అమ్మ అవసరమేగా ! - అచ్చంగా తెలుగు
అమ్మ అవసరమేగా!
లక్ష్మణ్ భరద్వాజ్ 

   అమ్మ అవసరమేగా...

"ప్రేమగా పలకరిస్తే పరాయివాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు అదే పరాయివాళ్ళలా భావిస్తే సొంతవాళ్ళు కూడా పరాయివాళ్ళే అవుతారురా రాసుకున్నావా.... "

"అబ్బా ఆపు నానమ్మా నీ సోది ఇప్పుడు నిన్నెవరేమన్నారని ఇలా అంటున్నావు? నువ్వు ఖళ్, ఖళ్ మని దగ్గుతావు, అది నాకు నచ్చదు అంత మాత్రాన పరాయివాళ్ళలా చూసినట్టా...? రోజూ ఒక మంచిమాట చెప్పవా అని నిన్నడిగాను చూడు, నా బుద్ధి తక్కువై అడిగా. నన్ను క్షమించు ఇక నిన్నేమి అడగనులే. అసలే మా స్కూలువాళ్ళ బాధ పడలేక చస్తున్నా. రోజూ ఓ మంచిమాట రాయడం అంటే అలవాటు లేనిపని, కష్టం కూడా. అందుకే నీ మీద ఆధారపడ్డా అది నా తప్పు ఇక నిన్నేమి అడగనులే.
ముసిలి దానివి మనసున్న దానివి మనదానివి అని అడిగా, ఈ మనవరాలి మీద ప్రేమతో చిన్నప్పుడు అడగపోయినా ఎన్నో ఊసులు చెప్పేదానివి. ఇప్పుడు అవే మాటలు మంచిమాటలుగా రాద్దాం అనుకున్నా.. కానీ నువ్వు ప్రేమ, పరాయివాళ్ళు, మనసున్నవాళ్ళు, మనవాళ్ళు, పగవాళ్ళుఅంటూ ఏదేదో సాగదీసి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నావు, రాద్దాంతం చేసేస్తున్నావు.
నువ్వు వచ్చిన దగ్గర నుండీ ఇప్పటివరకూ మమ్మల్ని మా చిన్నప్పుడు చూసినట్టుగా చూడటం లేదు. నువ్వు మారిపోయావు నానమ్మ. నువ్వు నాకు నచ్చలేదు, నీకో దండం తల్లీ. ఇక నుండి నాతో మాట్లాడకు. నేనూ నిన్ను పిలవను ,ఏమీ అడగను కూడా.. ఇక నీ గదిలోకి రాను. బోడి నీ మాటలేం నాకు అక్కర్లెద్దులే. కావాలంటే మా గూగుల్ తల్లిని అడిగితే అన్నీ చెప్పేస్తుంది, నీ తరం నుండి నా తరంవరకూ తెల్సా? కావాలంటే చూడు ఇదిగో ,"ఇప్పటి పరిస్ధితి ఇలానే ఉండిపోదు మార్పు సహజం," అని ఉంది ఈ వాక్యం నిజమేగా. నేనడిగితే చెప్పనన్నావు కానీ నేనే నా అంతట సులువుగా తెలుసుకో గలిగానుగా," అంటూ రవళి నానమ్మ మీద తన కోపాన్ని వెళ్ళ బుచ్చుతోంది ఈ లోగా...

"ఓసేయ్ అమ్మలూ రవళి ఏంటా మాటలు? పెద్దంతరం,చిన్నంతరం లేకుండా అంతలేసి మాటలనీయడమే, నానమ్మని పట్టకుని. తప్పు జరిగిందని, క్షమించమని, నానమ్మా! అని కాళ్ళు పట్టుకుని అడుగు. లేదంటే ఓ ఇరవై గుంజిళ్ళు తీయ్. లేకపోతే ఇవాళ, రేపు నీకు భోజనం, చిరుతిళ్ళు, టిఫిన్, ఆఖరికి అమ్మ చేసిన తీపికూడా కట్ తెల్సా !" అన్నాడు రవళి తండ్రి జనార్దనం గర్జిస్తూ.

