‘మీరు నిజంగా దేవుడండీ!’ - అచ్చంగా తెలుగు

‘మీరు నిజంగా దేవుడండీ!’

Share This
‘మీరు నిజంగా దేవుడండీ!’ 
నండూరి సుందరి నాగమణి 

అర్థరాత్రి ఒంటిగంట దాటింది. టకటకమని ఎవరో తలుపు కొట్టిన శబ్దానికి మెలకువ వచ్చింది సుబ్రహ్మణ్యానికి. వీధి తలుపు తెరవగానే చల్లటి గాలి రివ్వున కొట్టింది.  బయట అరుగు మీద కూర్చుని మూలుగుతున్నాడో వ్యక్తి...

“అరెరె ఎవరు? ఎవరదీ?” అంటూనే వరండాలో లైట్ వేసి, చూసాడు.  

“నాపేరు ప్రసాద్ డాక్టర్...” నొప్పికి మూల్గుతూ అన్నాడా ముప్పై ముప్పయ్యైదు సంవత్సరాల మధ్యనున్న ఓ వ్యక్తి. అతని మోకాలికి, పాదానికి తీవ్రంగా గాయమై, రక్తం ధారగా కారిపోతూ కనిపించింది..

“అయ్యయ్యో... ఏమిటీ గాయాలు? ఇటు రా బాబూ...“ అంటూ అతన్ని లేవదీసి, మెల్లగా నడిపించుకుంటూ క్లినిక్ రూమ్ కి అనుబంధంగా ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళాడు. ఎమర్జన్సీ కేసులను అక్కడే చూస్తూ ఉంటాడాయన. అక్కడ ఒక మంచం వేసి ఉంది. మూల గట్టుమీదనున్న స్టవ్ వెలిగించి, వేడినీళ్ళు పెట్టి, గాయాలను క్లీన్ చేసాడు. టించర్ వేసి, కట్లు కట్టాడు. గాయాలు చిన్నవే అయినా ప్రసాద్ బట్టలన్నీ రక్త సిక్తమయ్యాయి. టీటీ ఇంజక్షన్ ఒకటి ఇచ్చి, నొప్పి తగ్గటానికి కూడా మరో ఇంజక్షన్ ఇచ్చాడు. లోపలి నుంచి తన బట్టలు ఒక జత తీసుకువచ్చి ఇచ్చాడు. మొహమాటపడుతూనే పక్కనే ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడతను.

“ఏమైనా తిన్నావా?” ఆదరంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.

లేదన్నట్టు నీరసంగా తలూపాడు ప్రసాద్. తలపంకించి అక్కడినుంచి కదిలాడు సుబ్రహ్మణ్యం.  అయిదు నిమిషాల వ్యవధిలోనే కాల్చిన బ్రెడ్ స్లైసులు, గ్లాసు నిండా వేడి పాలతో ప్రత్యక్షమయ్యాడు... ప్రసాదు కళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి.

“అయాం సో సారీ డాక్టర్... మీకు చాలా శ్రమ ఇస్తున్నాను...” అతని గొంతు బొంగురు పోయింది.

దీర్ఘంగా నిట్టూర్చాడు సుబ్రహ్మణ్యం... “అవన్నీ రేపు మాట్లాడుకుందాము...ముందు తినవయ్యా ప్రసాద్... చాలా ఆకలిమీద ఉన్నావు...”

మారు మాట్లాడకుండా తినేసి, డాక్టర్ కి తన రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టాడు ప్రసాద్. అతన్ని పడుకోమని చెప్పి, కట్టు కట్టిన కాలికింద ఎత్తుగా ఒక దిండు పెట్టి, బెడ్ లాంపు వేసి, ఆ గదిలోంచి వచ్చేసాడు సుబ్రహ్మణ్యం. డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ ప్రభావానికి కనులు మూతలు పడుతూ ఉండగా నిద్రలోకి జారుకున్నాడు ప్రసాద్.

