నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - జీవితపోరాటం  - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - జీవితపోరాటం 

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - జీవితపోరాటం 
శారదా ప్రసాద్ 

డిగ్రీ పూర్తయింది.ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను.గుంటూరు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ లో MA (maths) లో చేరాను.వామపక్ష భావజాలం బాగా ఎక్కువైంది.మరో పక్క మోడరన్ తెలుగు లిటరేచర్ పట్ల కూడా ఇష్టం పెరిగింది.శ్రీ శ్రీ సాహిత్య సభలు ఎక్కడున్నా వెళ్లే వాడిని.కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివి ఎందరు కమ్యూనిస్టులు గా మారారో  తెలియదు కానీ ,నా మహా ప్రస్థానాన్ని చదివి చాలామంది కమ్యూనిస్టులయ్యారు అన్న శ్రీ శ్రీ మాటలు యదార్ధం.అలా కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు బాగా ఆకర్షితుడయిన వారిలో నేనొకడిని.దిగంబర సాహిత్యం అప్పుడే వెలుగులోకి వచ్చింది.సమాజాన్ని చీల్చి చెండాడిన సాహిత్యం అది!సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలి అని కచ్చితంగా నమ్మే వాళ్ళు దిగంబరకవులు.ఆ రోజుల్లో రోజూ మహాప్రస్థానం నుంచి కానీ,కన్యాశుల్కం నుంచి కానీ రోజూ ఏదో ఒక కొటేషన్ మిత్రులకు చెప్పేవాడిని.వర్తమాన సమస్యలు సాహిత్యంలో ప్రతిబింబించాలి .అలాకాకపోతే అది స్మశాన సాహిత్యం అవుతుంది.భగవద్గీత మీద వ్యాఖ్యానం , రామాయణం లాంటివి రాయటానికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండనక్కరలేదు.మన గదిలోనే కిటికీలు వేసుకొని కూడా వాటిని వ్రాయొచ్చు!ఇది అప్పటి నా అభిప్రాయం.ఇప్పటికి కూడా ఆ అభిప్రాయంలో పెద్ద తేడా లేదు.అయితే ,భగవద్గీత మాత్రం దైనందిక జీవిత సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుంది. బీనాదేవి,రావిశాస్త్రి ,కొడవటికంటి కుటుంబరావు,చలం,గోపీచంద్ .....లాంటి వారి రచనలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి.చదువు మీద శ్రద్ధ తగ్గింది.ఇతర వ్యాపకాలు ఎక్కువయ్యాయి.ఇవన్నీ కాక,ఇండియన్ రేషలిస్టు అసోసియేషన్ లో ఆక్టివ్ సభ్యుడిని.కోవూర్  గారి సభలను కొన్నిచోట్ల ఆర్గనైజ్ చేసేవాడిని. సాధువులు,బాబాలు చేసే ట్రిక్కులను కోవూర్ గారు జనానికి వివరించేవారు.సత్యసాయిబాబా మీద ఇప్పటికీ నా అభిప్రాయం మారలేదు.ఆయనొక మెజీషియన్ అని నా అభిప్రాయం.అయితే,ప్రజల దృష్టి మరల్చటానికి కొన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాడు.సత్యసాయి యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఎవ్వరూ ఎక్కువగా రాణించలేదు.ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ లో వారి విద్యాభ్యాసం సాగటం  వలన,వారిలో Exposure ఉండేది కాదు . పప్పు సుద్దల లాగా ఉంటారు.