"ఆ అలానే కట్ చెయ్యండీ నాన్నా. నాకూ మంచిదే. నా పాకెట్ మనీ ఉందిగా, లేదంటే అమ్మని అడిగి బయట తినేస్తా.. ఎలాగూ అమ్మచేతి వంటలు తిని, తిని బోర్ కొడుతోంది. మీ పుణ్యమా అని బయట తింటాను అంతేగాని క్షమించడాలు, గుంజీళ్ళు తీయడాలు లాంటివి మన నిఘంటువులో లేవు." రెట్టించింది రవళి.

ఈలోగా "ఏవండీ! ఇలా రండి కాస్త ఈ పాలు చూడండి పొయ్యమీదున్నాయి పొంగిపోయేలా ఉన్నాయి," అరిచింది రవళి తల్లి వంటింట్లోంచి."

"ఆగవే శారదా, స్టౌ సిమ్ లో ఉంచు. ఈలోగా ఏం పొంగిపోవు కాని, నేను అమ్మ దగ్గరున్నాను, రవళి అమ్మని ఏదేదో అంటే బుద్ది చెబుతున్నా, నువ్వూ ఇటురా," పిలిచాడు జనార్దనం.

"ఆ చాల్లెండి సంబడం. మీరూ మీ బుద్ది చెప్పడం కూడానా.. మీరు బుద్ధి చెప్పాలని అనుకోవడం ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టడం లాంటిదే.... చాలు, చాలుగాని, ఇక ఆపి కాస్త పిల్టర్ లో డికార్షన్ వేడి చేసుకుని కాఫీ త్రాగండి. మళ్ళీ వరుసగా అందరం ఒకేసారి స్నానాలు చేయాలంటే కుదరదు, నేను వెళ్తాను. నాకు బయట పనుంది. పనిమనిషి కూడా ఈ రోజు రాలేదు. అన్ని పనులు నేనే చేసుకోవాలి, దానికి తోడు "తా దూర సంధు లేదు మెడకో డోలన్నట్టు మీ అమ్మ గార్ని నెత్తిమీద ఎక్కించారు. అసలు మీకు బుద్ది ఉంటేగా ఇంకొకరికి చెప్పడానికి. తమరు చెప్పినట్టే అది విన్నట్టే," తీసిపారేసింది శారద. మళ్ళీ తన వాగ్భాణాలను ఇలా సంధించింది...

" నేనూ ఇందాకటి నుండి వింటున్నా.. అది వాక్యాలేవో అడగడం, ఆవిడగారు ఉపన్యాసాలు ఇవ్వడం. ప్రేమగా ఏమీ చెప్పడం లేదు సరికదా విసుక్కుంటోంది. ఎంతైనా నేనూ, నా పిల్లలు అంటే ఆవిడ గారికి చులకనే నేను కాపురానికి వచ్చిన నాటినుండి ఇరవై సంవత్సరాలైంది, ఏ ఒక్క రోజూ ప్రేమగా నాతో మాట్లాడలేదు. అసలు ఆవిడ తీరే అంత. అలాంటప్పుడు మధ్యలో మన పిల్లేం తప్పు చేసిందని దాని భోజనం కట్, టిఫిన్ కట్ అని దాన్ని బెదిరిస్తారు అలా అయితే మీకెన్ని సార్లు కట్ చేయాలో తెలుసా! మీ ఆఫీస్ లో ఎవరో సంధ్య కి మీరు వాట్సాఫ్ పంపకండీ అంటే మానారా ఏంటీ? మరి మీరు చెప్పండి. ఎవరి బుద్దులు వాళ్ళకుంటాయి సర్ధుకు పోవడమే."