***

“లేచావా ప్రసాద్? బాగా నిద్ర పట్టిందా?” ఉదయం గదిలోకి వస్తూనే పలకరించాడు సుబ్రహ్మణ్యం. అప్పటికే లేచి కాలకృత్యాలు తీర్చుకొన్న ప్రసాద్ నీరసంగా తలూపాడు. డాక్టర్ వెనుకే వచ్చిన పనిమనిషి చేతిలోని టిఫిన్ ప్లేట్ ను అక్కడున్న బల్ల మీద ఉంచి, మంచినీళ్ళ సీసా, ఒక ఫ్లాస్కు  కూడా పక్కనే పెట్టి వెళ్ళింది. సుబ్రహ్మణ్యం ఇడ్లీ ప్లేట్ ను ప్రసాద్ కి అందించాడు. అతను తినటం పూర్తి చేసాక, ఫ్లాస్కు లో ఉన్న కాఫీని గ్లాసులోకి వంచి ఇచ్చాడు.

అతను కాఫీ తాగుతుంటే, “ఊ, ఇప్పుడు చెప్పు ప్రసాద్... నువ్వెవరు? ఈ గాయాలేమిటి?” అని అడిగాడు సుబ్రహ్మణ్యం.

కాసేపు మౌనంగా ఊరుకున్నాడు ప్రసాద్.  ఆ తరువాత గొంతు సవరించుకొని, ”డాక్టర్, నేను ఒక దొంగను!” అన్నాడు మెల్లగా. సుబ్రహ్మణ్యం ముఖంలో ఏ భావమూ కనిపించలేదు.

“ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకలేదు. నాకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాడు నాకు రావలసిన ఉద్యోగాన్ని అడ్డదారిలో కొనేసాడు. ఇంటిమీద చేసిన అప్పు కట్టనందుకు అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేసేసారు. మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాను. నాకు ఒక కూతురు కూడా... నేను రైళ్ళలో దొంగతనాలు చేస్తూ ఉంటాను. పోలీసులు కానీ, ప్రయాణీకులు కానీ నన్ను పట్టుకోవాలని వెంటపడాలని ప్రయత్నించినపుడు వాళ్ళకి దొరక్కుండా క్రిందికి దూకినప్పుడు ఇలా దెబ్బలు తగులుతుంటాయి... వీటిని తగ్గించుకోవటానికి ఇదివరలో చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళాను కానీ వాళ్ళెవరితోనూ నేను ఒక దొంగను అన్న నిజం చెప్పలేదు... కానీ మీరు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎలాంటి వివరాలు అడక్కుండా  నాకు వైద్యం చేసారు. నా ఆకలి తీర్చారు. మీ మంచితనం చూసి నిజం దాచలేక మీకీ విషయం చెబుతున్నాను...”

వింటూ మౌనంగా ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం.

“ఏం డాక్టర్, వీడికి అనవసరంగా వైద్యం చేయటమే కాకుండా ఒకరాత్రి అంతా ఇంట్లో కూడా ఉంచుకున్నానని ఫీలవుతున్నారా? అందుకనే నేను ఏ డాక్టర్ కీ నిజం చెప్పను...”

“చూడు ప్రసాద్, ఏ మనిషి కైనా అనారోగ్యాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ప్రసాదించటం డాక్టర్ గా నా విధి. అది నా వృత్తి ధర్మం. అలాంటప్పుడు ఎదుటి మనిషి యొక్క వృత్తి ఏమిటనేది చూడను నేను...” నవ్వుతూ చెప్పాడు, సుబ్రహ్మణ్యం.

రెండురోజులు గడిచాయి. కాస్త కోలుకున్న ప్రసాద్, “ఈరోజు నేను వెళతాను డాక్టర్... మీ ఫీజు కింద ఇది ఉంచండి...” అని వెయ్యి రూపాయలు జేబులోంచి తీసిచ్చాడు.

“వద్దు ప్రసాద్, మీ పాపకు కొత్త ఫ్రాక్ కొని తీసుకువెళ్ళు ఈ డబ్బుతో... ఒక్క పదినిమిషాలాగి బయలుదేరు. ఈలోగా నేను నీతో కాస్త మాట్లాడాలి...”

“చెప్పండి డాక్టర్...”

“చూడు ప్రసాద్, నీకు తెలుసు నువ్వు ఎన్నుకున్న దారి అసలు మంచిది కాదనీ, నీ లైఫ్ కే రిస్క్ అనీ... ఇకనైనా ఆ జీవితానికి స్వస్తి చెప్పవచ్చు కదా...” అనునయంగా అన్నాడు సుబ్రహ్మణ్యం. 

ఆ మాటలు రుచించనట్టు అయిష్టంగా తల తిప్పుకున్నాడు, ప్రసాద్.

