అటక మీది మర్మం - 12 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 12

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల)  -  12
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 
(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. ఆ కేసులో ముందుకు వెళ్ళాలంటే ముందుగా బుషీట్రాట్ అన్న వ్యక్తి డైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు నిర్ధారించాలి. తండ్రి చెప్పినది విన్న నాన్సీ రైల్వే స్టేషన్లో డయానెను కలిసి తన మాటల్తో బోల్తా కొట్టించి, ఆమెతో డైట్ కంపెనీకి వెడుతుంది. డయానె తండ్రి దగ్గరకు వెళ్ళిన సమయంలో, ఆ కంపెనీ కార్యదర్శితో ఫాక్టరీలోపల చూడటానికి వెళ్ళిన నాన్సీ చిన్ననాటాకంతో అక్కడ పనిచేసే బుషీట్రాట్ ను చూస్తుంది. ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా పై అంతస్తునుంచి రక్తం గడ్డకట్టించే స్థాయిలో అరుపు వినిపిస్తుంది. పక్కబట్టలకోసం పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు మరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. హన్నా ప్లెజెంట్ హెడ్జెస్ కి వచ్చి బ్లాక్ విడోని కనుక్కొని చంపేస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెబుతాడు. ఆ రాత్రి అటకమీద వెతుకుతుంటే అనుకోకుండా ఆమె టార్చీలైట్ ఆరిపోవటం, అదే సమయంలో ఎక్కడినుంచో కొన్ని విపరీత శదాలు వినిపించటం జరుగుతుంది. ఎఫీ కోలుకొన్నాక యువ గూఢచారి యింటికొస్తుంది. ఆరోజు తన తండ్రితో కలిసి బుకర్ ఫాక్టరీకి వెళ్ళి పట్టుకండువాలు చేసే విధానాన్ని గమనిస్తుంది. తరువాత తండ్రికోరికపై ఒక ప్రణాళిక ప్రకారం డయానె యింటికి వెళ్ళి, తనకు తెలిసిన ఒక పాపకు డయానె చెల్లెలుకి బిగువైన బట్టలను యిమ్మని అడుగుతుంది. ఆమె లోనికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని వారి హాబీలేమిటో గమనిస్తుంది. డయానె యిచ్చిన పాత బట్టలతో ప్లెజెంట్ హెడ్జెస్ కి చేరిన నాన్సీ మార్చ్ అనుమతితో అటక మీద ఉన్న కొన్ని పాత సీసాలతో డైట్ ఫాక్టరీలోకి అడుగు పెడుతుంది. అక్కడ సీసాలను డైట్ కి చూపెడుతున్న ఆమెకు బుషీట్రాట్ కనిపిస్తాడు. తరువాత కధ ఏమిటంటే. . . .)

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

"నీకెంత కావాలని అడుగుతున్నాను?" కోపం నిండిన కంఠంతో ఆయన మరొకసారి అడిగాడు.

బుషీట్రాట్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొనే అవకాశాన్ని నాన్సీ వదులుకోదలచలేదు. బహుశా బుకర్ ఫాక్టరీనుంచి దొంగిలించిన ఫార్ములాని ఉపయోగించే రహస్యవిభాగానికి వెడుతూ ఉండవచ్చు. ఇదే దాని గురించి తెలుసుకొనే మంచి అవకాశం.

"మిస్టర్ డైట్! ఈ సీసాలను యిక్కడ వదిలి వెడుతున్నాను" అంటూ కంగారుగా ఆ గది ద్వారం దగ్గరకు నడిచింది. ఆమె అక్కడనుంచి బయటపడటానికి తొందరపడుతున్నట్లు కనిపించకూడదని నటిస్తోంది. "నేను చెప్పిన ధరకి కొనేముందు, ఆ గాజుసామగ్రి అంత విలువ చేస్తుందా అని మీరు పరీక్షించాలనుకొంటారుగా!"