"శారదా. ఇంట్లో ఆఫీస్ విషయాలెందుకు? అవి ఇంపార్టెంట్ మెసేజెస్ కాబట్టి పాస్ చేయాలని చేసాను. అది తప్పెలా అవుతుంది? నీ బుద్ధిలేని మాటలు నువ్వూనూ... ఇలా ఒక విషయంలో నుండి ఇంకో విషయంలోకి వెళ్తావు. కాలికేస్తే మెడకీ, మెడకేస్తే కాలికి అన్నట్టుంటుంది నీతో వ్యవహారం. ఇలా మనిద్దరిలో ఎవరో ఒకరు పిల్లల్ని వెనకేసుకొస్తే వాళ్ళు పాడవడం ఖాయం. కాబట్టి నువ్వైనా బుద్ధి చెప్పు, లేదంటే నన్నైనా చెప్పనీ. వాళ్ళు పాడైతే మనకి పరువూ,మర్యాద ఉంటాయా చెప్పు? ఆల్రెడీ పెద్దిది నళినీ పాడైపోయింది మన మాట కూడా లెక్కచేయకుండా.
నాయకులెవరి పాదయాత్రలోనో, బాగా కండలు తిరిగిన బాడీ గార్డ్ ని చూసిందట, నేను చూసుకున్నట్టే చూసుకుంటాడంటూ తన ఇంటర్ సెకెండ్ ఇయర్ కూడా పూర్తి కాకుండానే వాడితో పారిపోయింది అప్పుడే నా పరువు గంగలో కల్సింది. ఇంకా పోవాలా ఏంటీ? నేటికీ దాని ఆచూకి లేదు, ఫోను కూడా లేదు. ఏమైందో అసలది బ్రతికే ఉందో లేదో కూడా తెలియదు.
మా అమ్మ చెబుతూనే ఉంది నళినీని ఓ కంట కనిపెడుతూ ఉండు, జాగ్రత్తరా అది గాడి తప్పుతోందని. నేనే పట్టించుకోలేదు. టీనేజి పిల్లలు కదా ఈ మార్పులు అనేవీ సహజం అని లెక్కచెయ్యలేదు.
ఆడ పిల్లల తండ్రి ఎలుగు బంటిలా నిద్రపోవాలిరా అనేది అమ్మ. అది రాత్రి ఒక కన్ను మూస్తే మరోకన్నుతెరిచి ఉంచుతుందట, అలా అంటే ఎందుకో అనుకున్నా. అన్నీ నాకే తెల్సని ఊరుకున్నా... చూడు ఇప్పుడు ఎంత అనర్ధం జరిగిందో."
భూషణం గారి అమ్మాయి లేచిపోయిందట అని మర్యాదలేనివాళ్ళు, కాస్త మర్యాదస్తులు తప్పిపోయిందట పాపంఅని నెమ్మదిగాను, సానుభూతి చూపిస్తున్నారు. అందుకే మిగిలిన ఈ ఇద్దరూ ఆడ పిల్లలూ... కూడా పాడవకూడదనే అమ్మని తీసుకు వచ్చాను." భార్యను కోప్పడి, తన గదిలోకి వెళ్లి, గత జ్ఞాపకాల్లో మునిగిపోయాడు జనార్దనం.
***


జీవశ్చవంలా, బంగారు పంజరంలో రామచిలుకలా ఓ జైలులో బ్రతుకుతున్నట్టుగా పెద్దన్నయ్య శేఖరం ఇంట్లో బ్రతుకుతోంది అమ్మ. నోరు విడిచి ఏ నాడు నన్ను " ఓరేయ్ మీ ఇంటికి తీసుకు వెళ్ళరా" అని అడగలేదు.

అక్కడ అన్నయ్య, వదినా బాగానే చూస్తారు. కానీ ఏం లాభం వాళ్ళ పనులమీద వాళ్ళు వెళిపోతారు. ఈవిడ ఒక్కర్తే ఆ నాల్గు గోడల మధ్య ఉండాలి. పిల్లలెవరూ ఇక్కడ ఉండటం లేదు. విదేశీ చదువులే, ఎప్పుడో వస్తారు, వచ్చినా వాళ్ళ భాష వాళ్ళ తీరు, వాళ్ళదే లోకం గానీ నానమ్మా అని పిలవరు, పట్టించుకోరు.

ఎప్పటి నుండో తీసుకు తెచ్చుకుందామని అనుకోవడమే గానీ అవడం లేదు. చిన్నది పుట్టినప్పుడు 'ముగ్గురూ ఆడపిల్లలే శారద చేసుకోవడం కష్టం అవుతోంది' అని తీసుకొద్దామనుకున్నా కానీ తన అమ్మగారు దగ్గరుండి చూసుకుంటున్నారు గదా, పర్లేదు. అమ్మైతే ఈ ఇరుకు ఇంట్లో సర్ధుకోలేదని సరిపెట్టుకున్నా... అదిగో అప్పటి నుండీ ఇప్పటివరకూ ఇలానే అనుకుంటూ వచ్చాడు తను.

