నెల'వంక ' - పాపభీతి - అచ్చంగా తెలుగు

నెల'వంక ' - పాపభీతి

Share This
నెల'వంక' - పాపభీతి 
కంభంపాటి రవీంద్ర 

హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో కారు డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్టు  తీసుకుందామని కొండాపూర్ లోని rto ఆఫీస్ కి వెళ్ళేను . షరామామూలుగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ టెస్టు కోసం .
ఆ జనంలో ఓ కుటుంబం నన్ను ఆకర్షించింది . ఆ ఇంట్లో వాళ్లెవరో డ్రైవింగ్ పరీక్ష కోసం వచ్చినట్టున్నారు , అదేదో కృష్ణవంశీ సినిమా టైపులో మొత్తం కుటుంబం అంతా వచ్చి తెగ హడావిడి పడిపోతున్నారు ! ఆ ఫామిలీ లో ఎవరో అమ్మాయి పరీక్ష తీసుకోడానికి రెడీ అయ్యింది , వాళ్ళందరూ తెగ జాగ్రత్తలు చెప్పి పంపించారు , తీరమోసి ఆ డ్రైవింగ్ రింక్ లోకి వెళ్లిన తర్వాత , ఎక్కడబడితే అక్కడ కారుని డింకీ కొట్టించేసింది . అసలు ఏ మలుపూ సరిగా తీసుకున్న పాపాన పోలేదా అమ్మాయి !
ఇంక ఈ పిల్లకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్టే అనుకున్నాను , కాసేపు తర్వాత నా టెస్టు తీసుకుని వెళ్లిపోయేను . 
మర్నాడు ఆఫీసుకెళ్తూ కొండాపూర్ వేపెళ్తూంటే, ఎదురుగుండా ఎవరో అడ్డదిడ్డంగా కారు  డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు . ఆ చుట్టుపక్కల అందరూ ఆ కారు వేపు హారన్ మోగిస్తున్నవారే ! ఆ కార్ పక్కనుంచెళ్తూ, డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయేను , నిన్న ఆ డ్రైవింగ్ రింక్ లో అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసిన అమ్మాయే . ఇప్పుడు రోడ్డు మీద తన ప్రతాపాన్ని చూపించేస్తూంది . అసలు మిగతా జనాల ప్రాణాల్ని రిస్కులో పెట్టడానికి ఈ పిల్లకి ఏ హక్కుంది ? అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళూ ఈ అమ్మాయికి బుద్ది చెప్పుండచ్చు కదా అనిపించింది . 
ఇదేదో ఆ అమ్మాయికి మాత్రమే సంబంధించిన విషయం కాదు , అన్ని కుటుంబాల్లోనూ ఇలాగే జరుగుతూంది . కూతురికో కొడుక్కో కాళ్ళానేసరికి వాళ్ళ చేతిలో ఒక బైకో కారో పెట్టాడా, వాళ్ళు యముళ్ళా ఊరమ్మట తిరిగి ఎవరో ఒకరి ప్రాణం తీసేసుకోడం !
వీళ్ళ బ్యాచికి బలైపోయేది పాపం ఎవరో రోడ్డు దాటుతున్న ముసలాళ్లో , పిల్లలో ఉంటారు పాపం . ఇలాంటి యముళ్ళ బ్యాచికి ఇంకో లెవెలెక్కువలో ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లో బాతాఖానీ వేసేవారు . ఇలాంటి బ్యాచికి వాళ్ళసలు ఆక్సిడెంట్ చేసేరనే సృహ లో కూడా ఉండరు . పైగా అలా సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నావేంటని కాస్త గట్టిగా హారన్ కొడితే , తినేసేలా ఓ చూపొకటి పడేస్తారు మనకి !
 ఈ మధ్య మా ఇంటి దగ్గిర జరిగిన సంఘటన ఒకటి చెబుతాను . ఒకాయన కొత్త  కారు కొన్నాడు , షోరూం వాడు ఇంటి దగ్గర డెలివరీ ఇచ్చి వెళ్ళేడు , ఈయనకి డ్రైవింగ్ రాదట మరి . కొంతకాలం పాటు  డ్రైవర్ ని పెట్టుకుందాం , ఈ లోపల డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నాడు . 
కానీ కారు ఇంటికి డెలివరీ వచ్చేసింది మరి .. కాలాగలేదు . సరదాగా కార్లో కూర్చుని సొంతంగా  డ్రైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాడు . బేస్మెంట్ లోని కార్ పార్కింగ్ కి వెళ్ళేడు . కొత్త కారు .. అందంగా నిండా రిబ్బన్ చుట్టుకుని , కొత్త పెళ్లి కూతుర్లా ఆకర్షిస్తూ కనిపించిందేమో , వెంటనే వేరేమీ ఆలోచించకుండా కారెక్కేసేడు . బహుశా ఏ మహేష్ బాబు ధంసప్ అడ్వర్టైజుమెంటో  చూసొచ్చిన హుషారులో ఉన్నట్టున్నాడు , ఒక్కసారి కారింజను స్టార్ట్ చేసి గేర్లు అటూ ఇటూ తిప్పి గట్టిగా ఏక్సిలరేటర్ నొక్కేడు . కాస్త దూరంగా ఈ కొత్త కారు తంతు ని చూస్తున్నాడు అనీష్ గాడు . పదేళ్ళుంటాయి వాడికి , ఓ అరగంట ముందే క్రికెట్ బాట్ పట్టుకుని బేస్మెంట్ లోకి వచ్చాడు , ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకుందామని , మిగతా పిల్లలకోసం వెయిట్ చేస్తున్నాడు . అంతలో రివర్స్ గేరేసుకుని రాకెట్లా దూసుకొచ్చేసిందా కారు వాడి మీదకి . అక్కడున్న అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కి వాడిని నొక్కి పడేసింది . 
ఈయన కారు దిగి వెనక్కి చూసుకునేసరికి, కాంపౌండ్ వాల్ కి , కారుకి మధ్య నలిగిపోతున్న అనీష్ కనిపించేడు . కంగారుగా కారు తీద్దామని ప్రయత్నిస్తే , ఎలా డ్రైవ్ చెయ్యాలో తెలీదీయనకి . ఆ పిల్లాడి రోదన, ఈయన అరుపులూ విని అపార్ట్మెంట్ వాచ్ మన్ వచ్చి కారు ముందుకు నెట్టేసరికి , అనీష్ ప్రాణం పోయి చాలాసేపైంది . 
ఇదేదో కధ కాదు .. నిజంగా జరిగిన సంఘటన .. వచ్చీ రాని డ్రైవింగ్ తోనో లేక తోచినట్లుగా రోడ్ల మీద పోతూనో అనీష్ లాంటి అమాయకుల్ని బలి తీసుకోవద్దు .. మీరు చేసిన పాపం తో ఒక జీవితాన్ని బలి తీసుకుని ,ఆ పాపభీతితో మీ జీవితం గడపడంకన్నా దుర్భరం ఇంకోటుండదు .. ఇంకొకరి ఉసురు మనకొద్దు , ఒళ్ళు దగ్గిరపెట్టుకుని డ్రైవ్ చేయండి .. మీరు బతకండి .. ఇతరులను బతకనివ్వండి !

No comments:

Post a Comment

Pages