”నాకు అనుమానం  పోలీసు రికార్డ్స్ లోకి నీ పేరు ఎక్కిపోయి ఉంటుంది... ఇప్పుడు రైల్లో దొంగతనాలు చేస్తున్నావు... ఆర్పీయఫ్ వాళ్లకు దొరికితే ఏం జరుగుతుందో నీకు తెలుసు. అందుకని కదులుతున్న  రైల్లోంచి ప్రాణాలకు తెగించి దూకేయటం ఎంత రిస్క్?”

ప్రసాద్ మౌనంగా ఉండిపోయాడు. 

“సరే, నువ్వేమీ నాలా ఒంటరి వాడవు కాదు. నువ్వేమైనా అయితే, నీ భార్యా, పాపా ఏమైపోతారు? అదీగాక, సంఘంలో నీ భార్య పరిస్థితి ఏమిటి? ఒక దొంగ భార్యగా ముద్ర పడిపోయింది... నా మాటవిని ఈ పని మానేసి, ఎక్కడన్నా గౌరవంగా బ్రతుకు...”

“ఆ ముద్ర ఇదివరకే పడిపోయింది డాక్టర్... ఇప్పుడు నేను మామూలు మనిషిగా మారాలన్నా మారలేను... ఇప్పుడు నా బేబీని స్కూల్లో చేర్చాలి. డొనేషన్ కట్టాలి... అంటే డబ్బు కావాలి... నేను ఏమైపోయినా ఫర్లేదు... కానీ వాళ్ళు బాగుండాలి... అందుకే ఈ పని ఎంత రిస్క్ అయినా చేస్తున్నాను...”

“అది తప్పు కాదా? ఎవరో, ఏదో అర్జెంట్ పని మీద డబ్బు తీసుకుని వెళుతూ ఉంటారు... దాన్ని నువ్వు దొంగతనం చేయటం తప్పు కాదా? ఏమో, అవతల ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, ఈ డబ్బు వాళ్లకు ఎంత అవసరమో .... ఏ పెళ్ళికూతురి పెళ్ళి నీ దొంగతనం వలన ఆగిపోతుందో... ఏ ఇల్లాలి మెడ లోంచి నువ్వు కత్తిరించిన గొలుసు ఆవిడను ఎన్ని ఇక్కట్ల పాలు చేస్తుందో... ప్రయాణీకులు ముసుగులు పెట్టి ఆదమరచి నిద్ర పోతున్నప్పుడు, వాళ్ళ దుప్పట్లు, జేబులు కత్తిరించి డబ్బు కొట్టేసినప్పుడు, ఆడవారి నగలు కత్తిరించి దొంగిలించినపుడు ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించవా?”

“నో...” గట్టిగా అరిచాడు ప్రసాద్... 

“ఎందుకాలోచించాలి డాక్టర్?  మాకు తిండి దొరక్క పస్తులున్నపుడు మా గురించి ఎవరైనా ఆలోచించారా? నా భార్యకు నొప్పులు వస్తున్నపుడు సహాయం చేయమని అర్థిస్తే ఏ పొరుగావిడైనా ఆదుకుందా? అయినా సొమ్ములు వేసుకుని ప్రయాణం చేయవద్దని మీ ఘనత వహించిన ప్రభుత్వం వారే హెచ్చరిస్తున్నారు... సరియైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం వలననే కదా నాలాంటి వాళ్ళు దొంగతనాలు చేయగలుగుతున్నారు? అయినా ఎవరో బాధ పడతారని నేను ఆలోచిస్తూ కూర్చుంటే, నా అవసరాలు గడవవు... నేను తప్పు చేస్తున్నానన్న భావన నాకు ఏమాత్రం లేదు...” దృఢంగా అన్నాడు ప్రసాద్.

“సరే ప్రసాద్, వెళ్లిరా... జాగ్రత్త...” గుమ్మం వరకూ వచ్చి సాగనంపాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం.

***

ఆ తరువాత సంవత్సరంలో ఒక నాలుగైదు సార్లు, దెబ్బలు తగిలినప్పుడల్లా సుబ్రహ్మణ్యం దగ్గరకు ప్రసాద్ రావటం ఒక అలవాటుగా మారిపోయింది. వచ్చిన ప్రతీసారీ ప్రసాద్ ను మంచి మార్గంలోకి మారమనీ, మామూలు జీవితం గడపమనీ చెప్పటం దానికి ప్రసాద్ ససేమిరా అనటం జరుగుతూనే ఉంది.

