నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -'ఎదలోని తీపి గుర్తు!' - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -'ఎదలోని తీపి గుర్తు!'

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -'ఎదలోని తీపి గుర్తు!'
శారదాప్రసాద్ 
 
PUC లో మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడయ్యాను.వృత్తి విద్యా కోర్స్ లలో చేరటానికి ఆ రోజుల్లో ఎటువంటి ఎంట్రన్స్ పరీక్షలు ఉండేవి కావు.కేవలం PUC మార్కుల ఆధారంగానే  వృత్తి విద్యా కోర్స్ లలో సీట్స్ కేటాయించేవారు.మిత్రుడు బసవయ్యకు వరంగల్ లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది.నాకు ఇతర రాష్ట్రాల్లోని కొన్ని కాలేజీలలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది.అంత  దూరం పోవటానికి నాతో  పాటుగా  అమ్మానాన్నలకు కూడా ఇష్టం లేదు.కారణం నేను బాగా హోమ్ సిక్.ఆ రోజుల్లో అగ్రికల్చర్ కాలేజీల్లో కూడా ఎంపీసీ  గ్రూప్ వారికి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో సీట్స్ ఇచ్చేవారు.ఎక్కడ సీట్ వస్తుందో,అసలు రాదేమో అనే సందేహం ఉంటే తల్లి తండ్రులు ముందుగా అదే కాలేజీలో B .SC లో డబ్బుకట్టి సీట్ రిజర్వు చేసుకునేవారు.నేను కూడా అలానే చేసాను.అయితే,తర్వాత నాకు బాపట్లలోని అగ్రికల్చర్ కాలేజీలో సీట్ వచ్చింది.ఒక పక్క సీట్ వచ్చిందనే సంతోషంతో పాటుగా అమ్మా నాన్నలను వదలి వెళుతున్నానే బాధ కూడా ఉంది.నా మనసులోని విషయాన్ని గ్రహించిన   నాన్నగారు,ఒక రెండు మూడు నెలలు హాస్టల్ లో ఉంటే,తర్వాత అక్కడికి  బదిలీ చేయించుకుంటానని నచ్చచెప్పి ,బాపట్లలో చేర్చారు. అన్నీ కోల్పోయినట్లుగా బాధపడ్డాను.పట్టుమని ఒక నెల కూడా అక్కడ చదవలేదు.మానేసి,నర్సరావుపేట వచ్చి  B .SC లో జాయిన్ అయ్యాను. ఒక నెల తరగతులు మిస్ అయ్యాయి.అప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉండేవాళ్ళం!అప్పుడు  మాడిఫైడ్ REGULATIONS అమలులో ఉండేవి.ఆ సిస్టం కింద మొదటి సంవత్సరంలో పరీక్షలు ఉండేవి కావు.  రెండవ సంవత్సరంలోనే రెండు సంవత్సరాల సిలబస్ ను కవర్ చేస్తూ పరీక్షలుండేవి.అందుచేత ,నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు.ఆడుతూ ,పాడుతూ చదువుకుంటున్నాను.అప్పుడు విద్యార్థులకు NCC COMPULSORY,వారానికి రెండు CLASSES ఉండేవి.ఉదయం 6 గంటల నుండి   8 గంటల వరకు తరగతులను నిర్వహించేవారు.5 గంటలకు నిద్రలేచి,డ్రెస్ ,షూస్ వేసుకొని పోవటం బాధగా ఉండేది.కానీ తప్పదు.లేట్ గా వెళితే గ్రౌండ్ చుట్టూ నాలుగు రౌండ్స్ పరిగెత్తించేవారు.నేను ఎప్పుడూ పరిగెత్తేవాడిని ,అంటే ఎప్పుడూ లేట్ అన్నమాట!దాని పుణ్యమా అని 800 మీటర్స్ పరుగు పందెంలో ఫస్ట్ వచ్చాను.రాత్రి పూటే డ్రెస్ వేసుకొని పడుకునే వాడిని.తెల్లవారగానే పరుగెత్తుకుంటూ వెళ్ళేవాడిని.కుక్కలు వెంటపడేవి.మరీ స్పీడ్ గా పరిగెత్తే వాడిని.NCC తరగతులు కాగానే విద్యార్థులకు కాంటీన్ లో టిఫిన్ టికెట్స్ ఇచ్చేవారు.టిఫిన్ చేసి ,ఇంటికొచ్చి స్నానం చేసి కాలేజీకి వెళ్ళేవాడిని.ఫస్ట్ పీరియడ్ లో నిద్ర వచ్చేది. 


