నెత్తుటి పువ్వు - 3 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 3

Share This
నెత్తుటి పువ్వు - 3
మహీధర శేషారత్నం 

(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు హీరో. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు.)

ఆ మాట వింటూనే హఠాత్తుగా కూలబడి ఏడవడం మొదలు పెట్టింది. ఇతను ఉలికి పడ్డాడు..
            “మా తల్లివిగా! ఇలా ఏడవకమ్మా! ఎవరైనా వింటే నిన్నేదో చేసేనని గోలగోలగా వస్తారు" కొద్దిగా భయపడుతూ అన్నాడు. ఇది గమనించి ఆమె కంఠం ఇంకా పెంచింది. అతను చటుక్కున చెయ్యి ముందుకు చాచి లాగించి కొట్టాడు. బిక్క చచ్చిపోయి చెంప పట్టుకుని నోరు టక్కున మూసింది.
            "మొగలిపొత్తు నంటిపెట్టుకున్న మొదటిరేకులా మృదువుగా, చక్కగా ఉన్న అందం నీకు శాపమై పోతుంది. దేవుడు నీకు ఇంతటి అందాన్ని ఇవ్వకుండా ఉంటే బాగుండేది. మామూలు ఆడవాళ్ళలా ఉంటే నీ దారిన నువ్వు బ్రతికేదానివి. కానీ దురదృష్టవశాత్తూ నీకు విపరీతమైన అందాన్ని ఇచ్చాడు. ఈ అందం బదులు అందులో సగం తెలివి ఇచ్చినా బాగుండేది. ఏ కూలో, నాలో చేసి బ్రతికే దానివి. ఈ సంఘం అంత బాగున్నట్టు లేదు. తెల్లారిలేచి చూస్తే పేపర్ల నిండా భయంకరమైన వార్తలే, ముఖ్యంగా స్త్రీలమీద అత్యాచారాలు,బయటికెడితే ఇంటికొచ్చేదాకా భయమే, పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా  ఆడదాన్ని వడలటం లేదు. ఎన్నోసార్లనుకున్నా నాకు సంబంధంలేని ఈ అమ్మాయి గురించి నా కెందుకని, ఉండలేకపోయాను. నువ్వు ఎంచుకున్న డబ్బు సంపాదనా మార్గమే అలాంటిది. మెల్లిగా మూడు,నాలుగేళ్ళలో నిన్ను ఏ రెడ్లైట్ ఏరియాలో ఏవెధవో అమ్మేస్తాడనిపించింది. అలాగే జరిగితే ఏ ఎయిడ్సోవచ్చి ఒళ్ళంతా పుచ్చి కొన్నాళ్ళు తీసుకు తీసుకు దిక్కులేని చావు చస్తావు" అతను సీరియస్గా ఇలాచెబుతూంటే ఆమె కళ్ళముందు తాను ఇలా దిక్కులేని చావు చస్తున్న చిత్రం కడలాడింది.
          భయంగా ముందుకు జరిగి అతని మోకాళ్ళపై తలపెట్టింది. ఇతడు లాలనగా ఆమె వెన్ను నిమిరాడు. ఒక్క క్షణం ఆమెకు సాంత్వనగా అనిపించింది. నా కోసం ఒకరున్నారనే భావన మనసును మెత్తపరిచింది. మరుక్షణం అనుమానం మనసులో పాములా కదలాడింది. చివ్వున తలెత్తి అతనిని సూటిగా చూసింది.
          “నన్ను మోసం చేస్తే నీకేమొస్తుంది?"
           “ఏమొస్తుంది? నిన్ను జైలులో వేస్తే ఓ కేసెస్తుంది."
            భయం భయంగా కొంచెం దూరం జరిగింది. ఆల్చిప్పల్లాంటి కళ్ళలో కదలాడుతున్న ఆ భయం అతని మనసును కరిగించింది. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.
            "లే లేచి స్టవ్వులో కిరోసిన్ పోసి వెలిగించు కాసిని పాలు కాచి తోడు వేసుకో. అన్నం నీక్కావలసినవి వండుకో.... లే!"
          అతని మాటలు వినపడనట్టుగా ఆమె అంగుళం కూడా కదలలేదు.
          “లే! చెప్పిన మాట విను. నీకు పూట పూటకూ బయటనుంచి కొనుక్కొచ్చే స్థోమత గానీ, తీరికగాని నాకు లేవు . వండుకో. నేను వెళతాను"ఇతను లేచాడు.