సుబ్రహ్మణ్యం దగ్గర చనువు పెరగటంతో ఓ రోజు, “నాకు తెలుసులెండి... ఎప్పుడో ఒకప్పుడు మీరే పోలీసులకు ఫోన్ చేసి నన్ను పట్టిచ్చేటట్టు ఉన్నారు...” అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.

“నా వృత్తి వైద్యం చేయటమే ప్రసాద్, దొంగల్ని పట్టివ్వడం కాదు... పట్టిచ్చే వాడినే అయితే ఇన్నాళ్ళు ఊరుకుంటానా?” చెప్పాడు సుబ్రహ్మణ్యం తనూ నవ్వుతూనే...

కొన్నాళ్ళుగా ప్రసాద్ రావటం మానేసాడు... అర్థరాత్రి నిద్ర పట్టక, ఏవో మెడికల్ జర్నల్స్ తిరగేస్తూ కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ప్రసాద్ గుర్తు వస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యానికి...  “ పాపం... ఎలా ఉన్నాడో...” అని ఒక నిట్టూర్పు విడుస్తూ ఉంటాడు.

***

మరో సంవత్సరం తరువాత ఒక సాయంకాలం, సుబ్రహ్మణ్యం  క్లినిక్ లో రోగులను చూస్తూండగా ఒక వ్యక్తి చాలా నిస్త్రాణగా, దగ్గుతూ  లోపలికి వచ్చాడు. మనిషి వంటిమీద గుప్పెడు కండకూడా లేదు... శుష్కించి పోయి ఉన్న అతన్ని ప్రసాద్ గా పోల్చుకోవటానికి ఆట్టే సమయం పట్టలేదు సుబ్రహ్మణ్యానికి. లోపలి రూములో కూర్చోమన్నట్టు కనుసైగ చేసి, చివరిగా మిగిలిన ఇద్దరు రోగులనూ చూసి పంపించి లోపలికి వచ్చాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం.

“ఏవిటయ్యా ప్రసాదూ, ఏమయింది? ఇలా అయిపోయావేమిటి? అరె, ఇలా దగ్గుతున్నావేమిటి? ఆరోగ్యం ఇంతలా పాడై పోయేవరకూ నిర్లక్ష్యం చేసావా?” బాధపడుతూ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.

“డాక్టర్, నాకు చాలా అన్యాయం జరిగింది... నేను లేనప్పుడు నా ఇంటిమీద దాడి జరిగింది. నా భార్యను తీసుకువెళ్ళిపోయారు... ఆమె ఎక్కడుందో తెలియదు. నా పాపను మా దూరపు చుట్టాలు తీసుకువెళ్ళారని తెలిసింది...” ప్రసాద్ చెబుతూ ఉండగానే పెద్ద దగ్గు తెర వచ్చింది... పేగులు ఉండ చుట్టుకుపోయినట్టు దగ్గుతున్నాడు... దగ్గుతో పాటే అతని నోటిలోంచి రక్తం పడింది...

సుబ్రహ్మణ్యం కంగారుగా, ప్రసాద్ ని పట్టుకుని, “షీలా... త్వరగా రా...” అని నర్స్ ని పిలిచి, క్లీన్ చేయించాడు... ఆ తరువాత ఒక ఇంజక్షన్ ఇచ్చి, బిస్కట్లు, పాలు ఇచ్చి పడుకోబెట్టాడు... కాస్త ఉపశమనం కలిగిన తరువాత, “డాక్టర్ గారూ, పోలీసులకు భయపడి అజ్ఞాత వాసం చేస్తున్నాను. ఈ మాయదారి జబ్బు పట్టుకుంది... నా భార్య నాకు కాకుండా పోయింది... నా బేబీ ని చూడాలని ఉంది...” అన్నాడు ఆయాసపడుతూ...

“నీ భార్యను ఎవరు తీసుకువెళ్ళారు?”

