు ఫోన్లు వచ్చినా పట్టించుకోని పంతం, తరువాత, లండన్ లో స్థిరపడిన రెండేళ్ళకి, తమకి టికెట్లు పంపినా చింపి, నిరాకరించిన మొండితనం, ఫోన్లో తాతయ్యా అని ముద్దుగా వైదేహి చేత మాట్లాడించినా మౌనంగా ఖండించిన తన ఈగో అన్నీ స్లైడ్ షో లా కళ్ళ ముందు మెదిలాయి. ఏడాది క్రితమే తన స్నేహితుడు నారాయణరావు గారి ఇంట్లో ఙ్ఞానోదయమైంది. పంతాలన్నీ వదిలి, తనంతట తానే ఫోన్ చేసి మాట్లాడారు. మనవరాలి పేరు వైదేహి అనీ, రేపు వేసవి సెలవులకి, పంపుతామని, వీలు చూసుకుని, వాళ్ళు వస్తామనీ చెప్పడంతో, ఆనందానికి హద్దులు లేవు. వైదేహి ఒక్కసారిగా, ’వాటీజ్ దిస్ గ్రాండ్ పా ? డాడీ ఏమో నువ్వెళితే చాలు, అన్నీ వాళ్ళే చూసుకుంటారన్నారు, మీరేమో స్టేషన్ కే ఇంత లేట్ గా వచ్చారు. కనీసం ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు, డాటా ఆన్ చేసి, టైమ్ పాస్ చేద్దామంటే, ’వాట్ కైండ్ ఆఫ్ ఎ విలేజ్ ఈస్ దిస్ ?’ అంటూ అంతెత్తున ఎగరడంతో ఈ లోకంలోకి వచ్చారు రఘురామయ్యగారు... ’వచ్చేసాగా ? ఎన్నాళ్ళురా సెలవలు ” అంటూ బండి ఎక్కించారు. దారిలో అంతా ’లండన్ పిల్ల ఈ అమ్మాయేనా ?’ అని అడిగితే గర్వంగా ఛాతీ విరిచి అందరికీ పరిచయం చేశారు రఘురామయ్య. గుమ్మంలో దిగుతూనే సుబ్బు ఎర్రనీళ్ళతో దిష్టి తీసి, గుమ్మంలో గుమ్మడికాయ బద్దలుకొట్టి, లోపలికి ఆహ్వానించింది. ’అమ్మా నాన్న ఎలా ఉన్నారని’ అడిగిన సుబ్బు ప్రశ్నకి, వాట్సాప్ లో ఉండే”సూపర్బ్, ఎక్సెలెంట్’ అన్న ఎమోజీ లాంటిదోటి పెట్టి చూపించింది. ’ఇదిగో ఈ గదిని నీకోసమే ప్రత్యేకంగా రెడీ చేసామ’ని తాతయ్య చెబితే, ’వావ్’ అనే ఎమోజీలా మూతిని సున్నాలా చుట్టింది.”ప్రయాణం ఎలా సాగిందంటే’, వాట్సాప్ లో ఒక అమ్మాయి తల కొట్టుకుంటున్నట్టుగా ఉన్న పోజ్ పెట్టింది. పిల్ల సడెన్ గా మూగనోము పట్టిందేంటా అని సుబ్బు అయోమయపడి, భర్త వైపు చూసింది. ఆయనా హైరానా పడ్డారు. స్టేషన్ లో ఇంతెత్తున లేచిన గొంతు సడెన్ గా ఏమయిందా అని ? ఆ రోజంతా తప్పు చేసిన దోషిలా తల వంచుకునే ఉంటే, ఏమీ అర్థం కాలేదు. తామేమైనా తప్పు చేసామా అని పునరాలోచించుకుంటున్నారు. ఇంతలో అద్దం ముందు నిలబడి, పురావస్తు శాఖవారి త్రవ్వకాల్లో బయటపడిన సగం విరిగిన శిల్పం లాగా వివిధ భంగిమల్లో, వికార మొహంతో, రకరకాల హావభావాలతో ఉన్న వైదేహిని చూసి గుండె ఆగినంత పనయ్యింది. సాయంత్రానికి ఊళ్ళో ఉన్న పీరుసాయబుగార్ని పిలిచి తాయెత్తు కట్టించారు. అది సెల్ఫీ అని ఫోటో తీసుకునే ఒక ప్రక్రియ అని రాత్రికి భోజనాల దగ్గర వైదేహి చెబుతుంటే వింతగా విన్నారు. పనిలో పనిగా, డిన్నర్ విత్ గ్రాండ్ పేరెంట్స్ అని ఒక సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తే చూసి, అండమాన్ లో అరవై రోజులుగా అన్నం దొరకని అభాగ్యుల్లా ఉన్న మొహాలు చూసుకుని ఏడవలేక నవ్వారు వృధ్ధ దంపతులు. 


