కరువు సీమలో అతివృష్టి
లక్ష్మీ రాఘవ
“ఎంకీనా సెయ్యి పట్టుకోరా...పడిపోతాను” అన్న అవ్వ చెయ్యిపట్టుకుని కాళ్ళకింద తోసుకు పోతున్న నీళ్ళని చూస్తున్నాడు ఎంకి అనబడే 10 ఏళ్ల వేంకటేశు.
వాన పొద్దున్న నుండీ కుండపోతగా కురుస్తూనే వుంది. 17 ఏళ్లుగావానమొగం చూడని అనంతపురం జిల్లా నైరుతి ఋతుపవనాలు వెనుదిరిగే సమయంలో రాయలసీమనంతా తడిపేసింది. ఎక్కడ చూసినా వర్షాలు. కదిరి, కర్నూలు, అనంతపురాలలో అత్యధిక వర్షం!!
చెరువులు మొరవలు పోయినాయి. గండిపడి ఊర్లోకి దూసుకు వచ్చిన నీళ్ళతో ఆపల్లె లో ప్రతి ఇల్లూ నీళ్ళతో నిండి పోయింది.
వెంకీ, వాళ్లవ్వా ఇంట్లోనుండీ కష్టంగా వాకిలి వరకూ వచ్చినారు...చెయ్యి వదిలితే అవ్వ కొట్టుకు పోతుందేమో అన్నంత గా పారుతావున్నాయి ఇంటి ముందు నీళ్ళు.
అప్పుడు కొంతమంది పారుతున్న నీళ్ళల్లో కష్టంగా నడుచుకు వచ్చినారు.
“ఒరే ఎంకీ, అవ్వను మేము ఎత్తుకుంటాము. నీవుమమ్మల్ని గట్టిగా పట్టుకో...ఇడిసి పెడితే కొట్టుకు పోతావు.”
“యాడికి మామా?” అన్న ఎంకితో
“పెద్దకాపు కాంక్రీటు మిద్దెమీద చేరుస్తా వుండాము అందరినీ...వాన నిలిస్తేనే అందరూ కిందికి దిగేది” అని అవ్వను ఒడుపుగా ఎత్తుకుని, ఎంకి తో మోకాళ్ళలోటు నీళ్ళలో భారంగా పెద్దకాపు ఇంటి మిద్దె మీద చేర్చినారు.
అప్పటికే మిద్దెమీద శానామంది వున్నారు. అవ్వలాటి ముసలోల్లను ఒక పక్కగా కూర్చోబెట్టి నారు. ఎంకటేశు దావచేసుకుని మిద్దేనానుకుని వున్న రాగిచెట్టు మీదకు ఎక్కినాడు. రాగిచేట్టు మీద సుమారుగా పిల్లవాండ్లు చేరినారు.
ఎంకటేసు మెల్లిగా కొమ్మలు పట్టుకుని అందరికంటే పైన వున్న కొమ్మమీద అనువుగా కూర్చున్నాడు.
పైన వాన కురుస్తావుంది.
వాడు పుట్టినప్పటినుండీ వాన చూడలేదు. మీద చినుకులు పడతావుంటే హాయిగావుంది. ముఖం పైకెత్తి వాన చినుకులు పడతావుంటే ఆహా...ఎంతబాగుందీ అనుకుంటావున్నాడు..
“బాగుందా?...”మెల్లిగా వినిపించింది.
ఉలిక్కి పడ్డాడు!!! చుట్టూ చూసినాడు. రెండుకోమ్మల కిందదాకా ఎవరూ లేరు మాట్లాడడానికి.
“పైకి చూడు...నేనే...నీ మీద వానకురిపిస్తున్న మేఘాన్ని...” అని వినిపించింది.
“ఆ.........” అని నోరు తెరిచి పైకి చూసాడు.
రాగి చెట్టుమీద వాన కురిపిస్తున్న నల్లని మేఘం.
“ఓ...నువ్వా? ఎంతబాగుందో వాన...నేను పుట్టిన కాడ నుండీ వాన చూడనేలేదు...”
“ఈ సారి వాన కురవడానికి ఎంతకష్టం అయ్యిందో తెలుసా?” అన్నది మేఘం.
“ఎందుకూ మీరెప్పుడూ మా రాయలసీమకు రారు గదా??”
“అందుకే మా మేఘాలు అన్నీ కూడబలుక్కుని మానాయకుడి తో పోట్లాడినాము. ఈ సారి రాయలసీమకు వెడ తామని తాఖీదు ఇచ్చినాము.”
“అట్లా కూడా జరుగుద్దా??”
“అవును మరి మాతాతల కాలం లో పొరబాటున ఒక పిల్ల మేఘం అనంతపురం వైపున మల్లి, చినుకులు రాల్చిందని వెలివేశారు. అనంత వెళ్ళడానికి పర్మిషను ఉండాలట”
“ఏమిచేసినాము మేము??” అన్నాడు ఎంకీ.
“చెబుతానుండు...రాయలసీమకు వచ్చే మాకు ఎప్పుడూ ఎండే.వర్షం కోసరము మీరు చేసే కప్పల పెళ్ళిళ్ళు, గంగ రాల్లకు నీళ్ళు, శివుడికికుంభాభిషేకాలు, అందరూవూరు విడిచి వెళ్ళే‘వలస దేవర’...ఇవన్నీ చూసి మనసుకు శానా కష్టం అయ్యింది...అందుకే నైరుతి రుతుపవనాల కాలం లో నీటి తో నిండు కుండలా వుండే మేము ఈ పక్క వెళ్ళుతామని మా నాయకుడి మొరపెట్టుకుంటే, వరుణుడు‘భగవంతుని హై కమాండ్ లో నిర్ణయాలు జరుగుతాయి’ అనినాడు. దేవుడు అందరినీ సమానంగా చూడాలి గదా? ఎచ్చుతగ్గులు ఎందుకు అంటే అది ఆ ప్రాంత పరిస్థితిని బట్టి వుంటుందని జవాబు వచ్సి౦ద౦ట..మేము ఆనిర్ణయాన్ని ఎదురిస్తామన్న నోటీసుతో కొంచెం మెత్తబడి మాకు పర్మిషను ఇచ్చినారు. చాన్స్ దొరికింది కదా అని కురిసి పారేస్తున్నాము...”
“భలే...భలే.. మీదగ్గరకూడా అధికారమూ, అప్పోజిషన్ వునాయన్నమాట“ చప్పట్లు కొట్టినాడు వెంకి
“వాళ్ళకింద పని చేస్తున్నామని మరీ మా మాటను ఖాతరు చెయ్యకుండా పోకూడదు కదా?”
“దేవుడెందుకు మా మీద చిన్నచూపు చూస్తాడు?”
“దేవుడు ‘ఆ ప్రాంత భౌగోళ‘ అట్లావుంటాయి.ఎప్పుడూ లేని పరిస్థితులు వస్తే వాళ్ళు నన్నే తిట్టు కుంటారు...అందుకే పైవారి ఆజ్ఞలు పాటించాలి’ అని వరుణుడి తో అంటాడుట...కానీ ఈసారి ఎదురు తిరిగి ఏమైతేనేం సాధించాము” అంది నవ్వుతూ. ఆ మాటలకి ఎంకి కి చాలా ఆశ్చర్యమేస్తావుంది.
“ఇంకా పోతావున్నా... నీరు తగ్గి నా శరీరం తేలిక అయ్యింది... దేవుడిని ఎదిరించి మీదగ్గరికి వచ్చినామని ఎవరికైనా చెప్పాలని చూస్తే నీవు కనిపించినావు” అంటూ తెల్లగా అయిపోయిన చిన్నమేఘం కదిలిందిపక్కకు.
ఎంకటేసుకు కలలో ఉన్నట్టుగా వుంది...
కిందికి చూస్తే వర్షం తగ్గిందని అందరూ చెట్టు దిగిపోయినట్టు వున్నారు. పెద్దకాపు మిద్దె ఖాళీ అవుతూ వుంది. నీళ్ళ ఉదృతం తగ్గింది. అవ్వలాటి వాళ్ళను పెద్దకాపు వసారాలో ఉండమన్నారు.
ఎంకటేసు తో “ఇంటికాడ కెళ్ళి చూసిరా ఎంకీ...ఎట్టా వుందో ఏమో. మీ అమ్మా,నాయనా వూరికేల్లినారు కాబట్టి సరిపోయింది” అనింది అవ్వ.
మెల్లిగా ఇంటి వైపు నడిసినాడు.దారిలో గుడిసెల గోడలు నాని పడిపోయినాయి. మర్రిచెట్టు మొదట్లో కొంతమంది జనం నిలబడి వుంటే ఆ పక్కగా పోయినాడు.
“ఏందీ వానరా సంపుతావుంది...పక్క వీధిలో సాలమ్మ చంకలో బిడ్డ నేసుకుని బయటకు వచ్చినాదంట. నీళ్ళల్లో నిలవలేక తూలీతే చంకలో బిడ్డ జారిపోనాదంట. కళ్ళముందే బిడ్డ మునిగి పోయిందని నెత్తీ నోరూ కొట్టుకుంటా వుంది. గుడిసెలు పడిపోయినాయి.ఎండకాలమే బాగుండే...ఇంతవాన వచ్చి ఊరినిండా నీళ్ళే..ఎప్పటికి ఎండుతాయో ఏమో...బురద కి ఎన్ని రోగాలు వస్తాయో...మనల్నిచంపడానికి కాకపొతే ఎందుకింత వాన?? దేవుడికి బుద్దిలేదా??” ఇట్లాంటి మాటతో దేవుడిని తిదతావుంటే మేఘానికి చెప్పాలనిపించి పైకి చూసిన ఎంకటేసు కు ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా కనిపించింది.
బహుశా మేఘాలు చేసిన ఈ చర్య వలన ప్రజలు కుఎంతో నష్టం వచ్చి ఎట్లాతిడతావున్నారో తెలియ చెయ్యడానికి దేవుడు మేఘాలతో మీటింగ్ పెట్టినాడేమో అనిపించింది ఎంకటేసు కు...
రాయలసీమ అతీ వృష్టి ని తట్టు కాలేదేమో...
***
No comments:
Post a Comment