ఆమె మాటలకు తన సమాధానం వినకుండా నాన్సీ తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటే, డైట్ విస్తుపోయాడు. అలా బయటపడ్డ నాన్సీ ఒక్క క్షణంలో ఆ భవనం ప్రధానద్వారాన్ని దాటింది. కంగారుగా తాను పైనుంచి చూసిన సందులోకి మళ్ళిన ఆమెకు, బుషీట్రాట్ యిటుకలతో కట్టిన ఒక చిన్న యింట్లోకి ప్రవేశించటం కనిపించింది. చుట్టుప్రక్కల ఎవరూ లేరు.

"నేనొక్కర్తినీ లోనికెడితే!" నాన్సీ కొద్దిసేపు ఆలోచించింది.

జాగ్రత్తగా ఆమె ఆ యింటి తలుపును పరిశీలించింది. దానికి ఆటోమేటిక్ తాళం ఉన్నా, అదృష్టవశాత్తూ లోనికెళ్ళిన అతను ఆ తలుపును లాగి వెయ్యలేదు. అందుకే అది నెమ్మదిగా మూసుకొనేలోగా, నాన్సీ ఆ తలుపు మధ్యనుంచి లోనికి జారుకొంది. ఆ భవనం లోపలంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ కార్మికుల లేదా యంత్రాల చప్పుడేమీ వినపడటం లేదు.
మసకవెలుతురుగా ఉన్న సన్నటి హాలులో చప్పుడు కాకుండా ఆమె బుషీట్రాట్ ని అనుసరించింది.

అతను మరొక తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగి, త్వరగా దానిని తెరచి లోనికెళ్ళాడు. నాన్సీ ఏ మాత్రం సంకోచించలేదు. అతని అడుగుల చప్పుడు ఆగగానే ఆమె ఆ ద్వారం గుండా లోనికెళ్ళింది. అక్కడ అతను కనిపించలేదు.

తాను ద్రవాలు నింపిన తొట్టెలు ఉన్న గదిలో ఉన్నట్లు గ్రహించి, నాన్సీ వాటిని పరిశోధించాలనుకొంది.

కానీ ఆమె అలా చేసేలోపునే ఎవరో తాళంకప్పలో చెవి ఉంచి తిప్పుతున్నట్లు వినిపించింది. వెంటనే ఒక తొట్టె వెనుక నక్కిన ఆమెకు, మరొకద్వారం గుండా ఆ గదిలోకొస్తున్న ట్రాట్ కనిపించాడు. అతను ఆ తలుపుకి తాళం వేసి, మళ్ళీ మసకవెలుతురుగా ఉన్న హాలు వైపు వెళ్ళిపోయాడు.

నాన్సీ పైకి లేచి అక్కడ ఉన్న తొట్టెల్లోకి చూసింది. వాటిలో ఉన్న ద్రవాల రంగు సుపరిచితమైనట్లుగా తోచింది. గట్టిగా గాలి పీల్చింది. ఆ తొట్టెల్లోని రసాయనిక మిశ్రమాల వాసన బుకర్ ఫాక్టరీలోని వాసనతో సరిపోలింది.

"ఇప్పుడు నాకు సరైన సాక్ష్యం దొరికింది" ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.

తన ఆవిష్కరణకు సంబరపడుతూ, ఆమె డైట్ రసాయనపాత్రల నుంచి కొంత ద్రవాన్ని సేకరించటానికి సీసా కోసం వెతకాలనుకొంది. "ఇక్కడ ఒక సీసా దొరికితే బాగుండును."

అకస్మాత్తుగా ఆమె భుజానికి ప్రక్కగా ఉన్న వెంటిలేటర్ నుంచి ఆ గదిలోని గోడమీదకి పాకుతూ వస్తున్న బ్లాక్ విడో సాలీడు కనిపించింది. భయంతో ఆమె దానికి దూరంగా వెనక్కి జరిగింది. తన కాలి బూటు తీసి దాన్ని చంపేసింది.

