పేరిణి వైభవం -1 - అచ్చంగా తెలుగు
పేరిణి వైభవం -1
 శ్రీరామభట్ల ఆదిత్య సృష్టిలో ప్రతీ నాట్యానికి ఆ చిదంబరేశుడే ఆద్యుడు. సృష్టి ఆరంభానికి, నిర్వహణకు మరియు లయానికి అయ్యవారి తాండవం, అమ్మవారి లాస్యమే కారణం. అలా ఆయనలోంచి పుట్టిన నాట్యాలు ఎన్నో ఉన్నాయి. అందునా లాస్యతాండవ ప్రధానమైన నాట్యం 'పేరిణి నాట్యం'. పేరిణి నాట్యంలో తాండవం చేసేది పురుషులు మరియు లాస్యాన్ని స్త్రీలు చేస్తారు. అప్పుడప్పుడు అర్థనారీశ్వర రూపంలో తాండవలాస్యాలని ఒక్కరే చేస్తుంటారు. 

మన దేవాలయాలలో భగవంతుడిని కేవలం ఆగమాలలో సూచించిన పూజాపద్ధతులతోనే కాక సంగీత,నాట్య,వాయిద్య కళలతో కూడా అర్చించేవారు. అలా ఆ కళలను పదర్శించే కళాకారులను రాజులు ప్రత్యేకంగా మాన్యాలు ఇచ్చి పోషించేవారు. అలా పేరిణి నాట్య పోషకులు కాకతీయులు.
ముఖ్యంగా మనకు దేవాలయాలలో ఉండే ముఖమండపంలో నాట్యాన్ని ప్రదర్శించేవారు కళాకారులు. అలా కాలాంతరంలో తమ సంతానంలో ఒకరిద్దరిని దైవ సాన్నిధ్యంలో కళాసేవకు సమర్పించేవారు. వారే నాట్యాన్ని అభ్యసించి భగవంతుని ముందు నాట్యం ఆడేవారు. వీరిలో ఆడవారు లాస్యప్రధాన నాట్యాన్ని ప్రదర్శించేవారు. మేలుకొలుపు దగ్గరినుండి పొద్దున్నే సమర్పించే బాలభోగం, మధ్యాహ్నం పెట్టే మహానైవేద్యం, సాయంత్రాలలో జరిగే ఉత్సవాలలో, రాత్రివేళలో నైవేద్యం తరువాత జరిగే శయనసేవలోని జోలపాటల వరకు ఈ కళాకారులే ఆడేవారు.
12వ శతాబ్దంలో గణపతి దేవుడి‌ కాలంలో యుద్ధాలకు వెళ్ళేముందు తమలో శివశక్తులను ఆవహింపచేసుకొని వీరశైవులు ఈ పేరిణినాట్యంలో తాండవం చేసేవారట. అందులో ముఖ్యంగా నాలుగు తెగలవారు ఈ నాట్యం చేసేవారు వారే మహేశులు, పశుపతులు, మైలారులు మొదలైనవారు. అలా 900 ఏళ్ళక్రితం ఈ నాట్యం కాకతీయుల ద్వారా ప్రసిద్ధమైనది. ఆ తరువాత ఢిల్లీ సుల్తానుల దండయాత్రలలో కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోగా దానితోపాటే పేరిణి నాట్యం కుడా కనుమరుగైంది.

ఆ తరువాత ఆ నాటరాజస్వామి కృపతో అంతరించిపోతున్న ఎన్నో నాట్య కళలను పునఃసృష్టించిన నాట్యఋషి పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. ముఖ్యంగా ఆంధ్రనాట్యం, పేరిణి నాట్యాలను మళ్ళీ సృష్టించిన నాట్య తపస్వి రామకృష్ణ. ఆయన లేకుంటే బహుశా ఈ నాట్యం గురించి ఎవరికి తెలిసేది కాదేమో. 1974లో డా|| నటరాజ రామకృష్ణ గారు మొదటిసారి నాట్యం గురించి ప్రస్తావించారు. మొదటగా పురుషులు చేసే తాండవరీతిని మళ్ళీ సృష్టించి పేరిణిలో తాండవ భాగాన్ని పునః నిర్మించారు. ఆ తరువాత తెలంగాణ ఆలయాల్లో నాట్యం చేయబడిన లాస్యాన్ని కలుపుకొని పేరిణి లాస్యంగా తీర్చిదిద్ది లాస్యతాండవ సహితమైన పేరిణి నాట్యానికి ఒక రూపుని ఇచ్చారు.
పేరిణి నాట్యం గురించి తరువాయి భాగంలో మరింత తేలుసుకుందాం....
***

No comments:

Post a Comment

Pages