భక్త జయదేవులు - గీతగోవిందం - అచ్చంగా తెలుగు

భక్త జయదేవులు - గీతగోవిందం

Share This
భక్త జయదేవులు - గీతగోవిందం
మధురిమ

శ్రీ కృష్ణ లీలామృతాన్ని కావ్యాలుగా ఎందరో కవులు,వాగ్గేయకారులు ప్రపంచానికి అందించారు. కానీ వారందరిలో ప్రథముడైన జయదేవుడు రాధాకృష్ణుల రాసలీలలను గీతగోవిందం కావ్యం ద్వారా, ఒక శృంగార రసప్రధానమైన మహాకావ్యమును,రాధాకృష్ణుల ప్రేమతత్వమును ప్రపంచానికి తెలియపరిస్తే...సంగీత ప్రపంచానికి "అష్టపది" అనే సరికొత్త ప్రక్రియను  పరిచయం చేసాడని చెప్పవచ్చు.
శృంగారం అంటే అదేదో వినకూడని మాటని తలచేవారు. గీతగోవిందం కావ్యం కనుక పరిశీలించినట్లైతే శృంగారం కూడా ఓ భగవాదనుభూతి అని ఖచ్చితంగా అర్థం అవుతుంది.మనిషి తన జీవితంలో నవరసాలను అనుభవిస్తాడనడంలో ఎలాంటి  సందేహము  లేదు.ప్రేమ భావం నుండి శృంగార రసం ఉద్భవిస్తుందన్న విషయాన్ని జయదేవుడు తన గీతగోవింద కావ్యం లో చక్కగా విశదీకరించాడు.
జయదేవుడు 12వ శతాబ్దానికి చెందినవాడు.ఒరిస్సా రాష్ట్రములోని గల జగన్నాధ క్షేత్రమైన పూరికి దగ్గరలో "బిందుబిల్వ" నే గ్రామంలో జన్మించాడు. ఈగ్రామానికి "కెందువి" అని ఇంకో పేరు కూడా ఉంది.జయదేవుని తండ్రి భోజదేవుడు, తల్లి రమాదేవి.ఒరియా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు,కృష్ణ భక్తులు. జయదేవుడు ఊరి చివర ఒక గుడిసెలో నివశిస్తూ ధ్యానములోనే  చాలా కాలం గడిపేవారట.
వీరి భార్య పద్మావతి.ఆమె నర్తకీ మణి.వీరికి ఈమె తో వివాహం జరుగుటకు ఒక ముఖ్యకారణం ఉంది.వీరి గ్రామంలో దేవశర్మ అనే ఇంకొక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన తన మొదటి సంతానాన్ని శ్రీ పురుషోత్తముడికి అర్పిస్తానని మొక్కుకున్నారట.ఈవిధంగా దేవశర్మ భార్య విమలాంబకు ఒక కుమార్తె జన్మించగా ఆమెకి పద్మావతి అని పేరు పెట్టుకున్నారు.యుక్తవయస్సు వచ్చాక ఆమెను పురుషోత్తమునికి అర్పించి వారు ఇంటికి వెళ్ళిపోయారట.
ఆరాత్రి పురుషోత్తమాలయంలో ఉన్న పూజారికి శ్రీ పురుషోత్తమ స్వామి కలలో కనబడి ఆ బాలికను జయదేవుని వద్దకు తీసుకువెళ్ళి అతనికిచ్చి వివాహం చెయ్యమని చెప్పగా మర్నాడు ఉదయమే వారు బాలికను,ఆమె తండ్రిని కూడా జయదేవుని వద్దకు తీసుకువెళ్ళి దేవశర్మ మొక్కును మరియు స్వామివారు స్వప్నములో చెప్పిన విషయాలు చెప్పగా జయదేవుడు తన పేదరికం కారణం గా ఆమెని ముందు నిరాకరించినప్పటికీ ….వారందరు పద్మావతిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
పద్మావతి జయదేవులవారికి భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ ఉండేదట.కొంతకాలానికి పద్మావతి తన పట్ల చూపుతున్న శ్రద్ధకి , చేస్తున్న సేవలకు ముగ్ధుడై ఆమెను శాస్త్రొక్తంగా జయదేవుడు వివాహం చేసుకున్నాడు. జయదేవుడు శ్రీ పురుషోత్తమస్వామి అంశ అని అంటారు.వీరిద్దరూ అన్యొన్యానురాగాలతో దాంపత్యజీవితం గడుపుతూ కృష్ణుని మహిమలు గానం చేయుచూ జీవితాన్ని గడిపారు.