“నాలాంటి అసమర్థుడిని పెళ్ళి చేసుకున్న నేరానికి బలైపోయింది. ఆ మధ్య నెల్లూరులో ఒక రైలు పట్టాలు తప్పినప్పుడు, చాలా ప్రాణనష్టం జరిగింది కదా... అప్పుడు చనిపోయిన ఒక బిజినెస్ మాగ్నెట్ సూట్ కేస్ మాయంఅయిందట.  దాంట్లో కొన్ని కోట్ల రూపాయల విలువచేసే బంగారు బిస్కట్లు ఉన్నాయట. అది నేనే దొంగిలించానని, దాన్ని కాజేయటానికి ప్రయత్నించిన ఒక దొంగల ముఠా అనుమానించి, నా జాడలు చెప్పమని ఆమెను బంధించారని అనుమానం. మీరు చెప్పిన అభద్రతా జీవితమంటే ఏమిటో, నాకూ, నాకన్నా కూడా నా భార్యకూ బాగా అనుభవమయ్యాయి... ఇప్పుడామె బ్రతికి ఉందో, లేదో కూడా తెలియదు...”

“అరె... ఎంత పని జరిగింది? సరే... మాట్లాడకుండా పడుకో ప్రసాద్... కాసేపటి తర్వాత భోజనం చేద్దువు గాని...” అన్నాడు సుబ్రహ్మణ్యం. ప్రసాద్ బాధగా కళ్ళు మూసుకున్నాడు.

మర్నాడు ప్రసాద్ రక్తం, మూత్రం, ఉమ్మి శాంపిల్స్ తీయించి, ల్యాబ్ కి పంపించాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం. అతని అనుమానం నిజమయింది. ప్రసాద్ కు క్షయ వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజిలో ఉంది.  ఆ సాయంత్రం అతన్ని కూర్చోబెట్టి, రిపోర్ట్స్ చూపించాడు సుబ్రహ్మణ్యం.

“నాకు తెలుసు డాక్టర్, నాకు టీబీ అనీ, ఎక్కువ రోజులు బ్రతకననీ... ఒకవేళ ఈ జబ్బు వల్ల కాకపోయినా ఎలాగైనా నాకు మరణం తప్పదు. నన్ను వెదికి, వెంటాడి అవతలి ముఠా మనుషులు సఫా చేసేస్తారు. మరొక వైపు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు నాకోసం. నేను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను... కానీ నాకు చచ్చిపోవాలని లేదు డాక్టర్... బ్రతకాలని ఉంది... నా పాపను తెచ్చుకుని, చక్కగా పెంచుకోవాలని ఉంది...” ఆయాసపడుతూ అన్నాడు ప్రసాద్.

“అలాగే ప్రసాద్... నేను నీకు వైద్యం చేస్తాను... ప్రస్తుతం నిద్రకు మందిస్తాను... పడుకో...” అని ఇంజక్షన్ ఇచ్చాడు సుబ్రహ్మణ్యం. అతను నిద్రపోగానే, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, “మీరు వెదుకుతున్న దొంగ ప్రసాద్ నా క్లినిక్ లో ఉన్నాడు. వచ్చి అరెస్ట్ చేయండి...” అని చెప్పేసాడు.

***

తొమ్మిదేళ్ళ తరువాత –

జైలు శిక్ష ముగించుకొని వెంటనే రైలు ఎక్కి వచ్చేసిన ప్రసాద్ కోపంగా డాక్టర్ ఇంటి తలుపు తట్టాడు. డాక్టర్ కనబడగానే అతన్ని నిలదీయాలనుకుంటున్న అతనికి తలుపు తెరచిన పదిహేను సంవత్సరాల పాపను చూడగానే  కళ్ళు వెలిగిపోయాయి... ఆ పాపను తన కూతురు స్నిగ్ధగా పోల్చుకోవటం అతనికి ఏమాత్రం కష్టం కాలేదు. అశ్రుధారల మధ్య ఆమె రూపం మసక మసకగా కనిపిస్తూ ఉంటే, గభాలున ఆ పాపను దగ్గరకు తీసుకొని, ఆమె తలను తన గుండెలకు హత్తుకున్నాడు... ‘నా బంగారు తల్లీ...’ అంటూ...నుదుట ముద్దులు కురిపించాడు... 

“ఆయనేనమ్మా  మీ నాన్న” ఆమె వెనుకనే నిలుచున్న సుబ్రహ్మణ్యం చెప్పాడు.

“నాన్నగారూ...” స్నిగ్ధ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. ముందుకు వంగి ప్రసాద్ కు పాదాభివందనం చేసింది.