ఇప్పటికి కుదిరింది అందుకే ఇంటికి తీసుకు వచ్చాడు. ఓ విధంగా తన ఈ గుమస్తా ఉద్యోగానికి కాస్త భారమే కానీ, తప్పలేదు. పిల్లల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అమ్మని సూటీపోటు మాటలతో ఇబ్బంది పెడుతుంటే ఈ ఇంటి కన్నా ఆ పెద్దన్నయ్య జైలులాంటి ఇల్లే నయమనిపిస్తోంది. లేదంటే అమ్మ మా సొంతూరు చిన్నన్నయ్య భాస్కరం ఇంటికి వెళిపోతాను అంటుంది. అప్పుడు తన ప్రయత్నం, శ్రమ వ్రృథా అవుతాయి.

మరింత వివరంగా పరిస్థితులను శారదకు చెప్పాలని నిశ్చయించుకున్నాడు జనార్దనం.
***

"చూడు శారదా ! మా. అన్నయ్యలకు మనలాంటి బాధలు లేవు. ఆ ఇద్దరికీ కొడుకులే, అదృష్టవంతులు. అమ్మ అవసరం వాళ్ళకి లేదు. నిజానికి మనకే అమ్మ అవసరం చాలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా మసలుకోవాలని గ్రహించు. ఆవిడ మీద నీ ప్రతాపం చూపించి, ఆవిడ మనస్సును గాయ పరిస్తే, మనమే నష్టపోతాం. ఆవిడ గౌరవ మర్యాధలకు నష్టం రానీయకుండా జాగ్రత్త పడు. నేను చెప్పేది చెప్పాను, ఇక అటుపై నీ ఇష్టం," వంటింట్లోకి వెళ్లి, నెమ్మదిగా శారదను హెచ్చరించాడు జనార్దనం. ఆమె ఆలోచనలో పడి, మౌనంగా వినసాగింది.

"ఎదిగే మొక్కకు కర్ర ఆసరాగా ఉంచుతాం. అలా మన పిల్లల క్రమశిక్షణ,
నీతివంతమైన, నిజాయితీ గల జీవనానికి ఆత్మీయతను పంచి, చక్కగా పెంచే మా అమ్మ ఎంతైనా అవసరమని నా అభిప్రాయం. మన పిల్లలు చిన్నప్పుడు ధనాలే,మణిపూసలే,రత్నాలే. కాని సమాజ పోకడవల్ల వాళ్ళు మారుతూ ఉంటారు. అసలు అమ్మను ఎప్పుడో తీసుకు తెచ్చుకోవాల్సింది కానీ, మన మధ్యతరగతి బ్రతుకులు సహకరించక తెచ్చుకోలేక పోయాను. "కెరటాలు తగ్గేదెప్పుడు, స్నానం చేసేదెప్పుడు"అని భయ పడుతూ ఉంటే ఎప్పటికీ భయ పడటమే కదా. అందుకే తెగించి పెద్దన్నయ్యని ఒప్పించి మరీ తీసుకొచ్చాను.
ఇప్పుడు గనుక మీరు ఆమెపట్ల సరిగా ప్రవర్తించ లేదనుకొండి. ఇక అమ్మ ఎవరి ఇంటికీ వెళ్ళదు. ఓల్డేజ్ హోమ్ కి లేదంటే ఏకంగా కైలాశానికే అని హెచ్చరించి, నా నుండి హామీ తీసుకుని మరీ వచ్చింది. కాబట్టి శారదా జాగ్రత్త. మాట జారకు, చిరాకు పడకు. ఎలాగూ మీ అన్నదమ్ములవల్ల మీ తల్లి తండ్రులను ఇద్దర్నీ దూరం చేసుకున్నావు. ఇక వాళ్ళు ఈ లోకంలోనే లేకుండా పోయారు. కనీసం ఉన్నన్నాళ్ళైనా... మా అమ్మలో అయినా మీ అమ్మను చూసుకో, ప్రేమగా నడచుకో." అన్నాడు లాలనగా.

" అలాగే లెండి బాగానే చూసుకుంటా, ప్రామిస్ ఇక వెళ్ళి స్నానం కానీయండి. టిఫిన్ తయారు చేసెస్తా.. ఈ రోజు క్యారేజీ కట్టలేను. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది ఆఫీస్ కి వెళ్ళాలి కదా . " అంది శారద.


