ఆయన నీడ - అచ్చంగా తెలుగు
 ఆయన నీడ
 చందకచర్ల రమేశ్ బాబు


ఇతడు ఇలా నా ఆలోచనలను ఆవరించుకుంటాడని అసలు అనుకోలేదు నేను.
38 సంవత్సరాల సర్వీసు తరువాత నివృత్తి పొంది, అపార్ట్ మెంట్ జీవితాలతో విసుగెత్తి,  నగరపు శివార్లలో ఒక చిన్న ఇల్లు కొని అక్కడికి నేను,  నా శ్రీమతి మకాం మార్చాం. క్రొత్త పరిసరాలు, క్రొత్త ఇరుగు పొరుగు, అక్కడివే అయిన సమస్యలు, వాటికి తాత్కాలిక పరిష్కారాలు వీటన్నిటితో మొదటి రెండు సంవత్సరాలు ఎలా గడచి పోయాయో తెలియలేదు. నా శ్రీమతి కూడా ఈ క్రొత్త పరిసరాల్లో తనకు ఎవరు తోడూ దొరక లేదని ఫిర్యాదు చెయ్యలేదు. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయికి పెళ్ళయి పూణే లో స్థిరపడింది. అబ్బాయికి కూడా పెళ్ళయి ఈ తరపు పిల్లలలా అమెరికాలో ఉన్నాడు. ఇక ఈ నగరంలో మేమిద్దరమే.
రెండేళ్ళలో మేము ఆర్నెల్లు అమెరికా వెళ్లి వచ్చాము. అక్కడి ఒంటరి జీవితంతో రాజి పడలేక పోయాము. అమ్మాయి వాళ్ళు వాళ్ళ పిల్లల సెలవులకు మాత్రమే అదీ ఒక వారం కంటే ఎక్కువ కాకుండా వచ్చి వెళుతుంటారు. కాకపొతే ఇవేవీ మా ఇద్దరి రోజువారీ ఒంటరి తనాన్ని పోగొట్ట లేక పోయాయి.  రోజులు గడిచిన కొలది నా శ్రీమతికి ఎలాగోలా ఇరుగు పొరుగు ఆడవారితో మాటలు, వంటపని, ఇంటి పనుల మధ్య అంత అనిపించేది కాదు. ఎటొచ్చీ నాకే సాయంత్రాలు పొద్దు గడిచేది కాదు. వాకింగ్ కి వెళ్లేవాణ్ని. అదీ ఒక్కణ్ణే. రోజుకొక కాలనీని ఎంచుకుని రోడ్లమ్మట కాళ్ళు ఈడ్చుకుంటూ రోడ్డుకు ఇరు వైపులా ఉన్న ఇళ్ళని చూస్తూ తిరిగేవాణ్ణి. నాకు ఇళ్ళకు పెట్టిన పేర్లు చూడడం మహా ఆసక్తి. క్రొత్త పేర్లు కనిపిస్తే ఆనందమయ్యేది. మాములుగా ఎక్కువగా కనిపించే శ్రీ సాయి నిలయం, తరువాత ఎక్కువగా లక్ష్మి నిలయం, శ్రీనివాస నిలయం, దుర్గా నిలయం లాంటి సాధారణ పేర్లు కాకుండా, స్నిగ్ధ నిలయం, దత్త పాదరస, పిచ్చుక గూడు, పర్ణశాల లాంటి అరుదైన పేర్లు కూడా కనపడేవి. కాకపోతే కొన్నాళ్ళకు ఇది కూడా విసుగేసింది. మనస్సులోని మాటలను పంచుకోవడానికి ఎవరైనా మనిషి కావాలనిపించేది. మాట్లాడుతూ నడుస్తుంటే దారి తెలియదు. కాస్త ఎక్కువగానే నడవచ్చు. ఒంటరిగా వెళ్ళే నడకలో విసుగెక్కువ. కొంత దూరం తరువాత వెనిక్కి పోదామనిపిస్తుంది. అలాగని నడకను అశ్రద్ధ చేయలేను. నాకున్న చక్కెర వ్యాధికి నడక అవసరం. ఈ ద్వంద్వంలో కొట్టుమిట్టాడుతున్నాను.
