కూరలమ్మి - అచ్చంగా తెలుగు
కూరలమ్మి
దొండపాటి కృష్ణ 

“కూరలమ్మా... కూరలూ...” అంటూ ఓ మహిళ గొంతు, బుద్ధిగా మానసిక పూజ చేసుకుంటున్న నాకు భంగం కలిగించింది. బయట ఎక్కడోనని మళ్ళీ పూజలో మునిగిపోయాను. 
“కూరలమ్మా... ఆకుకూరలు... తోటకూర... పాలకూర... కొత్తిమీరోయ్...” అంటూ ఆమె సత్తువంతా కూడబల్కుకుని అరుస్తుంటే పూజనే ఆపేశాను. మనస్సు దారి తప్పింది. 
‘ఎవరీమె’ అనుకుంటూ బయటకు చూశాను. 40 యేళ్ళు పైబడిన మహిళ నెత్తిమీద గంపతో, అందులో ఆకుకూరల్ని పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ మా వీధికొచ్చి బిగ్గరగా అరుస్తుంది. ఆకారం బాగానే ఉన్నా అలంకారం మాత్రం ఆమె ఆర్ధిక పరిస్థితిని చెప్పకనే చెప్తుంది.

ఎవరి వృత్తి వాళ్ళది. ఎన్నో విషయాల్ని, సంఘటల్ని చూసి చలించని వాళ్ళం, ఆమెను చూసి చలించిపోతామా.? అవసరమనుకుంటే కొంటాం లేదంటే మారు మాట్లాడం. కనీసం చూడనైనా చూడకుండా, ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తాం. కర్రీ షాపుల్లో రోజుకో కర్రీ తెచ్చుకుని తినే బాచిలర్స్ కి ఆమె కూరగాయలతో పనేం ఉంటుంది.? డీ-మార్ట్, స్పెన్సర్స్, రత్నదీప్, మోర్ లాంటి బడా సంస్థలు మార్కెట్లో పాతుకుపోయాక ఇంకా ఆమె దగ్గరేం కొంటారు.? వారానికోసారి వీలుచూసుకొని ఒక్కసారే, ఒక్కచోటే సరిపడా సరుకులు తెచ్చుకోవడం పట్నం వాసులకు ఎప్పుడో అలవాటైపోయింది. ఫ్రిజ్లు ఉంటున్నాయి కాబట్టి నిల్వ చేసుకోగల్గుతున్నారు. ఈమెకేం గడుస్తుందనిలా అరుస్తూ వీధులు తిరుగుతుందో అర్ధం కాలేదు.
బాగా స్థిరపడాలని పేరెంట్స్ ను కూడా వదిలిపెట్టి, ఈ పట్నంలో ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంటుంది. అలా జరక్కుండా ఉండాలని రోజూ ఉదయం లేవగానే పార్క్ కేళ్లోస్తాను. దీనికన్నా ముందే, సూర్యోదయం కాకమునుపే ఔషదయోగ్యమైన ఆహారంతో మెటబాలిక్ సిస్టమ్ మెరుగవుతుందని మొలకెత్తిన గింజలను తినడం అలవాటు. తర్వాత దైవనామస్మరణ. ఆయన కరుణా కటాక్షాలు లేనిదే అభీష్టం నెరవేరదు కదా.! అదిగో అలా పూజ చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదువుతుంటే కూరలమ్మి అరుపులు భంగం కలిగించాయి. మా రూమ్ ముందు అరిచే బదులు ఎదురుగానున్న అపార్ట్మెంట్ కేసి అరిస్తే ఎవరైనా కొనోచ్చని సైగ చేసి తలుపులు మూసేశాను. ఎందుకైనా మంచిదని కిటికీలు కూడా మూసేశాను.
మళ్ళీ మనస్సును లగ్నం చేసి మధ్యలో ఆగిపోయిన హనుమాన్ చాలీసాను పూర్తి చేసి బయటకొచ్చాను. నెత్తిమీదున్న గంపను దింపి, చెట్టు కింద పెట్టుకుని ఎవరికో కూరగాయలిస్తుందామే.! సర్లే... ఈమెతో మనకేం పనని టిఫిన్ చేద్దామని బయలుదేరుతుండగా ఒక సంఘటన నన్ను చూసేలా చేసింది. నాలుగో అంతస్తు నుండి ఓ ఇల్లాలు కూరలమ్మిని పిలిచింది.
“ఇదిగో కూరలమ్మాయ్... తోటకూరెంత..?” కిందకి చూస్తూ అడిగిందా ఇల్లాలు.
“ఒక్కొక్క కట్ట ఐదు రూపాయలమ్మగారు..(కొంచం పెద్ద కట్టలులెండి)..” ఒక చేతిని ఎండ తగలకుండా కళ్ళకు అడ్డుపెట్టుకుని, పైకి చూస్తూ చెప్పిందా కూరలమ్మి.
“ఒక కట్ట తోటకూర కావాలి. పైకి రా...” ఆర్డరిచ్చేసిందా ఇల్లాలు. అంతలోనే ఎదురింటి ఇల్లాలు కూరలమ్మి దగ్గరకొచ్చి బేరమాడసాగింది.
“అమ్మగారూ... గంపనిక్కడ దించానమ్మా... కిందకి రండి..” వెంటనే పైకి చూచి చెప్పిందా కూరలమ్మి.
“ఫర్వాలేదులే... పిన్నిగారికిచ్చేసిన తర్వాతే పైకి రా..! తొందరేం లేదులే...” బదులిచ్చిందా ఇల్లాలు.
“వేసవికాలం కదమ్మా... మళ్ళా ఇంత బరువునేత్తుకుని మెట్లెక్కలేనేమోనమ్మా.. ఇక్కడే చెట్టు నీడలో దింపేశాను... వాచ్మెన్ కూడా లేడమ్మా... కొంచం దిగి రండమ్మా..” బేరం పోతుందేమోనన్న భయంతో అభ్యర్ధించిందా కూరలమ్మి.