పది రోజుల్లో పది నిమిషాలు కూడా పన్నెత్తి మాట్లాడలేదు, కన్నెత్తి చూడలేదు వైదేహి. ఆషాఢ మాసమని, పెరట్లోని గోరింటాకుని దూసి, చక్కగా రోట్లో వేసి, నూరి, అరచేతుల్లో అప్పచ్చి పెడుతుంటే చల్లదనానికి చక్కిలిగిలి పుట్టి, ముందు నసిగినా, ఆ పూటకి అట్టేపెట్టుకుంది. తన స్నేహితుల మెహందీలో పెట్టుకున్న గోరింటాకుకీ దీనికీ ఎంతో తేడా కనబడింది వైదేహికి. పనిలో పనిగా బామ్మ పాడిన మందారం ఎరుపు, మంకెన పూవెరుపు పాటలో ఒక్క ముక్కా అర్థం కాకపోయినా, సంగీతం నేర్చుకున్న ఆవిడ శ్రావ్యమైన గొంతుకి ముగ్ధురాలైంది. ఎప్పుడూ స్పూన్ తో తినే తనకి, ముద్దలు చేసి పెడుతున్న బామ్మ చేతి రుచి అద్భుతంగా తోచింది. కడిగాక, కొబ్బరినూనె రాసి, పండిన చేతి రంగుని, పండు వెన్నెల్లో చూసుకుని మురిసిపోతున్న వైదేహిని చూస్తూ దంపతులూ మురిసిపోయారు. మర్నాడు, తాతయ్యతో కలిసి అలా వరిచేనుకి వెళ్ళింది వైదేహి. పాలు పోసుకున్న ధాన్యాన్ని, ఆకుపచ్చని తివాచీలా పక్కన పొలాల్లో ఉన్న మొలకల్ని చూసింది. మొదటి సారి ఇంత దగ్గర్నుండి పొలాల్ని చూడడం... ఇంతలో లక్ష్మి ఈనిందని జున్ను పాలు పంపాడు, పక్క పొలంలోని పాలేరు. ’ఈనడం అంటే ?’ అంటూ ప్రశ్నించింది వైదేహి. దారి పొడుగూతా ప్రశ్నలే. తాతయ్య ఓపిగ్గా సమాధానాలు చెప్తున్నాడు. మళ్ళీ గిరికి అన్నీ నేర్పుతున్నట్టుంది. సుబ్బు చేస్తున్న పాడి పోషణ, మేత వెయ్యడం, పాలు పితకడం చూస్తూ, ’ఇట్స్ టూ హార్డ్ టు మెయింటెయిన్’ అని భుజాలు ఎగరేసింది. ఏ వంట చేసినా ’అమ్మో కారం, టూ స్పైసీ’ అంటూ మంచినీళ్ళు తాగే వైదేహి, రెండు రోజుల్లో, వేడి అన్నంలో ముందు ముద్దకి, నల్ల కారం, కరివేపాకు, శొంఠి పొళ్ళు, ఉసిరి, నిమ్మకాయ పచ్చళ్ళు వేసుకుని, ఆ మాత్రం వెన్నముద్ద, కాచిన నెయ్యితో కలిపి ముద్దలు తినిపిస్తుంటే, ఏ కారమూ తెలీలేదు, బామ్మ తాతయ్యల మమకారం తప్ప...! ఇక సాయంత్రం నాలుగయితే, కజ్జికాయలు, కారప్పూస, గులాబీలు, పూతరేకులు, మినపసున్ని... పంటికింద నలగడానికి పోటీపడుతున్నాయ్. అసలు, కజ్జికాయలోకి, ఆ పొడిని ఎలా పంపారనేది, ఇప్పటికీ తనకో మిలియన్ డాలర్ క్వొశ్చనే..! మధ్య మధ్యలో ఇన్స్టా, ఎఫ్.