నా వాకింగ్ లో భాగంగా ఒక చిన్న వంతెన పైన కూర్చుని, కొద్దిగా సేద తీరేవాణ్ణి. అప్పుడు పరిచయమయ్యాడు ఈయన. ఇతడి పేరు చిదంబరం. ఏదో కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యానని చెప్పాడు. మంచి పేరే గడించానని చెప్పుకొచ్చాడు. అతడి సమయ పాలన, నిక్కచ్చిగా మాట్లాడే విధానం చూస్తే మనిషి మాటకు కట్టుబడి ఉండేవాడనిపించింది. చిదంబరం గురించి మంచి అభిప్రాయమే ఏర్పడింది. స్నేహం కొనసాగింది. ఇంచుమించు ఒకే వయస్సు వాళ్ళం కాబట్టి కొన్నివ్యక్తిగత విషయాల గురించి చర్చించడం, సలహాల వినిమయం జరిగాయి. ఫర్వాలేదు ఇలా కొనసాగుతుందిలే అని ఆనందించినంత సేపు పట్టలేదు నాకు , నా ఈ అభిప్రాయానికి నేను పశ్చాత్తాప పడాల్సి వస్తుందని.
చిదంబరం స్వయానా భయస్తుడు. అతడి ఉద్యోగ రీత్యా అతనికి బదిలీలు లేవు. ఒకే సంస్థలో,ఒకే కార్యాలయంలో ౩౫ సంవత్సరాలు పనిచేశాడు. అందులోనే ప్రమోషన్లు తీసుకున్నాడు కానీ ఆ ఆఫీసు దాటి బయటకు రాలేదు. దాంతో లోకానుభవం తక్కువ. ప్రతివాడూ తనను మోసం చేస్తాడేమోననే అనుమానం, తన పైన ఎలాంటి మాటా రాకుండా ఉండాలని జాగ్రత్త పడడం అతడి వ్యక్తిత్వంలోని భాగాలు. ఏదీ స్వంత నిర్ణయం తీసుకోడు. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా చాలా మందికి వివరించి, వాళ్ళ సలహాలన్నీ విని, ఎవరో తను నమ్మిన వారు ఎలా చేయమని చెప్తే అలా చేయడం అలవాటు. ఆఫీసులో అంతా రూలు ప్రకారం జరిగిపోయేది కదా. అలాగే బయట కూడ అంతా రూలు ప్రకారమే నడవాలని అనుకుంటాడు. తను అలా రూలు పాటిస్తాడు కాబట్టి తనను అందరూ పొగడాలని, తనను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఉద్దేశం. అలా కాకపోతే చిరాకు, విసుగు, కోపం, గొణుగుడు.ఇక్కడికి రాకముందు ఆయన తండ్రి కట్టించిన ఇంట్లోనే ఉండేవాడు కాబట్టి అతనికి ఇల్లు కట్టే బాదరబందీ లేకుండా పోయింది. ఇక్కడి ఫ్లాట్ కూడా అతడి కొడుకే తీసుకుని ఇల్లు కట్టించి అందర్నీ ఇక్కడికి మార్చేడట. ఒక మనమడు. ఆ బాబు స్కూలుకు వెళ్తాడు. వాణ్ణి స్కూలుకు తీసుకువెళ్ళడానికీ, మళ్ళీ దింపడానికీ స్కూలు బస్సుంది. ఇతడికి ఆ బాధ్యత కూడా లేదు.