"వెంటిలేటర్ కి అవతలపక్క ఏముంది?" ప్రశ్నించుకొన్న ఆమెకి ఒక ఆలోచన వచ్చింది.
"పట్టుదారాల తయారీలో బుషీట్రాట్ కూడా బుకర్ లాగే సాలీళ్ళను వాడుతూండవచ్చు."

ఉత్తేజంతో ఆమె వెంటిలేటర్ గుండా అటువైపు చూసింది. ఆ పక్కన అంతా చీకటిగా ఉంది. కానీ లోపలిగదిలో లైట్ వేసే మీట (స్విచ్) నాన్సీ కళ్ళబడింది. వెంటనే లైట్ వేసి వెంటిలేటర్ గుండా లోపలిగదిలోకి తొంగిచూసిన ఆమెకు, ఆ గది నిండా గాజు తొట్టెలు కనిపించాయి. కానీ వాటిలో ఏముందో మాత్రం కనబడలేదు.

"వాటిలో పట్టుదారాలు వడికే సాలీళ్ళు ఉన్నాయేమో కనుక్కోవాలి" నాన్సీ నిశ్చయించుకొంది. "అవి ఉంటే డైట్ కి వ్యతిరేకంగా మరొక సాక్ష్యం అవుతుంది."

వెంటిలేటర్ కి దగ్గరగా ఆ గదిలోకి వెళ్ళటానికి తలుపు కనిపించింది. కానీ దాన్ని తెరవటానికి గొళ్ళెం కానీ, కనిపించే తాళం కానీ లేవు. కనీసం లాగినా, తోసినా ఆ తలుపు తెరుచుకొనే ఆస్కారం కనిపించక ఆమెకు చిరాకేసింది.

"ఈ తలుపు తెరవటానికి రహస్యంగా ఎక్కడో మీట ఉండి ఉంటుంది" నాన్సీ తనలో తర్కించుకొంది. ఎంతో ఓపికతో ఆమె ఆ తలుపు మీద ప్రతీ అంగుళాన్ని వదలక చేతితో తడిమింది. అకస్మాత్తుగా అది లోపలికి తెరుచుకొంది.

"బహుశా తలుపుకి ఉన్న రహస్య మీటను తాకి ఉంటాను" ఆనందంగా అనుకొంది. ఆగదిలోకి ప్రవేశించాక తలుపును చిన్నగా చేరవేసింది. ఆ తలుపు దాదాపుగా మూసుకొనేలోగా బయట అడుగుల చప్పుడు వినిపించింది. ఆమె వేసిన లైట్ వెలుతురుకి ఆకర్షితుడైన రాత్రి కాపలాదారు ఖచ్చితంగా ఆ గదిని పరిశీలించటానికి వచ్చాడు. కానీ అతను ఆ గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదు.

"అతని దగ్గర తాళం లేదా?" ఆ యువతి దీర్ఘంగా ఆలోచించింది. "లేదా దుండగుడెవరైనా లోపల ఉన్నాడని అనుమానించాడా?" బహుశా ఆ రహస్య పరిశోధనశాలలోకి బుషీ ట్రాట్ తప్ప ఎవరూ వెళ్ళకూడదనే ఆంక్షలు ఉన్నాయేమో!

అదే సమయంలో నాన్సీ పరిశోధనశాలలోని లోపలిగదిని నిశితంగా అన్వేషించింది. ఆమెకు గాజుతొట్టెలలో సాలెపురుగులు కనిపించాయి కానీ అవి బుకర్ ఫాక్టరీలోలాగే గాజు గోళాలలో నేత నేసేవే కానీ హాని చేసేవి కావు.

"అవి ప్రాణాంతకమైన బ్లాక్ విడోసే కావచ్చు. కానీ దారం తీయటానికి బాగా ఉపయోగపడతాయి" నాన్సీ తలపోసింది. "బుషీట్రాట్ విషపూరితమైన వాటితో పనిచేసే గుండెధైర్యం ఉన్నవాడు. ఈ విషయంలో ఎఫీ ఏమంటుందో చూడాలి."