తెలుగు క్లాస్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు.అలా రోజులు గడుస్తున్నాయి.ఆ రోజుల్లో నేను పొడుగ్గా,బక్క పలచగా ,బలహీనంగా ఉండేవాడిని.బలహీనుడు బలవంతుల స్నేహాన్ని కోరుకోవటం సహజం.అందుకేనేమో,నా స్నేహితుల్లో కొందరు రౌడీలు,అల్లరిమూక  కూడా ఉండేవారు.వెంకట్రావు అనే ఒక రౌడీ మా ఇంటి దగ్గరే ఉండేవాడు.వాడే నన్ను రోజూ కాలేజీకి సైకిల్ మీద తీసుకొని వెళ్ళేవాడు.వాడు కూడా బాగానే చదువుకునే వాడు,కానీ అమ్మాయిలను బాగా అల్లరిపెట్టేవాడు.వాడు నా పక్కన ఉండటం చేత,నన్ను కూడా అందరూ చిన్న రౌడీగా చూసేవారు.నాలో కొంత ధైర్యం కూడా పెరిగింది.ఒకరోజు  వెంకట్రావు సైకిల్ మీద నన్ను తీసుకొని పోతున్నాడు.నన్ను ముందు వైపు కూర్చోపెట్టుకునేవాడు.ప్రమీల అనే మా తరగతి అమ్మాయి  నడుచుకుంటూ మా  కన్నా ముందు  పోతుంది.వెంకట్రావు మనసులో ఆ అమ్మాయిని గోల చేయాలనే తలంపు వచ్చింది.

వెంటనే వాడు నాతో,"నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు సైకిల్ ను నెమ్మదిగా పోనిస్తాను ,నువ్వు ఆ అమ్మాయి జడ లోని  పువ్వును లాగు!నేను వెంటనే సైకిల్ ను స్పీడ్ గా పోనిస్తాను.పువ్వును లాగింది నేనే అనుకుంటుంది!నీకేం భయం లేదు,నేనున్నాను!"అని నాకు ధైర్యం చెప్పాడు.వాడిని కాదనే ధైర్యంలేదు.ఒప్పుకోవటానికి మనసులో భయపడుతున్నాను.నా పరిస్థితి గమనించి వాడు నన్ను పిరికివాడిగా జమకట్టి హీనంగా చూసాడు. మంచి పని చేయటానికన్నా,తప్పుడు పని చేయటానికే ఎక్కువ ధైర్యం కావాలి.నాకు వాడి స్నేహం ముఖ్యం కనుక,భయంగా నైనా వాడు చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నాను.వాడు సైకిల్ నిదానంగా పోనిస్తున్నాడు.ధైర్యం,అధైర్యం మధ్య నేను ఊగిసలాడుతున్నాను.ఆ అమ్మాయిని సమీపించేసరికి చెయ్యి వణుకుతూ, జడలోని పువ్వును లాగటానికి బదులుగా జడను పట్టుకున్నాను.ఆ అమ్మాయి ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని సైకిల్ హేండిల్ పట్టుకొని ఆపి ,నా  చెంప ఛెళ్లుమనిపించింది!నా మిత్రుడు నన్ను చూసి నవ్వుతున్నాడు.ఆ అమ్మాయి తహసీల్దారు గారి అమ్మాయి.ఆ అమ్మాయి నాన్నగారు,మా నాన్నగారు మంచి స్నేహితులు.తప్పుచేసిన నేను భయంతో ఇంటికి చేరాను.భయంతో అన్నం కూడా సరిగా తినలేదు."ఏమిటిరా!అదోలా ఉన్నావు ?"అని నాన్నగారు అడిగితే,సంగతి నాన్నగారికి తెలిసిందేమోనని మరీ భయం వేసింది.ఒక రోజు గడిచింది.ప్రమీల శాస్త్రిని కొట్టిందనే  వార్త  కాలేజీ అంతా  పాకింది.కొంతమంది నా ధైర్యాన్ని మెచ్చుకొని అభినందించారు కూడా!నేను భయంతో ఒణికిపోతున్న సంగతి వారికి తెలియటంలేదు.ఒక రోజు ఆ అమ్మాయి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ రంగనాయకులు గారి రూమ్ లోకి వెళ్లి రావటం చూసి,కాలేజీ ప్యూన్ 5 రూపాయలు నా దగ్గర తీసుకొని ఆ విషయాన్ని నాకు చెప్పాడు.ప్రిన్సిపాల్ ఛండశాసనుడు.తెలిస్తే చాలా ఇబ్బంది!కొంతమంది మిత్రుల సలహా మేరకు నేనే ముందుగా పోయి జరిగిన విషయం చెబితే బాగుంటుందని అనిపించింది.నేను వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ గారి వద్దకు వెళ్లి ,ఫలానా ప్రమీల నా మీద చేసిన కంప్లైంట్ గురించి చెప్పటానికి వచ్చాను సార్ అని వారితో చెప్పాను.దానికి ప్రిన్సిపాల్ గారు,  ప్రమీల అనే అమ్మాయి ​ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పారు.​.ఇంకా నయం,ప్రిన్సిపాల్ గారికి  జరిగింది చెప్పలేదని మనసులో సంతోషపడి ,బయటకు వచ్చాను.ఆ అమ్మాయంటే మనసంతా ఆరాధనాభావం,కృతజ్ఞతాభావంతో నిండి పోయింది.పెద్ద ఆపద నుంచి క్షేమంగా బయటపడిన భావం కలిగింది.ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి జరిగినదానికి క్షమాపణ 
చెప్పాను.ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది.నవ్వి ఎందుకు ఊరుకుందో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. ఆ అమ్మాయి నా జీవితంలో మళ్ళీ ప్రత్యక్షమైంది.నేను ఆంధ్రాబ్యాంక్ లో పనిచేసే వాడిని.నాకు సంతోష్ కుమార్ అనే ఫ్రెండ్ ఉండేవాడు.అతను బ్యాంకు అఫ్ బరోడా లో పనిచేసేవాడు.ఒకరోజు అతను నన్ను వారింటికి తేనీటి విందుకు పిలిచాడు.అక్కడ ప్రమీలను చూసి నేను నివ్వెరపోయాను!ఇద్దరు పిల్లల తల్లి! మాతృత్వం ఉట్టిపడే రూపం.
 