చిదంబరం భార్య మరణించి కొన్ని సంవత్సరాలయిందట. అయ్యోపాపం అనిపించింది అతడు చెప్పిన కొత్తలో. కానీ  ఉండుంటే మాత్రం ఈ పెద్ద వయసులో చాలా బాధపడేది అనిపించింది.అలా అని అనుమానపు పిశాచి కాదు ఆయన. సైకో అసలే కాడు. కాకపోతే ప్రతిదానికీ పట్టింపులెక్కువ. ఇది ఇలాగే ఉండాలి అంటాడు. ప్రపంచమంతా చాలా నిజాయితీగా ఉండాలి అనుకుంటాడు. అనవసరంగా అందర్నీ పట్టించుకుంటాడు. వారికి సహాయం చేస్తాడు. ఇలా వారికీ వీరికీ సాయపడడంలో అతడి ఉద్యోగంకూడా అతడికి సాయ పడిందని చెప్పవచ్చు. ఆఫీసు పని అంత కొంప మునిగేంత అర్జంటుది కాదు. కాబట్టి ఇతడు పర్మిషన్ పెట్టి మరీ సాయ పడేవాడట. తను చేసిన ప్రతి చిన్న ఉపకారం కూడా అన్ని వివరాలతో ఆయనకు గుర్తుంటాయి.  తను వారికి అలా సహాయ పడ్డాను కాబట్టి, వారు తనకు సహాయం చేసితీరాలి అని అనుకుంటాడు. కానీ వాళ్ళు ఏదైనా కారణం వలన అతనికి సహాయం చేయక పోతే బాధపడడం, వాళ్ళ మీద కోపగించుకోవడం జరిగేది. అలా అని వారితో మొహమాటపడకుండా వారితో చెప్పేసే ధైర్యం లేదు.మనస్సులోనే బాధపడడం, కోపగించుకోవడమూనూ. దానితో అతడికి బిపి, షుగరూ చోటు చేసుకున్నాయి. మొహం ఎప్పుడూ ముటముటలాడుతుంటుంది, ఏదో కోల్పోయినట్టు. వీటి వివరాలన్నీ నాకు ఏకరువు పెట్టడం, వాటికి నేను తలూపడమే కాదు, చచ్చినట్టు ఔననాలని ఆయన ఉద్దేశం. నాకు నా స్వేచ్ఛ ఎక్కడికో వలస పోయినట్టనిపించసాగింది.
అతడెలా ఉంటే ఈయనకేమిటి అని మీరు అనుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఈ అలవాటు నా పై కూడా దాని ప్రభావం చూపసాగింది.
ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటలకు ఠంచనుగా ఫోన్ చేసేవాడు వాకింగ్ కు వెళ్దామా అని. సరే అని చెప్పి నేను కూడా బయలుదేరేవాడిని. నేను రోజూ కూర్చునే వంతెన నాకు చాలా సౌకర్యంగా అనిపించేది. రహదారిలో ఉండడం వలన వచ్చేపోయే వాహనాల్ని, మనుషుల్ని చూస్తూ ఉంటే పొద్దు పోయిందే తెలిసేది కాదు. కానీ చిదంబరం పరిచయం అయిన కొన్ని రోజులకే వంతెన పైన కూర్చోవడం వద్దండీ అన్నాడు. కారణం వాహనాల కాలుష్యం అట. ఇలా వచ్చేపోయే వాహనాలు వదిలే కార్బన్ మోనాక్సైడ్ ఆరోగ్యానికి ఎంత హానికరమో, నేను ఇప్పటికి ఎంత ఆ విషవాయువును పీల్చి ఉంటానో లెక్క కట్టి చెప్పేవిధంగా నాకు లెక్చరిచ్చి, అక్కడ కూర్చోకుండా ఏదో కాలనీ చివర ఉన్న కొండరాళ్ళ మీద కూర్చుందామని తీసుకెళ్ళాడు. అక్కడ బాగానే ఉంది కానీ, ఒక రెండు రోజులు అక్కడ కూర్చునే సరికి ఆ కాలనీ వాసుల అనుమానపు చూపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను అతడితో చూచాయగా అంటే కొట్టి పారేస్తూ “ ఆ అలా చూస్తుంటారు లెండి. మనమేం దొంగలమా బందిపోట్లమా ? ఇక్కడ చూడండి. ఎంత బాగుందో ప్రశాంతంగా ! వాహనాల్లేవు. మనుషుల్లేరు. మనమే మనస్సు విప్పి మాట్లాడుకోవచ్చు. “ అన్నాడు అదేదో ప్రేమికులు ఏకాంతం కోరినట్లు. నాకు కావలసిన విధంగా నా సాయంత్రపు వ్యాహ్యాళి కుదరకపోయేసరికి నాకు కొంత చిరాకు పుట్టుకొచ్చిన మాట నిజమే. అదీ కాకుండా ఆయన రోజూ ఫోన్ చేసి వాకింగ్ ప్రోగ్రాం నిశ్చయించే సరికి నేనేదో నా స్వతంత్రం కోల్పోయినట్టు అనిపించ సాగింది. రోజూ సాయంత్రం ఈయన ఫోన్ ఈరోజు రాకపోతే ఎంత బాగుంటుందో కదా అనే పరిస్థితికి వచ్చాను. కానీ చూస్తూ చూస్తూ దొరికిన ఒక కంపనీని పోగొట్టుకోవడానికి మనసొప్పలేదు.