బెంగాలు రాష్ట్రంలో నవద్వీపమునకు రాజైన లక్ష్మనసేనుని ఆస్థానమున క్రీ.శ.1116లో జయదేవుడు  పండితుడిగా ఉన్నట్లు అక్కడగల అధారములను బట్టి తెలియచున్నది.అక్కడ కోటద్వారముపైన "గోవర్ధనుడు,పారణ,జయదేవులు" మొదలైన మూడు రత్నములు మహారాజు కొలువులోఉన్నట్లు చెక్కబడియున్నది.
ఇక జయదేవుని అపూర్వ రచన అయిన గీతగోవిందం మహాకావ్యన్ని అష్ట్పదులుగా రచించాడు.ఒక్కొక్క దానిలో 8 పాదములుండుటచే వీటికి ఆ పేరు వచ్చినది.ఈ గ్రంధంలో 24 అష్టపదులు,80కి పైగా శ్లోకాలు కలిగి 12 సర్గలతో రాయబడినది.గోవిందునిగూర్చి రచింపబడిన గేయ ప్రబంధమగుటచే దీనికి "గీత గోవిందం" అన్న పేరు ఎంతో చక్కగా సరిపోతుంది.ఈ అష్టపదులు నాయికా, నాయకి,సఖులచే పాడబడినట్లు రచింపబడ్డాయి.ఈ అష్టపదులలో 19వ అష్టపదిని "దర్శనాష్టపది" "సంజీవినీ" అష్టపది అని కూడా అంటారు.దానికి కారణం ఈ సంఘటన.
జయదేవుడు ఎంతో భక్తిశ్రద్ధలతో,ఉత్సాహముతో గీతగోవిందాన్ని ఒక దీక్షలా రాస్తూ ఉండగా  10వ సర్గలో గల 19వ అష్టపదిలో ఏడవ చరణమును రచించున్న సమయమున ఒక విచిత్రమైన భావన వచ్చినదట...
"స్మరగల ఖండన మమశిరసి మండనం 
దహి పదపల్లవ ముదారం"
అనగా "రాధా!! ప్రేమ అను విషము నా తలకి ఎక్కియున్నది.అందువలన నీ కోమల పాద పద్మములను నా శిరస్సు పైనిడుము.అప్పుడు ఆ విషమంతయూ దిగును" అని అర్థం వచ్చేలా రాసి.అయ్యో ఇదేమిటి??? రాధ తన పాదమును కృష్ణ పరమాత్మ పాదముపై ఉంచడం ఏమిటి??"ఇది ఘోరము కాదా!!?? "ఇలా రాయుట మహాపచారమని తలచి ఆ పంక్తులను కొట్టేసి అభ్యంగన స్నానము చెయ్యడానికి లేచి తలకు ఒంటికి నూనె రాసుకుని..నదికి వెళ్ళాడుట.
కొంత సేపటికి ఆ స్వామి జయదేవుని రూపములో తిరిగివచ్చి ఆ వ్రాత ప్రతిని తెమ్మని పద్మావతిని అడిగి ,ఆ కొట్టేసిన పంక్తులనే మరల రాసి వెళ్ళిపోయడాట.స్నానము చేసి వచ్చిన జయదేవునికి తాను కొట్టేసిన పంక్తులు మరల రాసి యుండుట చూసి అశ్చర్యపడి "ఇవి ఎవరు రాసారు" అని పద్మావతిని అడిగారట.అప్పుడు ఆమె "స్వామి మీరే కదా మరల వచ్చి రాసి వెళ్ళారు అదిగో నూనె బొట్లు కూడా ఆ ప్రతిమీద ఉన్నాయే " అని చెప్పగా సాక్షాత్తూ శ్రీకృష్ణ  పరమాత్మే  వచ్చి వెళ్ళాడని తెలుసుకుని పద్మావతి యొక్క పుణ్యానికి ఎంతగానో సంతోషించి శ్రీ కృష్ణుడు  తన  భార్య పద్మావతికి దర్శనమిచ్చినందున ఆ అష్టపదికి "దర్శనాష్టపది" అని పేరుపెట్టారు.
ఈ అష్టపదియొక్క ఎనిమిదవ చరనములో 
"జయతు పద్మావతీ రమణ జయదేవకవి
  భారతీఫణిత మితీగీతం " అని తన పేరుకు ముందుగా ఆమె పేరునే ప్రస్తావించి ఆమెకి కూడా అపూర్వ గౌరవాన్ని,భాగ్యాన్ని కలిగించారు భక్త జయదేవులు.
అలాగే జయదేవకవి భార్య అయిన పద్మావతిని శ్రీ లక్ష్మణసేన మహారాజుగారు చాలా గౌరవించారు.అది సహించలేని మహారాణి ఒకనాడు"జయదేవులవారు,మహారాజాగారు వేటకి వెళ్లినప్పుడు జయదేవులవారు మరణించారు అని హాస్యమాడినారట."ఆ వార్త విన్న వెంటనే అక్కడికక్కడే అప్పటికప్పుడే కన్నీళ్ళ పర్యంతం ప్రాణాలు కోల్పోయినారట.మహారాణి కూడా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు.రాణీ గారు భయంతో గజ గజ ఒణికిపోయినారట.కొంతసేపటికి రాజుగారు,జయదేవులవారు వచ్చి జరిగినది తెలుసుకుని దిగులుతో ఏమి చెయ్యాలో తోచక నిశ్చేస్టులై ఉన్నారట.అప్పుడు జయదేవుడు "తన మరణవార్త విన్నందువల్ల చనిపోయింది కాని ఇప్పుడు తాను బ్రతికే ఉన్నానుకదా" అని తలచి 19వ అష్టపదీయిన "వదసియతి" పాడి ముఖముపై నీళ్ళు చల్లగా ఆమె నిద్రనుండి మేల్కొనినట్లు లేచి కూర్చుండినదట.
