నా ప్రేయసి యాదిలో - అచ్చంగా తెలుగు

నా ప్రేయసి యాదిలో

Share This
 " నా ప్రేయసి యాదిలో"

నాగ్రాజ్..


వాన నీటినంతా 
తనలోనింపుకుని
తామరాకులనీటి ముత్యాలతో
విచ్చిన తామరపూలతో సూరీడికి స్వాగతం 
పలికింది నా ప్రేయసి!

మత్స్యకన్నియలకు ,మండూకాలకు
కొంగలకు ,నీటిబాతులకు విడిదిగా మారింది
నా ప్రేయసి!

చాకలి ఐలన్న ఊరి మురికినంతా 
తన పక్కలపరిచిన బండమీద బాదుతుంటే
ఊరి మురికినంతా తనలో నింపుకుంది
నా ప్రేయసి!

గోపయ్య బర్లమందను తోలి 
గడ్డిపీసుతో బర్ల వీపు తోముతుంటె
మనసార మైలంత కడిగిపారేసింది
నా ప్రేయసి

ఆ పక్క పోరగాండ్లు గట్లమీదనుంచి
చడ్డీలు తొడిగి ఎగిరెగిరి దుంకుతుంటె
పసినవ్వుల సావాసగాల్ల
ఈతకొలనైంది నా ప్రేయసి!

తూముకాడ రెడ్డి లాకులెత్తుతుంటె
ఎప్పుడెప్పుడు కలుసుకుందామాని
విరహవేదనతో రగిలే ప్రియురాలిలా
ఉరికురికి పారింది గల గలాదూకింది
పొలాలకి నా ప్రేయసి!

కార్పోరేట్ నీళ్ళదంద గాల్లకు
కట్టబెట్టారంట నాప్రేయసిని!

కంచె కట్టి ఇనుపతీగలతో బంధిస్తున్నారు
యంత్రాలతో 
వ్యభిచారం చేయిస్తున్నారు
నా ప్రేయసిని !

కుమిలిపోతున్నా 
బాధతో కమిలిపోతున్నా...
ఊరినంతా ఒక్కతీరుగ ప్రేమించిన
నా ప్రేయసి
వ్యాపారసంకెళ్ళలో బంది అయిందని

***

1 comment:

  1. నా కవితను ప్రచురించి ప్రోత్సహించిన సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు

    ReplyDelete

Pages