నెత్తుటి పువ్వు - 5 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 5

Share This
నెత్తుటి పువ్వు - 5
మహీధర శేషారత్నం

(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. )
‘రాజు!" పిలిచాడు శంకరం. శంకరం నాగరాజ ఆత్మీయ మిత్రుడు ఒకే సూల్లో చదువుకున్నారు. అప్పట్నుంచీ ప్రాణమిత్రులే. ఒకసారే పోలీసువృత్తిలో చేరారు. అనుకోకుండా ఒకటే స్టేషన్లోనే పనికూడా.

            ఉc" ముక్తసరిగా అన్నాడు రాజు.    

            "నేను విన్నది నిజమేనా?

            మాట్లాడలేదు రాజు,

            “ఏం విన్నావో అడగవేం?"

             “ఏం విన్నావు గొంతు పెగల్చుకొని రాని నవ్వుతెప్పుకున్నాడు నాగరాజు

            "తలెత్తి నాకేసి చూడు" రెట్టించాడు శంకరం.

            “సెల్లో వేసి చితక్కొడుతున్నట్లు ఏమిట్రా ఆప్రశ్నలు?" నవ్వాడు

            “ఎవరా అమ్మాయి?" మాట్లాడలేదు రాజు.

            "రాజా! నువ్వు, నేనూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యోగ ప్రయత్నాలు చేశాం. అనుకోకుండా ఒకేచోట పని చేస్తున్నాం. నువ్వేమిలో నాకు తెలుసు. నేనేమిటో నీకు తెలుసు. నిజానికి మన మనస్తత్వాలకీ, ఈ ఉద్యోగానికి అంతగా పొత్తు కుదరదు. కాని బ్రతుకు తెరువుకేదో ఒకటి అనుకున్నాం. కానీ నువ్వు ఏంచేస్తున్నావో నీకు తెలుస్తోందా? నా మిత్రుడు రత్నం లాంటివాడు అనుకున్నాను. కాని అమ్మాయిల వ్యామోహంలోపడి నాశనమయిపోతాడనుకోలేదు. " బాధ నిండిన గొంతుతో అన్నాడు శంకరం.

          “ఏయ్! ఏమయింది ఇప్పుడు? అంతమాట అంటున్నావు? ఏదో సహాయం... అంతే కంగారుగా అన్నాడు

            “కొద్దిగా జారడం మొదలెడితే, ఇంక కిందకే..." అన్నాడు కటువుగా శంకరం

            "అయితే ఆడపిల్లలకి సహాయం చెయ్యకూడదా?"

            "చెయ్యచ్చు, కొంతవరడే, కూరలు, పాలు, నీళ్ళు కూలీపనులు చెయ్యడం... ఇదంతా సహాయమా?" సీరియస్గా అడిగాడు, ఏదో బయటపనులు అలవాటు లేదంటే ఏదో ఒకటి, రెండుసార్లు అంతే" నసిగాడు,

            అయినా నీదాకా వచ్చిందా?" తెచ్చుకోలు నవ్వు తో అడిగాడు,

            “నీ దాకా ...అనే దాకా వచ్చింది, నీ విషయం ఏదైగా మొదట తెలియాల్సిన వాడిని నేను. కానీ అలా.... అలా చక్కర్లు కొట్టి వచ్చింది. అయినా మనం పోలీసోళ్ళం మనం కని పెట్టినట్టే మనల్ని కని పెట్టేవాళ్ళూ ఉంటారు."

            “సారీ! బాబూ! ఏం లేదు వదిలెయ్.. రా!చాయ్ తాగుదాం" శంకరం భుజం మీద చెయ్యేసి లేవదీసాడు

            "లేదు రాజా మగవాడి పెద్ద బలహీనత ఆడది. ఏదో కొంచెం జాగ్రత్తగా..."

            మాట పూర్తి చెయ్యనివ్వకుండానే "పదపద” అంటూ లాక్కుపోయాడు రాజు. ఆసంతృప్తిగానే అనుసరించాడు శంకరం,

            నలుగురి నోళ్ళలోనూ నానకుండా ఇంక ఇక్కడితో కట్ చెయ్యాలని గట్టిగా అనుకున్నాడు నాగరాజు,

            అయితే ఏదో ఒక ఏర్పాటు చెయ్యకుండా, ఎలా వదిలెయ్యడం అని ఆలోచనలో పడ్డాడు.

*****

            పప్పు, ఉప్పు, చింతప్పుడు, బియ్యం, కిరసనాయిలు... అన్నీ ఒకటొకటిగా అతను సంచీ లోంచి తీస్తున్నంతసేపూ ఆమె బొమ్మలా అలాగే చూస్తూ కూర్చుండి పోయింది.