కొన్నాళ్ళు ఇలా గడిచేసరికి, నా వ్యాకులత మరింత పెరగింది. నేను ఈయన కంపెనీని వదులుకోవడమే మంచిదనే నిర్ణయానికి రావాల్సి వచ్చింది.
చిదంబరం వ్యక్తిత్వం గురించి ముందుగానే కొంత చెప్పాను కదా ! దాని పర్యవసానం నా మీద కూడా పడసాగింది. ఆయన  భార్య పోయింది అని ముందుగానే చెప్పాను కదా. ఆయన అబ్బాయి ఒక కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. కోడలేమో న్యూట్రిషనిష్ట్ కోర్స్ చేసింది. పెళ్ళై ఇక్కడికి వచ్చాక తన కంసల్టెన్సీ ఫరం పెట్టుకుంది. తను ఆహార విషయాలలో నిపుణురాలు కాబట్టి కుటుంబానికి కావలసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం తన విధి అని భావించి, అందరికీ ఉదయం టిపిన్ కాన్సిల్ చేసింది. తను అమెరికా నుండి తెప్పించి తన పేషెంట్లకు (?) ఇచ్చే అదేదో హెర్బల్ కషాయం ఈయనకూ ఇచ్చి భార్యాభర్తలు కూడా అదే తాగి తమతమ విధులకు బయలు దేరేటట్టు చేసింది. పిల్లవాడికి మాత్రం ప్రొద్దున పాలు,లంచ్ బాక్సులో ఓట్స్ తో చేసిన పదార్థాలు పెట్టి పంపించేది.
చిదంబరం గారికి తగిలిన పెద్ద దెబ్బ అంటే ప్రొద్దుటి కాఫీ క్యాన్సిలవడం. అది మంచిదికాదు, అనవసరంగా మీ నరాల్నిఉత్తేజపరచి బిపి పెంచుతుంది, అసలే బిపి పేషంటు మీరు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీరు అనవసరంగా మందులు మింగక్కర్లేదు అని సలహా ఆమెది. ఒక రకంగా మంచిదే కానీ, ఈయన కాఫీకోసం తహతహలాడి పోయేవాడు. తనకు చేసుకోను చేతకాదు. అలవాటు మానుకోవడం కావట్లేదు. మరి దారి ? మా ఇల్లు. ప్రొద్దునే మా కాఫీ సమయానికి తయారయ్యివచ్చేవాడు. ’ చెల్లాయ్ ! కాఫీకోసం వచ్చానమ్మా ’ అంటూ మొహమాటం లేకుండా అడిగేవాడు. సాయంత్రమయితే ఎలాగూ వాకింగుకు వెళ్ళే ముందు ఇద్దరం చాయ్ తాగుతాం. నేను ఏదైనా అర్జెంటు పని మీద ఊరెళ్ళినా తను మాత్రం కాఫీ కోసం వచ్చి, త్రాగి వెళ్ళేవాడని మా ఆవిడ మొహం గంటుపెట్టుకుని చెప్పింది. అప్పుడప్పుడు రాత్రికి టిఫెన్ కి కూడా హాజరవడం కొనసాగింది. కొన్ని రోజుల వరకు ఆయన తన కోడలిపైన చెప్పే ఫిర్యాదులన్నీ ఆసక్తితోనే వినింది. కాకపోతే రోజూ అవే కబుర్లయ్యేసరికి ఆమెకు కూడా చిరాకేసి నా చెవిని కొరకడం మొదలెట్టింది, ఏమైనా కానీ ఈయన తాకిడి ఎలాగైనా తప్పించమని.
