సౌందర్యలహరి - 5 - అచ్చంగా తెలుగు
సౌందర్యలహరి - 5
మంత్రాల పూర్ణచంద్రరావు 


గం గణపతయేనమః
శ్రీ గురుభ్యోనమః 
శ్లో: 56.తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః
నిలీయం తే తోయే నియతమ నిమేషాఃశ్శఫరికాl
ఇయంచ శ్రీర్బద్ధచ్ఛదపుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి ll

తా: అమ్మా! ఓ అపర్ణా.. నీ చెవులకు తాకుతున్నట్లు నీ కనులు కనబడటం వలన, ఆ చెవులకు తమ రహస్యం వెల్లడి కాకుండా తమను అమ్మ కళ్ళతో పోల్చుకున్న చేపలు బెడిసి తమ రూపాలను కనబడనీయకుండా దాక్కున్నాయి. నీ కనులలో నున్న కాంతియైన సౌభాగ్య లక్ష్మి ని కలువలు ఆవిష్కరించాయని నీ చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి పగలు, ఆ పూవుని విడిచి రాత్రి మాత్రమే ఆ పూవుల రేకు డిప్పలను తెరిచి ప్రవేశిస్తోంది. అమ్మ సౌందర్యముతో తమను తాము పోల్చుకున్నామనే బెరుకు వీటిచే ఆ పని చేయింస్తోంది. కదా.
శ్లో:57. దృశా ద్రాఘీయస్యా  దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివేl
అనే నాయం ధన్యో భవతి నచతే హానిరియతా
వనే వా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః ll

తా: అమ్మా! శివుని పత్ని యగు ఓ పార్వతీ దేవీ చాలా పొడవైన  వికసించిన నల్ల కలువల కాంతి గల నీ క్రీగంటి చూపు లోని కృపా రసముతో అతి దూరముగా ఉన్న  నన్ను కొంచెము తడుపుము. అట్లు చేయుట వలన నేను ధన్యుడను అగుదును. ఈ మాత్రము నీవు చేయుటవలన నీకు ఎటువంటి నష్టమూ లేదు. చల్లదనముతో కూడిన చంద్రుడు అడవి యందు అయిననూ రాజప్రాసాదము వంటి భవనముల యందు అయిననూ ఒకే విధమయిన చల్లదనము చూపును. కదా !
శ్లో: 58. అరాళం తే పాళీయుగళ మగరాజన్య తనయే
నకేషా మాధత్తే కుసుమశర కోదండ కుతుకంl
తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్
అపాజ్గవ్యాసజ్గో దిశతి శరసంధాన ధిషణామ్ll

తా: అమ్మా! పర్వత రాజ పుత్రీ నీ వంకరగా ఉన్న కణతల జంట ఎవరి మనస్సుకు అయినా మన్మధుని వింటి యొక్క సౌందర్యమును  కలిగించును  , ఎలాగు అనగా నీ కటాక్ష వీక్షణము కనుకొలకులను దాటి  చెవి త్రోవ మీదుగా మెరయుచున్న బాణములు వదులుచున్న భావము కలిగించు చున్నది కదా!
శ్లో:59. స్పురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథ రథంl
యమారుహ్య ద్రుహ్యత్యవనిరథ మర్కేందు చరణం
మహా వీరో మారః ప్రమథపతయే సజ్జితవతే.ll

తా: అమ్మా!  అద్దము వలె  ప్రకాశించు చున్న నీ చెక్కిళ్ళ యందు ప్రకాశించు చున్న నీ చెవి కమ్ముల జంటను కలిగిన నీ ముఖము మన్మధుడు ఎక్కిన నాలుగు చక్రములు గల రధముగా కనపడుచున్నది. ఈ రధమునెక్కిన మన్మధుడు  సూర్యచంద్రులు చక్రములుగా కలిగి భూమి అను రధమునెక్కిన  ప్రమధ పతి ని ఎదిరించుచున్నాడు కదా !
శ్లో:60. సరస్వత్యాః సూక్తి రమృతలహరీ కౌశల హరీః
పిబన్త్యా శ్శర్వాణీ శ్రవణచుళుకాభ్యా మవిరళంl
చమత్కార శ్లాఘా చలిత శిరసః కుండల గణో 
ఝణత్కారైస్తారైః ప్రతివచన మాచష్ట ఇవ తే.ll