            "ఇవన్నీ నీకే.. కాసింత ఒండుకుని తిని ఏదైనా పనిచూసి చేసుకో, నేనూ చూస్తాలే..." అన్నాడు.

           

            "ఏమనుకుంటున్నావు? నన్నేం చేద్దామని ఈడకు తెచ్చావు? ఇవన్నీ పారబోస్తాను. ఏమిటిది?... సివంగిలా లేచింది. చెంప ఛెళ్ళుమనిపించాడు. "ఖర్చు పెట్టి, కష్టపడితెస్తే పారబోస్తావా? ఏమనుకుంటున్నావు? స్టేజి ఎక్కితాగి తందనాలాడడం అనుకున్నావా.. విసురుగా అన్నాడు

          ఆ మాటకు ఆమె మనసు చివుక్కుమంది.

            "తాగుతానో, తందనాలాడతానో! నీ కెందుకు? నువ్వేం ఆర్చేవాడివా? తీర్చేవాడివా? ..." మీద మీదకు వస్తూ అరిచింది. ఒక్క తోపు తోసాడు. తూలిపడబోయి అపుకుంది. "దేవుడు నీకు అద్భుతమైన అందం ఇచ్చేడు. అది తగ్గించి రవ్వంత తెలివి పెట్టినా బాగుండేది. అంట్లు తోముకునైనా బతికేదానివి. నిన్ను వాళ్ళు ఎందుకు చేరదీశారో తెలుసా! నీ అందంచూసే..ఎవరికో అనేస్తే ఎయిడ్స్ వ్యాధివచ్చి వచ్చి పుచ్చి పుచ్చి చస్తావా? నీకదే బాగుంటే అలాగే చాపు, జాలిపడి తెస్తే తెగ నీలుగుతున్నావు... నాకీ దరిద్రం ఎందుకు? ఛీ..ఎరక్కపోయి తెచ్చాను. వెధవను... ఎలాచస్తే నాకెందుకు?" ... విసురుగా వెళ్ళిపోయాడు.

          నాలుగడుగులు వెళ్ళాక జాలేసింది.

            ఆ అమ్మాయి భయం ఆ అమ్మాయిది. ఒంటరిగా ... నేరెవరో తెలియనప్పుడు... నన్నే మాత్రం ఎలా నమ్ముతుంది అనుకున్నాడు. తిన్నగా  రాములమ్మ దగ్గర కెళ్ళాడు. ఆరుబయట పొయ్యిపెట్టి అన్నం వండుతోంది.

          'రా! రాజబాబూ! ఇలా వచ్చేవేమిటి? రా! కూచో! కాసింత టీ పెడతాను." మాట్లాడుతూనే టీ నీళ్ళు పడేసింది. అక్కడే ఉన్న కుక్కి మంచంలో కూలపడ్డాడు.

            "అక్కా నువ్వో సాయం చెయ్యాలి.." టీ తాగుతూ అన్నాడు. "నేనా! ఏంటిబాబూ!" అంది రాములమ్మ,

            మెల్లిగా ఊదుకుంటూ టీ తాగుతూనే "నేను తెచ్చిన అమ్మాయి... చెప్పబోయాడు.

          "సరోజమ్మ బాబూ.... అంది అర్ధాంతరంగా,

          ఓహో! ఆ అమ్మాయి పేరు సరోజ అన్నమాట అనుకున్నాడు మనసులో

          “ఆ! ఆఁ! సరోజ గురించే! నేను అస్తమానం వచ్చి వెడుతున్నా బాగుండదు. చిన్నది వయసులో ఉన్నది. కాస్త మంచి చెడ్డలు చూస్తుండు అక్కా" అన్నాడు ముఖమాటంగానే.

            “నీకెందుకు బాబూ ఈ లంపటం..." అంటూ.... సందేహంగా.... తటపటాయిస్తూ

          “నీకు కానీ ఆ పిల్లమీడ....”

          మధ్యలోనే ఆపేసాడు.

            “ఛ ఛ! అలాంటిదేం లేదక్కా ఆ పిల్లని ప్రతేడూ రికార్డుంగు డాన్సుల్లో చూస్తున్నా ఆ అందం చూస్తుంటే ఆగమయిపోద్దనిపించి వదిలెయ్యలేకపోయాను. "

            “చూడు బాబూ! నువ్వా పెళ్ళయినోడివి. ఒక కొడుకు కూడా ఉన్నాడంటివి. ఆ పిల్లా! వయసులో ఉన్న ఆడపిల్ల. జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి ఏ పనైనా...!" మెత్తగానైనా గట్టిగా చెప్పింది రాములమ్మ.
(సశేషం)

No comments:

Post a Comment

Pages