"నాన్నా! నన్ను క్షమించు నాన్న! నానమ్మ గురించి వంటిట్లో అమ్మతో మీరు చెప్పిందంతా విన్నాను. ఇక ఎఫ్ఫుడూ తప్పుగా ప్రవర్తించను. ఇకపై నానమ్మ చెప్పినట్టే వింటాం. గూటిలో ఉండి ఎదిగే పక్షుల పిల్లలకు అమ్మ ఎంత అవసరమో, ఇప్పుడు నానమ్మ కూడా మాకు అంతే అవసరం గదా నాన్నా.. ఇప్పుడే వెళ్ళి నానమ్మను క్షమించమని అడగుతా.. చాలా విషయాలు నేర్చుకుంటా.. క్షమించకపోతే ప్రాధేయపడతాను. మా అమ్మమ్మ మమ్మల్ని ఎలా చూసుకుందో అలానే నానమ్మను నేనూ,చెల్లి చూసుకుంటాం సరేనా.. " అంది రవళి పశ్చాత్తాపంతో.

వెంటనే నానమ్మను వెతుక్కుంటూ వెళ్ళింది. ఏ గదిలోనూ లేదు నానమ్మ.

"నాన్నా.. నాన్నా ,నానమ్మ ఎక్కడా కనపడటం లేదు. ఏమైంది నిజంగానే ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళిపోయిందా? క్షమించు నానమ్మా.. త్వరగా వచ్చేయ్ ఎక్కడున్నా.. నేను మారిపోయాను. " ఆందోళనగా అరవసాగింది రవళి.

"ఏదీ నే వెతుకుతా ఉండు. దేవుడికి పువ్వలకోసం పక్కింటి భరత్ అంకుల్ ఇంటికి వెళ్ళుంటుంది. వాడంటే అమ్మ కి చాలా ఇష్టం. చిన్నప్పుడే వాడికి వాళ్ళమ్మ చనిపోతే అమ్మే చూసింది ఇప్పుడు వాడో పెద్ద ఆఫిసర్ అయ్యాడు వాడు అమ్మ వచ్చిన దగ్గర నుండీ తన దగ్గరే ఉండమని అంటున్నాడని చెపుతోంది కూడానూ. బహుశా అక్కడికి వెళ్ళిందేమో..."అంటూ భరత్ ఇంటికి వెళ్ళాడు జనార్దనం.

"ఆ రండి జనార్దనం బావగారు రండి,రండి. అత్తయ్య,ఈయన కల్సి ఇప్పుడే టిఫిన్ చేసి, ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళారు. ఏదో విషయం తెల్సుకోవాలట అత్తయ్యగారు. ఈయనతో అంటే ఈయన తీసుకు వెళ్ళారు," అంది భరత్ భార్య.

"అమ్మకి ఏం తెల్సుకోవాలని పనికట్టుకుని మరీ వెళ్ళిందో. ఈ భరత్ గాడు మరీనూ.. కనీసం నాకు కూడా చెప్పలేదు. వెళ్లి చూసి రావాలి, " అని మనసులో అనుకుని, "శారదా,శారదా ఏదీ నా స్కూటీ తాళం ఇటివ్వు, అమ్మ భరత్ తో కల్సి ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళిందట. ఇంతకీ ఈ సిటీలో ఏ హోంకి వెళ్ళిందో .. ఈ భరత్ గాడు ఏ హోం కి తీసుకు వెళ్ళాడో. చూసి వస్తా," అని బయల్దేరాడు జనార్దనం. ఎంత వెతికినా అమ్మ జాడ దొరకలేదు. ఎండకు సోలిపోయి, తిరిగొచ్చాడు. ఈ లోగా జనార్దనం చిన్న కూతురు...