తా: అమ్మా! పరమ శివుని పత్ని అయిన ఓ పార్వతీ దేవీ అమృత ప్రవాహముల మాదుర్యములను హరించు మధురమయిన పలుకులతో సరస్వతీదేవి చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిళ్ళ చేత చక్కగా వినుచూ , ఆ స్తోత్రముల లోని చమత్కారములను మెచ్చుకొనుటకు  శిరస్సును కదల్చగా  నీ యొక్క కర్ణాభరణములు ఝణత్కారములచే మారు మాటను చెప్పు చున్నట్లు ఉన్నది కదా !
శ్లో: 61. అసౌ  నాసా వంశ - స్తుహినగిరి వంశధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ l
వహత్యంతర్ముక్తాః శ్శిశిరకర నిశ్వాస గళితం
సమృద్ధ్యా య స్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ll 

తా: అమ్మా! తుహినగిరి రాజ పుత్రీ అయిన ఓ పార్వతీ దేవీ  నీ యొక్క వెదురు వలె ఉన్న నాసా దండము మాకు కోరిన కోరికలను తీర్చుచున్నది,ఆ నాసా దండము లోపల మణులను ధరించు చున్నది.ఆ మణుల నిండు దనముచే చంద్రునిదగు ఎడమ ముక్కు ద్వారా వచ్చు గాలి వలన బయట కూడా ముక్తా మణిని ధరించెను కదా !
శ్లో: 62. ప్రకృత్యారక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విదృమలతా l
నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం
తులా మధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా ll

తా: అమ్మా ! చక్కని పలువరుసలు కలిగిన తల్లీ ! స్వభావము చేత కాంతులు చిమ్ముతున్న నీ పెదవుల కాంతికి సారూప్యముగా ఈ ప్రపంచమున ఏమియూ లేదు,నీ పై పెదవి సహజమయిన కాంతి కలది, అట్టి కాంతికి సమానముగా "పగడము" తీగకు పండినచో పోలిక కాగలదు.పోల్చుదమన్నదానికి దొండపండును పెదవుల కాంతి సహజము కాదు,దొందపండును బింబమని పలికెదరు, అది కూడా నీ పెదవుల యొక్క ప్రతిబింబము వలననే ఆ పేరు వచ్చెను. కదా !
శ్లో:63. స్మితజ్యోత్స్నాజాలం  తవ వదన చంద్రస్య పిబతాం
చకోరాణామాసీ దతి  రసతయా చంచుజడిమా l
అతస్తే శీతాంశో రమృత లహరీ రామ్లరుచియః 
పిబంతి స్వచ్ఛన్డం  నిశినిశి భృశం కాంజికధియా ll 

తా: అమ్మా! భగవతీ , నీ చంద్ర బింబము వంటి ముఖమున గల చిరునవ్వు అను వెన్నెలను త్రాగుచున్న చకోరపక్షుల ముక్కులకు అతి మాధుర్యము వలన అరుచి కలిగి, అవి పులుపునందు కోరిక కలిగి చంద్రుని యొక్క అమృత ప్రవాహమును బియ్యపు కడుగు అనుకొని ప్రతి రాత్రియు వెన్నెల యందు తృప్తిగా త్రాగుచున్నవి . కదా!  
శ్లో: 64. అవిశ్రాంతం పత్యర్గుణ గణకథా మ్రేడనజపా
జపా పుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా l
యద గ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్ఛచ్భవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా ll

తా: అమ్మా !  నీ యొక్క నాలుక నుండి నిరంతరమూ జప రూపముగా వచ్చు నీ భర్త అయిన ఆ పరమ శివుని  జపా పుష్పములతో , నీ నాలుక చివరి భాగమున ఉన్న శుద్ధ స్ఫటిక రంగు కలిగిన  సరస్వతీదేవి కూడా ఎఱ్ఱని వన్నె కలదై ప్రకాశించు చున్నది. కదా !
శ్లో: 65. రణే జిత్వాదైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్ని వృత్తైశ్ఛణ్దాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః
విశాఖేన్ద్రోపేన్ద్రై శ్శశివిశద కర్పూర శకలాః
విలీయ న్తే మాత స్తవ వదన తామ్బూలకబళాః