చిరాకు తెప్పించే ఇంకో విషయం నా బుర్ర తినసాగింది. తన డబ్బులు ఎక్కడ పెట్టాలి అన్న విషయంపైన తను సలహా అడగడం. ఈయన రిటైరయ్యేటప్పటికి ఈయన భార్య గతించింది.  ఆవిడ కూడా ఏదో ప్రభుత్వ ఉద్యోగే. ఆవిడ పి.ఎఫ్ డబ్బులు వచ్చున్నాయి. తను రిటైరయ్యాక వచ్చిన డబ్బులతో పాటు వాటినీ కలిపి, మంచి స్కీముల్లో మదుపు పెట్టాలని ఆయన ఆశ. నెలా నెలా వచ్చే తన పెన్షన్, తన భార్య ఫ్యామిలీ పెన్షన్ లతో ఆయనకు డబ్బులకు కొదవలేదు. కానీ ఇంకా కావలనే తపన. అలా అని షేర్లలోనూ, సైట్లపైన డబ్బులు పెట్టడం ఆయనకు భయం. డబ్బులు పోతాయేమో నని. ఎవరో స్నేహితుడు చెప్పాడట మ్యూచువల్ ఫండ్లలో పెట్టమని. నన్ను అడిగాడు. నేనన్నాను షేర్లలో పెట్టడం, వీటిలో పెట్టడం అంతా ఒకటే నని. ఆయనకు నచ్చలేదు. నాతో మాట అనకుండా పెద్ద మొత్తమే పెట్టాడు. ఈయన పెట్టేటప్పటికి షేరు మార్కెట్ చాలా ఉచ్చస్థాయిలో ఉంది. ఈయన పుణ్యానికి పడిపోలేదు కానీ పెరగనూ లేదు. నా దగ్గర రోజూ నస. ఈ మొత్తం బ్యాంకుల్లో పెట్టినా ఎంతో కొంత వచ్చేది. ఇదేమిటి వీటి వ్యాల్యూ పెరగడమే లేదు అనేవాడు. నేను రోజూ  మీరు పెట్తిన ఫండ్ల ఎన్.ఎ. వి చూసుకోవాలి పెరగొచ్చు, పడిపోవచ్చు చూసుకుని సరెండర్ చేయాలి అని దాని లాజిక్ వివరిస్తే ఒప్పుకొనేవాడు కాదు. వీళ్ళంతా మదుపుదారులను మోసం చేస్తున్నారు అని ఫిర్యాదు. పోనీ మీ అబ్బాయిని అడగండి ఏం చెయ్యాలో అంటే వాడికి తెలియకుండా వేశానండీ తెలిస్తే కోప్పడతాడు అనేవాడు. ఆయనకు నచ్చే సలహా జన్మలో ఇవ్వలేననిపించింది. అలాగని రోజూ ఆయన నస భరించడం కూడా కష్టమనిపించసాగింది.