"నాన్నా.. నాన్నా. నానమ్మ ఇందాక నాతో చెప్పింది భరత్ అంకుల్ రమ్మన్నారట ఎక్కడికో వెళ్ళాలట. మీరూ అమ్మ వంటింట్లో మాటల్లో పడి బిజీగా ఉన్నారని నాకు చెప్పిం.ది నేను స్కూల్ కి రెడీ అవడంలో మర్చిపోయాను. బాయ్ నాన్నా నే స్కూల్ కి వెళ్తున్నా..." అంటూ తుర్రున పారిపోయింది.
" ఏం రవళీ నీకింకా స్కూల్ టైం అవలేదా టీ.వీ చూస్తూ కూర్చున్నావు హా!" కోపంగా కూతుర్ని గదిమాడు జనార్దనం.
"నాన్నా నేనింకా రెడీ కాలేదు నానమ్మని క్షమించమని అడుగుదాం అనుకుంటూ ఉండిపోయాను గదా అందుకే లేటయ్యిందని వెళ్ళడం లేదు. ఈ లోగా ఓ సారి మా ఫ్రెండు భర్త్ డే సి.టీ కేబుల్ టీ.వీ లో ఫోటో వస్తుందని చూద్దామని టి.వీ ఆన్ చేసా. టీ.వీ లో వస్తోంది నానమ్మ అదిగో భరత్ అంకుల్ నానమ్మతో రిబ్బన్ కట్ చేయిస్తున్నారు ఇది సి.టీ కేబుల్ లైవ్ షో నాన్నా రండి మీరూ చూడండి," పిలిచింది రవళి.
ఆ పూటకిక ఆఫీస్ మానేసి, టీవీ ముందు కూర్చుండిపోయారంతా.
***

"బృందావనమనే ఈ ఓల్డేజ్ హోం నా కల. ఇది నా సొంత నందనవనమనే గార్డెన్. ప్రశాంత వాతావరణంలో సిటికి బాగా దూరంలో ఉంది. ఇక్కడే ఈ హోమ్ నిర్మించడానికి ఏకైక కారణం మా అమ్మ. నన్ను కని పెంచిన నా తల్లితండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. ఎలా ఉంటారో కూడా నాకు ఊహ తెలీదు. అప్పుడు నేను హాస్టల్ లో ఉండి చదువుకునే వాడిని. సెలవులొస్తే ఎక్కడికి వెళ్ళాలో ఎవర్ని చూడాలో తెలిసేది కాదు. మరి అటువంటప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకునే దైవంలాంటి మా అమ్మ దొరికింది. నా చిన్నతనంలో నాకు హాస్టల్ కి వచ్చి మరీ లెక్కలు నేర్పిన జనార్దనం అన్నయ్య వాళ్ళ అమ్మ గారే, ఈ కృష్ణవేణి గారు. ఆవిడనే నేను అమ్మా అ.ని అనుకోకుండా పిలిచేసే వాడ్ని. ఆవిడ వల్లే అమ్మ అవసరం ఏంటో తెల్సింది అందుకే కష్టపడి చదివి పెద్ద ఆఫీసర్ కాగలిగాను. ఆవిడ స్పూర్తితోనే నేనీ ఓల్డేజ్ హోమ్ నిర్మించగలిగాను.
ఇటీవల నేను ఓ ఇంటిల్జెంట్ సర్వే చేయించాను. చాలా ఇళ్ళలో ఈ పెద్దవాళ్ళను పట్టించుకోకపోవడమే గాక ఈసడింపులు,అసభ్య పదజాలంతో తిట్లు,ఆఖరికి మనవలు విడిచిపెట్టిన తిండి, పాచిపోయినది ఈ పెద్దవాళ్ళకు పెట్టడం వంటి ఎన్నో చర్యలు వాళ్ళ మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి. కానీ ఇవన్నీ పరువు మాటున దాక్కుండి పోతున్నాయి. బయట పడటం లేదు. అంతకన్నా ముఖ్యమైనది ఆస్తి పంపకాలు విషయం కూడా .. అందుకే చాలామంది ఓల్డేజ్ హోమ్ వైపు వెళ్తున్నారు. వాళ్ళ అందరికి వాళ్ళ సొంత వాళ్ళతో ఉన్నట్లుగా ఒక వాతావరణం కల్పించాలని, వాళ్ళేమి కోల్పోయారో అది ఈ హోమ్ లో లభించాలని, మా అమ్మ సూచనలు,సలహాలతో నేను దీన్ని నిర్మించాను.
నేనీ ఉద్యోగంలో చేరిన నాటినుండి నేటి వరకూ, అమ్మకు కూడా తెలియకుండా అమ్మ పేరున నా జీతంలో నలబైశాతం పొదుపు చేసి, ఇదంతా నీదేనమ్మా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే నీ సలహా చెప్పమ్మా అంటే ""అమ్మ అవసరం"" ఉన్నా అవసరం లేని వాళ్ళలా పట్టించుకోలేని వృద్దులకు ఆసరా ఉండాలి కదా. అందుకే ఓల్డేజ్ హోం కట్టమని చెబితే, ఇది నిర్మించాను ఇప్పుడు నేనామెను మీ అందరికీ ఈ సభాముఖంగా పరిచయం చేయబోతున్నా... నా బృందావన ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ప్రేరణ క్రృష్ణవేణి గారు. అమ్మా.. రండి, మీరు మాట్లాడండి," పిలిచాడు భరత్.