కమ్యూనిస్ట్ నాయకుడైన వేములపల్లి శ్రీ కృష్ణ గారి తరఫున ఎన్నికల్లో ప్రచారాం కూడా చేసాను.ఆయన కూతురు  ప్రతిమతో కూడా నాకు సాన్నిహిత్యం ఉండేది. ఆయన చాలా అందగాడు,అలానే భార్య,సంతానం అందరూ రూపవంతులే!వీటితో పాటుగా సంస్కరణాభిలాష ఎక్కువైంది.వర్ణాంతర వివాహాలను,ప్రేమ వివాహాలను కూడా జరిపించేవాడిని.ఒక మార్వాడి అమ్మాయిని ,నాయి బ్రాహ్మణుడైన నా స్నేహితుడు ప్రేమించాడు.ఇద్దరూ బాగుండేవారు.ప్రేమలో పడటానికి అందం ,ఆకర్షణే చాలావరకు కారణం.ప్రేమ కన్నా ముందరే కామం జనిస్తుంది.ఆ కామమే ప్రేమగా మారుతుంది.ప్రేమించే హృదయమున్నవారు ,వికలాంగులను ,అనాకారులను ప్రేమించకపోవటానికి కారణం -వారిలో ప్రేమించే హృదయం లేకపోవటమే!సరే ఆ మార్వాడి అమ్మాయి, నాయి బ్రాహ్మణుడు అబ్బాయికి రిజిస్టర్ మ్యారేజ్ చేసాం!అమ్మాయి తల్లితండ్రులు మా ఇంటిమీదకి తగాదాకు వచ్చారు.అప్పుడే మా నాన్న గారికి నా ఆక్టివిటీస్ అన్నీ తెలిసాయి!ఆ అమ్మాయి తల్లి తండ్రులు నన్ను నిలదీసి,'నీవెందుకు వర్ణాంతర వివాహం చేసుకోలేదు?' అని ప్రశ్నించారు.తప్పకుండా చేసుకుంటానని పొగరుబోతుగా సమాధానం చెప్పాను.మా నాన్న గారు నన్ను బాగా కోప్పడ్డారు.వివాహమన్నది రెండు మనుషుల కలయిక కాదు,రెండు కుటుంబాల కలయిక అని చెప్పారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు!నీ తర్వాతి వారికి పెళ్లిళ్లు కావటంకష్టమని ప్రాధేయపడినంతగా చెప్పారు.మా నాన్న గారి ప్రేమ నా ఆశయాలకు సంకెళ్లు వేసింది.అయినా ,ఆయనకు నా మీద నమ్మకం కుదరలేదు.నాకు తెలియకుండానే నాకు సంబంధాలను చూస్తున్నారు.చదువైవు పూర్తిగాక ముందరే, ఉద్యోగం రాక ముందరే నాకు పెళ్లి చేశారు.అప్పటికి నా వయసు 21 ఏళ్ళు.నిజానికది బాల్య వివాహమే .30-03-1972 న విజయలక్ష్మి అనే కన్యామణితో నా వివాహం జరిగింది! పెళ్ళైతే కానీ తిక్క కుదరదని అనుకున్నారు.అలానే జరిగింది.సంపాదన మీద దృష్టి మళ్లింది.సినిమాకు పోవాలన్నా నాన్నను  డబ్బులడగటం చాలావరకు నామోషీగా భావించటం మొదలయింది.ఉద్యోగం పురుషలక్షణం అని పెద్దలు చెప్పింది నిజమే !ఉద్యోగ వేటలో పడ్డాను.జీవిత పోరాటం మొదలయింది.ఇప్పటికి ఇంతే !మరికొన్ని విషయాలు మరొకసారి!
***

3 comments:

 1. చాలా నిజాయితీగా వ్రాస్తున్నారు.అభినందనలు!

  ReplyDelete
 2. మీ నిజజీవితం లోని 'ఒక జీవితపోరాటం' యవ్వనంలో చాలామందికి జరుగుతుంది ,కాని కొంతమందే కళ్ళకు కట్టినట్లు చక్కగా వ్రాయగలరు .
  ధన్యవాదములతో,

  ReplyDelete
 3. "జీవితమంటే అంతులేని ఒక పోరాటం. బ్రతుకు తెరువుకై పెనుగులాట ఒక పోరాటం" అని ఒక సినీకవి చెప్పిన మాట, మీ జీవితపోరాటం గుర్తుచేసింది. ప్రతిదశలోను సంఘర్షణ తప్పదు కదా!! మీ జీవితానుభవం బావుంది.

  ReplyDelete

Pages