“ఇప్పుడు స్నిగ్ధ టెంత్ క్లాస్ చదువుతోంది... అమ్మలూ, నాన్నకు వాష్ రూమ్ చూపించు... ప్రసాద్ ఫ్రెష్ అయి రావయ్యా... భోజనం చేద్దాం...” ఆదరంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.

“మిమ్మల్ని ఒక మాట సూటిగా అడుగుతున్నాను  డాక్టర్... ఆరోజు మీ వృత్తి వైద్యం చేయటమే కానీ దొంగల్ని పట్టివ్వడం కాదని గొప్పగా చెప్పారే, నాకు మత్తిచ్చి వెంటనే పోలీసులకు ఎందుకు పట్టిచ్చేరు?” ఆగ్రహంగా అడిగాడు ప్రసాద్.

“ప్రసాద్, అప్పుడు కూడా నీకు వైద్యమే చేశానయ్యా... నీకు టీబీ ఉందని తెలిసాక, నీకు పూర్తి విశ్రాంతి అవసరమని గ్రహించాను. మానసికంగా ఒత్తిడికి లోనవుతూ, శారీరకంగా శ్రమ పడుతూ, ఎప్పటికప్పుడు ఆపదనుంచి పరుగు తీస్తూ ఉంటే, నీ ఆరోగ్యం ఎప్పటికీ బాగుపడదని నాకు అర్థమైంది. నీకు విశ్రాంతి కావాలంటే నీవు అన్నింటికీ దూరంగా ఉండాలి. అందుకనే నిన్ను జైలుకు పంపించాను. అంతే కాదు, నీ అనారోగ్య పరిస్థితి గురించి జైలు సూపరింటెండెంట్ కు ముందే రాసిచ్చి, నీకు జరగాల్సిన వైద్యం అంతా జైలు శానిటరీ లో జరిగేలా చూసాను...” ఆప్యాయంగా చెప్పాడు, సుబ్రహ్మణ్యం.

తన సందేహాలన్నీ మబ్బుల్లా తొలగిపోవటంతో ప్రసాద్ కోపం మంచులా కరిగిపోయింది. జబ్బుపడి చనిపోవలసిన తాను జైలు హాస్పిటల్లో వైద్యం చేయటం వలన మృత్యు ముఖం నుంచి బయటపడిన మాట వాస్తవం... అంతులేని కృతజ్ఞతా భారంతో  వంగి సుబ్రహ్మణ్యం పాదాల మీద పడిపోయాడు. అతని కన్నీరు ఆయన పాదాలకు అభిషేకం చేస్తూ ఉంటే, అతన్ని మెల్లగా లేవనెత్తి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు సుబ్రహ్మణ్యం.

“డాక్టర్ గారూ! మీరు నిజంగా దేవుడండీ... నాకిప్పుడు క్షయవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది... నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను...  సూర్యుడు మనకు వెచ్చదనాన్నే కాదు, జీవాన్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలాగే మీరు నాకు శరీరానికే కాక, ఆత్మకు కూడా వైద్యం చేసిన సూర్యుడు... నా చిట్టితల్లిని తీసుకువచ్చి, మీ దగ్గర ఉంచుకొని పెంచి ఇంతదాన్ని చేసారు... ఏం చేస్తే మీ ఋణం తీర్చుకోగలను?” గాద్గదికంగా అన్నాడు, ప్రసాద్.

“చూసావు కదా ప్రసాద్, ఈ ప్రక్కన ఇరవై పడకల హాస్పిటల్ కట్టించాను.. పేదరోగులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాను. ఇకనుంచీ ఆ హాస్పిటల్ కేర్ టేకర్ వి నువ్వే... నాకు సహాయంగా ఉండిపోవయ్యా...”

“అంతకన్నానా?” ఆయన చేతులు చెమ్మగిల్లిన తన కళ్ళకు అద్దుకొన్నాడు ప్రసాద్. తన గమ్యాన్ని చేరుకొన్న అతనికి కలిగిన మానసిక సాంత్వనతో అలసిన శరీరమూ, హృదయమూ సేదదీరసాగాయి.

***

1 comment:

  1. చాలా హృద్యంగా రచించారు.!
    చివరలో కొంచం ఏడిపించారు కూడా.!
    మంచి కథను చదివిన అనుభూతి కలిగింది.!

    ReplyDelete

Pages