శ్రీరామకర్ణామృతం - 46
 సిద్ధకవి
డా.బల్లూరి ఉమాదేవి
41.శ్లో:ఇదం శరీరం శ్లథసంధి జరరం
        పతత్యవశ్యం పరిణామ పేశలమ్
        కిమౌషధం పృచ్ఛసి మూఢ దుర్మతే
       నిరామయం రామకథామృథం పిబ.
భావము:.
ఈ దేహము బహు రంధ్రములు గలది.శిథిలమైనది. చెడి పోయిన తర్వాత మరలా దొరకనిది. ముఖ్యముగా పడిపోవును .ఓ తెలివి లేని వాడా!బుద్దిలేని మనుష్యుడా !దీనికి ఔషధ మేల అయడిగెదవు. రోగములు లేకుండా చేయు రామ కథ యను నమృతమును త్రాగుము 
తెలుగు అనువాదపద్యము:
చ:కడు శతసంధి జరరిత గాత్ర మనిత్యము నాయు వల్పమె
య్యడబడి బోవునో తెలియదందుకు దదివ్య మహౌషధంబు నే
ర్పడియె నిరామయంబయిన బరామకథామృత మెల్లకాలమున్ 
జెడక విమూఢతన్ బడక శీఘ్రమ గ్రోలుచు నుండు చిత్తమా.
42.శ్లో:దశముఖ గజసింహం దైత్య గర్వాతి రంహం
    కదన భయదహస్తం తారక బ్రహ్మశస్త్రం
    మణిఖచిత కిరీటం మంజు లాలాప వాటం
   దశరథకులచంద్రం రామచంద్రం భజేహం.
భావము:
రావణుడుడనెడు  ఏనుగునకు సింహంమైనట్టియు రాక్షసుల గర్వమునెడ మిక్కిలి వేగము కలిగినట్టియు  యుద్ధమందు భయమునొసగు చేతులు కలిగినట్టియు ప్రశస్తమైన తారక బ్రహ్మ స్వరూపుడైన్టియు రత్న స్థాపిత కిరీటము కలిగినట్టియు మృదువాక్యములకు స్థానమైన్టియు  దశరథ వంశమునకు చంద్రుడైనట్టియు రామచంద్రుని నేను సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
చ: దశరథ వంశసాగర సుధాకరు దానవ గర్వ భంజనున్
దశముఖ దంతి సింహమును దారకబ్రహ్మ మరరీంద్ర భీతిదున్
శశి సరసీజమిత్ర విలసన్మణి హేమకిరీటు మంజు
భాషి శరధితల్పు దాశరథి శ్రీరఘురాము సమాశ్రయించెదన్.
43.శ్లో:లంకావిరామం రణరంగ భీమం
  రాజీవ నేత్రం రఘువంశ మిత్రమ్
   కారుణ్య మూర్తిం కరుణా ప్రపూర్తిం
   శ్రీరామచంద్రం శరణం పరపద్యే.
భావము: లంక లంక పాడు చేసిన యుద్ధమందు భయంకరుడైన పద్మములవంటి నేత్రములు కలిగినట్టి రఘువంశమునకు మిత్రుడైన daya స్వరూపుడైన శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రుని నేను శరణు పొందుతున్నాను
తెలుగు అనువాదపద్యము:
అరవిందాయత పత్ర నేత్రు రఘువంశాభోధి పూర్ణాబ్దు సంఘ 
గరంగోజ్జ్వల భీము భీమ వినుతున్  గారుణ్య సన్మూర్తి భా
సుర లంకా ప్రవిరాము రామ ధరణీశున్  సర్వసర్వం సహా
వరపుత్రీ హృదయాంబు జాత తరణిన్ వాంఛించి సేవించెదన్.
44.శ్లో:రామచంద్ర మనిశం హృదయస్థం
        రామమిందు వదనం ప్రవిభాసమ్
       భాసయామి నిగమాంత నివాసం
        భారతీపతినుతం భవ వంద్యమ్.