ఇలాంటి అభ్యర్ధనలేవి నాకస్సలు నచ్చవు. వెంటనే తల త్రిప్పేసుకుని నడకలో వేగం పెంచేశాను. ఆడవాళ్ళ విషయాల్లో అస్సలు తలదూర్చకూడదని ఎంతోమంది నిరూపించిన సంఘటనలు గుర్తుకురావడంతో నా మానాన నేను వెళ్ళిపోయాను. పావుగంటలో టిఫిన్ చేసేసి, న్యూస్పేపర్ తీసుకుని సరాసరి రూమ్ కొచ్చేశాను.
కూరలమ్మి ఆశ కరగలేదు. గంప కిందనే పెట్టుకుని నిరీక్షిస్తూనే ఉంది. వీధులన్నీ తిరగడం వల్లనో, వయసు పైబడుతుండడం వలనో, సరైన పౌష్టికాహారం కరువౌవడం చేతనో కాని ఆయాసాన్ని తీర్చుకోవడానికి చెట్టు నీడనే కూర్చున్న బాటసారిలా కన్పించిందా క్షణంలో.! మేడ పైకి, కిందకి చూస్తూనే ఉంది. నేను రావడం గ్రహించి దగ్గరికి రమ్మని సైగ చేసి మళ్ళీ నాలుగో అంతస్తువైపు చూసింది. ఫోన్ మాట్లాడుతూ, ఆ ఇల్లాలు అటూఇటూ తిరుగుతూ కనిపించడంతో నిట్టూర్పు విడిచింది. ఒకరివల్ల సమయం వృధా కావడం, ఎండ తీవ్రతను పెంచేసుకోవడంతో ఆమె ఆశ కరిగిపోయింది. చివరిసారిగా అనుకొని “అమ్మా... కూరలు... కావాలా..? వస్తున్నారా..? వెళ్ళిపొమ్మంటారా..?” అంటూ మళ్ళీ గట్టిగా పిలిచింది.
“ఫోన్ మాట్లాడుతున్నాను, పైకొచ్చి ఇచ్చి వెళ్ళిపో...” అంటూ చెవి దగ్గరినుంచి ఫోన్ ను పక్కకు నెడుతూ అందా ఇల్లాలు. పోట్టకూటికోసమని కిలోమీటర్లు గంప నెత్తినెట్టుకుని ప్రతి గడప తొక్కుతున్న నడివయస్కురాలు కూరలమ్మి. ఆ నాలుగంతస్తులు పైకెక్కి ఐదు రూపాయల కట్టనిచ్చే ఓపికలేక పైకి చూడనైనా చూడకుండా, సమాధానమైన చెప్పకుండా “కూరలమ్మా... కూరలు... కూరలోయ్” అంటూ గంపను నెత్తిన పెట్టుకుంది – నా సాయంతో.
ఆర్ధిక భేదాలు మనుషుల్ని ఎంత దారుణంగా ప్రవర్తించేలా చేస్తాయో.! ఆ ఇల్లాలు కిందకైనా దిగకుండా ప్రవర్తించిన తీరుకు లోలోన తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పల్లెటూర్లలో అమ్ముకున్నా బావుండేదేమో..! ఇలా అపార్ట్మెంట్లు, అంతస్తుల గోల ఉండేది కాదు. కష్టపడేవాడు కష్టపడుతూనే ఉన్నాడు. సుఖపడేవాడు సుఖపడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఎదుటివాడు మారాలనుకోవడం మన మూర్ఖత్వమే..!
ఆ క్షణంలో ఇద్దరి మొహాలు స్పష్టంగా కన్పించాయి. నాకు కూరలమ్మి వదనంలో నిర్వేదం తెలిసింది. సంప్రదాయాలకు సాక్ష్యమంటూ, శ్రామిక జీవనానికి సంకేతమంటూ కనుబొమ్మల నడుమ గుండ్రంగా దిద్దిన కుంకుమ బొట్టుగా రూపుదిద్దుకున్న ఆమె తిలకం, వస్తున్న చెమటలకు తన రూపాన్ని కోల్పోవడం ప్రారంభమైంది. ‘కష్టపడే తత్త్వం మనస్సులో ఉండాలే కాని నా ముందు ఇదెంత’ అన్నట్లుగా సాక్షాత్కరించింది. నలుగురున్న మా రూమ్ లో రెండు పూటలా వండిపెట్టడానికి వంట మనిషి దొరికేసింది.
......-: శుభం :-......

4 comments:

 1. ఒక సంగటన ఒక జీవితం మారుస్తుంది అన్న విషయం ఎంత చక్కగా చెప్పావు కృష్ణ..అభినందనలమ్మా..

  ReplyDelete
 2. Namaskaram krishnagaru. Ua story kooralammi has a good point but Pl make sure the incident is twisted into a story. Otherwise it only remains a news item. The story should make us wait to unfurl a suspense. U have a good flow Pl make use of it create good stories. Regards prabha Varanasi

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములండి..!
   కథను చదివి మీ విలువైన, నిజమైన, ఆచరించదగిన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా సంతోషం.!
   మీరు తెలియపరిచినట్లుగానే కథలో ఆ టెంపో ఎక్కడ మిస్ అవుతుందో ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటానని మాటిస్తున్నాను.!
   ఇలాగే ఇంకా నా కథలకు మీ అభిప్రాయాలు తెలియపరచి, పురోభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను.!

   Delete

Pages