ప్రమీలను చూడగానే నా మనసులో న్యూనతా భావం కలిగింది.చాలా UNEASY గా కూచున్నాను.ప్రమీల టీ తాగుతుండగా కాలేజీలో జరిగిందంతా సరదాగా  భర్తకు చెప్పింది.నాకు ఖొరపోతే,తలమీద తల్లిలాగా నిమిరింది.ప్రమీల ముందర నేను మాటలు రాని పసివాడిగా మారాను. స్త్రీమూర్తులకున్న తెగువ,ధైర్యం,అణకువ,విశాల హృదయం, మగవారికి ఉండవేమో !ఇప్పుడు ప్రమీల నా అభిమాన పాఠకురాలే కాకుండా నా ఆరాధ్య దేవత!కొసమెరుపు ఏమిటంటే ,ప్రమీలే నాకు వెంకట్రావు గురించి కూడా తెలిపింది.వాడు కాలేజీలో లెక్చరర్ గా పనిచేసి,తర్వాత కడపలో ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు.మేమందరమూ ఈ మధ్యనే ప్రమీల వాళ్ళ ఇంట్లోనే విజయవాడలో సమావేశం అయ్యాం ! ఎవరి జీవితాలు ఏ మార్పు చెందుతాయో ఆ పరాత్పరుడికే తెలియాలి !ఎదలోని తీపి గుర్తులను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మరికొన్ని  కబుర్లతో మరో సారి!

***

5 comments:

  1. చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి ఈ వయసులో తలచుకొని మురిసిపోవడానికి బావుంటుంది కూడా.

    ReplyDelete
  2. మంచి కథ.college రోజుల్లో ఎన్నో అనుభవాలు..మధుర అనుభూతులు ఉంటాయి..స్మృతి ఇలా మాతో పంచుకున్న మీకు ధన్యవాదాలు..అభివాదాలు

    ReplyDelete
  3. మంచి కథ.college రోజుల్లో ఎన్నో అనుభవాలు..మధుర అనుభూతులు ఉంటాయి..స్మృతి ఇలా మాతో పంచుకున్న మీకు ధన్యవాదాలు..అభివాదాలు

    ReplyDelete

Pages