బి, ట్విట్టర్ ఎక్కవుంట్లలో అప్డేట్లు పెడుతున్నా, ముందున్నంత ఫోన్ ఎడిక్షన్ ఇప్పుడు లేదు. పది రోజులెలా ఉండాలా అని భయపడ్డ తను, నెల రోజులైనా టైం తెలీలేదు. ఇంతలో గిరీ పావని లు కూడా వచ్చారు. ఒక్కసారిగా, పది పండగల సందడి, రఘురామయ్య ఇంట్లో..! తనకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి, తృప్తిగా తినిపించింది. పావని కూడా ఏమీ మనసులో పెట్టుకోకుండా ఇట్టే కలిసిపోవడంతో, ఇన్నాళ్ళూ ఎంత మంచి కోడల్ని దూరం చేసుకున్నామా అని తెగ బాధపడ్డారు. రోటి పచ్చళ్ళు అనే పేరుకే తప్ప, అన్నీ నుజ్జునుజ్జయేలా మిక్సీలో వేయడం వల్ల అసలు రుచి తెలియలేదనీ, ఉత్త పచ్చి మిరప, చింతపండు, కచ్చాబద్దాగా నలిగినా, ఉప్పు చేర్చి, వేడన్నంలో నెయ్యేసి కలిపితే అమృతతుల్యమని అత్తగారి చేతి వంటని ప్రశంసిస్తుంటే ఆనందంతో మురిసిపోయారు సుబ్బు. టి.వి. లేదు, మొబైల్ లేదు, అయినా ఎంత ప్రశాంతంగా ఉన్నారు ? ఎలా అన్నది వైదేహి. అవి లేవు కాబట్టే అంటూ తేలిగ్గా నవ్వేసారు రఘురామయ్యగారు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే మనుషులున్నారు... ’తాతయ్యా..! నా మెడిసిన్ పూర్తవగానే, నేనిక్కడే ప్రాక్టీస్ చేస్తా..! వాట్ సే ?’ అంది వైదేహి. తప్పకుండా..! నీకోసం నేనో ఆసుపత్రి కట్టిస్తాను అని మాటిచ్చారు తాతయ్య. సెలవులు ముగుస్తూనే కొడుకు, కోడలు, వైదేహి యూకే వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళూ ఎన్నడూ లేని వెలితితో ఇద్దరికీ ఏమీ తోచట్లేదు. ఇల్లంతా బోసిపోయింది. రెండేళ్ళు గడిచాయి... ఎంతో ఉత్సాహంగా ఊరొచ్చిన వైదేహికి గుమ్మంలో ఎవ్వరూ ఎదురురాలేదు. ఏమైందని పక్కవాళ్ళని అడిగితే, రెండు రోజుల క్రితం ఉరుములు మెరుపులతో వర్షం, ఈదురుగాలి వస్తుండగా ఇద్దరూ పొలానికెళుతూంటే, పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. అదేంటి మరి, కనీసం ఒక్క ఫోన్ చెయ్యలేదని నిలదీస్తే మా దగ్గర విదేశాలకి ఫోన్ చేసేంత పెద్ద ఫోన్ లేదమ్మా అన్నారు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలీని వైదేహి, 'సైన్స్ అభివృధ్ధి చెందినప్పుడు, మనమూ ఒక అడుగు ముందుకు వేసి, దాన్ని అందిపుచ్చుకోవాలి. తెలీదని అలాగే ఉంటామని అంటే ఎలా ?' అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. జరిగింది తల్లిదండ్రులకి చెప్పి, ఆ ఇంటినే తన ఆసుపత్రిగా చేసుకుని, అక్కడున్న ప్రజలకి వైద్యమే కాదు, సాంకేతికత కూడా నేర్పుతూంది. ఇప్పటికీ గోరింటాకు దూసినా, గోరువంక కూసినా బామ్మ పాట తన చెవుల్లో మ్రోగుతోంది. పెరట్లోని రోలు రోటి పచ్చడి నూరే వారు లేక బోసిపోతోంది... పాడి, కోడి కూడా ఇప్పుడు వైదేహిలాగే అనాథలుగా మిగిలిపోయాయి...  కానీ వైదేహి మాత్రం ఎందరికో ప్రాణదాతయింది. ఆ ఇల్లు మళ్ళీ ఒక తెలుగు లోగిలిగా మారింది.
  *****

No comments:

Post a Comment

Pages