ఈ అష్టపదిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్వహస్తాలతో రాసిన పంక్తులు ఉన్నాయి కనక ఆమె మరల పునర్జీవము పొందినది గనుక ఈఅష్టపదికి "సంజీవని అష్టపది" అన్న పేరుకలదు.
శ్రీ భక్తజయదేవ కవి దేవాలయములలో అష్టపదులను పాడుతున్నప్పుడు పద్మావతి వాటికి నాట్యము చేసేవారట.
పూరి రాజ్య మహారాజైన పురుషోత్తమదేవునకు జయదేవునిపై విపరీతమైన ఈర్ష్య.అందువలనే శ్రీ జయదేవుని గీతగోవిందమును పోలిన "అభినవ గీత గోవిందము" అనే గ్రంధము రచించెను.ఆ గ్రంథములోని రచనలే పాడవలెనని ప్రజలను నిర్దేశించి నిర్బందించెను.కాని ప్రజలు గీత గోవిందములో రచనలే పాడుచుండిరి.ఇది సహించలేని మహారాజు తన గ్రంధము గొప్పదో లేక జయదేవుని గ్రంధము గొప్పదో పరిశీలించుటకు ఇద్దరి గ్రంధములను శ్రీ జగన్నాధ స్వామి వద్ద పెట్టి తలుపులు మూసివేసారు.
మరునాటి ఉదయం తలుపులు తెరచి చూసేసేరికి "గీత గోవిందము" స్వామివారి చేతిలో ,రాజుగారి గ్రంధము గర్భగుడిలో ఒక మూల ఉండదం రాజుగారు గమనించి రాజుగారు తన తప్పుతెలుసుకుని గీతగోవిందం యొక్క శ్రేష్టతను కొనియాడినారట.అప్పటినుండీ జయదేవుని,పద్మావతిని భక్తితో మనస్పూర్తిగా గౌరవించారుట.ఈ అష్టపదులను రచించిన స్థలమును నాటినండి "జయదేవపురమని" పిలవబడుతోంది.
జయదేవుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపముగా పూజించిరి.వీటిలో రాధ నాయకి జీవాత్మ,కృష్ణుడు నాయకుడు పరమాత్మ మరియు సఖి.ఈ సఖి జీవాత్మను ముక్తిపథంలో నడిపించి పరమాత్మలో లీనము చెయ్యుటకు తోడ్పడును.ఇదియే గీతగోవిందములోని సారాంశము.
గీతగోవింద మహాకావ్యము అందించిన జయదేవుని జయంతి ఉత్సవమును ప్రతీ ఏటా కిందుబిల్వము (ఇప్పటి కిందూలా)లో జరుపబడి అన్ని అష్టపదులు అక్కద పాడబడుతున్నాయి కూడా.ఇప్పటికీ పూరి జగన్నాథ క్షేత్రములో ప్రతీరోజు పూజా సమయములో అష్టపదిని పాడడం ఆనవాయితీ.. దీనికి జయదేవసేవ అని పేరు కూడా కలదు.
శ్రీ భక్త జయదేవులు శ్రీముఖ నామ సంవత్సర మార్గశిర బహుళ ఏకాదశి  నాడు అనగా 28-12-1153 నాడు...కృష్ణ సాన్నిహిధ్యాయమును పొందిరి.
భక్తజయదేవుని అష్టపదులు అమృతము వలనే ఆ చంద్రతార్కమూ భక్తుల భజనలలో,నిత్య పూజల్లో,ప్రార్ధనల్లో వినిపిస్తూనే ఉంటాయి అనడం జగమెరిగిన సత్యాన్ని ఉటంకించడమే..
శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీ ఉన్నికృష్ణన్, శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి వంటి ఎందరో కర్నాటక సంగీత విద్వాంసులు జయదేవుని అష్టపదులను తమ తమ శ్రావ్యమైన గళంలో పాడి తరించారు కూడా..

కొన్ని శ్రావ్యమైన జయదేవ అష్టపదులను క్రింది లింక్ లో వినండి...

No comments:

Post a Comment

Pages