ఇంకోటండోయ్ ! తను పరిచయమైన తరువాత ఎక్కడికెళ్ళాలన్నా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. నా పనులన్నీ నేను నా బండి మీద వెళ్ళి చేసుకుంటాను. ఈయన తను కూడా వస్తానన్నాడు. సరే ఒకసారి కూడా వచ్చాడు. ఆయన రావాలని నాకేం లేదు. అవసరమూలేదు. వెళ్ళొచ్చాం. మనిద్దరం కలిసి వెళ్తుందాం, కంపెనీ ఉంటుంది అన్నాడు. తరువాత తను ఎక్కడికో బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్దామన్నాడు. నాకు వేరే పనుంది రాలేను అన్నాను. అంతే. ప్రారంభం. సాయంత్రం నాతో మాట్లాడేటప్పుడు కొందరు ఎలా మన నుండి సహాయం పొంది దానిని మరచిపోతారో అని చెప్పుకొచ్చాడు. నాకేమో అలా అనవసరంగా తోడువెళ్ళడం ఇష్టం ఉండదు. నాకూ అక్కడ పనుంటే ఆ మాట వేరు. కానీ అనవసరంగా వెళ్ళడం వ్యర్థం అని నా అభిప్రాయం. ఒక్కరే చేసుకోగలిగిన పనికి ఇద్దరు వెళ్ళడం మొదటినుండి నాకు నచ్చని విషయం. నేను ఆయనకు నా అభిప్రాయం చెప్పాను కూడా. వినిపించుకోడు. అలా అని ఆయన పనున్నప్పుడల్లా నాకేమీ పని లేకపోయినా ఆయన వెంట వేళ్ళే ఐడియా నాకు నచ్చలేదు. దాంతో నాకు ఇంకో భయం పట్టుకుంది. ఏ రోజు రమ్మంటాడో, నా పనులేం ఆగిపోతాయో, నేను కాదనేసరికి ఆ సాయంత్రం మళ్ళీ ఆయన నుండి ఏం వినాలో నని.
ఒకసారేమో ఆయనతో దగ్గరలోని పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. ప్రోగ్రాం అనుకున్నప్పటినుండీ ఇక వెంటబడిపోయాడు. టిక్కట్లు బుక్ చేశారా, అక్కడ రూము తీసుకున్నారా, భోజనాల గురించి కనుక్కున్నారా అంటూ ఒకటే ప్రశ్నలు. చేశానండీ అంటే ఇంకోసారి కనుక్కోండి ఎందుకైనా మంచిది అని సలహా. మళ్ళీ తను ఏవీ చెయ్యడు. నాకు ఇవన్నీ తెలియవండీ, మీరెలాగూ చేసుకుంటున్నారు కదా, నాకు చేసేయండి అనడం. అక్కడికి వెళ్ళే ప్రయాణంలో లేనిపోని జాగ్రత్తలు చెప్పడం. మామూలుగా నేను కొంచెం అటూ ఇటూ మనిషిని.  పెద్దగా పట్టింపులు లేవు. మా ఆవిడే అన్నిజాగ్రత్తలు తీసుకుంటుంది. కాకపోతే ప్రయాణం బుక్కింగులు, రూము గురించిన వివరాలు ఇవన్నీ నాకే వదలిపెడుతుంది. కానీ, ఈ ట్రిప్ గురించి ప్రతిదీ ఈయనకు నేను సంజాయిషే ఇవ్వవలసి రావడం పరమ చిరాకనిపించసాగింది. అక్కడైతే ఇక ఈయన విశ్వరూపం. ప్రతిదీ సరిగ్గా లేదనడం, పూజ సరిగ్గా చేయలేదనడం, భోజనం అస్సలు బాలేదనడం. రోజంతా సణుగుడు, ఫిర్యాదులు.  మా ఆవిడైతే చెప్పేసింది ఇకపైన ఈయన    వస్తే నేను ఎక్కడికీ రానని.
ఇప్పుడు నేను ఏ రోజైనా ఈయన మా ఇంటికి రాని రోజు, నాతో వాకింగ్ కి రాని రోజు ఉందా అని చూస్తున్నాను. సాయంత్రం ఆరుకు ఠంచనుగా వచ్చే ఆయన్ ఫోన్ కాల్ అయితే నాలోని విప్లవ భావాలనన్నిటినీ ఒక్కసారిగా తిరగదోడుతుంది. ఆయన పెట్టే నసతో నా నరాలన్నీ పెట్రేగిపోతాయి. రోజంతా ఆయన ధ్యాసే. మా ఇద్దరి మాటల్లోనూ ఆయన విషయాలే.
అందుకే అంటున్నా ఇలా ఒక మనిషి మన ఆలోననన్నింటిని ఆవరించుకుని ఉండడం సాధ్యమా ? దీనినుండి బయటపడే మార్గమే లేదా ?
***

No comments:

Post a Comment

Pages