తా: అమ్మా ! సమరమున రాక్షసులను జయించి వచ్చి తలపాగాలను తొలగించి , కవచములని తొలగించని వారునూ చండుడు అను ప్రమధునిచే  అనుభవింపదగిన హర నిర్మాల్యమునందు విముఖులయిన వారునూ అగు కుమారస్వామి, ఇంద్రుడు,విష్ణువు మొదలగువారిచే చంద్రుని వలె స్వచ్ఛమయిన, నిర్మలములు అయిన నీ ముఖమునందలి తాంబూలపు ముద్దలు గ్రహించబడు చున్నవి. కదా !
 శ్లో: 66. విషఞ్చ్యా గాయన్తీ వివిధమపదానం పశుపతే
స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే
త్వదీయైర్మాధుర్యైరపలపిత తన్త్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్ ll

తా: అమ్మా! సరస్వతీదేవి నీ ఎదుట పరమ శివుని విజయగాధలు వీణతో పాడుచు ఉండగా, అప్పుడు నీవు నీ మనస్సునందు కలిగిన సంతోషమును తెలుపుచూ శిరస్సును కదుపుతూ ప్రశంసా వాక్యములు పలుకుట మొదలు పెట్టగానే, ఆ వాక్యములందలి మాధుర్యము నకు, తన యొక్క  వీణా తంత్రము కలవరము చెందినదయి  తన యొక్క వీణను చీర చెంగుతో కప్పివేసెను .కదా !
శ్లో:67. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహు రధరపానాకులతయా
కరగ్రాహ్యం శమ్భోర్ముఖ ముకురవృన్తం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్ ll

తా: అమ్మా ! పర్వత రాజ కుమారీ ! నీ తండ్రి గారిచే గారాబముగా  చేతి కొసలచే తడుప బడినదియు, మరియు పతి అయిన శివుని చేత పానకమాడు వేళ తడబడి మాటి మాటికి పైకి ఎత్తబడి శివుని చేత పట్టుకొనబడి ముఖము అనెడు అద్దమునకు పిడి అని నీ చుబుకమును వర్ణించ తరము కాదు కదా .
శ్లో:68. భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంణ్టకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియ మియమ్
స్వత శ్వేతా కాలాగురుబహుళ జమ్బాలమలినా
మృణాళీలాలిత్యం వహతి యదథో హారలతికాll

తా: అమ్మా! త్రిపురాంతకుడయిన ఈశ్వరుని కౌగిలింత వలన నిత్యమూ రోమాంచిత అగు ముఖ కమలము అను పద్మము యొక్క కాడ అందమును ధరించు చున్నది, ఎందువలన అనగా దాని క్రింది భాగమున సహజముగా తెల్లనిదయి నల్లనిదగు విస్తారమయిన బురద చేత మలినమయినదియునూ  తీగవంటి హారము తామర లత యొక్క లాలిత్యము వహించు చున్నది. కదా! 
శ్లో:69. గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైకనిపుణే
వివాహవ్యానద్ధ ప్రగుణగుణసంజ్ఖ్యా ప్రతిభువఃl
విరాజన్తే నానావిధమధుర రాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవతే ll

తా: అమ్మా! సంగీత గతికి సంబంధించిన మార్గదేశి గతులను పాడుట యందు నిపుణరాలవు అగు తల్లీ ! నీ గళమున ముడుతలు లాగున ఉన్న మూడు భాగ్య రేఖలు వివాహ సమయమున  మంగళ సూత్రము  కట్టిన తరువాత వాని వద్ద పెక్కు పేటలు కలిపి పేనిన మూడు సూత్రములను జ్ఞప్తికి తెచ్చుచూ అనేక విధములయిన రాగములకు నిలయమయిన షడ్జమం,మధ్యమం‌,గాంధారమనే గ్రామముల ఉనికి కొఱకు ఏర్పాటు చేసిన సరి హద్దులా ప్రకాశించుచున్నది. కదా! 
శ్లో: 70. మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భి స్సౌన్దర్యం సరసిజభావః స్సౌతి వదనైఃl
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమమథనా దంధకరిపో
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా l

తా: అమ్మా!  బ్రహ్మ అంధకాసురినికి విరోధి అయి వానిని వధించిన పరమ శివుడు, తన అయిదవ తలను తన గోళ్ళతో పెరికి వేయుట వలన  మిక్కిలి భయపడిన వాడయి తన నాలుగు తలలతో తనకు అభయ హస్తమును ఇమ్మని తామర తూడుల వలె మృదువయిన నీ నాలుగు చేతులనూ ప్రార్ధించు చున్నాడు .కదా.
(సశేషం)

No comments:

Post a Comment

Pages