"ఈ సభకు.నమస్కారం ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ నా అభివందనాలు నా కొడుకులకన్నా ఎక్కువగా ఆదరించే భరత్ కి నా ఆశీస్సులు. నాకు నలుగురు కొడుకులు వీడు భరత్, నా కొడుకులుకన్నా ఎక్కువే. నా కొడుకులు కొందరు బాగానే సంపాదించినా ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదు. కానీ వీడు నన్ను ఆశ్చర్యపరిచేలా అందరికీ వార్ధక్యంలో ప్రయోజనకరమైనదిగా ఉండే అన్ని వసతులతో కూడిన ఈ ఓల్డేజ్ హోం నిర్మాణం చేపట్టాడు. ప్రేమ ఉంటే మౌనం కూడా అర్ధమవుతుంది. అది లేకపోతే ప్రతీమాట అపార్ధమే అవుతుంది. కాబట్టి మీ అవసరం లేదని, మీ వాళ్ళు భావిస్తుంటే, వాళ్ళందరూ ఈ ఓల్డేజ్ హోమ్ లో ప్రశాంతంగా ఉండొచ్చు అని హామీ ఇస్తున్నా.
ఇంత మండు వేసవిలో మీ పెద్దలందరి సమక్షంలో వీడు చేసిన మంచి పనికి. నిజమైన నిదర్శనంగా ఈ జోరు వాన ఇచ్చే చల్లదనమే శుభాశీస్సులు అందిస్తోంది. ఇంత కన్నా ఏ తల్లికైనా ఏం ఆనందం ఉంటుంది చెప్పండి?
నేను వీడికి కన్న తల్లిని కాలేకపోయానని బాధ పడుతుంటా. అయినా పెంచిన ఋణాన్ని తీర్చేసుకున్న వీడికి మీ అందరీ దీవెనలు కావాలి.వీడిని మరిన్ని మంచి పనులు చేసేలా మీ ఆశీస్సులు ప్రోత్సహిస్తాయని ఆశిస్తూ. . సెలవు తీసుకుంటున్నా..." కృష్ణవేణి గారి ప్రసంగం ముగియగానే ఆ ప్రాంతమంతా చప్పట్లు మారుమ్రోగాయి.
***

"అమ్మను ఎందుకు తీసుకు వెళ్ళావో ఓల్డేజ్ హౌమ్ కి అని కంగారు పడ్డాను భరత్. కానీ నువ్వు చిన్నవాడివే అయినా చాలా పెద్దగా దూరాలోచన చేసి మంచి పని చేసావు. నీకు నా అభినందనలు. నీ బృంధావనానికి అమ్మ అవసరం లేదు అనుకుంటా. అది ఇంట్లో అమ్మ, పెద్దల అవసరం లేదనుకున్న వారికే గానీ మన అమ్మకు గాదు. ఎందుకంటే.. నా కూతుర్లు గోపికలు తోడు ఉండగా కృష్ణవేణమ్మ ఎటూ వెళ్ళదు కదా. అమ్మా మా ఇంట్లోనే ఉండిపోతావు గదా...." అమ్మ ఒళ్లో పడుకుంటూ అడిగాడు జనార్దనం.
"అవున్రా జనార్దనం. అమ్మ అవసరాన్ని గ్రహించిన నిన్ను కాదని నా కోడల్ని,మనవల్నీ వదిలి, ఎలా వెళ్తాను చెప్పు? " అంది కృష్ణవేణమ్మ కొడుకు తల నిమురుతూ.
***

1 comment:

  1. అమ్మ అవసరమేగా... మంచి సందేశం గల రచన బాగుంది

    ReplyDelete

Pages