ఎఫీ! హఠాత్తుగా ఆమెకు రాత్రికి తప్పకుండా ప్లెజెంట్ హెడ్జెస్ కు తిరిగి వస్తానని తాను యిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. ఆమె తన చేతిగడియారాన్ని చూసి ఎంత ఆలశ్యమైందో తెలుసుకొని ఉలికిపడింది.

"వెంటనే పక్కగదిలోనుంచి రసాయనికద్రవం మచ్చు(శాంపిల్) తీసుకొని, యిక్కడనుంచి బయటపడే మార్గం చూడాలి" అని నిశ్చయించుకొంది.

మరొకసారి ఆ తలుపులోని రహస్యమీటను నొక్కగానే, అది ఒక్కుదుటున తెరుచుకొంది. నిశ్శబ్దంగా ఆమె బయటిగదిలోకి వచ్చి ఖాళీ సీసా కోసం వెతికింది.

"నాకు తెలుసు!" అంటూ ఆమె తనలో నవ్వుకొంది. "ఇంతవరకూ దీని గురించే ఆలోచించలేదేమిటి?"

మార్చ్ యింటినుంచి తెచ్చిన మరీ చిన్నగా ఉన్న సీసాలు రెండు ఆమె జేబులో ఉన్నాయి. ఆమె వాటిని డైట్ కి కానుకగా యివ్వాలని విడిగా తన జేబులో పెట్టుకొంది. కానీ ట్రాట్ కనపడగానే అతని ఆఫీసుని వదిలే తొందరలో వీటి విషయమే మరిచిపోయింది. సీసాలు చిన్నవైనా, వాటికి చాలా పెద్ద బిరడాలు బిగించి ఉన్నాయి. తన చేతులు తడవకుండా జాగ్రత్తగా ఆ సీసాల్లో రెండు వేర్వేరు తొట్టెల్లోని ద్రవాన్ని నింపి బిరడాలు బిగించింది.

ఆమెకు మళ్ళీ భవనం బయట అడుగులచప్పుడు వినిపించింది. ఆమె యిప్పుడేం చేయాలి? లైట్ ఆర్పేస్తుందా? అలాగే వదిలేస్తుందా? ఆర్పేస్తే లోపల మనిషి ఉన్నట్లు బయటవాళ్ళకి అనుమానం వచ్చి లోనికి వస్తే? . . .తాను దొరికిపోయే అవకాశం ఉంది. అందుకే లైట్ అలాగే వదిలేయాలని నిశ్చయించుకొంది.

"కానీ సాధ్యమైనంత త్వరగా యిక్కడనుంచి బయటపడాలి" అనుకొందామె. అప్పుడే ట్రాట్ అన్ని తలుపులకు తాళాలేసి బయటకు వెళ్ళిపోయిన సంగతి గుర్తుకొచ్చింది. కానీ సాలీళ్ళు ఉన్న లోపలి గదిలో మరొక తలుపు ఉన్న సంగతి ఆమెకు గుర్తొచ్చింది. దానిద్వారా బయట పడటానికి మార్గముందేమో ప్రయత్నించాలనుకొంది. తిరిగి ఆమె సాలీళ్ళ గదికి వెళ్ళే తలుపుకున్న రహస్య మీటను నొక్కింది. తెరుచుకొన్న తలుపుల మధ్యనుంచి ఆమె సాలీళ్ళ గదిలోకి అడుగుపెడుతూంటే, బయట కారుబ్రేకులు కీచుమన్న శబ్దం వినపడింది. దాన్ని అనుసరించి ఎవరో పరుగెడుతున్న పాదాల చప్పుడు. వెంటనే భయాందోళనలతో ఆమె సాలీళ్ళగదిలో దూరంగా ఉన్న తలుపు దగ్గరికి వేగంగా పరుగెత్తింది. అది వెంటనే తెరుచుకోక ఆమెకు నిస్సహాయతతో కూడిన నీరసం ఆవహించింది.
(తరువాయి భాగం వచ్చే నెలలో)

No comments:

Post a Comment

Pages