భావము: ఎల్లప్పుడు మనస్సునందుననట్టియు  చంద్రుని వంటి మొగము గలిగినట్టియు ప్రకాశించుఉన్నట్టియు వేదాంతముల యందు నివాసము కలిగినట్టియు బ్రహ్మచే నుతించ బడుచుననట్టియు  ఈశ్వరునికి నమస్కరించ దగినట్టియు రామచంద్రుని ధ్యానించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
శారద పూర్ణచంద్ర విలసద్వదనున్ రవికోటిభాసితున్
సారసగర్భ సన్నుతు బ్రశస్త చరిత్రుని నాగమాంత సం
చారు ధరాధరాధిపతి సన్నమితాంఘ్రుని మామకీన హృ
త్సారస సంస్థితున్ వరదు దాశరథిన్ శరణంబు వేడెదన్.
45శ్లో:కౌమారో రామచంద్రః కమల మృదుపదా శోభయన్ భూమిభాగం
  మాతుశ్చానందకారీ మరకత నికరాకర  ఇందీవరాక్షః
   ఉత్సంగే సన్నివిష్టః పితురమరవరైః స్తూయమానోపకారో
 నాగాలంకార భూషః స్ఫురతు మమ సదా మాయయా రామ ఈశః.
భావము: కౌమారావస్త కలిగినట్టియు పద్మము వలె మృదువైన పాదము చేత భూతలమున శోభింప చేయుచున్నట్టియు తల్లికి సంతోషం కలుగజేయునట్టియు మరకతమణి సమూహము వంటి రూపు గలిగినట్టియు నల్ల కలువల వంటి కన్నులు కలిగినట్టియు  తండ్రి తొడ పై కూర్చున్నట్టియు దేవతాశ్రేష్టులచే నుతింపబడుచున్న యుపకారములు గలిగినట్టియు సమస్తాలంకారములచే నలంకరింపబడినట్టియు మాయచే రాముడై నట్టియు ఈశ్వరుడు నాకు పొడగట్టు గాక.
తెలుగు అనువాదపద్యము:
మ: జనకాంక స్థితుడై సురాళి నుతుడై సర్వేశుడై మాయయై
జనయిత్రీ పరితోష కృన్మరకత చ్ఛాయాంగుడై  పద్మలో
చనుడై కంజ మృదుత్వ పాద విలసత్ క్ష్మాభాగుడై భవ్య యౌ
వన పూర్వుండగు  రాఘవుండెపుడు మత్స్వాంతంబునన్ భాసిలున్.
46శ్లో:సన్నద్ధఃఃకవచీ ఖడ్గీ చాపబాణోధరో యువా
      గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః  పాతుసలక్ష్మణః
భావము: యుద్ధ సన్నాహము గలిగినట్టియు కవచము కలిగినట్టి యు కత్తి కలిగినట్టి యు ధనుర్బాణములను ధరించినట్టియు యువకుడైనట్టియు లక్ష్మణునితో కూడినట్టియు రాముడు నిత్యము నా కెదుట నడచుచు రక్షించుగాక.
అనువాదపద్యము:
చ: నిరతము త్రోవనేగు తరి నెయ్యము తోడ మదగ్ర చారి వై
కర మనురక్తి నుద్ధతను గౌశలమొప్ప స లక్ష్మణుండవై
 శరము శరాసనంబు  కవచంబును ఖడ్గము దాల్చి కావవే 
తరణి కులాబ్ధి సోమ వరతారక నామ శ్రితావనాచ్యుతా.
47శ్లో:సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవహేమ సూత్రం 
       కారుణ్య పాత్రం శతపత్రనేత్రం శ్రీరామ చంద్రం శిరసా నమామి.
భావము: సుగ్రీవునికి చెలికాడై నట్టియు మిక్కిలి పవిత్రుడైనట్టియు సీత భార్యగా కలిగిన నట్టియు కొత్తది యైన బంగారు మొలత్రాడు కలిగినట్టియు  దయా స్థానమైనట్టియు పద్మములవంటి కన్నులు కలిగినట్టియు రామచంద్రుని శిరస్సుచే నమస్కరించుచున్నాను
తెలుగు అనువాదపద్యము:
చ: పరమ పవిత్రు తామరస పత్ర విభాసిత నేత్రు ధారుణీ
వర తనయా కళత్రుని విభాకర సంభవ మిత్రు నవ్య క
ర్బుర కటి సూత్రునిన్ భువన మోహన గాత్రు బతత్రి మిత్రు సు
స్థిర కరుణాసముద్రు మునిసేవితు శ్రీ రఘురామ గొల్చెదన్.
48..శ్లో:శ్రీరాఘవేతి రమణేతి రఘూద్వహేతి
        రామేతి రావణ హరేతి రమాధవేతి
         సాకేతి నాథ సుముఖేతి సుపవ్రతేతి
         వాణీ సదా వదతు రామ హరే హరేతి.
భావము: శ్రీ రాఘవా యని మనోహరుడా యనిరఘూద్వహా యని  రావణుని సంహరించిన వాడాయని లక్ష్మీనాథా యని అయోధ్యా నాయకాయని మంచి మొగము గలవాడాయని గొప్ప నియమము గలవాడాయని రామా అని హరీ అని పాప సంహారాయని నావా క్కెల్లప్పుడూ పలుకు గాక.
తెలుగు అనువాదపద్యము:
చ: హరి హరి రామ రామ పరమాత్మ రఘూద్వహ దివ్యవిగ్రహా 
శరనిధి కన్యకా రమణ శౌరి యయోధ్య పురాధి నాయకా 
వరద దశాన నారి శ్రీత వత్సల రాఘవసువ్రత  ప్రభా
కర శతకోటి తేజ సుముఖా యనుచున్ రసనా స్మరింపుమా.
49శ్లో:జయతు జయతు రామో జానకీ వల్లభోయం
       జయతు జయతురామశ్చంద్ర చూడార్చితాంఘ్రి
        జయతు జయతు వాణీనాథ నాథః పరాత్మ
        జయతు జయతు రామో నాథ నాథః కృపాళుః.
భావము:
సీతాపతి అయిన రాముడు విజయ మొందు గాక. ఈశ్వరుని చే పూజింపబడు పాదముల గల రాముడు  జయ మొందు గాక .బ్రహ్మకు నాథుడైన రాముడు జయ మొందుగాక. రాజులకు రాజైన వంతుడైన రాముడు జయ మొందుగాక.
తెలుగు అనువాదపద్యము:
చ:జయ జయ రామభద్ర పురశాసన వందిత పాదపంకజా
    జయ జయ రామచంద్ర గుణసాంద్ర ధరాతనయాధినాయకా
    జయ జయ రాఘవేంద్ర జలజాసన నాథ చరాచరాత్మకా
   జయ జయ సత్కృపాభరణ శాశ్వత దీనజనాపనాచ్యుతా.
50శ్లో:వరం నయాచే రఘునాథ యుష్మత్పాదాబ్జ భక్తి స్సతతం మమాస్తు
ఇదం ప్రియం నాథ వరం ప్రయచ్ఛ పునః పునః స్త్వా మిదమేవ యాచే.
భావము: ఓ రామమూర్తీ నీ పాద పద్మ భక్తి నాకెల్లప్పుడు నగు గాక .ఇతరములు నే గోరను. ఇష్టమైన ఈ వరమును నాకిమ్ము మరల మరల నిన్నిదే కోరుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
ఉ: శ్రీ రఘునాథ మీ పద సు సేవయ భక్తి నిరంతరంబు మా 
కారయ  నిష్టమైన వరమంతియె చాలును మాటిమాటికిన్
గోరెద నీ వరంబు నిను గూరిచి యన్యవరంబు లెవ్వియున్
గోరను నాయభీష్ట మొనగూర్పగదే  కరుణించి మక్కువన్.
(ఇంకా ఉంది)
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment