"భయం" - అచ్చంగా తెలుగు
  "భయం"
వెంకట్ అద్దంకి 

పద్మకు నెలలు నిండాయి, నెప్పులు మొదలయ్యాయని అనుమానంతో ఆసుపత్రికి తీసుకువచ్చి ఎడ్మిట్ చేసాడు రఘు. అత్తగారూ, మామగారూ కూడా వచ్చారు. 

ఉదయం నుండి చూసి చూసి సాయంత్రం అయ్యేసరికి డాక్టర్ వచ్చి, చూస్తుంటే నార్మల్ అయ్యేలా కనపడటం లేదు, మీరు ఒప్పుకుంటే సిజేరియన్ చేస్తాను అంది. 

వెంటనే పద్మ తండ్రి తమ ఊరికి ఫోన్ చేసి పురోహితుడిని కనుక్కుంటే రాత్రి 1:30 కి అయితే బాగుంది, డాక్టర్ కి డబ్బు ఇచ్చైనా సరే ఆ సమయానికే ఆపరేషన్ చేయించండి అని చెప్పేడాయన.

రఘు మామగారు "ఇలా అంటున్నాడయ్యా పురోహితుడు లేదంటే రేపు మధ్యాహ్నం దాకా ఆగాలన్నాడు, ఏం చేద్దాం "అన్నాడు. 

"ఊరుకోండి మావయ్యగారూ!! ఈ ముహర్తాలేమిటి?" అన్నాడు అప్పటికే కొంచం టెన్షన్ ఉండడంతో. 

అటు పక్కగా పోతున్న వార్డ్ బాయ్ వీళ్ళ మాటలు విని దగ్గరకొచ్చి కొంచం చిన్న గొంతుతో" మీ మామగారు అన్నది నిజమేనండి, ఈ మధ్య అందరూ అలా మంచిది చూసే ఆపరేషన్ చేయిస్తున్నారు, మీరు ఊ అనండి మా డాక్టరమ్మని ఒప్పిస్తాను, కాకపోతే కొంచం రేట్ ఎక్కువ అవుతుంది. ఒక 30 మీవి కాదనుకుంటే మీకు కావలసిన టైమ్ లో ఆపరేషన్ చేసి పండంటి బిడ్డను మీ చెతుల్లో పెడతారు." అన్నాడు.

ఊరుకోవయ్యా ! మంచి పేరున్న ఆసుపత్రి అని ఇప్పటికే తైలం బాగానే వదిల్చారు, ఇప్పుడు ఈ ఎక్సట్రా ఖర్చు కూడానా అన్నాడు. 

అంతే మామగారు దండకం అందుకున్నాడు, "ఆలస్యం అయ్యి నా కూతురుకు ఏమన్నా జరగాలి అప్పుడు చెబుతాను నీ పని, ఎంతో బుద్ధిమంతుడని పిల్లనిస్తే దాని సంగతి ఆలోచించకుండా డబ్బు చూసుకుంటున్నాడు డబ్బు." అంటూ.

వార్డ్ బాయ్ సర్! పెద్దాయన చెబుతున్నదాంట్లో కూడా న్యాయం ఉంది కదా, ఆ మాత్రం ఆలోచించడం ఎందుకు  మీ ఇద్దరి మాటా చెల్లేలా ఒక 5 తగ్గించుకుని ఇవ్వండి నేను మానేజ్ చేస్తాను అంటూ "పదండి , మళ్ళీ మేడం వెళ్ళిపోతారంటే " ఏం చెయ్యాలో తోచక వాడిననుసరించాడు.

వార్డ్ బాయ్ చెప్పడం, ఆవిడ క్షణం ఆలోచించి సమయం కష్టమే అయినా సరేలెండి మా బాయ్ చెప్తున్నాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మార్నింగ్ నాకు కాన్ఫరెన్స్ ఉంది, ఇప్పుడే వెళ్ళి ఓ కునుకు తీస్తాను రాత్రి ఎలాగూ నిద్ర పాడవుతుంది అంటూ 7 అయ్యేసరికి ఇంటికెళ్ళిపోయింది ఆవిడ. 

రాత్రి బయటనుండి భోజనాలు తెచ్చి ఇచ్చి తనూ బయటకి వెళ్ళి తినేసి వచ్చాడు. 

వచ్చి లోపలకి వెళ్ళి చూసాడు. పద్మ పడుకుని ఉంది. అత్తగారు పక్కనే ఉన్న బెడ్ మీద గాఢ నిద్రలో ఉంది. అలికిడి క పద్మ కళ్ళు తెరిచింది. ఆపరేషన్ చెయ్యడానికి అనస్ధీషియా ఇవ్వాలి కాబట్టి సాయంత్రం నుండి ఏమీ పెట్టలేదు. నీరసంగా నవ్వింది. అత్తగారికి డిస్టర్బెన్స్ లేకుండా " కంగారు పడకు" కాసేపు పడుకో, నేను బయటనే ఉన్నాను అని చెప్పి వచ్చేసాడు.

బయట ఖాళీగా ఉన్న సోఫాలో మామగారు గుర్రు పెడుతూ మాంఛి నిద్రలో ఉన్నారు. 

కొంచం దూరంగా కుర్చీలో కూలబడ్డాడు రఘు. 

ఫుల్ గా తిన్నాడేమో నిద్ర ముంచుకొస్తోంది, పైగా ముందురోజు క్లయింట్స్ ప్రోబ్లమ్స్ ఎక్కువగా ఉండడంతో వాటినన్నిటినీ సాల్వ్ చేసి రాత్రి 2గం. కి ఇంటికి చేరాడు. ఉదయం 6 గంటలకు పద్మకు కడుపులో నెప్పి మొదలవడంతో హడావుడి గా ఆసుపత్రికి వచ్చేసాడు. 

కానీ కళ్ళు నులుపుకుంటూ అతి కష్టం మీద నిద్ర ఆపుకుంటున్నాడు. 

రాత్రి పన్నెండు అయినట్లు దూరంగా చర్చిలో గంటలు వినపడ్డాయి. అప్పుడే ఇద్దరు నర్సులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ బీపీ ఆపరేటస్ పట్టుకుని పద్మ గదిలోకి వెళ్ళారు. 

ఆపరేషన్ తయారీకి వచ్చి ఉంటారు అనుకున్నాడు. 

ఇంతలో ఒక నర్స్ గాభరాగా బయటకి వచ్చి డాక్టర్, డాక్టర్ అని అరుస్తూ డాక్టర్ క్యాబిన్ లోకి పరిగెట్టింది. 

రఘు కంగారుగా పద్మ గదిలోకి వెళ్ళడానికి తలుపు తీసి ఏమయ్యింది అనగానే రెండవ నర్స్ అడ్డం వచ్చి ముందు బయటకి వెళ్ళండి మీరు రాకూడదు అంటూ బయటకి తోసినంత పని చేసింది.
మొదటి నర్స్ అరుపులకు దూరంగా కునికిపాట్లు పడుతున్న వార్డ్ బాయ్ పరిగెట్టుకు వచ్చాడు. 

మీరు కూర్చోండి సర్ ప్రశాంతంగా, వాళ్ళు చూస్తున్నారు కదా అని భుజం మీద చెయ్యి బిగించి తీసుకొచ్చి కుర్చీలో కూలేసాడు. 

డాక్టరమ్మ , ఆవిడ వెనుక నర్స్ పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళారు. 

కొంత సేపటికి డాక్టర్ బయటకి వచ్చి, ఒక కాగితం చేతిలో పెట్టి , రెండు ప్యాకెట్స్ బ్లడ్ తీసుకు రండి అర్జంట్ అంది. "
"ఏమయ్యింది, డాక్టర్! ఏమన్నా ప్రమాదమా?" అడిగాడు కంగారుగా 

ముందు మీరు బ్లడ్ ఎరేంజ్ చెయ్యండి మిగతావి తరువాత, అని లోపలకి వెళ్ళిపోయింది ఆవిడ. 

అప్పటికప్పుడు బ్లడ్ ఎలా దొరుకుతుందో తెలియక అటూ ఇటూ దిక్కులు చూసాడు. 

రిసెప్షన్ దగ్గరకి వెళ్ళి అడిగితే " సారీ! మీరు గవర్నమెంటు ఆసుపత్రికి వెళ్ళండి, అక్కడ మార్చురీ రూమ్ పక్కన ఉంటుంది, అక్కడికే వెళ్ళండి " అని సమాధానం వచ్చింది . 

పోనీ మామగారిని లేపి, తను బయలుదేరదామని మళ్ళీ రూమ్ దాకా వచ్చాడు. అప్పుడే బయటకి వచ్చిన నర్స్ , " అర్జంట్ అని చెప్పినా ఇంకా ఇక్కడే ఉన్నారా?" అంటూ కొంచం కోపంగా అరిచేసరికి, మామగారి ని లేపాలన్న ఆలోచన విరమించుకుని తన బైక్ మీద బయలుదేరాడు. 

ఒక పక్క ఆందోళన బండి వేగం పెంచాడు, రోడ్ ఖాళీ గా ఉంది, చల్లగా గాలి వీస్తోంది. ఆ రోడ్ మీద అంతకుముందు టోల్ గేట్ ఉండేది, ఇప్పుడు టోల్ తీసుకోవడం ఆపెయ్యడంతొ ఖాళీ క్యాబిన్లు ఉన్నాయి.

టోల్ గేట్ దగ్గర ఆగే పని ఎలాగూ లేదని వేగంగా వెడుతున్నాడు, సడన్ గా ఒక దున్నపోతు నల్లగా భయంకరంగా ఉంది, డివైడర్ మీద నుండి దూకుతూ బైక్ ముందు నుండి క్రాస్ చేసింది. 

రఘు కంగారుగా సడన్ బ్రేక్ వేసాడు. బైక్ అదుపు తప్పి కింద పడబోతూ ఎలాగో అతి కష్టం మీద నిలదొక్కుకుని, చుట్టూ చూసాడు. చిత్రంగా దున్నపోతు ఎక్కడా కనపడలేదు.

ఆశ్చర్యంతో పాటూ వళ్ళు గగుర్పొడిచింది. తన బైక్ కి అడ్డరావడం స్పష్టంగా కనపడింది, మరి ఇప్పుడెటుపోయిందీ అనుకుంటుండగా గుర్తొచ్చింది, నాలుగురోజుల ముందు పేపర్లో వచ్చిన వార్త, దాని మీద ఆఫీస్ లో జరిగిన డిస్కషన్. 

రఘ స్నేహితుడు చెప్పేడు, వాళ్ళ బంధువుల అబ్బాయి మరికొందరు స్నేహితులూ రెండు బైక్స్ మీద పోటీలు పెట్టుకుని నడుపుతుంటే వాళ్ళ బంధువులబ్బాయి బైక్ కి ఇలాగే ఏదో జంతువు అడ్డం పడినట్లు అనిపించి బ్రేక్ కొడితే కంట్రోల్ తప్పి, పడిపోయాడు రెండో రోజు ఆ గాయాలతో చనిపోయాడని. ఆసుపత్రిలో అతను చెప్పిన విషయం అది. వెనుక వస్తున్న బైక్ మీద కుర్రాళ్లకు మాత్రం ఆ ఆకారం కనపడలేదుట. 

అది గుర్తొచ్చి మరింత భయపడ్డాడు. తన అదృష్టం బాగుండి, బైక్ కంట్రోల్ అయ్యిందిగానీ లేకపోతే తనని ఎవరూ పైకి లేవదీసే వారు కూడా లేరు, అనుకుంటూ నెమ్మదిగా బండి ముందుకుపోనిచ్చాడు. 

తీరా బ్లడ్ బ్యాంక్ దగ్గరకి వెడితే అక్కడ కుర్చీ ఖాళీ గా ఉంది. చుట్టూ చూసాడు ఎవరూ కనపడలేదు. ఏ వాష్ రూమ్ కైనా వెళ్ళుంటాడని పది నిమిషాలు వెయిట్ చేసాడు.

ఒక పక్క పద్మకు ఎలా ఉందో అని టెన్షన్ రెండో పక్క ఆలస్యం అవుతోందన్న టెన్షన్. 

ఒక పదడుగులు ముందుకు వెళ్ళాడు, అక్కడొక వార్డ్ బాయ్ పైకి వెళ్ళే మెట్లమీద కునికిపాట్లు పడుతుంటే లేపి బ్లడ్ బ్యాంకతని గురించి అడిగాడు.
"ఎక్కడకి పోతాడు, అక్కడే ఉంటాడు చూడండి, లేదంటే ఆ పక్కన మార్చురీ రూమ్ దగ్గర బాతాఖానీ కొడుతున్నాడేమో చూడండి" అంటూ నిర్లక్ష్యం గా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. 

రఘు అసహనంగా మార్చురీ రూమ్ వైపు కదిలాడు. మనసులో భయంగా ఉన్నా తప్పదు కాబట్టి. 

అక్కడ కూడా బయట ఎవరూ లేరు, లోపలకి వెళ్ళాలా వద్దా అన్న సంశయం. నెమ్మది గా తలుపు తోసాడు. లోపల అంతా చీకటిగా ఉంది కొంత దూరంలో చిన్నగా లైట్ వెలుగుతోంది. 

అదో రకమైన వాసన ముక్కుపుటాలకి ఘాడంగా సోకి వెగటు కలిగిస్తోంది. సంశయిస్తూనే లోపలకి ఒక అడుగు వేసాడు.
ఇంతలో కీచు మని శబ్దం రావడంతో కాలు బయటకి తీసి కారిడార్ లోకి చూసాడు. అక్కడ పక్కన ఉన్న స్ట్రెచర్ అటూ ఇటూ కదులుతోంది.

ముందు నెమ్మదిగా కదులుతున్న స్ట్రెచర్ తరువాత వేగంగా ఎవరో కుదుపుతున్నట్లు ఊగుతూ శబ్దం చేస్తుంటే గుండెదడ మొదలయ్యింది, చెమట పడుతుంటే అప్రయత్నంగా జేబులోంచి కర్చీఫ్ తీసి తుడుచుకుంటూ అటే చూస్తున్నాడు. 
ఇంతలో గాలికి తను తీసిన మార్చురీ రూమ్ తలుపు శబ్దం చేస్తూ మూసుకుంది. ఆ శబ్దానికి రఘు కెవ్వుమని అరిచాడు. 

ముందు అక్కడనుండి పారిపోదాం అనుకున్నాడు, కానీ ఆ స్ట్రెచర్ తను వచ్చిన వైపే ఉంది, పైగా తను వచ్చేటప్పుడు ఒక పక్కగా ఉంది, ఇప్పుడు కారిడార్ మధ్యలో ఉంది. వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు. టైమ్ చూసాడు 1:20 అయ్యింది.

అనుకున్న ముహూర్తం ప్రకారం 1:30 కి పద్మ ఆపరేషన్ జరగాలి, కానీ తాను ఇక్కడ ఇరుక్కున్నాడు. బ్లడ్ బ్యాంక్ వాడూ దొరకలేదు. 

ఇంతలో రూమ్ లోపల అలికిడి అయినట్లు అనిపించి ఉగ్గపట్టుకుని తలుపు వైపుకీ, స్ట్రెచర్ వైపుకూ చూస్తున్నాడు. 

అలా బిగుసుకుపోయి చూస్తుంటే ఎవరో వెనుకనుండి రఘు మెడ మీద చెయ్యవేసి బలంగా తోసారు.ఆ హఠాత్పరిణామానికి గట్టిగా అరుస్తూ స్ట్రెచర్ వైపుకు పరిగెట్టి, కదులుతున్న స్ట్రెచర్ కి అడుగు దూరంలో ఆగేడు. 

రఘు కాళ్ల సవ్వడికి అప్పటిదాకా స్ట్రెచర్ వెనుక చక్రాల కింద సరసాలాడుకుంటున్న రెండు పందికొక్కులూ కారిడార్ కి అడ్డంపడి పరిగెత్తాయి. 

దెయ్యంకాదని నిర్ధారించుకుని వెనక్కి తిరిగేసరికి మూర్చురీ రూమ్ దగ్గరకొచ్చిన గూర్ఖా కొట్టడానికి అన్నట్లు కర్ర ఎత్తి కోపంగా చూస్తున్నాడు. 

ఎక్కడ తలపైన మోదుతాడో అని భయపడుతూ 'బ్లడ్ బ్యాంక్' అన్నాడు చేతిలో కాయితాలు గాల్లో ఊపుతూ. 

వాడు కర్రదించి "క్యా సాహెబ్! ఆప్ భీ, బ్లడ్ బ్యాంక్ ఉస్ తరఫ్ హై, జావో" అన్నాడు హిందీలో. 
బ్రతుకు జీవుడా అని బ్లడ్ బ్యాంక్ దగ్గరకి వచ్చేసరికి అక్కడ మనిషి ఉన్నాడు. 

అర్జంట్ గా రెండు బ్లడ్ బ్యాగ్స్ ఇవ్వండి అన్నాడు, కంగారుపడుతూ. చమటలు కక్కుతున్న రఘుని చూసి ఎవరికి, ఏమిటీ అనే వివరాలు అడుగుతూ పేపర్ వర్క్ పూర్తి చేసి బ్లడ్ చేతికి ఇచ్చి, కంగారు పడకండి అంతా మంచే జరుగుతుంది అన్నాడు తాపీగా. 

అంతే వాయు వేగంతో బైక్ నడుపుతూ పావుగంటలో ఆసుపత్రి చేరుకున్నాడు. 
బ్లడ్ నర్స్ చేతిలో పెడుతుంటే, మామగారు మా నాయనే వెనకటికి మందుకెళ్ళి రమ్మంటే మాసికానికి వచ్చాడుట నీలాంటి వాడే అర్జంట్ అని డాక్టర్ చెబితే ఇప్పుడొస్తున్నావా? అసలు నిన్ను కాదు అనేది మమ్మల్ని మేము తిట్టుకోవాలి నీలాంటి వాడికిచ్చి చేసినందుకు. 

1:30 కి ఆపరేషన్ చేయించవయ్యా అంటే 2:15 అయ్యింది, అంతా మా ఖర్మ అంటూ మొదలుపెట్టారు. 

ఒక పక్క టెన్షన్ రెండో పక్కన మామగారు సతాయింపూ ఇంక తట్టుకోలేనన్నట్లు " చాలు ఇంక నోరు మూస్తారా లేదా సాయంత్రం నుండి చూస్తున్నాను. ఇప్పటికైనా ఆపకపోతే మిమ్మల్ని పొడిచి జైలుకు వెడతా " అంటూ రౌద్రంగా అరుస్తున్న రఘు భుజం తట్టి లేపుతూ
" ఏం సార్ కల కంటున్నారా? ఆ అరుపులేంటి? లేచి కొంచం ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకువెడుతున్నాము" అంది నర్స్. 

అప్పుడే పద్మని స్ట్రెచర్ మీద బయటకి తీసుకువచ్చారు. 

అప్పటిదాకా వచ్చినది పీడకల అని తెలియగానే హాయిగా ఊపిరి పీల్చుకుని, కాగితాల మీద సంతకం పెట్టి పద్మ చెయ్యి సున్నితంగా నోక్కి భయపడకు అని చెప్పేడు. 

సరిగ్గా 1:30 కి ఆపరేషన్ అయ్యి మహలక్ష్మి లాంటి కూతురు పుట్టిందన్న వార్తతో సంతోషంగా మామగారిని కౌగలించుకున్నాడు. 
                                                   ******

2 comments:

  1. ఇది నిజంగా జరిగిందో లేదో తెలీదు కాని,
    ఇలా మాత్రం ఎవ్వరికీ జరగకూడదు.!
    మనిషిని కృంగదీసేవి రెండే రెండు -
    ఒకటి ఆలోచన (మనోవేదన), రెండు భయం.!
    ఈ రెండింటితో చాలా జాగ్రత్తగా మెలగాలి.!

    ReplyDelete

Pages