            "నాకు తెలుసు. నువ్వు నన్ను వ్యాపారానితే తెచ్చావు. ఎంతయినా  పోలీసోడివి కదా నీకు కావలసిన వాళ్ళకందరికి అణా,కాణీకి అమ్మి పెడతావు. నేను సిగ్గువిడిచి ఒళ్ళు చూపించి అడినా  ఆ పాడుపని మాత్రం చెయ్యలేదింకా! అయిపోయింది. నా చావు కే నువ్వు తీసుకు వచ్చేవు" నేలమీద బోర్లాపడి ఏడవడం మొదలు పెట్టింది.
            అతను కంగారుగా బయటికెళ్ళాడు. వెడుతూ ఈసారి తలుపు గడియవేసి వెళ్ళాడు. ఆమె ఎక్కడికైనాపోయి తలనొప్పి తెచ్చుకుంటుందేమోనని.
          నా ఖర్మ ఈ అమ్మాయిని చూడగానే నా మనసెందుకు కదలాలి? ఎందుకు జాలిపడాలి? ఆ అమ్మాయిచావు ఆ అమ్మాయి చచ్చేది.... ఒక్క క్షణం విసుగ్గాఅనిపించింది.
            పది నిమిషాల్లోఒక ఇంటి ముందు సైకిలు దిగాడు.      
            "అక్కా" గట్టిగా పిలిచాడు
            "ఎవరూ?" అంటూ ఒక నలభై ఏళ్ళ ఆడదీ బయటికొస్తుంది.
             “నువ్వా రాజుబాబూ! ఇవాళప్పుడొచ్చేవేంటి?"
            “ఏం లేదు గానీ! నీతో చిన్న పనుంది. నాతో ఒకసారి రా! నా సైకిలెక్కు"
            నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తుండగానే సైకిలు గుమ్మం ముందు ఆగింది.
            అతడు గడియ తీసాడు. ఆమె ఇంకా అలాగే ఉంది ఎక్కిళ్ళు పెడుతూ.
            "ఈ అమ్మాయి ఎవరూ? ఏవిటిబాబూ! ఆశ్చర్యంగా అడిగిందామె. ఆడ మనిషి మాట వినగానే తలెత్తి చూసింది. .
            "అక్కా ఈ అమ్మాయి పండగలకీ, పబ్బాలకీ తీర్ధాలలో, తిరునాళ్ళలో ఊరూరా తిరిగి రికార్డింగు డాన్సులు చేస్తుంది. నీకు తెలుసుగా అవి ఎలా ఉంటాయో! ఎందుకో ఈ అమ్మాయి నాశనమయిపోతుందని, అలా కాకూడదనీ తెచ్చాను. ఒక విధంగా ఎత్తుకొచ్చాననుకో... అందుకే నేనేదో లాభానికి తీసుకొచ్చానని భయపడి చస్తోంది... అంతలోనే కోపం పెరిగిపోయింది.
            "చావు. నీ చావు నువ్వు చావు. ఫో! ఇక్కణ్ణుంచి,ఇక్కడ చస్తే నా చావు కొస్తుంది. పుణ్యానికి పోతే పాపమెదురయ్యిందని ... నా కెందుకు నీగోల? ఫో! ఇప్పుడే ఫో!" పిచ్చి కోపంతో చెయ్యిపట్టి లేవదీసాడు. జేబులోంచి రెండువందలు తీసి చేతిలో పెట్టాడు..
            ఈ డబ్బు చాల్లే. ఏ రోడ్డు మీద నిలబడి డాన్సు చేసినా నాలుగు రూపాయలు వస్తాయి. ఫో! చావు ..
          అక్కా! ఈ సామాను నువ్వు తీసుకుపో! ఎక్కడైనా చేర్చి సరిగా బ్రతికేట్టు చేద్దామనుకున్నా. ఎందుకు నాకీ దరిద్రం... ఇదుగో తాళం కప్పు. ఆ అమ్మాయినిపంపేసి తాళం వేసి వెళ్ళిపో! రేపొచ్చి నేను తీసుకుంటాను. రిక్షాలో వెళ్ళు" చేతిలో పది రూపాయలు పెట్టి విసురుగా వెళ్ళిపోయాడు. బిక్క చచ్చిపోయి కూర్చుంది.
          లేమ్మా ఆబాబు చెప్పాడుగా ప్రయాణానికి డబ్బులు కూడా ఇచ్చేడు. లే! బయల్దేరు. తాళం వేసి వెళ్ళిపోతాను! తాపీగా ఇందాకా బయటపెట్టినవన్నీ సంచీలో సర్దడం మొదలుపెట్టింది.
          ఎక్కడికి వెళ్ళను?* బావురుమంది అమ్మాయి.
            “ఏడనుంచివచ్చావో ఆడకే!నింపాదిగా జవాబిచ్చింది. లేమ్మా! బెగేళ్లు. నేను తాళం వేసుకు వెళ్ళాలి. తొందర పెట్టింది. బావురుమంది ఆ అమ్మాయి. "రాత్రివేళ నేనెక్కడికి వెళ్ళను. " నీ పేరేంటో నాకు తెల్దు..."రాములమ్మ మాట పూర్తి కాకుండానే అంది ఆ అమ్మాయి.
            “సరోజ!”
            చూడమ్మా సరోజా! ఈడ ఉండమని రాజుబాబు ఏదో ఏర్పాటు చేసాడు. నీకు భయం.. మరేం చేస్తాం... వెళ్ళు..."తాపీగా చెప్పేసి తాళం కప్ప తీసుకు నుంచుంది. సరోజ కదల్లేదు, రాములమ్మ ఓ పావుగంట ఓపిగ్గా నుంచిని ఇంక ఇక నిలబడలేక దగ్గర్లో చతికిల పడింది.
          “చూడమ్మా! ఆ రాజుబాబు చాలా మంచోడు. నా పేరు రాములమ్మ నిజానికి నేనతడికి అక్కను కాను ఇలా పిలుస్తాడంతే... మా ఆయన... లేదా పెనిమిటి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. పోలీసులు తీసికెళ్ళి బొక్కలోవేసి బొమికలిరగ్గొట్టి వదిలేవారు. వచ్చేక ఆ కోపమంతా నా మీద తీర్చుకునేవాడు. తాగొచ్చి నా ఒళ్ళు వాయగొడుతుంటే రాజుబాబది చూసి మా ఇంటి ముంగల్నే కుక్కి మంచంలో వేసి లాఠీతో మా ఓడిని కుళ్ళ బొడిచాడు చస్తాడేమోనని నేనే అడ్డుపడ్డాను. లేవలేని స్థితిలో వాణి డాక్టరు దగ్గరకు తీసికెళ్ళి మందులిప్పించి బాగుచేయించాడు. నా అక్కలాంటిది. ఆమెమీద చెయ్యేస్తే ఏదో ఒక కేసులో బొక్కలో తోసేస్తానని బెదిరించాడు. అప్పటి నించి నా ప్రాణం హాయిగా ఉందనుకో.
          ఏదో మూటలు మోస్తాడు, ఇస్తాడు, పెట్టందితిని కమ్మగా తొంగుటాడు. రాజుబాబు చాలా మంచోడు, ఏదో... పేదాళ్ళు... సేవ.... అంటూ తిరుగుతూంటాడు, భయం అక్కర్లే,బయటిడిపోతే అంతా రాజుబాబులే ఉండరు. పోతావా!" "ఉహూ వెక్కిళ్ళ మధ్యే తల అడ్డంగా ఊపింది. రాములమ్మ లేచి తనే కిరసనాయిలు స్టవ్వులో పోసి వెలిగించి పాలుకారింది. వేడిగా ఒక గ్లాసు పాలు ఇచ్చింది,
            "ఇదిగో! నే వెడుతున్నా! ఎక్కడవక్కడే వదిలివచ్చాకి ఓపికుంటే గుప్పెడు బియ్యం పడేసుకో, పాలు చల్లారేక ఓ తోడు చుక్కేసుకో , రేపు పొద్దుట వస్తా"
            తలుపులు చేరేసి వెళ్ళిపోయింది. మెల్లిగాలేని వీధి తలుపు గడేసి వచ్చింది. నీళ్ళతో ముఖం కడుక్కొచ్చి సామాను ఓ వారగా సర్టింది. పాలల్లో తోడేసివచ్చి పడుకుంది. భయం భయంగా ఆలోచిస్తూ ఏడ్చిన అలసటతో నిద్రలోకి జారుకుంది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages