శివం -42 - అచ్చంగా తెలుగు

శివం -42

శివమ్మ కధ -15
రాజ కార్తీక్

(నేను మా అమ్మ దగ్గర పసి బాలుని వలె సేద తీరుతున్నా ...)
ఇప్పుడే మా అమ్మ నాకు స్నానం చేయిద్దాం అని తన ఏర్పాట్లు అన్ని చేసుకుంది. 
శివమ్మ "కన్నయ్య నీకు మంచిగా నలుగు పెట్టి స్నానం చేయిస్తాను" అంది.
నంది, భృంగి, నాగరాజు "హమ్మా, మనం పసి మహాదేవునికి అభిషేకం.... అదీ ప్రత్యక్ష అభిషేకం చూడబోతున్నాము " అన్నారు సంబరపడుతూ.
విష్ణు దేవుడు "అభిషేక ప్రియుడు ఐన మహాదేవుడికి మధురమైన ఘట్టం ఇప్పుడు "అన్నారు.
మాతలు ముగ్గురు "కన్నుల పండుగ  గాంచవాచ్చు" అన్నారు మురిసిపోతూ.
బ్రహ్మ దేవుడు "ఆధ్యాత్మిక చరిత్ర లో ఒక మధుర స్వప్న సాకారమిది" అన్నారు.
మా  అమ్మ నన్ను ఎత్తుకొని "జో జో కన్నా, నీకు ఇప్పుడు లాల పోస్తాను "అంటూ ముద్దాడుతుంది. 
నేను " హహహ ,ఆహాహః ...లఅ అ అ అ  "అని నవ్వుతున్నా. పసిపిల్లలు గొడవ చేసినట్టు చేస్తున్నా.
శివమ్మ "ఎవరి కోసం నవ్వుతున్నావ్ నాన్న నువ్వు ..నా కోసమే  నా " అంటూ పరమానంద పడిపోసాగింది.
నంది "మహాదేవా  ...గంగని తలలో దాచుకున్న నీకు ఈ శివమ్మ తల్లి అభిషేకం ..ఆహా, ఎంత కమ్మని దృశ్యం " అన్నాడు.
ఇక మా అమ్మ నన్ను ఎత్తుకొని తన కాళ్ళని ఎడంగా చాచి, అ కాళ్ళ పైన నన్ను పడుకోబెట్టుకుంది. ఎలాగైతే పసిబిడ్డలకు తమ తల్లి స్నానం చేయిస్తుందో అలా చేయించసాగింది.
విష్ణు దేవుడు "హరుడు తన భక్తురాలి పదాల చెంత ...మాతృ ప్రేమలో మహేశ్వరుడు. లోకాలని సృజించిన దేవుడు ఒక సామాన్య భక్తురాలి పాదాల మీద పడి ఉన్నాడు " అన్నారు.
పార్వతి, సరస్వతి, లక్ష్మి మాతలు కనుల నిండా ఆనంద బాష్పాలతో వీక్షిస్తున్నారు. 
"ఒక మాతృ మూర్తి శక్తీకి ఇంత మహత్తు ఉందా"
అనుకున్నారు.

అందరు "ఎవరి పాదాలు చూస్తే చాలు అనుకుంటారో ..ఎవరి దివ్య చరణ కమలాలు తాకితే చాలు అనుకుంటారో ..ఎవరి పాదాల వద్ద తమ శిరస్సును పెట్టాలి అని అనుకుంటారో ..ఎవరి పాద స్పర్శ తగలాలి అనుకుంటారో ..ఎవరి పాద ధూళి తాకుదాము  అనుకుంటారో, ఆ మహాదేవుడు ఈరోజు ఒక పండు ముసలి దాని పాదాల చెంత పసిబాలుని వలె క్రిడిస్తున్నాడు  " అని ఆశ్చర్యపోసాగారు.
నేను మాత్రం మా అమ్మ నా కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆనందంగా ఆడుకుంటున్నా . నా తల్లి స్పర్శ కోసం ఆరాట పడుతున్నా. నిజంగా చెబుతున్నా.  నా  తల్లి  పాదాల చెంతనే ఉంది నా స్వర్గం .
విష్ణు దేవుడు "స్వర్గం నరకం సృష్టించిన శివుడు ఈరోజు తన స్వర్గ చిరునామాని తన భక్తురాలి దగ్గర వెతుకున్నాడు " అన్నారు.
నేను మాత్రం ఇక మా అమ్మ ఏమి చేసినా సామాన్య బాలుని వలె ప్రతి స్పందిస్తాను ..
మా అమ్మ పాదల మీద ఉన్న నన్ను ఒక్కసారిగా తిప్పి పడుకోబెట్టుకుంది.
ఈ తిప్పే ప్రక్రియలో నంది వైపు హాస్యంగా చూసాను.
నంది  "భృంగి,  నాగరాజు ..మహాదేవుల వారు ఏదో చెప్తున్నారు " అన్నాడు.
మా అమ్మ నా బుజ్జి పాదాలు సాగదీసి "నా వజ్రాల మూట, వరాల దండ .."అంటూ మళ్ళీ ఇటు తిప్పింది. 
నేను మళ్ళీ నంది వైపు చూసాను.
ఇక చుడండి నా ముఖకవళికలను చూసి అందరు నవ్వే నవ్వు. 
ఇక మా అమ్మ నా ఒంటికి నూనె రాసింది. నా దేహం అంతా నూనె రాసింది.
ఆ నూనె రాయగానే, నేను చూడండి, పెద్ద మల్ల యుద్ద వీరుని వలె చేతులు పైకి ఎత్తి సైగలు చేస్తున్నా.
అందరూ అది చూసి ఏమి నవ్వుకున్నారో ..మా అమ్మ కూడా నా చేష్టలు చూసి మురిసిపోయింది.
నారదుడు వచ్చాడు ఇంతలో ..
 "నారాయణ నారాయణ ఈ చిలిపితనం  అంతా మహాదేవుడి దేనా "
విష్ణు దేవుడు "ఆయనకు రాని కళా? అన్ని కళలను సృజించి నటరాజు అయ్యాడు " అన్నాడు.
నారదుడు "మీతో కల్సి మహాదేవుని లీల చూస్తే, ఇంకా మధురంగా ఉంది " అన్నాడు.
( ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages